[శ్రీ అనిల్ అట్లూరి రచించిన ‘సువర్చలకి కోపం వచ్చింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
గోడమీద వున్న ఉన్న గడియారంలో సెకన్ల ముల్లు నెమ్మదిగా కదులుతోంది. అరవింద్ తల తిప్పి గది చుట్టూ చూసాడు. నిరాడంబరంగా వుంది – సువర్చల లాగే. కనుబొమల మధ్య విభూతి. కళ్ళజోడు. తెల్లని కాటన్ చీర. నీలం రంగు అంచు. చెరో చేతికి సన్నని బంగారపు గాజు. చేతులు కుర్చీలోని చెక్క చేతులపై విశ్రమిస్తున్నాయి. అతనికి ఎదురుగా కూర్చుంది. ఏవో కనిపించని అక్షరాల మీద కదులుతున్న చూపుడు వేలు. టైపిస్ట్ రోజుల నుంచి వచ్చిన అలవాటనుకున్నాడు.
దాదాపు నాలుగు దశాబ్దాలు అయ్యింది తనని చూడక. జీవితం అరవింద్‌ని ప్రపంచంలోని అనేక ప్రాంతాలకి తీసుకు వెళ్ళి ఆ నాగరికతలను పరిచయం చేసింది. కానీ తన బాల్య స్నేహితురాలిని మరిచిపోనివ్వలేదు. సువర్చల వివాహాంలో ఆమెని చూడటమే. ఆ తరువాత కూడ ఒకటి రెండు సార్లు కలిసినట్టున్నాడు. అంతే. ఆ మధ్య మరెవరో చెప్పారు సువర్చల భర్త చనిపొయ్యాడని. అందుకని ఈసారి తప్పనిసరిగా ఆమెని పలకరించాలని అనిపించింది.
###
సువర్చల ఎస్.ఎస్.ఎల్.సీ పరీక్షలవ్వగానే టైపింగ్ షార్ట్‌హాండ్ నేర్చుకుంది. కాదు నేర్చుకోవలసివచ్చింది. రెండూ పాసయ్యింది. ఎవరో శ్రేయోభిలాషులు చెబితే చిన్న కంపెనేలో టైపిస్ట్‌గా చేరింది. సాయంత్రాలు ట్యుటోరియల్ కాలేజీలో చదువుకుని డిగ్రీ పాసయ్యింది. వందరూపాయలు ఎక్కువ వస్తాయని ఆ ఉద్యోగం మానేసి అదేదో హోటల్లో రిసెప్షనిష్ట్గా చేరింది.
మన ఇంటి ఆడపిల్లేమిటి, హోటల్లో పనిచెయ్యటమేమిటి అని పొడిచారు బంధువులు కాకుల్లాగా. ఆ బస్సుల్లో ప్రయాణాలేమిటి ఆ మొగాళ్లందరి మధ్య! సువర్చల వినిపించుకోలేదు. ఆ మొగవాళ్లని తప్పించుకుంటూనే హోటల్లో దిగిన వాళ్ల ఫోనుకాల్స్కి కూడా గౌరవంగా జవాబిచ్చేది. ఎక్కడా తడబడేది కాదు. గుసగుసలు వీపు మీద బాకుల్లా గుచ్చుకునేవి. అవన్నీ పట్టించుకున్నట్టు కనబడేది కాదు కాని ఆ ఒకటి రెండు సార్లు కలిసినప్పుడు ఆమె మాటల మధ్య ఆ ‘ధ్వని’ వినిపించేది. అరవింద్ కూడా తామరాకు మీద నీటిబొట్టులాగ వుండేవాడు. తను నోరు విప్పి వివరంగా చెప్తే బాగుండేదేమో. ఆమె ఎప్పుడూ చెప్పలేదు. అతను ఎప్పుడూ రొక్కించి అడిగింది లేదు.
“పాత టైప్‌రైటర్ గుర్తుందా అరవింద్?” ఆమె స్వరం అతన్ని వర్తమానంలోకి లాగింది. ఇది మృదువుగానే వినపడినా బరువును మోస్తున్నట్టనిపించింది. అది పోర్టబుల్ టైప్‌రైటర్.
“అఫ్ కోర్స్” అతను నవ్వి, ముందుకు వంగి. “ఎలా మర్చిపోతాను! నేను నిన్ను చూడటానికి వచ్చినప్పుడల్లా దాని మీద టైప్ చెయ్యడానికి ప్రయత్నించేవాడిని కదా!”
ఆమె పెదాలమీద ఒక చిరునవ్వు కనపడీ కనపడకుండా. “ఆ టైప్రైటరేగా ఈ ప్రపంచంలోకి నా మొదటి అడుగు. నా భవిష్యత్తుకి ధైర్యాన్ని ఇచ్చింది.”
వెంకట్రావుతో ఆమె వివాహం ఆమె ఆశించినంత ఆశాజనకంగా లేనప్పటికీ, అది ఆమె భవిష్యత్తులో మరో మెట్టుని ఎక్కించింది. వెంకట్రావు ‘సౌమ్యుడు’ అని చుట్టాలు పక్కాళ్ళు అనేవారు. అలా అతని అసమర్థత గురించి చెప్పకుండా చెప్పేవారు. ఆమె చేతి వేళ్ళు అరిగిపొయ్యేలాగా కష్టపడింది. మణికట్టు నొప్పులు భరించింది. ఆర్.ఎస్.ఐ. (Repetitive Stress Injury) కార్పొరల్ టనల్ సిండ్రోంకి దారి తీసి చేతి నరాలు, కండరాలను బలహీన పరిచాయి. వాటి వాపుతో భరించలేని నొప్పి. మానసిక ఒత్తిడి, ఆర్ధిక అవసరాల ముందు ఆ నొప్పులు భరించక తప్పలేదు. వెంకట్రావు అసమర్థుడా లేక బద్ధకస్తుడా? బద్ధకస్తుడే. అందుకే ఉద్యోగం చెయ్యగలిగేవాడు కాదు. సులోచన తెలివిగలది. సమష్టి కుటుంబం విలువలే ముఖ్యం అని అనుకునేది. అందుకే అతని అప్రయోజకత్వాన్ని గురించి ఎప్పుడు ఎవరితోను ప్రస్తావించినట్టు లేదనుకున్నాడు అరవింద్ – ఆమె ఆలోచనలను చదువుతున్నట్టుగా. “వెంకట్రావు..” అని అంటుండగానే.. “ఆయన ఎప్పుడూ ఉద్యోగంలో స్థిరంగా లేకపోయినా నాకు చేదోడు వాదోడుగానే వుండేవారు.” అని ఆమె నిబ్బరంగా చెప్పినా ఆ స్వరంలో బాధ, బరువు అరవింద్ గ్రహించకపోలేదు.
సువర్చల కుర్చీలో వెనక్కి వాలింది. ఆమె చూపులు కిటికీ వైపు మళ్ళాయి. ఆ సాయంత్రపు కాంతి గదిలోకి చిమ్ముతోంది.
“ఆర్ధిక ఇబ్బందులు సరే సరి. సంపాదిస్తాము, అవసరాలకు వాడతాము. కాని డబ్బు తెచ్చే మనిషిగా గుర్తించినప్పుడు ఆ మనిషికి ఒక మనసుంటుందని ఎందుకనుకోరు?”
గది నిశ్శబ్దంగా వుంది.
మళ్ళీ తనే అందుకుంది.
“నా జీవితంలో పోరాటానికి నన్ను ప్రోత్సహించింది నా తల్లి తండ్రులే కదా! వీళ్ళు ఎలాగో, వాళ్ళూ నా వాళ్ళే కదా? కాని వాళ్ళు నన్ను చూడటానికి ఆ ఇంటినుంచి ఈ ఇంటికి వచ్చినప్పుడు.. కనీసం ‘మంచి నీళ్ళు’ కూడా ఇవ్వలేదు. నా వాళ్ళు మాములు మనుషులు. అయినప్పటికీ..” ఆమె స్వరం ఉద్వేగంతో నిండి ఉంది.
“వీళ్ళు వారిని చిన్నచూపు చూశారా?” నెమ్మదిగా అడిగాడు అరవింద్.
సువర్చల నవ్వింది. కన్నీటి బొట్టు ఆమె చెంప మీద నుండి జారుతోంది.
“నేను ఈ కుటుంబం కోసం ఎంత చేసినప్పటికీ, నా తల్లిదండ్రులని నా ఇంటికి ఆహ్వానించ లేకపోయానని వాళ్ళు వచ్చిన ప్రతిసారి బాధ కలిగేది. నేను ఆయన కోసం, నా పిల్లల కోసం మౌనంగా ఉన్నాను, కానీ ఈ బాధని భరించలేకపోతున్నాను అరవింద్!”
“నువ్వు ఒక్కదానివే భరించాల్సిన అవసరం లేదు. నాతో పంచుకోవచ్చుగా! నేను చేయగలిగింది చేస్తాను,” ఓదార్పుగా అన్నాడు.
సువర్చల చిన్నగా నవ్వింది. ఆమె పెదవుల మీద ఒక చేదు వంపు. “ఒంటరితనం కాదు నన్ను బాధిస్తున్నది. ఈ ఇంటి పెద్దలు నా ఇంటి పెద్దలను గౌరవించకపోవడమే నన్ను తరిమి తరిమి బాధిస్తున్నది.”
ఇన్నేళ్లుగా చెప్పకుండా మిగిలిపోయిన ఆమె మాటల ప్రతిధ్వనులతో వారిద్దరి మధ్య నిశ్శబ్దం నిండిపోయింది.
“అసలు ఈ సంబంధం ఎలా వచ్చిందో తెలుసా? వాళ్ళే వచ్చారు నా కోసం. కుటుంబం మంచిదని. నా తల్లితండ్రుల వ్యక్తిత్వాలు, జీవన విధానమేగా మా కుటుంబానికి గౌరవాన్నిచ్చింది! వారి విలువలతోనేగా నేను పెరిగింది. అందుకేగా నన్ను ఏరి కోరి ఈ ఇంటికి తెచ్చుకున్నారు. సౌమ్యుడైన భర్తని నాకు కట్టబెట్టారు. నేను తెచ్చిన డబ్బుతోనేగా ఈ ఇల్లు గడిచింది. ఏనాడు నేను నోరు మెదపలేదు. కానీ.. కానీ.. నాన్న.. నాన్న నన్ను చూడటానికి వచ్చినప్పుడు కనీసం కూర్చోమని కూడా అనలేదు. నేను ఆయనకి డబ్బులిస్తాననేమోనని భయమా? నా సంతకాలతో చెక్కులు, పాస్‌బుక్కులు అన్నీ ఈ ఇంటి బీరువాలోనేగా వున్నాయి!” అని ఆగింది.
“నిన్ననే ఎవరో మళ్ళీ గుర్తు చేసారు! పచ్చిగా వుంది ఆ బాధ!” అని.. “సారీ.. కనీసం నీకు మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా కూర్చోపెట్టి మాట్లాడుతున్నాను.. వుండు కాఫీ ఇస్తాను. పంచదార కలపనా?” అంటూ లేచింది.
‘సువర్చలకి కోపం వచ్చింది.’
చాలా ఆలస్యంగా అనిపించింది అరవింద్‌కి.
You must be logged in to post a comment.
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 52 – లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం
“రైలు కథలు” పుస్తకావిష్కరణ సభ
పచ్చదనం
ఆక్రోశం
సంచిక రచయితల ‘జూమ్’ సమావేశానికి ఆహ్వానం
కొత్త పదసంచిక-10
సంచిక – పద ప్రహేళిక – 7
పొట్టి శ్రీరాములు
అన్నింట అంతరాత్మ-8: గొడవలన్నీ వింటా.. కానీ మాటే రాని గోడను నేను!
నేను గాలి భూతాన్ని
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®