[డా. సి. భవానీదేవి రచించిన ‘నేలా – నింగీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నేలమీద నిలబడి మా అమ్మ
ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసేది
ఒక్కసారయినా దాన్లోకి ఎక్కాలని
ఏవేవో కలలు కంటుండేది.
ఆ ప్రయాణాన్ని వర్ణిస్తున్నప్పుడు
సంభ్రమాశ్చర్యాలతో
కళ్ళు తిప్పుకోకుండా వినేది
విమానంలోని విచిత్రాలను
మరింతగా ఊహించుకుంటూనే
కాలం విసిరేసిన ఆవలితీరాలకు
మౌన బాష్పంలా నిష్కమించింది!
రైల్లో నైనా దూరప్రయాణం చేయని అమ్మకు
నేలకూ.. నింగికీ నిచ్చెన అందలేదు!!
సినిమాల్లో.. బొమ్మల దుకాణాల్లో
ఎడ్ల బండిని మా పిల్లలు చూస్తుంటారు
ఒక్కసారయినా దాన్లోకి ఎక్కాలని
ఉబలాటంతో ప్రశ్నిస్తుంటారు
పెద్ద పెద్ద బండి చక్రాలతో
అంత కంటే పెద్ద ఎద్దుల్ని అదిలిస్తూ
బండి తోలే మనిషిని ఆశ్చర్యంగా చూస్తారు
ఎద్దుల మెళ్ళో మువ్వల పట్టీల చప్పుడ్ని
కళ్ళింతలు చేసుకుని వింటారు
ఆ బండెక్కి తిరుగుతున్నట్లు కలల్లోనే
ఖండాంతరాల కేసి ఎగిరిపోయారు
వాళ్ళకి కూడా..
నింగికీ – నేలకూ నిచ్చెన వాలలేదు
నా పిల్లలకు ఎడ్ల బండి బొమ్మను
కొనివ్వగలను గానీ..
విమానం బహుకరించేందుకు
ఇప్పుడు అమ్మకూ నాకూ
ఏ నిచ్చెనా లేదు.. లేదు
1 Comments
మట్టిగుంట వేంకటరమణ
సుప్రసిద్ధ రచయిత్రి డా. సి. భవానీ దేవి గారి రచన నేలా-నింగి ఎంతో చక్కని భావాత్మక కవిత. తెలుగు వారి అనుభవాలను, అనుభూతులను సామాన్యుడి జీవనశైలి అనే ఒక సజ్జలో కట్టి చిక్కటి కవిత్వపు గుబాళింపు తో అందించిన రచయిత్రికి ప్రచురించిన మీకు ధన్యవాదాలు.