Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-61

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పంచమ సర్గః

తస్య పద్మపురే చాన్నసత్రే వ్యంజనసౌరభైః।
కథం న కుంకుమ స్యాభూద్ గంధభేదకదర్ధనా॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 20)

అచ్ఛిన్నేనాన్నసత్రేణ విజయేశ్వర వాసినామ్।
ఉదరే మేదురే సిద్ధః ప్రణామో యత్నతో విభోః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 21)

జైనులాబిదీన్ నిర్మించిన అన్నసత్రాలలో అన్నదానం గురించి, అక్కడి వంటకాల రుచి గురించి, ఘుమఘుమల గురించి విపులంగా వర్ణిస్తున్నాడు శ్రీవరుడు.

రాజు ఆశ్రమ స్థానాలలో ఎంత తృప్తిగా భోజనం పెట్టాడంటే, ఎంత అందంగా లతలతో అలంకరించాడంటే, అక్కడ భోజనం చేసిన వారు ఇక లతల వైపు చూడటం లేదు. అలాగే, అక్కడ వండిన పదార్థాల పరిమళం, కుంకుమ పువ్వు పరిమళాన్ని మించింది. నిత్యాన్నదానాలలో తినటం వల్ల విజయేశ్వరపురంలో ప్రజల పొట్టలు ఎంతగా ఉబ్బిపోయాయంటే వారు ఎంతో కష్టపడితే కూడా భగవంతుడికి సాష్టంగా ప్రమాణాలు సరిగ్గా చేయలేకపోయేవారు.

ఇక్కడ శ్రీవరుడు ప్రస్తావించిన ప్రాంతాలలో ‘ఆశ్రమ’ ప్రాంతం ఎక్కడిదో సరిగ్గా కనుక్కోలేకపోయారు. అనాటి ‘పద్మపురం’ ఈనాటి ‘పాపోర్’గా గుర్తించారు. శ్రీవరుడు ప్రస్తావించిన విజయేశ్వర క్షేత్రాన్ని ప్రస్తుతం అనంతనాగ్ దగ్గరలో ఉన్న ‘బిజ్‌బేహార’గా గుర్తించారు. ఆనాటి కశ్మీరంలో రెండు విద్యాపీఠాలుండేవి. అవి నలంద, తక్షశిల విశ్వవిద్యాలలతో పోటీపడేవి. వాటిలో ఒకటి శారదా పీఠం. అయితే మరొకటి బిజ్‌బేహర వద్ద ఉండేది. విద్యా బోధనకు బిజ్‌బేహార పీఠం ఎంత ప్రసిద్ధి అంటే సిక్కు గురువు గురునానక్ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన రచనల్లో పలుమార్లు ఇక్కడి విద్యాపీఠం ప్రసక్తి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో పలు మసీదులు, సమాధులు ఉన్నాయి. ఇక్కడ వహీద్ బాబా ఊదర్ కొండ పై ఉన్న మహావృక్షాన్ని ఇప్పటికీ హిందువులు కొలుస్తారు.

ఈ ప్రాంతంలో పది మసీదులు, ఎనిమిది జియారాత్‌లు ఉన్నాయి. నసీరుద్దీన్ గాజే జియారాత్ అన్నిటికన్నా పెద్దది.

అన్నసత్రేణ విచ్ఛిన్నం కృత్వా శూరపురాధ్వనా।
శుల్కస్థానే వ్యధాత్ రాజా భారికానాభిసారికాన్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 22)

శూరపురం మార్గం నుంచి ప్రయాణించే యాత్రికుల వద్ద నుంచి శుల్కం వసూలు చేసే స్థానంలో, శుల్కం వసూలు చేయటం బదులు, వారికి నిండుగా అన్నం ఇచ్చి పంపించేవాడు రాజు.

‘అభిసారుడు’ అంటే వేగంగా ప్రయాణించేవాడు అని అర్ధం. అలా వేగంగా ప్రయాణించే వారికి రాజు ఎంతగా ఆహారం ఇచ్చి పంపించేవాడంటే, వారు వేగంగా ప్రయాణించలేక పోయేవారన్నమాట. అంటే, రాజు అంతగా కడుపు నిండుగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేశాడన్నమాట.

శ్రీవరుడు ప్రస్తావించిన ‘శూరపుర్’ ను ప్రస్తుతం ‘హుర్‌పూర్’ అంటున్నారు.

గుణీ మూర్ఖో నిరాచారః సాచారో యవనో ద్విజః।
నాపోషి యస్తదన్నేన కశ్మీరేషు స నాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 23)

కశ్మీరంలో రాజు పోషణను అనుభవించని పండితులు, మూర్ఖులు, ఆచారవిహీనులు. సదాచారులు, యవనులు, బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. అంటే, కశ్మీరు ప్రజలంతా రాజు అన్న పోషణ అనుభవిస్తున్నవారే అన్నమాట. అంటే, స్వపర భేదాలతో సహా ఎలాంటి బేదభావాలు లేకుండా జైనులాబిదీన్ కశ్మీరు ప్రజలకు, కశ్మీరును సందర్శించే యాత్రికులకు, ప్రయాణీకులకు అందరికీ ఉచితంగా, కడపు నిండా భోజనం అందే ఏర్పాట్లు చేశాడన్నమాట.

శంభు శ్రీపతి ధాతృజహ్నుమనుభిః పూర్వం రవేన్వయే
జాతెనాపి కృతః శ్రమత్రిపథగా గంగైవ జాతా నదీ।
తేషాం స్వార్థమ భూద్రసో నరపతిః సోయం పరార్థే పున –
ర్దైశోస్మిన్ స్వధియా నదీర్నవనవా నానాపథాః కృష్టవాన్॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 24)

గతంలో శివుడు, శ్రీపతి, బ్రహ్మ, జహ్ను, మను వంటి వారు సూర్యవంశంలో జన్మించిన భగీరథుడు కలసి శ్రమిస్తే, భూమి పైన గంగావతరణం సాధ్యమైంది. కానీ గంగావతరణం వెనుక వారి స్వార్థం ఉంది. కానీ నిస్వార్థంగా, ఎలాంటి లాభాపేక్ష, ప్రతిఫలాపేక్ష లేకుండా రాజు, నదులను నానా విధలుగా ప్రవహింప చేసి, కొత్త కొత్త మార్గాలలో, కొత్త కొత్త నదులను ఏర్పాటు చేశాడు.

‘గంగావతరణం’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘భగీరథ ప్రయత్నం’ అన్న పదం కష్టసాధ్యమైన పనిని సూచించటమే ‘గంగావతరణం’ఎంత కష్ట సాధ్యమూ, అనితర సాధ్యమైన పనియో ఊహించవచ్చు. కానీ అంత కష్టమైన పనిని వీరంతా కలసి సాధ్యం చేయటం వెనుక వారి స్వార్థం ఉంది. గంగానదిని, పాతాళంలో తన పూర్వీకులు బూడిదపై ప్రవహింప చేయాలన్నది, గంగానదిని భూమిపైకి దింపటం వెనక ఉన్న భగీరథుడి లక్ష్యం. కానీ దేశంలో నదులను మళ్లించి, కాల్వలు త్రవ్వించి, నీటి పారుదల వసతులను ఏర్పాటు చేయటం వెనుక జైనులాబిదీన్‌కు ఎలాంటి స్వార్థం లేదు. లాభాపేక్ష లేదు. ప్రజల సంక్షేమం తప్ప మరొక భావన లేదు. కాబట్టి గంగానదిని భూమికి దింపటం కన్నా జైనులాబిదీన్ కశ్మీరులో కొత్త కాల్వలను, నదులను ఏర్పాటు చేయటం ఎంతో గొప్ప పని అంటున్నాడు శ్రీవరుడు.

నవీనోదారకేదారభూమ్యత్పన్నాః ప్రతిస్థలమ్।
కూటా ధాన్యఫలైః పుష్టా దృష్టాః పర్వతసాన్నిభాః॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 25)

నూతనంగా ఏర్పడిన సస్యశ్యామలమైన భూమి నుండి ఉత్పన్నమైన ధాన్య రాశులతో ఆ ప్రాంతాలు పర్వత పరివేష్టిత ప్రాంతాలుగా అనిపిస్తున్నాయి.

నీటి పారుదల వసతులు కల్పించటంతో, అంత వరకూ వ్యవసాయం జరగని భూములలో కూడా వ్యవసాయం జరిగింది. పంటలు పండాయి. అలా నూతనంగా వ్యవసాయం ఆరంభించి, ఆ ప్రాంతాలలో పండిన పంటల ధాన్యపు రాశులు గుట్టలు గుట్టలుగా పోశారు. అవి ఎలా ఉన్నాయంటే, ఆ ప్రాంతమంతా కొండలే ఉన్న భ్రమ కలిగిస్తున్నాయి. జైనులాబిదీన్ పథకాల వల్ల సుభిక్షమైన, సమృద్థమైన కశ్మీరును వర్ణిస్తున్నాడు శ్రీవరుడు.

ధాన్యకూటచ్ఛలాన్నూనం సాభూద్ ధాత్ర్యాః కుచస్థలీ।
ప్రాప్తప్యాయం ప్రజా యస్మాద్ వృద్ధిమాపద్ దినే దినే॥
(శ్రీవర రాజతరంగిణి, పంచమ సర్గ, 26)

చాలా చక్కని భావనాత్మకమైన శ్లోకం ఇది.

గుట్టలు గుట్టలుగా పోసి ఉన్న రాశులు ధరిత్రి కుచస్థలంలా తోస్తున్నాయి. ఆ కుచస్థలాలు అందించే అమృత ధారలతో తృప్తి చెందిన ప్రజలు రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్నారు.

నిజంగా కవులు ఎలాంటి వారు! ఎంతటి భావనా బలం కలవారు!

ఇలాంటి శ్లోకాలు అనువదిస్తుంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది. మామూలు విషయాలనే ఎంత సుందరమైన రీతిలో అత్యద్భుతం అనిపించేట్టు ప్రదర్శించే వారి సృజనాత్మకతకు జోహార్లు అర్పించాలనిపిస్తుంది.

‘భూమాత’ మనకు ‘తల్లి’ అన్న విషయం అందరికీ తెలుసు. భూమి నుండి మెలిచిన మొక్కలు ఔషధాలనీ అందరికీ తెలుసు. ఆ ఔషద సేవనం వల్ల జీవించగలుగుతున్నాం. శక్తి పొందుతున్నాం అనీ అందరికీ తెలుసు. తల్లి తన స్తన్యంతో శిశువుకు జీవాన్ని అందిస్తుందీ. అమృతతుల్యమైన స్తన్యపానం వల్ల శిశువు దిన దిన ప్రవర్ధమానుడవుతాడన్నది అందరికీ తెలుసు. అందుకే ఆహారాన్ని అందించే భూదేవిని తల్లితో, ఆ భూదేవి ఆందించే పంటను (ఆహారాన్ని) అమృతంతో పోలుస్తారు. చంద్రుడిని ‘సుధాకరుడు’ అనటం వెనుక కారణం కూడా ఇదే. వెన్నెల కిరణాలతో ఔషధాలను చంద్రుడు రూపొందిస్తాడు. ‘సుధ’ అంటే అమృతం.

భూదేవి అందించిన  ధాన్యాలను కశ్మీరు ప్రజలు రాశులు పోశారు. అవి కొండ గుట్టలన్న భ్రమ కలుసుస్తున్నాయి అని గతంలో అన్నాడు.  ఇప్పుడు ఆ రాశులు పోసిన పర్వత సమాన ధాన్యరాశులు, భూదేవి స్తనాలుగా అనిపిస్తున్నాయట. ఆ స్తన్యం సేవించిన ఈ కశ్మీరీ ప్రజలు దిన దిన ప్రవర్ధమానం అవుతున్నారు.

భూదేవి స్తన్యం పంటలు, ధాన్యరాశులు. వాటి సేవనం వల్లనే మనిషి శక్తి పొందుతున్నాడు. జీవిస్తున్నాడు. ఎదుగుతున్నాడు. ఈ సామాన్య విషయాన్ని ఎంతో అసామాన్యంగా, అనన్యసామాన్యంగా శ్లోకంలో ప్రదర్శించాడు శ్రీవరుడు.

ప్రతిభావంతుడయిన కవికీ అక్షరాలను పేర్చి కవిగా చాలామణి అయ్యేవారికీ తేడా ఇక్కడే కనిపిస్తుంది.

మామూలు కవి ఉన్నది ఉన్నట్టు చూపిస్తాడు. ప్రతిభావంతుడయిన కవి ఉన్నదాన్ని అనూహ్యమైన రీతిలో అందమైన భావాలు కలిగేటట్టు చూపిస్తాడు.

ధాన్యాలు రాశులు పోశారు. ప్రజలు ధనవంతులయ్యారు. ఆరోగ్యవంతులయ్యారు అని చెప్పటం సామాన్యం. రాశులు పోసిన ధాన్యాలు భూమాత స్తనతుల్యాలు. అమృతమయమయిన ఆ స్తన్యాన్ని సేవించిన ప్రజలు ప్రవర్ధమానులవుతున్నారు. అని చెప్పటం కవిత్వం. ఇలా చెప్పాలంటే భావనా బలంతో పాటు భాషా పటిమ ఉండాలి. ఊహాశక్తి ఉండాలి.

అధునిక కాలంలో ఊహాశక్తి లేని వారు, ఉన్నది ఉన్నట్లు రాయటమే అసలు కవిత్వం అని ప్రచారం చేసి, సాహిత్య ప్రపంచాన్ని ప్రభావితం చేసి కవిత్వంలోంచి రసాన్ని, సృజనాత్మకతను పిండి, ఎండిపోయిన మోడయిన పదాల కూటమిని ‘కవిత’గా ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికి ప్రాచీన కావ్యాలతో, గ్రంథాలతో పరిచయం ఉండదు. దాంతో భాషా పటిమ ఉండదు. వారు ఇలాంటి శ్లోకాలను, చదవలేరు, అర్థం చేసుకోలేరు. అనుభవించలేరు.  కాబట్టి ఇదంతా పనికిరాదని ముద్ర వేసి తరాలను సాహిత్య గతం లేని అనాధలుగా చేశారు. ఫలితంగా ‘చేతులు, కాళ్లు/కాళ్ళకు గజ్జెలుంటాయి, చేతులకు  గాజులుంటాయ్’ అనేవాడు గొప్ప కవి అవుతున్నాడు. ‘చరణకింకిణలు ఘల్లు ఘల్లు మన’ అనేవాడు పనికిరాని వాడవుతున్నాడు.

శ్రీవరుడి రచన అడుగడుగునా ఇలాంటి భావాలను కలిగిస్తూ ఎటువంటి స్థాయిలో ఉండే సాహిత్యం ఏ స్థాయికి చేరుకుంటున్నదోనన్న గ్రహింపును  ఇస్తూంటుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version