పచ్చని హరివిల్లులా మెరుస్తూ..
మురిపిస్తుంటాయి వృక్షాలు!
దారి వెంట నడుస్తుంటే..
ఎదురొచ్చే ఎండ వేడిని తట్టుకునేలా నీడనిచ్చి..
సేదతీరుస్తుంటాయి వృక్షాలు!
ఆకలిని తీర్చేలా తీయని ఫలాలనిచ్చి..
అమ్మలా ఆకలిని తీర్చుతుంటాయి వృక్షాలు!
ప్రాణవాయువు ని మనకి అందిస్తూ..
ఆయుష్షును పెంచే సంజీవనులై నిలుస్తుంటాయి వృక్షాలు!
ఆయుర్వేదంలో మూలికలై.. రుగ్మతలను రూపుమాపే ఔషదాలై..
జీవితాలను నిలుపుతుంటాయి వృక్షాలు!
గగనాన విహరించే మేఘాల చెలికత్తెలని అమృతహస్తాలతో
నేలపైకి ఆహ్వానిస్తూ..
పుడమి తల్లికి వాన జల్లుల సంబరాలను
పరిచయం చేస్తుంటాయి వృక్షాలు!
తాము నేలకొరిగినా..
కలపై మానవ జీవితాలకు ఉపకారులై..
ఇంటి అవసరాలను తీర్చే వస్తువులై..
తోడుంటాయి వృక్షాలు!
వృక్షాలు చేసే మేలు మర్చిపోతూ..
వృక్షాలను నరికేస్తూ.. ఎడారులను తలపించే..
‘కాంక్రీట్ జంగిల్స్’ని నిర్మించుకుంటూ..
మనిషి తన పతనాన్ని తనే కోరి తెచ్చుకుంటున్నాడు!
వృక్షాలు కానరాని చోటు.. మానవ జీవితాలకు చేటు!
‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న వేదకాలం నాటి మాటలు మననం చేసుకుంటూ..
వృక్షాలను సంరక్షించుకుంటూ..
ఆనందాల జీవితాలని అందుకుని హాయిగా బతికేద్దాం!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.