పట్టితి భట్టరార్య గురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్
బెట్టితి, మంత్రరాజ మొడి పట్టితి, నయ్యమ కింకరాళికిం
గట్టితి బొమ్మ, మీ చరణకంజములందు దలంపు పెట్టి పో
దట్టితి పాపపుంజముల దాశరథీ కరుణా పయోనిధీ.
స్వామిని చేరి తాను నరకానికి పోకుండా జాగ్రత్త పడ్డానని కంచెర్ల గోపన్న రామునికి దాసుడిగా చెప్పుకున్నాడు. అయితే చరణాలకు శరణమనడంతోనే ఆయనకు పరమపదవాసం లభించలేదు. అది ఆచార్యుల పాదాలవల్లనే లభించాయని శ్రీ వైష్ణవ క్రమాగత విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఆచార్యాశ్రయం కొరకు ఊర్ధ్వపుండ్ర ధారణ చేసుకుని మంత్ర రాజాన్ని పొంది చివరికి ఆచార్యుని ద్వారా భగవత్ సాయుజ్యాన్ని పొందానని చెప్పుకోవడం విశిష్టాద్వైత సంప్రదాయ మార్గంలో ఉంది. గురువు వల్ల పొందింది అష్టాక్షరీ మంత్రం. దాని ద్వారా మోక్షాన్ని పొందానని చెప్పుకున్న రామదాసు సాహిత్యంలో విశిష్టాద్వైత తత్త్వ స్వరూపం పరిశీలించడం ఈవ్యాస ఉద్దేశం.
రామదాసు కీర్తనలు, దాశరథీశతకం రచించాడు. మరెన్నో రచించాడని అన్నా ఈ రెండింటికే ఆయన రచనలుగా కీర్తి దక్కింది. ఈ రెండు ప్ర్రక్రియలలో వైష్ణవ సంప్రదాయ పరిమళాన్ని అందిస్తూనే అంతర్గతంగా ఈసిద్ధాంతతత్త్వాన్ని, స్వరూపాన్ని స్థూలంగా ప్రస్తావన చేశాడు. రామదాసు ఆళ్వారుల వంటి భగవద్భక్తుడు. ఆళ్వారుల రచనలలో కనిపించే ఆర్తి రామదాసు రచనలలోనూ కనిపిస్తుంది. ఆళ్వారులు భగవద్దత్తప్రతిభతో పాశురాలు రచించినట్లే రామదాసూ రచించాడు.
రామదాసు రఘునాథ భట్టరార్యుడి దగ్గర తీసుకున్న మంత్ర రాజమే తప్ప ప్రత్యేకంగా విశిష్టాద్వైత రహస్యాలు చదివినట్లు దాఖలాలు లేవు. అయితే తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రాలైన భద్రాద్రి, యాదాద్రి వంటి క్షేత్రాలలో పూర్తి స్థాయిలో వైష్ణవ పడికట్టు అనుసరించే క్షేత్రంగా భద్రాచలానికి ప్రసిద్ధి ఉంది. ఇవి రామదాసు కాలం నుంచే ఉన్నట్లు దేవాలయచరిత్ర చెబుతున్నది. అందువల్ల పాంచరాత్రాగమానుసారం జరిగే ఉత్సవాలు, ఆళ్వారుల పాశురాలలో కనిపించే ఆర్తి, జీవుడు భగవంతుని చేరడానికి పడే వేదన వంటివన్నీ రామదాసు కీర్తనలలో కనిపిస్తాయి. ప్రత్యేకంగా పేర్కొనబడే విషయం ఏమిటంటే ఆళ్వారుల పాశురాలు రామదాసు కీర్తనలు సామూహికంగా గానం చేయబడేవే. ఆళ్వారులలో వైష్ణవులలో దాసభావన, నైచ్యానుసంధానం రామదాసులో అడుగడుగునా కనిపిస్తాయి. నిజానికి దాసభావన భక్తులందరిలో కనిపించినా దాసానుదాసత్వం మాత్రం విశిష్టాద్వైత సంప్రదాయంలోనే కనిపిస్తుంది. శరణాగతి భగవంతుని యందు మాత్రమే చేసేది కాగా దాస్యం భగవంతుడు, భాగవతుడు ఇద్దరి దగ్గర చేసేది. తాను దాసుడిని అని చెప్పుకున్నాడంటే భగవత్ పాద సంబంధం గల అందరికి తాను దాసుడినని చెప్పుకోవడమే.
రామదాసు కీర్తనలు, దాశరథీశతకం రెండూ భగవంతుని పారమ్యాన్ని చెప్పేవే. శ్రీ వచనభూషణమ్ అన్న విశిష్టాద్వైత సంప్రదాయ గ్రంథం ఆచార్యుడు, భగవంతుడు, భాగవతుల సంబంధం గురించి ఇలా చెబుతుంది.
ప్రాప్యమునకు ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం
మధ్యమ పర్వం భగవత్ కైంకర్యం
చరమ పర్వం భాగవత కైంకర్యం
ఆచార్య ప్రీతి విషయమైన భగవత్ కైంకర్యమును ఆచార్య కైంకర్యమనీ, భగవత్ ప్రీతి విషయమైన భాగవత కైంకర్యం భగవత్ కైంకర్యమనీ, భాగవత ప్రీతి విషయమైన ఆచార్య కైంకర్యం భాగవత కైంకర్యమనీ చెప్పబడింది. అందువల్ల ఆచార్య కైంకర్యం ప్రాప్యమని చెప్పవచ్చు. [ శ్రీ వచనభూషణమ్ 412 వ సూత్రం, వివరణ]
ఆచార్యుడికి భగవత్ సేవ, భగవంతునికి భాగవత సేవ, భాగవతులకు ఆచార్య సేవ చాలా ఇష్టమైనవని పై మాటల తాత్పర్యం. రఘునాథభట్టరార్యుడి సేవ ద్వారా భాగవతులను, భగవదాలయ నిర్మాణం చేసి ఆయనను అర్చించడం ద్వారా ఆచార్యులను, భగవద్దర్శనం చేయించి భాగవతుల సేవను చేసి భగవంతుని ఏకకాలంలో రామదాసు అర్చించాడు. రామదాసు భగవద్దాసుడిగా, భాగవతుడిగా ఆళ్వారుల స్థితికి తక్కువకాడు. అయితే ఆళ్వారులు, అన్నమయ్యలలో కనిపించినంత విశిష్టాద్వైత తాత్త్వికత రామదాసు సాహిత్యంలో కనిపించదు. అందుకు కారణం రామదాసు ఉద్విగ్న మనస్కుడైన భక్తుడు కావడం, భగవంతుని చరణాలు తప్ప తనకేమీ అక్కరలేదనీ భావించే స్వభావమేనని చెప్పాలి. ఆళ్వారులలో కులశేఖరులు, వాగ్గేయకారులలో రామదాసు ఉద్విగ్న భక్త హృదయులు.
రామదాసు సాహిత్యంలో విశిష్టాద్వైత స్వరూపాన్ని అర్థం చేసుకోడానికి ప్రపన్నుని తత్త్వం, ప్రపత్తి, ప్రధానాంశాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలు మూడింటిలోనూ చూడవచ్చు. ప్రపత్తి ప్రత్యేకంగా విశిష్టాద్వైతానికే సంబంధించినది. రామదాసులో ఈ ప్రపన్నుని దృష్టిని ప్రపత్తిని పరిశీలించడానికి ప్రపత్తి స్వరూపాన్ని పరిశీలించవలసి ఉంటుంది.
నిశ్చితే 2 న్యస్య సాధ్యస్య పరత్రేష్టస్య సాధనే
అయమాత్మ భరన్యాసః ప్రపత్తిరితి చోచ్యతే అని భరద్వాజ సంహిత ప్రపత్తిని నిర్వచించింది. చరమోపాయమైన మోక్షం సాధించడానికి భగవంతునియందు ఆత్మ సమర్పణం చేయడం ప్రపత్తి. ఇది ఆరు విధాలు.
అనుకూల్యస్య సంకల్పః ప్రాతి కూల్యస్య వర్జనమ్
రక్షిస్యతీతి విశ్వాసో గోప్తృత్వ వరణమ్ తథా
ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతిః
ఈ లక్షణాలన్నీ రామదాసులో కనిపిస్తాయి.
ఈ ప్రపత్తి ధర్మాలను, భేదాలను విశిష్టాద్వైత సంప్రదాయం రెండు ప్రధాన రీతులుగా చెబుతుంది. ఈ రీతులను అనుసరించిన ప్రపన్నులను ఆర్తప్రపన్నుడు, తృప్త ప్రపన్నుడు అని అంటారు. పరమాత్మ ఏదో ఒక సందర్భంలో మోక్షమిస్తాడని స్థిరచిత్తంతో ఉండేవాడు తృప్త ప్రపన్నుడు. పరమాత్మను తనను రక్షించమని మోక్షమివ్వమని పదేపదే ప్రార్ధించేవాడు ఆర్తప్రపన్నుడు. ఈ ఆర్త లక్షణమే రామదాసు సాహిత్యంలో కనిపిస్తుంది.
నా తప్పులన్ని క్షమియించు మీ జగ
న్నాథా నీ వాడ రక్షింపుమీ – (రామదాసు కీర్తనలు.తె.వి.వి. పుట.23 )
ఉన్నాడో లేడో భద్రాద్రి యందు
ఆకోని నేనిపుడు చేకొని వేడితే
రాకున్నా డయ్యయ్యో కాకుత్స తిలకుడు (పైదే -20)
ఎంతపని చేసితివి రామ నిన్నేమందు (ఫైదే -72)
ఎటుబోతివో రామ యెటుబ్రోతువోరామ (పైదే -138)
ఇక్ష్వాకు కులతిలక యికనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకు లెవరింక రామచంద్రా (పైదే -247)
ఎక్కడి కర్మము లడ్డుపడెనో ఏమి సేయుదునో శ్రీరామా
అక్కట నా కన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా – (పైదే-251)
రామ రామ సీతారామ రామ రామ సీతారామ
రాదా దయయిక నామీద యిపుడైన
పాదములకు మ్రొక్కెద పలుమారు విన్నవించెద (పైదే -324)
తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు
పగవాడనా యెంతో బతిమాలిననుగాని పలుకవేమి నీవు (పైదే -278)
దశరథ రామగోవింద నన్ను దయజూడు పాహి ముకుంద- (పైదే -293)
నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామ (పైదే -312)
వంటి కీర్తనలలో రామదాసు ఆర్తిని, భగవంతుని శరణు వేడే విధానాన్ని గమనించవచ్చు. అయితే రామదాసు ఇనకులతిలకుడిని భౌతిక చెర నుండి విడిపించమని కదా కోరుకున్నది అని కొందరు చెప్పవచ్చు. భౌతికమైన బాధలను తట్టుకోలేక భగవంతుని వేడిన సందర్భాలను రామదాసు వాచ్యంగానే చెప్పాడు. ఉద్విగ్న హృదయంతో ప్రశ్నించాడు. ఆ స్థితి లేని కీర్తనలలో ఆర్త ప్రపన్నుడి గుణాన్ని మనం గమనించవచ్చు.
స్వతహాగా రామదాసు ఆర్తుడు కావడం వల్ల తృప్తప్రపన్న లక్షణం అంతగా కనిపించదు.
రాముని వారమైనాము యితరాదుల గణన సేయుము మేము,
ఆమహోమహుడు సహాయుడై విభవముగా మమ్ము చేపట్ట- (పైదే-262) అన్న కీర్తనలో తృప్తప్రపన్నుని లక్షణం కనిపిస్తుంది.
రామదాసు కీర్తనలలో కనిపించే విశిష్టాద్వైత లక్షణం ప్రపత్తి. ప్రపత్తి అంటే పరమాత్మను శరణు వేడడం. ఈ శరణువేడడం గురించి రామదాసు ‘‘శరణాగత బిరుదు నీదు గాదె రామా’’ అని రాముడికి గుర్తు కూడా చేస్తాడు. శరణాగతి వేడే సందర్భంలో ఇంతకు పూర్వం శరణాగతి ఫలాన్ని పొందిన వారిని పేర్కొనడం ఆళ్వారుల రచనల్లోనూ, రామదాసు కీర్తనల్లోనూ కనిపిస్తుంది.
దాశరథి శతకంలో దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు…….(పద్యం 54)లో గుహుడు, శబరిలకు మోక్షమిచ్చినట్టే నాకూ ఇవ్వు అంటాడు. నమ్మాళ్వారులు ‘‘అన్ఱు ఐవర్కు అరుళ్ శెయ్ ద నెడియోనై’’ (నాడు ఐదుగురికి శరణమిచ్చిన స్వామీ) అంటాడు. శ్రీమద్రామాయణాన్ని వైష్ణవులు శరణాగతి కావ్యంగా చెబుతారు. జటాయువు, గుహుడు, శబరి, విభీషణుడు వంటి పాత్రలన్నీ స్వామియందు ప్రపత్తి చేసి పరమపదాన్ని పొందాయి. రామాయణ, భాగవత పాత్రలను జ్ఞప్తికి తెస్తూ తనకూ శరణాగతి ఫలాన్నివ్వమని వేడుతాడు రామదాసు.
నిన్ను నమ్మి యున్న వాడను ఓ రామ
నిన్ను నమ్మినవాడ పరులను వేడనిక
మన్నన జేసి పాలింపవే ఓరామ – (రా.కీ. తె.వి.వి. పుట -40)
రక్షకుడు, ఇతరులను వేడను అన్న ప్రపత్తి గుణం కనిపిస్తుంది. ఇది ఆరు రకాల శరణా గతులలో ప్రతికూలతను వర్జించడంతో సమానం. ఇలాగే మిగతా అంశాలను సమన్వయం చేసుకోవచ్చు.
విశిష్టాద్వైత సిద్ధాంతం జీవుడికి పరమాత్మతో గల సంబంధాన్ని తొమ్మిది విధాలుగా వివరించింది. దీన్ని నవవిధ సంబంధం అని ఈ సాంప్రదాయికులు చెబుతారు.
పితాచ రక్షక శ్శేషీ భర్తా జ్ఞేయో రమాపతిః
సామ్యాధారో మమాత్మాచ భోక్తాచాద్య మనూదితః అని 1.పితా-పుత్ర, 2.రక్ష్య- రక్షక, 3.శేష-శేషి, 4.భర్త-భార్య, 5.జ్ఞాతృ-జ్ఞేయ 6. స్వ- స్వామి, 7.శరీర-శరీరి, 8.భోక్తృ-భోగ్య, 9.ఆధార- ఆధేయ. (నవవిధ సంబంధమ్. అ.ప్ర. గోపాలాచార్యులు,1994). భర్త-భార్య, జ్ఞాతృ-జ్ఞేయ, భోక్తృ-భోగ్య, సంబంధం తప్ప మిగతావన్నీ రామదాసు కీర్తనలలో కనిపిస్తాయి. అందులో ఎక్కువగా పితా -పుత్ర సంబంధాన్నే ఆయన ప్రస్తావించాడు.
ఇతరము లెరుగనయ్యా నా – గతి నీవే శ్రీరామయ్యా అన్న కీర్తనలో
తప్పులెన్న వద్దంటి తల్లి తండ్రి నీవంటి
వొప్పులకుప్ప వంటి యప్పవు నీవను కొంటి
అప్పటప్పటికి తప్పక నీవే – తిప్పలు బెట్టక దిద్దు కొనుమీ (రా.కీ.పు.62) అని
పితా-పుత్ర సంబంధాన్ని చెప్పుకుంటాడు.
అడుగుదాటి కదలనియ్యను నాకభయమియ్యక నిన్ను విడువను (రా.కీ పు.356) అన్న కీర్తనలోనూ ఈ సంబంధమే కనిపిస్తుంది.
రామదాసు కీర్తనలలో పురుషకారిణి వైభవం [అమ్మవైభవం] చాలాచోట్ల ప్రస్తావించాడు. అమ్మను ప్రస్తావించే సందర్భంలో తన గోడును స్వామికి విన్నవించమని అడగడం ద్వారా విశిష్టాద్వైత సంప్రదాయం పురుషకారిణిగా ఆమెను భావించిన రీతి కనిపిస్తుంది. విశిష్టాద్వైత సంప్రదాయం లక్ష్మి భగవంతుడికి జీవునికి మధ్య పురుషకారత్వం చేస్తుందని, తగిన విధంగా తన భర్తకి జీవుడిని గురించి నచ్చచెప్పి భగవంతునికి ఉండే కోపాన్ని తగ్గిస్తుందంటుంది. జీవుడికి దేవుడికి మధ్య వర్తిత్వం నెరపడాన్ని పురుషకారిత్వం గా ఈ సంప్రదాయం చెబుతుంది. ఆ స్ఫురణ రామదాసుకు ఉన్నందుకే కొన్ని ప్రత్యేక సందర్భాలలో అయినా తన గురించి చెప్పమని వేడుకుంటాడు.
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవుమని చెప్పునారీ శిరోమణి అన్న కీర్తనలో
ప్రక్కకు చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి సొక్కి యుండెడి వేళ
లోకాంత రంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతమున నేక శయ్యనున్న వేళ – (రా.కీ.406) అమ్మను పురుష కారిత్వం నిర్వహించమంటాడు.
అమ్మనను బ్రోవవే రఘురాముని
కొమ్మనను గావవే మా- (రా.కీ.75)
రామ చంద్రులు నాపై చలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మ నీవైన సీతమ్మ చెప్పవమ్మ (పు-15) అంటూ పురుషకారిత్వాన్ని ప్రస్తావిస్తాడు.
రామదాసు కీర్తనలలో కనిపించే మరో విశిష్టాద్వైత అంశం భాగవత పారమ్యం, దాస భావనతో నైచ్యాను సంధానం చేసుకోవడం.
శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న
ఘోరమైన తపములను కోరమేటికే మనసా
భాగవతుల పాదజలము పైన చల్లు కొన్న చాలు
భాగీరధికి పోయ్యేననే భ్రాంతి యేటికి మనసా
భాగవతుల వాగమృతము పానము చేసిన చాలు
బాగు మీరినట్టి యమృత పాన మేటికే మనసా (రా.కీ.78) అంటూ హరి దాసులకు పూజలాచరించిన చాలు అని భాగవత పారమ్యాన్నివేనోళ్ళ కీర్తిస్తాడు.
రామచంద్రా నన్ను రక్షింప వదే మో నేనెరుగ (రా.కీ.79)అంటూ
భరతుడు, లక్ష్మణుడు, అంగదుడు, సుగ్రీవుడు, శబరి, జాంబవంతుడు వంటి భాగవతుల లాగా తాను సేవలు చేయలేనని తనను వారందరికంటే కింది స్ధాయి భక్తుడినని , భాగవతుడినని చెప్పుకోవడం ద్వారా ఏక కాలంలో నైచ్యానుసంధానం చేస్తూ దాసానుదాసుడిగా తనను తాను ప్రకటించుకున్నాడు.
నీ దాసులకును నేదాసుడ , దయయుంచి ఏలుమయ్యా(రా.కీ.పు.424) అంటాడు.
దాశరథీ శతకంలో పరమ దయానిధే పతితి పావన నామ అన్న పద్యంలో ముకుందమాలలోని ‘మజ్జన్మ ఫలమిదం మధుకైటభారే’ అన్న శ్లోక భావం కనిపిస్తుంది. ఇలా మరిన్ని శ్లోకాల భావాలు ఈ శతకంలో కనిపిస్తాయి. నైచ్యాను సంధానమే దాశరథి శతకంలోని ప్రధాన తత్త్వం.
ఇల్లే వైకుంఠం పందిరే పరమపదం అని ఒక సామెత. అలా రామదాసుకు భద్రాద్రి పరమపదంగా, వైకుంఠంగా కనిపిస్తుంది. విశిష్టాద్వైత సంప్రదాయంలో విభూతిద్వయం అన్న భావన ఉంది. అవి నిత్య విభూతి, లీలా విభూతి. నిత్యవిభూతి అంటే పరమపదం. లీలా విభూతి ఈ సమస్తలోకం. లీలావిభూతి వర్ణనలో నిత్య విభూతి వైభవాన్ని చెప్పడం ఆళ్వారులలో కనిపించినట్టే రామదాసు కీర్తనలలోనూ కనిపిస్తుంది.
భద్రాద్రిలో స్వామి, రామ రామ రామ రామ శ్రీరామ అన్న కీర్తనలో స్వామి స్వరూపవర్ణన చేస్తూ
శంఖ చక్రము లిరు వంకల మెరయగ
పొంకముతో నావంక చూడవేమి అంటాడు రామదాసు.
ఎంతో మహానుభావుడవు కీర్తన(రా.కీ.పు.285)లో
కారణ శ్రీ సీతగ జేసినావు, గరిమ శేషుని లక్ష్మణుని జేసినావు
ఆరెంటి భరత శత్రుఘ్నల జేసినావు, నారాయణ నీవు నరుడవైనావు (రా.కీ.పు.286) అంటూ భరత శత్రుఘ్నులను శంఖ చక్రాలుగా చెబుతాడు. పద్మపురాణం భరత, శత్రుఘ్నులను శంఖ చక్రముల ‘అవతారంగా’ చెబుతుంది. భద్రాద్రిలో శంఖ చక్రాలు వ్యస్తంగా ఉండడానికి చెప్పే స్థల పురాణాన్ని పక్కకు పెడితే భరతుడు శంఖంగానూ, చక్రము శత్రుఘ్నుడి గానూ భావించాలి. స్వామి పరివారమంతా ఆయన ఆయుధాంశాలుగా అవతరించిన విషయాన్నిఆయన స్వరూప వర్ణనల సందర్భంలో గుర్తించవచ్చు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం స్వామి సాకారుడు అది ప్రస్తావిస్తున్నట్లుగా ఆళ్వారులు పాశురాలలో, కవులు స్తోత్రవాఙ్మయంలో స్వామి రూపవర్ణన చేయడం వైష్ణవ సాహిత్యంలో కనిపిస్తుంది. అదే రీతి రామదాసు కీర్తనల్లో చాలాచోట్ల గమనించవచ్చు.
పరమాత్మ ఐదు అవస్థల్లో వేంచేసి ఉంటాడని విశిష్టాద్వైత సంప్రదాయం చెబుతుంది. పర, వ్యూహ, విభవ, అన్తర్యామి, అర్చావతారాలు అవి. ‘అర్చావతారం’ అంటే శ్రీరంగం మొదలు వివిధ క్షేత్రాలలో వేంచేసి ఉండే విగ్రహరూప స్వామి. ఆయనను అర్చించడం ద్వారా పరస్వరూపాన్ని పొందాలన్న విషయం సంప్రదాయం చెబుతుంది. అందుకు అనుగుణంగా రామదాసు కీర్తనలు అర్చవతార విశేషాన్ని చెబుతున్నాయి. అలా సాకారుడై కళ్ళముందు నిలిచిన స్వామిని వర్ణించడం ద్వారా ఆళ్వారుల మార్గాన్ని రామదాసు అనుసరించాడు.
విశిష్టాద్వైత సంప్రదాయ ఆగమాలో పాంచరాత్రాగమం ఒకటి. అందులో భగవదారాధనవిధిలో ‘మానసయాగం’ అన్నది ఒక ప్రక్రియ. భగవదారాధన ప్రారంభించటం కంటే ముందు మనోరూపంలోని స్వామి ఆరాధన చేయమని చెప్పడం మానసయాగం విధి. దానిని
సకలేంద్రియములార సమయము గాదు.
సద్దుసేయక యిపుడుండరే మీరు (రా.కీ.పు-300) అన్న కీర్తనలో
ఇరవుగ నా హృదయ కమల కర్ణికమధ్యమున
భక్తినుంచుకొనియు అంటూ మానసయాగం చేశాడు రామదాసు.
రామదాసు విశిష్టాద్వైత పరిభాష సంబంధ పదబంధాలలో కూడా ఈ తత్త్వాన్ని చెప్పాడు.
అడియేన్: (రా.కీ.పు-104) ‘అడి’ అన్న మాటకు తమిళంలో పాదము అని అర్థం.‘ ఏన్’ అన్న మాటకు ఏను,నేను అని, అడియేన్ అంటే ‘నీపాద దాసుడిని’ అని అర్థం.
తిరువడిగళ్ (రా.కీ.పు-170) : తిరువడి అంటే స్వామి పాదము అని అర్థం.‘కళ్’ శబ్దం బహువచన ప్రత్యయం.స్వామి పాదములను ‘తిరువడిగళ్’ అని వైష్ణవులు వ్యవహరిస్తారు.
దాసోహం (రా.కీ.పు-172) : సంస్కత పదం. వైష్ణవ భక్తుడు, భాగవతుడు కనిపించినప్పుడు నేను నీ దాసుడిని అని చెప్పడం
నూటయెనిమిది తిరుపతులు (రా.కీ.పు-8) : దివ్య దేశములు అన్నమాటకు వైష్ణవక్షేత్రాలు అని స్థూల వ్యవహారం. అయితే శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నవన్నీ వైష్ణవక్షేత్రాలే అయినా ఆళ్వారుల సంబంధం గల దేశాలను, ప్రాంతాలను మాత్రమే దివ్యదేశములు అని వ్యవహరిస్తారు. ‘దివ్య’ శబ్దం దివ్యసూరులు, దివ్యప్రబంధములు, దివ్యదేశములు అన్నచోట కనిపిస్తుంది. ఈ మూడు చోట్ల ఆళ్వారులసంబంధం ఉంది. దివ్యసూరులంటే ఆళ్వారులు. వారు రచించినవి దివ్యప్రబంధములు. ఆ దివ్యప్రబంధాలలో స్తుతించబడిన భగవత్ స్వరూపం గల దేశం దివ్యదేశము. అందువల్ల ఆళ్వారుల భగవత్ స్తుతి గల క్షేత్రాలకు దివ్యదేశములు అని పేరు ఏర్పడింది. ఇవి 108 అని ప్రసిద్ధి. అర్చారూపంలో స్వయంవ్యక్తమైనభగవత్ స్వరూపం గలవి దివ్యదేశములు. అవే నూటయెనిమిది తిరుపతులు. తిరుపతి అన్నది స్థలమన్న అర్థంలోగాక శ్రియ:పతి, స్వామి ఉన్న స్థలం అని అర్థం చేసుకోవాలి.
రామదాసు సాహిత్యంలో విశిష్టాద్వైత తత్త్వ స్వరూపం తాత్త్వికచర్చల స్థాయిలో గాక ఒక భాగవతుడు ఈ సంబంధాన్ని గురించి స్థూలంగా చేసుకున్న అవగాహన రూపంలో కనిపిస్తుంది. ఉద్విగ్న మనస్కుడైన భాగవతుడి ఆర్తి ప్రపత్తి, నైచ్యానుసంధాన రూపంలో ఆయన సాహిత్యంలో కనిపిస్తుంది.
సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి ఇటీవలి కాలంలో సాహిత్య ప్రపంచంలో సుప్రసిద్ధులైన సాహిత్య విశ్లేషకుడు.
You must be logged in to post a comment.
వారెవ్వా!-33
సాంఖ్యము- పరిచయము
సంచిక – పద ప్రతిభ – 142
సంగీత సురధార-13
కైంకర్యము-8
అయినా సరే!
అమాయకపు అమ్మే కావాలి!
మూసెయ్ తలుపులు!
కల్తీ కాలం
ఇట్లు కరోనా-11
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®