[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఆరుపల్లి గోవిందరాజులు గారి ‘సుబ్బూ ది గ్రేట్..!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


రకరకాల శాఖలకు చెందిన ఉద్యోగుల నివాస కాలనీ.
సుబ్బారావు కొనసాగించే ఎన్నో లాభదాయక టాలెంటెడ్ పనులకి, కార్యకలాపాలకు అక్కడి వారి దృష్టిలో ‘సుబ్బూ ది గ్రేట్’ అన్న బ్రాండు వైరల్గా ప్రకాశిస్తుందా కాలనీలో!
ఫర్ ఎగ్జాంపుల్ – షోరూముల్లో ఒకటి కొంటే మరొకటి ఉచితం. ఏదైనా రెండు వందలే లాటి ఆఫర్లకు ఠక్కున ఆకర్షించబడి స్వతం చేసుకొని ఇల్లు చేరిన వెంటనే పూజిత చేతుల్లో పెట్టడానికి అలవాటు పడ్డాడు. అటువంటి సందర్భాలలో పూజిత మహా ఆనందంతో తన వంతుగా ఓ స్ట్రాంగు హగ్గు ఆఫర్ చేయడం జరిగే ప్రక్రియ అయి కూర్చొంది.
ఆ వెంటనే సుబ్బు నిర్వాకంని థర్డ్ ఫ్లోరు తమన్నాకి, ఫస్ట్ ఫ్లోరు పవిత్రతో షేర్ చేసుకునేది. దానికి వాళ్ళు “వావ్.. నీ హీరో సూపర్ గ్రేటే! అందుకే అందరి కళ్లూ నీ హీరో పైనే ఉంటాయి. కాస్త దిష్టి తీసి పారబొయ్యి!” – స్ట్రాంగు కామెంట్లు వినిపించేవారు.
సుబ్బూ భళ్లున తెల్లవారిన తడవే నలుగురిలా పాల పేకట్ల కోసం పరుగు తీయకుండా ఒరిజినల్ పాల కోసం ఎక్కడో దూర ప్రాంతాన ఆవులు గేదెలకు పాలు తీసి అమ్మే ప్రాంతానికి వెళ్లి ఇల్లు చేరేవాడు. ఏ దినానైనా తన దృష్టిలో ఆవు/గేదె డెలివరీ అయినట్లు తెలియడంతో పాలేరుకి తన మాటకారి టాలెంటుతో కాస్ట్లీ సిగరెట్ ఒకటి ఆఫరు చేసి పాలు పుట్టించుకొని మరీ ఇల్లు చేరేవాడు. ఆ మేరకు పూజిత భర్తకేం తీసిపోని విధంగా యూట్యూబులో విన్న రీత్యా జున్ను తయారు చేసి ఇరుగు పొరుగులకి పోరట్లుగా పంపేది.
రుచి చూచిన కొందరు వాళ్ల వాళ్ల హిరోలతో “ఎందుకూ మీరూ ఉన్నారు.. శుద్ద వేస్టు. విగ్రహ పుష్టి నైవేద్య నష్టినూ? అసలు ఏనాడైనా కరక్టుగా లైటరుతో నాలుగు స్ట్రాంగు స్ట్రోకులు కొట్టి పొయ్యిని వెలిగించగలిగారా? అంతెందుకూ.. మార్కెట్టు నుండి కూరగాయలు తీసుకొని రమ్మంటే గంగిరెద్దులా తలాడించి – ఆ తీసుకొని వచ్చినవి సగం చచ్చువి, మిగతావి పుచ్చువీ! పోనీ ఆకుకూర లేమైనా అందంగా తగలబడి చస్తాయోమోనని చూస్తే, అదీ లేదూ! ఆముదం తాగిన వాడిలా ఏడ్చి ఛస్తాయి. మీ తోటివాళ్లు కొందరు ఎవరింట పని అమ్మాయి వెళ్లని దినాన ఆఫీసులకి సెలవులు పెట్టి మరీ ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం, కూరగాయలు తరగడం, మిక్సీలలో పప్పులు రుబ్బడం లాంటి సహాయాలు అందిస్తుంటారు”- అన్న వేధింపు మాటలకి కొందరి ఆత్మగౌరవం దెబ్బ తిని, అహం అడ్డుగా నిలిచి ఈ విషయం ఇలా విడిచిపెట్టేస్తే కేన్సరు కంటే ప్రమాదకరం అని భావించి కొందరు మగపుంగవులు డైరక్టుగా సుబ్బూనే కలసి ‘అమీతుమీ’గా తేల్చుకోదలచి సుబ్బూని కలసి –
“చూడు గురూ! నీ టాలెంటు ముందు మేం ఏమీ కాదు! అలా భావించి ఊరుకుంటుంటే మా పెళ్ళాలు మాకు మొగుళ్లయి రాచి రంపాన పెడుతున్నారు. అలా దొబ్బి దొబ్బి నరకం చూపిస్తూ మాది మేమే తినేటట్లు చేసున్నారు. అధ్యక్షా, ఒక్క నిముషం ఆలోచిస్తే, నీకే భార్య ఉన్నట్లూ వేరొకరికి లేనట్లు కాలరు ఎగర వేయకూడదు.” ఆవేశపరులయ్యారు.
వారి ఉద్రిక్త వాక్యాలకు సుబ్బు బి.పీ. బుస్సుమనలేదు. ప్రవచనకర్తలా చిరునవ్వుతో “అధ్యక్షా, ఈ సందర్భంగా నేను మీకు తెలిపించే విషయం అంటూ ఒకటుంది. అసలు భార్య అంటే ఎవరు? మూడు ముళ్ళు వేసిన తన దైవం కోసం అటు తల్లీ తండ్రీ అన్నదమ్ములని, అక్క చెల్లెళ్ళని, స్నేహితులని విడిచి మెట్టినిల్లు చేరుతుంది. గొడ్డు చాకిరీ చేస్తుంది. భర్తకు సర్వం అర్పిస్తుంది. నిండు ప్రాణాలకి జన్మనిస్తుంది. ఇదే విషయాన్ని ‘గుండమ్మ కథ’ చిత్రం ద్వారా ఓ మహాకవి ‘తీర్థయాత్రలకు రామేశ్వరము.. కాశీ ప్రయోగలేలనో, ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలనో!’ అన్నాడు. ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంలో భార్యాభర్తల అనురాగానికి ‘మనసున మనసై.. తోడొకరుండిన.. అదే భాగ్యము అదే స్వర్గము’ అని చాటిచెప్పారు. ఇప్పడు మీరేమంటారూ?”- నిలదీసిన ధోరణిలో రూలింగు పార్టీ వ్యక్తిలా అడిగాడు.
ఈ ఉపోధ్ఘాతానికి అవతలివారు “ఏమంటాం? బుద్ధి తక్కువై నీతో బ్రెయిన్ వాష్ చేయించుకున్నాం! అన్నీ మూస్కోని దారి తీస్తాం!” అన్నారు.
***
సదరు సుబ్బూగారికి అరవై ఏళ్లు నిండి ఉద్యోగానికి ఉద్వాసన జరిగింది.
తన శేష జీవితాన్ని పరోపకారానికి అంకితం చేయదలచుకొని లొకాలిటీలో అవకతవక ఆధార్ కార్డులవారి నుండి స్కూలు పిల్లల ప్రోగ్రెసు కార్డుల మంచి చెడులు, సీనియర్ సిటిజనుల లైఫ్ సర్టిఫికేట్లు, బ్యేంకుల లావాదేవీలు, ఫించనుల అవసరాలతో బాటు ఆరోగ్య విషయాల్లో కూడా తల దూర్చడానికి అలవాటు పడ్డాడు.
తండ్రి అలా సేవలందించడం సుతరామూ సహించని కొడుకులు, కూతురు ఓ శుభముహూర్తాన ఇంట కూర్బోబెట్టి “డాడీ మీరు ఎవరనుకుంటున్నారు. ఓ సెంట్రల్ గవర్నమెంటు ఆఫీసరు రేంకు గల వ్యక్తి. ఈ సేవలన్నింటిని కట్టిబెట్టి డిగ్నిటీగా ఉండండి. చెత్త చెత్త సినిమాలు, సీరియళ్లూ చూస్తూ అరవైలో ఇరవైలా టీ షర్టులు జీన్సుల జోలికి పోకండి” – అంటూండేవారు.
ఒక దినం వంటలో నిమగ్నమైన పూజితకు వర్షం కురిసే వాతావరణాన్ని గమనించి మేడమీద ఆరబెట్టిన తడి బట్టలు గుర్తుకు రావడంతో భర్తకు వినిపించేలా “వర్షం వచ్చేటట్లుంది. మేడ మీద బట్టలు ఉన్నవి. వెంటనే వెళ్లి తీసుకురండి” రైలింజనులా కేక వేసింది.
సుబ్బూ వెంటనే ఇంటర్నెట్లో బూతు విదేశీ సీనులు చూస్తున్నది కట్టి పెట్టి ఒక్క ఊపున పైకి చేరి బట్టలన్నింటిని చుట్టబెట్టుకొని సోఫాలో దిమ్మరించాడు. వంట పూర్తి చేసిన పూజిత ఆ బట్టల్ని గదిలో నాలుగు చోట్ల ఆరబెట్టాలన్న తలంపుతో ఒకటీ ఒకటీ పైకి తీస్తుండగ ఒక్క ఊపున కెవ్వుమంది.
సుబ్బూకి షాక్ కొట్టినట్లయి చూస్తున్న సెల్లు పక్కకు పెట్టి “ఏమయ్యింది..? అంతలా రియాక్టయ్యావు?” నిలదీశాడు.
పూజిత “ఏమయ్యిందా?” అంటూ ఓ కాస్ట్లీ, ఎరుపు రంగు బ్రా పైకి తీసి, “ఇదేమిటి..?” అంది కళ్లెర్ర జేసి.
సుబ్బూ ఈజీగా “ఆఁ! అది బ్రా.. దీనికంత బిల్డప్ ఎందుకంటా?” అన్నాడు.
“ఇక్కడ సమస్య అది కాదు. ఇది ఎవరిది అంటా?” ఢంకా మీద కొట్టినట్లుంది.
“ఔను.. అది నీది కదూ! దీనికంత తలబాదుకోవడం దేనికీ అంటా?”
“ఎందుకా? సరిగ్గా చూడండి.. ఇది నాదా? అయినా ఇటువంటి మేకప్పులు.. నేం చెయ్యను. ఆ విషయం మీకు తెలియదా ఏమిటి?” జవాబు చురకగా అంటించింది.
సుబ్బూ ఒక్కసారి ఖంగు తిని “మరైతే ఎవరిది చెప్మా.. ఏదీ ఒకసారి ఇలా ఇవ్వుము, చూస్తా..” అన్నాడు.
పూజితకు చిర్రెత్తినట్లయి “ఏం.. మీకెందుకూ? ధరించి చూస్తారా?” అంది.
“అయ్యో.. రామా ఏవిటా.. అప్రాచ్యపు మాటలు?”
“మరి మీకెందుకండి.. ఆరాటం? ఇస్తే లాబుకి పంపించి ఎవరిదో తెలుసుకుంటారా?” తిరిగి తనలో ఆవేశం కొట్టొచ్చినట్టు ప్రస్ఫుటమయ్యింది.
“అది కాదు సైజు చూసి అపార్టుమెంటులో ఎవరిని చెప్పగలుగుతారా? అయితే ఇదుగో తీసుకొని ఖచ్చితంగా ఎవరిదో చెప్పారంటే పిలిచి ముట్టచెపుతా! సిగ్గు అంటూ లేకపోతే సరి – చేసిన నిర్వాకానికి” అంది.
వారి మాటల్లోనే థర్డ్ ఫ్లోరు మీనాక్షి చేరి “ఏంటక్కా బావగార్తో గొడవ పడుతున్నావూ? పాపం బావగారు తొందరలో పక్కనే ఆరబెట్టిన నా బ్రా కూడా తిసుకొని వచ్చేశారు. బావగారికి ఈ వయసులో కూడా సరసం ఎక్కువే! ఛీ.. పాడు. ..చిలిపి” అంటూ కొంటె చూపులతో బ్రా తీసుకొని జారుకుంది.
ఆ వెంటనే దిగబడింది ఎనభైఏళ్ల బామ్మ మెట్టెక్కి చేరిన ఆయాసంతో, “అవున్రా సుబ్బయ్యా, నువ్వేదో కప్పుల బాడీని చుట్టబెట్టుకొని వచ్చేసావంట గదూ! అది ఆ పాడు మీనాక్షి దట! అది వట్టి పోకిరిది. మగాళ్లంటే పడి ఛస్తాది. అందులో నువ్వు అరవైలో ఇరవైలా ఎర్రగా బొద్దుగా ఉన్నావు. కొంచెం దానికి ఎడంగా ఉండు” అన్నది.
ఆ మాటలకు పూజితకు చిరాకు కలిగి ‘ఒసేవ్ ముసలి దానా, ఆ కప్పుల బాడీ గురించి నీకెందుకే! దీని కోసం అన్ని మెట్లెక్కి ఆయాసపడి ఎవర్ని ఉద్ధరించేయాలి? హాయిగా ఇంట్లో కూర్చొని రామకోటి రాసుకోక!’ అనుకున్నది.
***
ఒక దినం సుబ్బూకి ఖరగపూరు బంధువులు ఫోను చేసి, “రెండు దినాల్లో అమ్మాయిని చూడడానికి వస్తున్నాం!” – అన్న శుభవార్త వినిపించారు. సుబ్బూ ఉబ్బితబ్బి పూజితకు విషయం చెప్పి వారి మర్యాదలకు ఎటువంటి లోటు కలుగకూడదని వివరంగా చెప్పడం జరిగింది.
పూజిత విని “ఏంటి మర్యాదలు జరిపేది? ఈ ఎండ తీవ్రతకి వారం దినాలు నుండి వాటరు రావడం లేదు! కాళ్ల దగ్గరకు వచ్చే కూరగాయలు అమ్మకానికి రావడం లేదు” అంది.
అంతే సుబ్బూ భార్య మాటలకు రియాక్టయి రాత్రంతా సిగరెట్టు మీద సిగరెట్టు కాల్చి తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికి రావడం జరిగింది.
భళ్లున తెల్లవారింది.
పది గంటల పాలంతంలో చాలా దినాలు నుండి మూలన పడి ఉన్న డొక్కు సైకిలు దుమ్ము ధూళీ దులిపి తను గళ్ళ లుంగీ చారల టీ షర్టు ధరించి డిజిటల్ వాచీ, నల్ల కళ్ళద్దాలు, ఎరుపు టోపీ ట్రిమ్గా అలంకరించుకుని రెండు బ్యాగులు సైకిలు హేండిల్కి తగిలించి మార్కెట్కు బయలుదేరాడు, రానున్న బంధువుల మర్యాదలకు భంగం కాకుండా ఉండడానికి.
ముందుగా కొన్ని సామానులు కొని బ్యాగులు నింపి బైటపడేసరికి పన్నెండు దాటింది. అప్పటికే ఎండ తీవ్రతకి సుబ్బూ శరీరం మీద డ్రెస్సులు చెమటతో తడిచి ముద్దయ్యాయి.
కొంత దూరంలో ఓ చెట్టు నీడన నాటుకోడి పెట్టలు అమ్మకం కనిపించడంతో ఆతృతగా వెళ్లి ధర అడిగాడు. ఆ వ్యక్తి చెప్పిన ధర విని తన అలవాటు ప్రకారం “ఒకటి కొంటే వేరొకటి ఫ్రీగా ఇయ్యవా?” అన్నాడు.
ఆ వ్యక్తి సుబ్బూని ఒకసారి ఎగాదిగా చూచి “ఇదేమైనా చీరల షోరూం అనుకున్నావా? దేని ధర దానిదే!” అనడంతో కొనక తప్పింది కాదు.
కోళ్ళను సైకిలుకి తగిలించుకుని కాలనీ గేటు దగ్గరకు చేరీ చేరగానే సెక్యూరిటీ గార్డు ఆపి, “ఏయ్ రుకో, కహా జానా?” అన్నాడు గంభీరంగా. అపుడు “అమ్.. సుబ్బూ హై!” అంటూ సుబ్బూ చెప్పిన జవాబు విని “అమ్ నహీ జానా సుబ్బు గిబ్బూ!”- అన్నాడు సెక్యూరిటీ గార్డు.
ఈలోగా అక్కడకు చేరిన రామబ్రహ్మం సుబ్బూని గుర్తుపట్టి, “వాడు ఈ దినం కొత్తగా చేరాడు. నువ్వు బైటపడేటప్పుడు పాత వ్యక్తి ఉండేవాడు. షిఫ్ట్ మారి ఈ వ్యక్తి వచ్చాడు” అని సుబ్బూకి చెప్పి, సెక్యూరిటీకి నచ్చచెప్పి సుబ్బూని లోనికి పంపించాడు.
ఎంతో సేపటి నుండి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కోసం బాల్కనీ నుండి ఎదురు చూసే ఓ ఆమె గట్టిగా, అందరూ వినేలా “త్వరగా రండి. కూరగాయలతో బాటు కోడి పెట్టలు కూడా తీసుకు వచ్చాడు” అంది.
దాంతో పూజిత, పిల్లలు పైకి చేరారు. పిల్లలొక్కసారిగా, “అమ్మ నాన్నేనూ. అలా తయారయ్యాడు” అనడంతో పూజిత ఆ వేషం నలుగురిలో తల కొట్టినట్లయ్యింది.
ఆ పిమ్మట ఎక్కడి నుంచో భీకరంగా “దూల తీరింది యదవకు” అన్న మాటలు వినిపించినట్లయ్యింది – ది గ్రేట్ సుబ్బూ గారికి!