నీప్రేమయె నాకెపుడూ అవ్యాజము సహోదరా!
నీవుండగ లేదెపుడూ ఏలోపము సహోదరా!
అమ్మకడుపు పంచుకొనియు తోబుట్టువులైనాములె
నీవుచూపు మమతన్నది మాధుర్యము సహోదరా!
పుట్టింటికి దూరమైన లోటెపుడూ లేదులెమ్ము
నీమనసున జాలువారు వాత్సల్యము సహోదరా!
చిన్ననాట ఆడుకొనిన జ్ఞాపకాలు మృదుమధురము
పంచుకొనుటకానాడే ఆరంభము సహోదరా!
కంటనీరు రానీయక చేయిపట్టి నడిపినావు
ఆబలమే నాకునిచ్చె చైతన్యము సహోదరా!
ఏకీడూ చేరకుండ కట్టుచుంటి ఈ’రక్ష’ను
‘రాఖీ’యే మనబంధపు ప్రతిరూపము సహోదరా!
పొంగిపొరలునాత్మీయత కంటినుండి ఏకధార
‘మణి’గవెలుగు నీహృదయపు అనురాగము సహోదరా!!

సమాజంలోని సమస్యలను, విషయాలను కథాంశాలుగా చేసుకుని కథారచన కొనసాగిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి. వివిధ దిన, వార, మాసపత్రికలలో 350కి పైగా కథలు ప్రచురితమయ్యాయి. ‘అమూల్యం’, ‘నువ్వు కడలివైతే…’, ‘పూల మనసులు’ అనే కథా సంపుటాలు ప్రచురించారు. ‘స్వాతిముత్యం’, ‘తరలి రావే ప్రభాతమా’, ‘అతులిత బంధం’ అనే మూడు నవలలు ప్రముఖ పత్రికలలో ధారావాహికలుగా ప్రచురితమయ్యాయి.
2 Comments
Gvsprao
నమస్కారం సార్ నా పేరు గుండమరాజు వేంకట సత్య ప్రసాద్ రావు
నేను కథలు కవితలు రాస్తుంటాను… నాకు అవకాశం ఇస్తే మీకు పంపగలను నా email id… suswara.satya1@gmail.com
Tq sir…
కొల్లూరి సోమ శంకర్
Sir,
Please send your works to the editor at kmkp2025@gmail.com
Rgds,