డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన ‘మున్సిపల్ కథలు’ కేవలం మున్సిపాలిటీలలో జరుగుతున్న యదార్థ గాథలే కాదు, రాజకీయ విశ్వరూపాన్ని, పాలిటిక్స్, ట్రిక్స్ లను మన కళ్ళ ముందు ఉంచే కథలు.
“ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా అర్థమయ్యే దాన్ని ‘గవర్నమెంట్ రూల్’ అని చెప్పుకోవచ్చు”..
“పక్క ఊరిలో నీ స్వంత పనిని ప్రభుత్వపు ఖర్చు పై చక్కపెట్టుకోవటాన్ని ‘టూరు’ అంటారు”..
ఇలాంటి తమాషా విసుర్లు, చెణుకులు, సెటైర్లు ముళ్ళపూడి వెంకటరమణ గారి ‘రాజకీయ బేతాళ పంచవింశతిక’ లో చూడవచ్చు.
అధి అనే ఉపసర్గకు ఎత్తిపొడుపు, తిరస్కారం, నిందించు అన్న అర్థాలున్నాయి. క్షిప అనగా ప్రేరేపించుట అని అర్థం. Act of blaming or finding fault with – ఈ అర్థంలో ఆంగ్లం లోని satire కి తెలుగులో ‘అధిక్షేపం’ అనే పదాన్ని సమానార్థకంగా ఉపయోగించవచ్చు.
తెలుగులో రాజకీయ అధిక్షేప రచనలు తక్కువే వచ్చాయని చెప్పాలి. పాలగుమ్మి పద్మరాజు గారి ‘రెండవ అశోకుడి మూణ్ణాళ్ల పాలన’, ఆనందారామం గారి ‘ఇంద్ర సింహాసనం’ వంటివి కొన్ని నవలలు రాజకీయ అధిక్షేప నవలలు. శ్రీశ్రీ, కాళోజీ, గజ్జెల మల్లారెడ్డి తమ కవితల్లో రాజకీయ అధిక్షేపాన్ని విస్తారంగా ప్రయోగించారు. కుటుంబరావు గారి ‘దిబ్బ రాజ్యం’ కథలు రాజకీయ వ్యవస్థను అధిక్షేపిస్తాయి. రావిశాస్త్రి గారి చాలా కథల్లో రాజకీయాధిక్షేపం ‘వర్గ సంఘర్షణ’ ముడిపడి కనిపిస్తుంది. ఇక తమ శాఖకు సంబంధించిన కథల విషయానికి వస్తే కొందరు పోలీస్ అధికారులు తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన, లేదా కొన్ని కేసుల గురించి కథలు రాసారు.
డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ తను కమీషనర్‌గా పనిచేసిన ‘మున్సిపాలిటీ’ లో నిత్యం జరుగుతున్న రాజకీయాల్ని, అవకతవకల్ని, ఎత్తులకు పై ఎత్తుల్ని, కడుపు మంటల్ని, కడుపు పై కొట్టే అన్యాయాల్ని నిస్సంకోచంగా, స్పష్టంగా, ‘అధిక్షేపాన్ని’ ఆయుధంగా తీసుకొని రాసిన కథలు ‘మున్సిపల్ కథలు’.
ఎన్నో ఆశయాలతో, ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశతో డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన విజయభాస్కర్‌కి క్రమక్రమంగా అంతకు ముందున్న భ్రమలన్నీ తొలగిపోయి, వ్యవస్థ లోని లోపాలు, వ్యక్తులు వాటినెలా తమ స్వార్థానికి ఉపయోగించుకొంటున్నారో అర్థమైంది. అందరిలా వెల్లువలో కొట్టుకుపోకుండా తనకు చేతనైనంతగా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు కార్మిక వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేసారు. అంతే కాకుండా ధైర్యంగా ఆయా సంఘటనల్ని వ్యంగ్యంగా, సెటైరికల్‌గా కథలుగా రాసారు.
ఈ కథా సంపుటిలో ఉన్న 21 కథల్లో తలమానికమైనది ‘లాలన పాలన’. భార్య శారద మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తుంటే, భర్త సుబ్రహ్మణ్యం ఇక పెత్తనమంతా తనదేనని, ఆమె కేవలం డమ్మీగా ఉంటుంది, తనే చక్రం తిప్పవచ్చని ఊహల్లో తేలిపోయాడు. ఇది ఈనాటి సమాజంలో మనం చూడవచ్చు. తనకు అవకాశం రాకుండా, విమెన్ రిజర్వేషన్‌తో తన భార్యకు అవకాశం వస్తే భర్తే వెనక ఉండి రాజకీయం నడిపించడం జరుగుతోంది.
(“మా వార్డులో పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయని మా ఆయన చెప్పమన్నారు” అని అమాయకంగా ప్రెస్‌కి ఒక కౌన్సిలర్ చెప్పడం నేను స్వయంగా విని విస్తుబోయాను ఒకసారి. మర్నాడు పేపర్ల లో దీని గురించే చర్చ.)
కానీ ఈ కథలో శారద సమర్థవంతంగా పట్టణమంతా సుడిగాలి పర్యటన చేసింది. పరిస్థితులను చూసింది. సమస్యల్ని అర్థం చేసుకొంది. ఇంజనీరు, శానిటరీ ఇన్స్పెక్టర్లను, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ అందర్నీ ప్రశ్నించింది. పనులు చేయించింది. ఆడ ఆఫీసర్స్ ఎంత పెద్ద పొజీషన్లో ఉన్నా, ‘ఆమె’ కి ఏం తెలుసు అన్న చులకన భావం పురుషుల్లో ఉండడం సాధారణంగా చూస్తుంటాం. కానీ శారద తాను పని చేస్తూ, మిగిలిన వారి చేత చేయించడంతో అందరి నోళ్ళూ మూతబడ్డాయి. కానీ తీరా ఇంటికి వస్తే భర్త గారు “ఏ ఫైల్ మీద సంతకం చేయాలన్నా నన్ను అడుగు. నీ సొంత తెలివితేటలు ప్రదర్శిస్తే మున్సిపాలిటీ ఆఫీసర్స్ ముంచి పారేస్తారు” అన్నాడు అక్కసుగా.
చాలా తాపీగా, ఆత్మవిశ్వాసంతో చెప్పింది శారద – “నేను స్త్రీని. మీ పురుషుల కంటే రెండింతలు ధైర్యం, నాలుగింతల సమయస్ఫూర్తి, ఆరింతల చతురత, ఎనిమిదింతల సామర్థ్యం ఉన్నదాన్ని. పిల్లల్ని కడుపులో పెట్టుకొని తొమ్మిది నెలలు ఎలా రక్షించడమో తెల్సిన మాతృమూర్తిని. ఈ పట్టణ ప్రజల్ని మున్సిపాలిటీని ఐదు సంవత్సరాలు నా గుండెల్లో పెట్టుకొని ఎలా రక్షించడమో తెలీదా! ఆడదానికి తెల్సింది లాలనే కాదు – పాలన కూడా!!”
స్త్రీ ఉన్నత వ్యక్తిత్వాన్ని, మహోన్నత కార్యనిర్వహణా సామర్థ్యాన్ని సమర్థించిన రచయిత అభినందనీయులు.
పుట్టిన బిడ్డ మలమూత్రాలను శుభ్రం చేసే తల్లితో మున్సిపాలిటీని పోల్చిన అద్భుతమైన కథ ‘అమ్మ’లో గొప్ప నిర్వచనం ఉంది – “పొద్దు పొడిస్తే నీ చెత్తా చెదారం ఎత్తి, రోడ్లు ఊడ్చి, కాలువలు శుభ్రం చేసి, నీకు నీళ్ళిచ్చి, లైట్లేసి, రోడ్లు వేసిన మున్సిపాలిటీ ‘అమ్మ’తో సమానం. దానికి పన్ను కట్టేవాడు గొప్పవాడు”. తను పని చేస్తున్న శాఖను గౌరవంగా భావిస్తూ, ప్రజలకి అది చేస్తున్న సేవలను మనస్ఫూర్తిగా చెప్పడం ఈ రచయిత యైన కమీషనర్ గారి చిత్తశుద్ధికి నిదర్శనం.
కానీ.. ఆ ఆనందం, అంతఃకరణశుద్ధి వెల్లివిరవడం లేదా శాఖలో అని చెప్పకతప్పదు. అక్కడ లోలోపల జరిగే రాజకీయ చదరంగంలో చచ్చిపోయిన భటులెందరో, ఊహించని ఎత్తులు వేసి సింహాసనం అధిష్ఠించి, అధికారం చెలాయించిన రాజు, మంత్రులెందరో నిర్మొహమాటంగా చెప్పారు రచయిత.
పూట గడవక పొట్ట చేత పట్టుకుని మున్సిపాలిటీ కొచ్చిన ఒక సెట్లర్ తర్వాత ఎలక్షన్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ – కాలువ ఎంక్రోచర్ – చిన్న కాంట్రాక్టర్ – మున్సిపాలిటీ మీడియేటర్ – కాంట్రాక్టర్లా ఎలా ఎదిగాడో చెప్పిన కథ ‘భయం’.
“రాజకీయాల్లో ఎదగాలంటే నాయకుడంటే భయమైనా ఉండాలి. భక్తి అయినా ఉండాలి” అని గుంటెప్ప నమ్మి, ఆ భయంతోనే ప్రజలు తన చుట్టూ తిరిగేలా పథకం వేసాడు. ఆ పథకం సాలెగూడులో అమాయకంగా చిక్కుకొని గింగిర్లు తిరుగుతున్న రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తిని చూస్తే “నేతి బీరకాయలో నెయ్యిని వెదికినట్లు ప్రజాస్వామ్యంలో కూడా వెదకాలి” అనిపించక మానదు. “ప్రజల్ని ఒక రకమైన ఆలోచనల్లోకి నెట్టి నాయకులు మరో రకమైన ఆలోచనలు చేసేదాన్నే రాజకీయమంటారు” అని చదవగానే ఊసూరుమనిపిస్తుంది.
పేదప్రజలు చిన్న బంకులు వేసుకొని వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతారనే మంచి ఆశయం గలవాడు ఓ కమీషనర్. చప్పున ప్రహరీ గోడ కట్టేసి, “ఆ స్థలం నాదే” నంటూ పేపర్లు పట్టుకొని సాయినాథ్ అనే వ్యక్తి రావడంతో అవాక్కయి, అయినా పట్టుదలతో ప్రహరీ గోడని డెమాలిష్ చేయమని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌కి చెప్పాడు. సాయినాథ్ కోర్టు కెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం, ఆ కేస్ రెండేళ్ళు నలిగి, చివరికి ఆ స్థలం సాయినాథ్దే అని తీర్పు రావడం వెనుక ఏ ఏ శక్తులు పని చేసాయో, ఎవరెవరికి ఎంత ముట్టిందో తెలియాలంటే ‘డిమాలిషన్’ కథ చదవాల్సిందే.
‘కాశీ గంగ’ మరో మంచి కథ. ఒక మామూలు వ్యక్తి గంగన్న తన ఇంటికి పంపు శాంక్షన్ చేయించుకోవడం, పైపులు వేయించుకోవడం, నీళ్ళు రేపు వస్తాయి మాపు వస్తాయి అని ఎదురుచూస్తూనే, ఏమీ చేయలేక, ఎవరికీ అనలేక ఆ దిగులుతోనే ప్రాణాలు వదలడం విషాదం. మున్సిపల్ రూల్స్ ప్రకారం కొళాయి కోసం ఆరు వేలు కట్టాలి, ఓవైటీ స్కీం కింద అయితే పన్నెండు వేలు. గంగన్న పన్నెండు వేలు కట్టాడు. చిల్లర ఖర్చులు అంటూ మరికొంత తీసుకొంటూ, తాపీగా, నత్తనడకన మున్సిపాలిటీ వాళ్ళు పైపులు వేసారు. మర్నాడు ఎలక్ట్రిసిటీ వారు వచ్చి సరిగా చూడక ఆ పైపులు పడగొట్టడం, మళ్ళీ పైపులు వేయడం, ఆ తర్వాత రోడ్డు వెడల్పు చేయాలని పగలగొట్టడం.. మళ్ళీ పైపులు వేయడం.. ఈసారి టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి పగలగొట్టడం.. ఎంత ఘోరం! అన్యాయం! ఎవర్ని అడగగలం! హృదయ విచారకరమైన ఈ కథ చదువుతుంటే ముళ్ళపూడి వారి ‘ఎండని చేప’ కథ లో – ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాన్ని ఒక శాఖ మరొక శాఖ మీద వేసుకోవడం, చివరికి పేదవాడికి న్యాయం మృగ్యమవడం గుర్తొస్తుంది.
ఓ మోస్తరు పెద్ద వర్షం వస్తే – లోతట్టు ప్రాంతాలే కాక హైదరాబాద్ నగరం నీళ్ళలో తేలుతున్నట్టు అవుతోంది. ట్రాఫిక్ జామ్ అవడం, ఒక్కోసారి పడవలు ద్వారా మనుషులను చేరవేయడమూ జరుగుతోంది. సరియైన మాస్టర్ ప్లానింగ్ లేకపోవడం, ఎండిపోయిన కాలువలు పై ఇళ్ళు, అపార్ట్మెంట్స్ కట్టడం కారణం అని చెప్పవచ్చు. దీని వెనుక ధనదాహం మాత్రమే కాక రాజకీయ నాయకుల తంత్రమూ ఉంది. ఎన్నికల ముందు ప్రజలకి చేసిన వాగ్దానాలలో బడుగులకు ఇళ్ళు, బతకడానికి చిన్న కొట్టాలు వేసుకోడానికి స్థలాలు ఇవ్వడం ప్రధానంగా ఉంటుంది. తీరా చూస్తే అంతంత విశాలమైన నివాసయోగ్యమైన ఖాళీ స్థలాలు ఉండవు. ఈ ఉదంతమే ‘పెద్ద కాలువ’ కథ.
“ఈ స్వతంత్ర విశాల ప్రజాస్వామిక దేశంలో ప్రజల అవసరాల పునాదిపై ఒక కొత్త నాయక వృక్షం మొలకెత్తడానికి బీజం పడింది”! తత్పరిణామం – ఛైర్మన్ గారి అనుమతితో ముసలీ ముతకా తల్లీ పిల్లా అందరూ పలుగూ పారా తట్టా బుట్టా పట్టుకొని వచ్చి పెద్ద కాలువకి రెండు వైపులా కప్పెట్టేసారు. చకచకా గుడిసెలు వేసుకొన్నారు. మరి వర్షాలొస్తే..? పరిస్థితి మనకు తెలిసిందే! గుంటెప్ప, వీరాంజనేయులు పాత్రలు ఈ కథల్లో తరచుగా కనిపిస్తున్నారంటే వాళ్ళు నిజ జీవితంలో ఉండే ఉంటారు.
మున్సిపల్ ఛైర్మన్, బడా కాంట్రాక్టర్లు, కౌన్సిలర్ల మధ్య నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి కమీషనర్ ఎలా నిస్సహాయంగా చిక్కుకుపోతాడో, ‘పాలసీ మేటర్, రూల్స్’ అంటూ గింజుకొంటే ఎలాంటి ఓటమిని ఎదుర్కొంటాడో ‘తేడా’, ‘ప్రారంభోత్సవం’, ‘ట్రాన్స్ఫర్’ కథల్లో చూడవచ్చు.
రాజకీయాల్లో ‘కులం’ ప్రథాన పాత్ర వహించటం ముందు నుంచీ ఉన్నదే. స్టేజ్ మీద “కులమత రహితంగా” ప్రజలను పరిపాలిస్తాం అని చెప్పిన నాయకులే నాలుగు గోడల మధ్య మంచికైనా చెడుకైనా మొదట ‘కులం’ స్టాంప్ నే వాడతారు. ‘పుట్టినిల్లు’ కథ మంచి ఉదాహరణ.
సంపన్నులు అనే స్టేటస్ పునాది మీద మేడ కట్టుకున్న డబ్బు జబ్బు చేసిన వారు తరుచుగా ‘చులకన’గా అనే మాట ‘అలగా జనం’. ‘ఛైర్మన్ గారి భార్య’ తన ముద్దుల కూతురు పుట్టిన రోజుకి బంధువులు, ఫ్రెండ్స్‌కి ఖరీదైన చీరలు, గిఫ్ట్‌లు కొని, తనింట్లో పనిచేసే చంద్రమ్మకి షాప్‌లో అడిగి మరీ తక్కువ ధరకి చీర కొనింది. యాక్సిడెంట్లో కొడుకుని కోల్పోయిన చంద్రమ్మ యజమానురాలి బిడ్డపై ప్రేమను పెంచుకొని, దాచుకున్న డబ్బంతా వెచ్చించి బంగారు గొలుసు చేయించింది. ఇక్కడ ఎవరు ‘ధనవంతులు’? ఎవరు ‘పేదవారు’? అదీ ‘దేనిలో’? ఎవరి మనసు విశాలం? ముఖమూ, మనసూ కుంచించు పోయిన ఛైర్మన్ గారి భార్య చంద్రమ్మని పని లోంచి తీసేసి హాయిగా నిద్రపోయింది – అనడం మనుషుల్లోని సంకుచిత్వాన్ని తేటతెల్లం చేస్తోంది.
డబ్బు చేసే మాయాజాలం, మనిషిని నడిపించే ‘కులం’ భావన, ‘మనోడే’ అనుకోవడంలో లుప్తమై పోతున్న మానవ సంబంధాలు, కలియుగంలో చాలా సాధారణంగా జనాల్ని గెలిచేస్తున్న ‘లంచావతారం’, గేలి చేయబడుతున్న నిజాయితీ.. వీటన్నిటికీ అద్దం పడుతున్నాయి ఈ కథలు.
దుర్గయ్య మున్సిపాలిటీలో పాకీ పనివాడు. వాళ్ళ తాతల కాలంలో మనుషుల మలాన్ని గంపల్లో ఎత్తి నెత్తి మీద పెట్టుకొని ఊరవతలికి తీసుకెళ్ళేవారు. సెప్టిక్ లెట్రిన్లు వచ్చాక చాలా మున్సిపాలిటీల్లో ఆ పని ఇప్పుడు లేదు కానీ, పాకీ పనివారందర్నీ డ్రైనేజీలు కడగడానికి, కమ్యూనిటీ లెట్రిన్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కోటయ్య లాంటి మహా పండితుడు, ఖరీదైన పూజల్ని తన ఆధ్వర్యంలో నిర్వహించే నాయుడు, దుర్గయ్య ముగ్గురు చనిపోయి దేవుని దగ్గరకు వెళ్ళారు. నారదుడు తన న్యాయవాదనలు శివపార్వతులకు వినిపించి, దుర్గయ్యని స్వర్గానికి పంపించే తీర్పు ఇప్పించారు రచయిత ‘స్వర్గప్రాప్తి’ కథలో.
పారిశుధ్య కార్మికుడు, వర్కర్స్ యూనియన్ లీడర్ అయిన ఉలికుంటప్ప శవయాత్ర సాగుతూ మున్సిపల్ ఆఫీస్ కాంపౌండ్‌లో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కాసేపు ఆగినందుకు ఎన్నెన్నో అపశకునాలు, అఘాయిత్యాలు జరిగాయని గగ్గోలు పెట్టే నాయకులున్నారు కానీ అతను పెన్షన్ అందుకోకుండానే చచ్చిపోయాడని, అతని కుటుంబం వారికి కారుణ్య నియామకం అందలేదని అడిగేవారు లేరంటారు రచయిత ‘మర్రిమాను’ కథలో.
ఛైర్మన్ గారింట్లో ఎన్నాళ్ళ నుండో నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి ‘చాకిరీలో తన ఆధిపత్యం’ కోసం అమాయకంగా అమ్మగారి వియ్యంకుల పనిమనిషితో గొడవ పెట్టుకుంటే – నిర్దాక్షిణ్యంగా పోలీసులకు అప్పగించిన పెద్దింటి వారి కథ ‘అలుకుగుడ్డ’.
ఊరంతటినీ శుభ్రపరిచేది మున్సిపాలిటీ. కానీ తనలోనే కల్మషాన్ని నింపుకొంటోంది. ఊరంతటికీ నీటిని సప్లై చేసే మున్సిపాలిటీ తననే కాల్చివేస్తున్న అగ్నిని ఆర్పుకోలేక పోతోంది.
కలుషితమై పోతున్న మున్సిపాలిటీని కథలు కథలుగా వివరించారు డాక్టర్ విజయభాస్కర్. పరిష్కారాన్ని యోచించడం పాఠకులకు వదిలివేసారు. ఇవి కాలక్షేపం కథలు కావు. ఈ కథల వెనుక ఒక నిజాయితీ కల అధికారి ఆవేదన కనిపిస్తోంది. ఆయన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.


నాటక చట్రాలలో ఇమడని అంశాలను కవితల్లోను, కథల్లోను ఆవిష్కరిస్తారాయన. (వారి దీర్ఘ కవిత ‘మహా శూన్యం’ ను గతంలో నేను విశ్లేషించాను.)
డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ (డైరెక్టర్, సాంస్కృతిక శాఖగా) ఉద్యోగ బాధ్యతల నుండి విశ్రమించినా.., ఆయన కలం అవిశ్రాంతంగా తన లక్ష్యసాధనలో కృషి చేస్తుందని ఆయన వ్యక్తిత్వం ఎరిగిన వారందరికీ తెలుసు.
***


రచన: డా. దీర్ఘాసి విజయ భాస్కర్
పేజీలు: 144
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవచేతన, ప్రజాశక్తి, నవతెలంగణ బుక్ హజ్, నవోదయ బుక్ హౌస్.
పాలపిట్ట బుక్స్, హైదరాబాద్ – 9848787284
రచయిత: 9494366698

12 Comments
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
ఈ మధ్యన పుస్తక సమీక్ష అనేది స్థలం లేక బాగా బక్కచిక్కిపోయింది. స్థలం లభించినచోట పుస్తక పరిచయంగా మారిపోయింది. అడపాదడపా కొంచెం లోతుకు వెళ్లినా అది పుస్తకంలోని ముందుమాటల్ని దాటి ముందుకు వెళ్లడం అడుదై పోయింది. ఆయినప్పటికీ సంచిక సమీక్షలు లోతుగా ఉంటాయి. ఈ సమీక్ష కూడా లోతైనది. అధిక్షేప రచనల గురించిన వివరణ బాగుంది. పుస్తకం పట్ల ఆసక్తిని మాత్రమే కాక ఆలోచనని కూడా కలిగించేలా రాయడం ఒక కళాత్మక శాస్త్రం. ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది ఈ సమీక్షా వ్యాసం
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
విజయ శ్రీముఖి
ఏ ఫైల్ మీద సంతకం చేయాలన్నా తనని అడగమన్న భర్తతో శారద చెప్పిన సమాధానం ఆలోచించగల సామర్థ్యం ఉన్న ప్రతి స్త్రీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించింది!
“మున్సిపాలిటీ” అనే పదాన్ని కొంతమంది కించపరచడానికి పర్యాయపదంగా వాడటం నేను విన్నాను. కానీ, శ్రీ.దీర్ఘాసి విజయభాస్కర్ గారు మున్సిపాలిటీని “అమ్మ”తో పోల్చడం వారి చిత్తశుద్ధికి, అవగాహనారీతికి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను!
సుశీలమ్మగారి సమీక్ష, కథల పరిచయం చదివిన తర్వాత పుస్తకం మొత్తం చదవాలనే ఆసక్తి కలిగింది. సామాజిక సమస్యలను సాదృశ్యంగా చూపించిన రచయితగారికి, సమీక్షించిన వారికి మనఃపూర్వక అభినందనలు, నమస్సులు!
*విజయశ్రీముఖి*
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండి!
మధు చిత్తర్వు
చాలా మంచి సమీక్ష.ఈ కథలు చదవాలి అని ఆసక్తి రేకెత్తించే విధంగా వుంది.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
C.Suseela
సుశీలగారూ, ఇప్పుడే ‘మున్సిపల్ కథలు, డా.ధీర్ఘాశి విజయ భాస్కర్ , విశ్లేషణ చదివాను. కడుపులో దేవినట్లైయింది. గుండెను నులి పెట్టి తిప్పినట్లైయింది.

.

.




.
నేటి సమాజం, నేటి రాజకీయాలు మనుషుల తత్వాలు, ట్రిక్స్, ( తెలుగు పదం ఉపాయాలు , కాదు కుతంత్రాలు) వీటికి దర్పణం ఈ కథలన్నీ.
విజయ భాస్కర్ గారు గట్టు పై నిలబడి చూసి రాసినవి కావు. స్వయంగా అనుభవించినవి, తన కళ్ళారా చూసినవి, తన ఆదర్శాలు తన కళ్ళముందె నిస్సహాయంగా తలవంచి, చేతులు కట్టి నిలబడినపుడు వారి మానసిక వేదన మాటల్లొ చెప్పలేము.
రాజకీయాల విశ్శరూపాన్ని దర్శింపజేశారు. మీరూ మీ విశ్లేషణ రూపంలొ ఆ విశ్వరూపాన్ని చూపించారు.
నాకు ఇది చదువుతూంటె రెండు సినిమాలు గుర్తుకొచ్చాయి ఒకటి ఒకరోజు సి.ఎమ్. రెండవది నంబరు 1.
ఒక్క రోజు సి.ఎమ్.గా ఎన్ని మంచి పనులు చేస్తాడు. ఆ ఒక్క రోజుకూడా వాటిని భరించలేని నాయకులు ఏ విధంగా తల్లి .దండ్రిని బలిచేస్తారు, ఆయననే చంపడానికి ప్రయత్నిస్తారు.
నంబరు.1. సి.ఎమ్ ప్రజలకు న్యాయం చేయాలి, అధికారం వారి చేతుల్లొ ఉండాలి, Democracy of the People, by the People, for the People’ Recall బిల్లు ప్రవేశపెడితె, ఆ బిల్లు approval కాకపోవటమే కాదు, అధికారం నుంచి సి.ఎమ్ ను దించేస్తారు.
ఒక్కొక్క కథ చదువుతుంటె బాధ, నిస్సహాయత! అధికారంలొ ఉండిన వ్యక్తే ఏమి చేయలేకపోయారంటె!!
ఎత్తుకు పై ఎత్తు. ఈ బుద్దిని ప్రజలకు మేలు చేయటానికి ఉపయోగిస్తె ‘సర్వేజన సుఖినోభవంతు ‘
‘లాలన – పాలనా’ సూపర్. అలాంటి వారు ఒక్కరైన ఉన్నారా!!!
దీనికి పరిహారం ఉందా!!??? అంతా నెలసమమై మళ్ళీ కొత్తగా చిగురించాలి. చరిత్రలో ఎన్ని క్రాంతుల గురించి చదివాం. ఏమైంది చివరికి!!!
డా.ధీర్ఘాశి విజయ భాస్కర్ గారికి ఏం చెప్పాలి!!
కళ్ళను తెరిపించె , నేటి సమాజానికి ప్రతిరూపమైన కథలను పరిచయం చాలా లోతుగా విశ్లేషించారు, పరిచయం చేశారు.మీకు మనఃపూర్వక ధన్యవాదాలు
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
vizaibhaskar
డాక్టర్ సుశీల గారు మున్సిపల్ కథల ఫై చేసిన సమీక్ష చాలా సంతోషాన్ని కలిగించింది . సాధారణం గా సమీక్ష అంటే కథను మళ్ళీ చెబుతుంటారు . సుశీల గారు ఆ పని చేయలేదు కధ పుట్టిన నేపధ్యం , దానిలక్ష్యం,పాత్రల స్వభావం ,వాటి ప్రయోజనం , రచయిత అంతరంగం , ఆశయం – వీటిని ప్రస్తావిస్తూ – కధల్లోని సాహిత్య ,సామాజిక, వైయక్తిక అంశాల్ని చక్కగా స్పృశించారు . మంచి సమీక్ష చేశారు .
ధన్యవాదాలు .
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.
శీలా సుభద్రాదేవి
ప్రతీ కార్యాలయంలోనూ కొందరి స్వార్థం, సంకుచితం,పనిపట్ల అశ్రద్ధ మొదలైన వాటివలన అనేకానేక అవకతవకలు జరగటం సాధారణమే.అయితే వాటికి బలి అయ్యేది మాత్రం బలహీన వర్గాలు,అమాయకులు.సమర్థత ఉన్న అధికారులు ఈ విధంగా వాటిని ధైర్యంగా సాహిత్యం లోకి తీసుకు రాగలిగితే అన్నీ వెలుగులోకి వస్తాయి.అటువంటి సమర్థతగల రచయిత డా.విజయభాస్కర్ గారి కథలసంపుటిని మీరు పాఠకులకు అవగాహన కలిగేలా సమీక్షించారు.మీకూ,రచయిత విజయభాస్కర్ గారికి అభినందనలు
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ధన్యవాదాలండీ.