[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పి.ఎల్.ఎన్. మంగారత్నం గారి ‘సెల్ఫీ సరదా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
బోట్స్ క్లబ్ పార్కు ఆవరణలో రేల చెట్టుకి కట్టివేయబడ్డ యువకుడు పేరు అజయ్.
ఆ బంధనాల నుంచి విడిపించుకునే ప్రయత్నంలో గట్టిగా గింజుకుంటూ .. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుని బ్రతిమాలుకుంటున్నాడు, అలా కట్టేసిందే అతను కావడంతో.
“అన్నా! తప్పయింది.. అన్నా. ఈ సారికి వదిలెయ్యి. ఇంకోసారి ఇలా చెయ్యను. మా కాలేజీలో తెలిస్తే ఏమైనా ఉందా? నన్ను రేపటి నుంచీ కాలేజీలోకే రానివ్వరు” అంటూ.
అంతకు ముందే, అక్కడే ఉన్న చెరువులో దూకడంతో.. ఒంటి మీద ఉన్న ఉన్న దుస్తులు పూర్తిగా తడిసి పోయి చలికి వణకుతున్నాడు. జుట్టు నుంచి సన్నగా నీటి చుక్కలు కారుతున్నాయి. జేబులో సెల్ చిన్నగా చప్పుడు చేస్తున్నా.. తీసి చూసుకునే వీలు లేదు.
“అరే! ఇంట్లో చెప్పి వచ్చినవా? లేదా? చెరువు రిపేరులో ఉండి.. మెయిన్ గేట్‌కి తాళం పెట్టి. మరీ లోపల పనులు చేయించుకుంటు౦టే.. మా కళ్లుగప్పి లోనికి వచ్చిందే కాకుండా.. మీది కెల్లి.. సెల్ఫీలని కబుర్లు చెబుతావ్.. అయినా మీలాంటి కాలేజీ పోరాగాల్లకి ఏం పోయే కాలం వచ్చింది? సక్కగా సదువుకోమని అమ్మానాయినా పంపిస్తే .. ఇట్లా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. పెద్దోల్లను రానియ్యి. అప్పుడే వదిలేది.. అంతవరకూ సప్పుడు చెయ్యకు” అంటూ గదమాయించి, ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు.
ఫోన్ అందుకున్న వార్డు కార్పోరేటరు, కంగారుగా మాట్లాడి “నేను వస్తున్నా.. కమీషనర్ గారికి నువ్వు కూడా.. ఓ సారి ఫోను కొట్టు” సలహా ఇచ్చాడు.
అదే మంచి పని.. విషయం మరెవరి ద్వారానో తెలిసే ముందే తను మేల్కోవాలి. లేకపోతే, తనకే మాట వస్తుంది. ఇంత చేసీ అక్కరకు రాకుండా పోతుంది అనుకుంటూ మళ్ళీ పోన్ డయల్ చేసాడు.
ఆ సంభాషణ అంతా అజయ్ ఆలకిస్తూ ఉండడంతో..
“అన్నా! అంత పని చేయకండి అన్నా. కమీషనర్ గారికి చెప్పకండి. మేము ఇక్కడికి ‘చావడాని’కి రాలేదు. ఏదో సెల్ఫీలు తీసుకోవాలని వచ్చాం. ప్రగతి కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఈరోజు కాలేజీ లేకపోవడంతో ఇటుగా వచ్చాం. నేనూ నా స్నేహితుడూ. మీ విజిల్స్ విన్న కంగారులో నా స్నేహితుడు కాలు జారి చెరువులో పడిపోయాడు. అయినా నేను వాడిని రక్షించాను కదా!” అంటూ ప్రాధేయపడ్డాడు.
“అంటే, నేను విజిల్ ఏసినందుకే నీ తోటివాడు చెర్ల పడ్డడంటావ్. అదే మీకేమైనా జరిగిఉంటే ఈ రోజుతో .. నా నౌకరి పోవడం ఖాయమే కాదు.. పోలీసు కేసయి.. డ్యూటీ సరిగ్గా జేస్తేలేనని బొక్కలో ఏసేటోల్లు గదా! గందుకే, జరిగింది పైవాళ్ళకి తెలియ చెయ్యకపోయినా నాకు తంటానే” అంటూ ఫోన్లో బిజీ అయిపోయాడు సెక్యూరిటీ.
అంత ఉదయాన్నే..
విషయం తెలుసుకున్న కమీషనరు ఆఘమేఘాల మీద సంబంధిత అధికారులను వెంటబెట్టుకుని మరీ క్లబ్ దగ్గరకు వచ్చేశారు. వస్తూనే చెట్టు కట్టబడి ఉన్న అజయ్‌ని చూస్తూనే..
“ఏమిరా! నీ తోటివాడు వాడు ఏడి? యాడికి పోయిండు? వాడు పారిపోతే, నువ్వు దొరికినవన్న మాట. అసలు మొదగాలు.. తాళం పెట్టి ఉన్న పార్కు లోనికి ఎట్లా దూరిన్రో చెప్పురి” అంటూ తన యాస భాషతో అడిగాడు.
మొదట .. ఆ భారీ ఆకారాన్ని చూసి భయంతో బిగుసుకుపోయిన అజయ్, నెమ్మదిగా తేరుకుని చేతులు జోడిస్తూ “సార్! నేను ఈ ఊరిలోనే ప్రగతి కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను హాస్టల్లో ఉండి. అలాగే నా స్నేహితుడు ‘దయాసాగర్’ కూడా. ఈ రోజు కాలేజీ లేకపోవడంతో ఇద్దరం కలిసి ఇటు వచ్చాం. చెరువులో ‘బోట్లు’ కనిపించడంతో .. వాటి దగ్గర సెల్ఫీలు దిగాలని అనుకున్నాం. తీరా వస్తే, పార్కు గేటుకి తాళం వేసి కనిపించింది. కాలేజీ ఉంటే మళ్ళీ రావడానికి వీలుపడదని.. ఓ ప్రక్కన అడ్డుగా వేసి ఉన్న ముళ్ళ కంచెల్ని తప్పించుకుంటూ లోనికి వచ్చాం” అంటూ చెప్పాడు భయం భయంగా.
కమీషనరు అటుగా దృష్టి సారిస్తూ “మొన్ననే వారం రోజుల క్రిందట నీలాంటి వాళ్ళే.. ఓ ఇద్దరు కుర్రాళ్ళు.. ఆ చెరువులోనే జారి పడి చచ్చిపోయారురా అబ్బీ! ఇంకా ఊరు ఆ విషయం మరిసిపోక ముందే, మళ్ళీ మీరు తయారయ్యారన్న మాట” కళ్ళెర్ర చేసాడు.
“మాకు అలాంటి ఉద్దేశం లేదు సార్! సెల్ఫీలు తీసుకునే ఆలోచనతోనే వచ్చాము. అయితే సెక్యురిటీ ‘అన్న’ గట్టిగా విజిల్ వేసుకుంటూ ‘ఎవర్రా! అక్కడ’ అంటూ మా వైపు పరిగెత్తుకుంటూ రావడంతో.. కంగారుపడి ముందుకు పరిగెత్తబోయిన నా స్నేహితుడు కాలు జారి చెరువులో పడిపోయాడు. వాడికి ఈత రాక పోవడంతో.. నేనే చెరువులో దూకి ప్రాణాలు కాపాడాను. అంతే తప్ప వేరే ఆలోచన ఏమీలేదు” అంటూ చెప్పాడు.
“అంతే! సార్! గా.. పోరగాల్లు గాడ తచ్చాడుతుంటే.. ‘ఎవర్రా మీరు’ అంటూ గట్టిగా విజిలేసినా” చెప్పాడు తన డ్యూటీ.. తను చేసినట్లు.
అన్నీ వింటున్నారు కమీషనరు.
“మరొకసారి ఇలాంటి తప్పు చేయను. తాళం పెట్టి ఉన్న పార్కులోకి దొంగచాటుగా రావడం మా తప్పే. ఈసారికి వదిలేయండి సార్” అంటూ చేతులు జోడించాడు. కన్నీళ్ళు వరదలై కారుతున్నాయి.
దాంతో కాస్త మెత్తబడ్డాడు కమీషనరు.
“నువ్వు చెప్పేది నిజమే అని ఎలా అనుకోమంటావురా? దొరికిపొతే ఎవడైనా ఇలాంటి కబుర్లే చెబుతాడు” అన్నారు అసహనంగా.
“లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను. మాది ‘తొండంగి’ మండలం ‘పెరుమాళ్ళపురం’ గ్రామం. నేనూ, మా ఫ్రెండూ ఇద్దరం కలిసి ఇక్కడే శాంతినగర్‌లో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. నిన్నటితో.. ప్రాక్టికల్ పరీక్షలు అయిపోయాయి. ఇక థియరీ పరీక్షల కోసం చదువుకోవడానికి అన్నట్లు.. కాలేజీకి వచ్చేసాము. అయితే ఎందుకనో ఈ రోజు కాలేజీ తెరవలేదు. ఏం చేయాలో తోచక.. అలా తిరుగుతూ ఇక్కడి వరకూ వచ్చాము. వచ్చినందుకు.. అనుకోకుండా ఇలా జరిగిపోయింది” దీనంగా ముఖం పెట్టి చెప్పాడు.
“అయితే, పరీక్షల్లో మార్కులు గిట్ట తగ్గినయ్యేమో” అనుమానంగా అడిగాడు కమీషనర్.
“లేదు. సార్! మా ఇద్దరికీ మంచి మార్కులే వస్తాయి”
“అట్నా. వాళ్ళ ప్రిన్సిపాల్‌కి ఫోన్ కలపండి” ఆదేశించాడు వెంట ఉన్న ఆఫీసర్లకి.
ఫోన్ కలిసింది.
“అబ్బే! వాళ్ళిద్దరూ మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులే. మేము వాళ్ళపై ఏమీ కేకలు వెయ్యలేదు” చెప్పాడు ప్రిన్సిపాల్.
ముఖాలు చూసుకున్నారు వాళ్ళు.
“తల్లితండ్రుల గొడవ పెట్టుకుని వచ్చి ఉంటారు అనుకుందామనుకున్నా.. వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండడం లేదు. కాబట్టి, ఎందుకైనా మంచిది పోలీస్ కేసు బుక్ చేయండి” అంటూ ఆదేశించారు.
వెంటనే చేతుల్లో ముఖం దాచుకున్నాడు అజయ్. ఎంత చెప్పినా విషయం మళ్ళీ మళ్ళీ అక్కడికే రావడంతో.
అధికారులు ఏ విధంగా కేసు పెట్టాలి, ఏం సెక్షన్లు ‘కోట్’ చెయ్యాలి అన్న ఆలోచనలో పడ్డారు.
***
అలా ఒక గంట గడిచింది.
ఇంతలో..
ఉరుకుల పరుగుల మీద వచ్చి ఆ క్లబ్ దగ్గర ఆగిపోయింది.. మోతుబరి రైతు గోపాలం బుల్లెట్టు బండి.
కమిషనర్ రాకతో తెరుచుకున్న.. గేటు గుండా లోనికి వస్తూ.. చెట్టుకు కట్టేసి ఉన్న కొడుకుని చూసి లబోదిబో మన్నాడు.
“చదువుకోమని పంపిస్తే నీకు ఇలాంటి తిరుగుళ్ళు ఏమిట్రా.. ఆ దయాసాగర్ గాడు ఫోన్ చేసి చెబితే, కాళ్ళాడలేదు. వెంటనే బయలుదేరి వచ్చేసాను” అంటూ కొడుకుని గట్టిగా మందలించాడు.
అక్కడ ఉన్న ఆఫీసర్లకు నమస్కారం చేస్తూ “సర్ మా అబ్బాయిని మేము ఎప్పుడూ ఏమీ అనం, వాడికి ‘ఆత్మహత్య’ చేసుకునే కష్టం ఏమీ లేదు. పైగా రాత్రే ఫోన్లో, ప్రాక్టికల్ పరీక్షలు బాగా రాశానని కూడా చెప్పాడు. అయినా, మేము అగ్నికులక్షత్రియులు. మాకు ఈత చేతనవుతుంది. కాబట్టే మావాడు స్నేహితుడ్ని రక్షించుకోగలిగాడు. అందుకోసం అయినా నా కుమారుడిని వదిలేయండి, అలాగే ఆ దయాసాగర్ గాడిని కూడా క్షమించెయ్యండి. వాడు వాళ్ల తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన ఒక్కడే సంతానం. కాబట్టి కేసులేం పెట్టకండి. ఈసారికి వదిలేయండి” అంటూ వేడుకున్నాడు.
అప్పుడు ఎంత తరచి చూసినా కమిషనర్ గారికి అందులో అసందర్భం అయిన విషయం ఏమీ కనిపించలేదు.
ఆఫీసర్లు అందరి వైపూ ఓసారి దృష్టి సారించి.. అందరిలోనూ ఫర్వాలేదు అన్న నమ్మకం కనిపించాక..
“సరే! ఫో! పోయి ఇకనైనా బుద్ధిగా చదువుకో” అజయ్ వైపు తిరిగి హుకుం జారిచేశారు.
అలా బంధ విముక్తుడైన అజయ్..
తండ్రితో కలిసి అందరికీ నమస్కారాలు పెట్టడంతో వెనుదిరిగారు కమిషనర్.
ఏదో సరదాగా తీసుకోబోయే సెల్ఫీ ఇలా ప్రాణం మీదకు వస్తుందని అనుకోలేదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరు? అంటే ఇదే.
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: * ‘సెల్ఫీ సరదా’ కథ బాగుంది.. సరదాగా తీసుకునే విషయాలు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది అనే ముగింపుతో..*
You must be logged in to post a comment.
తల్లివి నీవే తండ్రివి నీవే!-4
భారతీయ కార్మిక హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ అసమాన కృషి ఫలితమే
శ్రీవర తృతీయ రాజతరంగిణి-21
నన్ను వదిలెయ్యండి ప్లీజ్
అలనాటి అపురూపాలు-56
స్నేహం సత్యం శివం సుందరం
మహతి-66
చిరుజల్లు-75
యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-6
దేశ విభజన విషవృక్షం-45
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®