[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
యువభారతి లహరీ కార్యక్రమ పరంపరలో, ఏడవ లహరీ కార్యక్రమ ఉపన్యాస వ్యాసాల సంకలనమే – ‘నవోదయ లహరి’.
ప్రతి ఉదయం వెనుక ఒక చీకటి రాత్రి ఉంది. ఆ రాత్రిలో ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్న ఆర్తి ఉంది. చీకటిని చీల్చుకొని వెలుగు ఉదయించే తరుణం జగత్తుకు సుప్రభాతం. ప్రతిరోజూ ఉదయంతో క్రొత్త చరిత్ర ప్రారంభిస్తుంది. ప్రతి నిత్యం జగత్తు క్రొత్తదనాన్ని అనుభవిస్తోంది.
సాహిత్యం సజీవతరంగిణి లాంటిది. అది కూడా కాలప్రవాహంలాగా అనంతంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. చీకటి పడినా, ప్రొద్దు పొడిచినా ప్రవాహం మాత్రం ఆగదు. అయితే ఆ నది – కటిక చీకట్లో రేఖామాత్రంగా స్ఫురింపవచ్చు. వెన్నెల రాత్రులలో కళామయంగా కదలాడవచ్చు. సూర్యరశ్మిలో ఉజ్వలంగా ప్రకాశింపవచ్చు. ఆకృతి ఒక్కటే అయినా అవస్థలో భేదం కనపడవచ్చు. ఒక చీకటి రాత్రిని దాటి ఒక ఉషస్సును దర్శించిన ప్రవాహ ప్రగతిని ‘నవోదయ’ మంటాం. అది అంతటితో ఆగకుండా అనంతంగా పొందే అభ్యుదయ పరంపరకు ప్రతీకగా ‘నవోదయ లహరి’ ని సంభావిస్తాం.
రాయప్రోలు కవిత ఒక క్రొత్త యుగానికి ఉషస్సు. నవ్య కవితా మాకందశాఖ పై నిలిచి అమలిన శృంగార తత్వాన్నీ, పూర్వాంధ్ర ప్రాభవగీతాన్నీ ‘ఆంధ్రావళి మోదముంబొరయ’ నాలపించిన పుంస్కోకిల – రాయప్రోలు సుబ్బారావు.
ప్రణయానికీ, ప్రణవానికీ మధ్యనున్న ప్రవృత్తిని జీర్ణించుకొని, బహిరంతర్మధురంగా భావనం చేసి జీవితయాత్రకే ప్రణయవ్యాఖ్యానంగా కవితా ప్రస్థానాన్ని సాగించిన కవితామూర్తి – నాయని సుబ్బారావు.
ముగ్ధమైన జానపద ప్రణయానికి, ప్రౌఢమైన భావనాన్ని జోడించి మనోజ్ఞ గేయలహరిని పొంగించిన రసమూర్తి – నండూరి సుబ్బారావు.
అభ్యుదయ కవితకు శ్రీశ్రీ ఆకృతినిస్తే ఆరుద్ర ఆటలు నేర్పాడు. ఆధునిక క్రీడలాడిన ఆంధ్రభారతి ముద్దుబిడ్డ – ఆరుద్ర.
వచనకవితకు ఉద్యమ స్ఫూర్తిని కల్పించి, జనవాక్యంగా కవిత నిండాలని కృషిచేసి, పంటలను కూడా కళ్ళారా చూసిన వచన కవితా పితామహుడు – కుందుర్తి ఆంజనేయులు.
ప్రయోగానికి ప్రతిభతో ప్రాణంపోసి, గేయానికి కావ్యగౌరవాన్ని కల్పించి, వచనానికి వైఖరీ వాల్లభ్యాన్ని సంతరించి, పట్టిందల్లా బంగారం చేయగలిగిన ప్రజ్ఞామూర్తి – డా. సి నారాయణ రెడ్డి.
ఆధునికాంధ్ర సాహిత్యలహరికి రాయప్రోలు ఒక నవోదయం. నాయని ఒక శుభోదయం. నండూరి ఒక రాగోదయం. ఆరుద్ర ఒక అరుణోదయం. కుందుర్తి ఒక తరుణోదయం. నారాయణరెడ్డి ఒక నవ్యోదయం. ఇన్ని ఉదయాలను దర్శిస్తూ సాగివస్తున్న నవ్య సాహిత్య ప్రస్థానంపై డా. జి.వి సుబ్రహ్మణ్యం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆచార్య సి. నారాయణరెడ్డి, డా. శ్రీమతి నాయని కృష్ణకుమారి, శ్రీ అద్దేపల్లి రామమోహన రావు, డా. అమరేంద్ర గార్ల సహృదయ సమీక్ష – మా నవ లహరి – మానవ లహరి – ‘నవోదయ లహరి’.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/YuvaBharathi/%20%E0%B0%A8%E0%B0%B5%E0%B1%8B%E0%B0%A6%E0%B0%AF%20%E0%B0%B2%E0%B0%B9%E0%B0%B0%E0%B0%BF/
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర. విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం. వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నాన్నగారూ… నాన్నగారూ…
గంగమ్మ దర్శనం!
జానేదేవ్-3
అలనాటి అపురూపాలు- 191
కొలకలూరి పురస్కారాలు 2022 – ప్రదాన ప్రకటన
అలనాటి అపురూపాలు – 209
మీ టూ
సందిగ్ధత
అన్నింట అంతరాత్మ-8: గొడవలన్నీ వింటా.. కానీ మాటే రాని గోడను నేను!
పంజరపు పక్షి
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®