[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘ప్రసిద్ధమైన సినిమా పాటైన మొల్ల కల్పన’ అనే రచనని అందిస్తున్నాము.]
వాల్మీకి రామాయణం బాలకాండములో 48వ, 49వ సర్గలలో అహల్యా శాప విమోచనం గురించిన కథ ఉంటుంది. టూకీగా చెప్పాలంటే, మిథిలకు దగ్గరలో ఉన్న ఒక పాతది, నిర్జనమైన ఆశ్రమం గురించి శ్రీరాముడు విశ్వామిత్రుడిని అడగడం వల్ల ఈ కథ ప్రస్తావన వస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా చెబుతాడు.
ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. అతడు ఇక్కడ తన భార్యయైన అహల్యతో చాలా కాలం తపస్సు చేశాడు. ఒక రోజు ఇంద్రుడు ఆ ముని లేని సమయంలో అతని వేషం ధరించి ఆమెని సమీపించి నీ సంగమము కోరుతున్నాను అని అడిగాడు. మునివేషంలో వచ్చిన అతడు ఇంద్రుడని తెలిసి కూడా ఆమె దుర్బుద్ధితో వచ్చిన వాడు దేవతలకి రాజు కదా అని ఇష్టంతో ఒప్పుకుంటుంది. తరువాత, “నేను కృతార్థురాల నయ్యాను. ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో, నిన్ను నన్ను కూడా గౌతముని నుండి రక్షించు.”, అని ఆమె ఇంద్రుడితో అంటుంది. ఇంద్రుడు ఆ పర్ణశాల నుండి బయటకు వెళుతూ గౌతముని కంట పడతాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడు ఏమి చేశాడో గ్రహించిన గౌతముడు నీ అండములు పడిపోవు గాక అని ఇంద్రుణ్ణి శపిస్తాడు. “అనేక వేల సంవత్సరాలు ఇక్కడే ఎవరికీ కనపడకుండా బూడిదలో పడియుండి ఆహారం లేకుండా వాయువు మాత్రమే భక్షిస్తూ నివసిస్తావు, కొంత కాలం తరువాత దశరథ సుతుడైన రాముడు ఈ వనంలో ప్రవేశించగానే నీవు శుద్ధురాలవు అవుతావు” అని అహల్యని కూడా శపిస్తాడు, గౌతముడు. రామునకు అతిథి సత్కారాలు చేసిన తరువాత నీ లోభమోహాలు తొలగి నిజరూపంతో నాతో కలిసి జీవిస్తావు అని కూడా గౌతము డంటాడు. రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే మంచు, మేఘాలు కప్పిన వెన్నెల లాగా, నీటి మధ్యలో ప్రతిబింబించే సూర్యకాంతి లాగా, శాపవశాత్తు పైకి ఎవరికీ స్పష్టంగా కనపడకున్నా, శాపం అంతం అవడం వల్ల అహల్య రామలక్ష్మణులకి కనపడింది.
అహల్యను శిలగా పడియుండమని గౌతముడు శపించినట్లు, రాముడు అక్కడికి వచ్చినప్పుడు అతని పాదం ఆ శిలను తాకగానే ఆమె నిజరూపాన్ని పొందినట్లు కొన్ని గ్రంథాలలో వాల్మీకి రామాయణంలో లేని విధంగా వర్ణించారు. ఈ ఘట్టాన్ని రామభక్తి ప్రతిబింబించే విధంగా చాలా మంది చాలా రకాలుగా పెంచి వ్రాశారు.
కవయిత్రి మొల్ల, 16వ శతాబ్దంలో అనుకుంటాను, వ్రాసిన రామాయణం పద్య కావ్యంలో అహల్యా శాప విమోచనం ప్రస్తావనకి సంబంధించి చేసిన అద్భుతమైన కల్పన వాల్మీకికి దీటుగా (వాల్మీకి చేయలేదు కానీ) ఉంది. ఆమె అహల్య గౌతముని శాపం వల్ల శిలగా మారడం, రామపాదం సోకగానే మళ్ళీ మనిషిగా మారడం గురించి చెబుతూ ఒక అడుగు ముందుకు వేసింది. ఆ పద్యాలు చూద్దాం.
బాలకాండములో 65వ పద్యము:
ఉ. ఆ ముని వల్లభుండు కొని యాడుచుఁ బాడుచు, వేడ్కతోడ శ్రీ రాముని జూచి యిట్లనియె, రామ! భవత్పద ధూళి సోఁకి, యీ భామిని రాయి మున్ను, కులపావన చూడఁగఁ జిత్రమయ్యె నీ నామ మెఱుంగు వారలకు నమ్మఁగ వచ్చును భుక్తి ముక్తులున్.
అయోధ్యకాండములో 32వ పద్యము:
చం. “సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి య్యెడ వడి నోడ సోఁక నిది యేమగునో” యని సంశయాత్ముఁడై కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్.
మొల్ల వేసిన ముందడుగు ఏమిటంటే గుహుడికి రాముని పాదరజము సోకి రాయి కాంతగా మారిందట, ఇప్పుడు నా ఓడ (నావ) మీద ఇతని పాదరేణువులు సోకితే నా నావకి ఏమవుతుందో అని సందేహం వచ్చి ఎందుకైనా మంచిదని రాముని పాదాలు కడిగాడని చెప్పడం. కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ఆ పడవ వాని (గుహుడు) చేత ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో (1971) పలికించిన జానపద సాహిత్యంలో మొల్ల చేసిన కల్పనకి గేయ రూపాన్ని ఇచ్చారు. ఆ గేయం ఇలా ఉంది.
“ఆగు బాబూ ఆగు! అయ్యా నే వత్తుండా!, బాబూ నే వత్తుండ! అయ్యా నే వత్తుండా!, బాబూ నే వత్తుండ! నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నాకు తెలుసులే! నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట, నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే యేమౌతాదో తంట! దయజూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట! రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ! మా నోములన్ని పండినాయి రామయ తండ్రి! మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి!”
ఇంత మంచి కల్పన చేసిన కవయిత్రి మొల్ల, దానికి జానపద మెరుగులు దిద్దిన కవిరత్న కొసరాజు గారు, ఇద్దరూ ప్రాతఃస్మరణీయులే.
ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * ‘ప్రసిద్ధ సినిమా పాటైన మొల్ల కల్పన’ లో మంచి పద్యం గుర్తు చేశారు రచయిత.. అదొక్కటే కాదు, మొల్ల రామాయణంలో ప్రతి పద్యమూ ఆణిముత్యమే! ..హనుమంతుడు తను రామదూతని అని చెబితే మొదట నమ్మదు సీతమ్మ. “రాముడిని నువ్వు నిజంగా చూసినట్లయితే ఎలా ఉంటాడో చెప్పు” అని అంటుంది. రాముడి ఆకారం వర్ణించే శ్లోకాలు ఓ ఇరవై దాకా ఉన్నాయి వాల్మీకంలో.. అవి అన్నీ ఒకే పద్యంలో చెబుతుంది మొల్ల “నీలి మేఘచ్ఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు..” అనే పద్యంలో. ఈ పద్యం భావాన్ని తెలియజేసే పాట ఉంటుంది ‘కథానాయిక మొల్ల’ సినిమాలో.. “నీల జలద రమణీయ రూపం, నిగమాంచల మందిర మణిదీపం..” అంటూ. పౌరాణిక చిత్రాల పాటలు అన్నిటికీ ప్రాచీన కావ్యాలే స్ఫూర్తి.*
You must be logged in to post a comment.
పుళింద
ప్రాంతీయ సినిమా -3: జాలీవుడ్కి కొత్త జాయ్!
ఫలము, పైకము – ఫలితము
‘శ్రీమద్భగవద్గీత – జీవన తత్త్వగీత – విశ్వజన సంహిత’ గ్రంథావిష్కరణ సభ – నివేదిక
వసంతం రాక కోసం ఎదురు చూస్తూ..!?
నల్లటి మంచు – దృశ్యం 15
మిర్చీ తో చర్చ-24: ప్రేమ – మిర్చీ… ఒకటే-6
ఆవేశం చల్లారి ప్రశ్నించడం మానివేసిన అక్షరం – గోలి మధు ‘సంఘర్షణ’ పుస్తక సమీక్ష
ఈ కవిత్వమే ఓ గోలీలాట
కల్పిత బేతాళ కథ-10 శిష్యుని సందేహం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®