మన చుట్టు అనుభవంలోకి వచ్చే అనేక మరణాలు మనకి వింత ఆలోచనలు కలిగిస్తాయి.
ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి ఆరోగ్యంగా తిరిగే వారు గాలి సోకిందనో, దయ్యం పట్టిందనో విచిత్రంగా ప్రవర్తించటం చూసి, మరణించిన వ్యక్తి యొక్క ప్రేతాత్మకి తీరని కోరికలుంటే అది దయ్యంగా మారి బ్రతికి ఉన్న వారి ద్వారా తన కోరికలు తీర్చుకుంటుంది అని చుట్టు పక్కల వారు మాట్లాడుకోవటంతో ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయనే భయం మనని చుట్టేస్తుంది. కాస్త ధైర్యస్థులైతే అసలు దయ్యలు ఉంటాయా? ఎక్కడ ఉంటాయ్? ఎలా మనని ఆవహిస్తాయ్ అని ఉత్సుకతతో అవి ఉంటాయని చెప్పబడే చోటుకెళ్ళి మరింత దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
అందులోను మనం అతిగా ప్రేమించే వ్యక్తి కానీ, లేదా మనం రోజు క్షణం క్షణం అనేక సందర్భాల్లో దగ్గరగా మసిలే వ్యక్తి కానీ చనిపోవటం జరిగితే… ఇప్పటి వరకు నా పక్కనే ఉన్నాడు… మాట్లాడుతూనే ఉన్నాడు.. హఠాత్తుగా నిర్జీవంగా ఎలా మారిపోయాడు? అనే సందేహం కలగటంతో పాటు, నిద్రపోయి ఉంటారు, కాసేపాగితే లేస్తారు అని మన మనసు ఊరుకోబెడితే కాబోలు అనుకుని సమాధాన పడతాము.
చుట్టుపక్కల వారి ఏడుపులనిబట్టి, తరువాయి కార్యక్రమాలు నిర్వహించే ప్రక్రియనిబట్టి నిర్జీవమైన వ్యక్తి ఇక లేవరు అని మనసు గట్టి సందేశం ఇస్తుంది. అయినా ‘ఇది’ అని ఒక తెలియని అయోమయావస్థలో ఉంటాము.
ఈ నవలలో కధానాయకుడు తను సన్నిహితంగా ఉండి పక్కలో రోజూ పడుకుని కథలు చెప్పించుకునే తాతయ్య, ప్రాణ స్నేహితుడైన ‘అబ్దుల్’ అనే వ్యక్తి, వృద్ధాప్యంలో కన్నకొడుకుని పోగొట్టుకుని వీరి గ్రామం చేరి…. దైనందిన జీవితంలో ఇతని సహాయం పొందుతూ ఉన్న ఒక స్త్రీ, తర్వాతి కాలంలో ఇతనితో సన్నిహితంగా ఉండే రూమ్మేట్, మరో ప్రాణ స్నేహితుడు…. హఠాత్తుగా చనిపోయిన సందర్భాల్లో కలిగిన మానసిక ఉద్వేగంతో మరణానంతర జీవితం ఎలా ఉంటుంది అనే ఆలోచనతో, దాని గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అనే పట్టుదలతో ఉంటాడు.
తాతయ్య, అమ్మమ్మ చనిపోయినప్పుడు… శ్మశానానికి వెళ్ళి దహన కార్యక్రమాలు చూసి.. కపాల మోక్షం అయ్యేవరకు ఉంటాడు. కాటికాపరిని (అతని వృత్తి రోజూ శవాలు చూడటమే కాబట్టి.. అతను చూసే ఉంటాడనే దృఢ విశ్వాసంతో) ఆసక్తిగా తన భౌతిక నేత్రాలతో అతనెప్పుడైనా చనిపోయిన మనిషి ఆత్మని చూశాడా అని అడుగుతాడు. ఆ ప్రశ్నలో తనకి కావలసిన సమాధానం వెతుక్కోవాలని ప్రయత్నిస్తాడు. అక్కడ జరిగే తంతు గురించి తెలుసుకుని.. మణించిన జీవికి చేసే సంస్కారాల అర్థం తెలుసుకుంటూ తను అనుకున్న పంథాలో ఇంకా బలంగా వెళ్ళాలని నిర్ధారించుకుంటాడు..
“జీవితం చాలా చిత్రమైనది. ఈ క్షణం ఉన్నవాడు మరు క్షణం ఉంటాడో లేదో తెలియదు” అని తాత్విక ధోరణి ప్రదర్శిస్తూ.. క్షణికమైన ఉపశాంతికి ఆంజనేయస్వామి సిందూరం పెట్టుకుంటే భయముండదు అనే ఆలోచన అందరికీ ఉంటుందని తెలుసుకుంటాడు.
తను గాఢంగా ప్రేమించిన వ్యక్తి… తనతో ప్రయాణిస్తూ తన కళ్ళ ముందే మరణించినప్పుడు, ఈ స్థితి మరింత ఆవేదనని కలిగిస్తుంది. అప్పుడు భౌతిక శరీరాన్ని వదిలిన జీవి పరలోకయాత్ర చేసే విధానాన్ని…. చుట్టు పక్కల వారు తన మరణాన్ని బాధతో అనుభవిస్తున్నారా… లేక తను వదిలివెళ్ళిన ఆస్తిపాస్తుల కొరకు అప్పటివరకు తనతో ప్రేమగా ఉన్నారా అనే అన్వేషణ చేసే దిశగా ఆలోచిస్తాడు.
అన్ని మతాలు మరణానంతరం స్వర్గ-నరకాలు ఉన్నాయని.. నరకానికి వెళ్ళకూడదనుకుంటే పాపాలు చెయ్యకూడదనీ, ఎవ్వరినీ ఏడిపించకూడదనీ చెబుతాయి.
మానసిక శాస్త్రం విద్యార్ధిగా… నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ (NDE) మరణం దాకా వెళ్ళిరావటం.. ఒక తెలుదుకోదగిన అంశంగా ఒక ప్రొఫెసర్ నోటి నించి విని ఆ విషయం మీద అన్వేషణ మొదలు పెడతాడు.
మరణందాకా వెళ్ళి బ్రతికి తిరిగి రావటమంటే.. అది సాంఖ్య యోగంలో శాస్త్రీయంగా చెప్పబడిందని.. అదే పరకాయ ప్రవేశం అని, దాని గురించి ఎవరి దగ్గరో తెలుసుకోవటానికి కాశీ వెళతాడు. సాంఖ్య యోగ ప్రక్రియని ఆదిశంకరులు ప్రముఖంగా నిర్వర్తించారని.. ఆ యోగమంటే మనిషి నించి జీవుడిని వేరు చెయ్యటమేనని తెలుసుకుంటాడు. ఆత్మ శాశ్వతమని.. కొన్ని ఆత్మలు కోరికలు తీరక ప్రేతాలుగా (దయ్యాలు) మారతాయని.. మరి కొన్ని పవిత్రమైన ఆత్మలుగా ఉండి కాశీలో విశ్వేశ్వరుడి పల్లకి మోస్తాయని వింటాడు.
మరణం అనివార్యమైనా.. మరణాన్ని జయించినవాళ్ళు ఉన్నారని.. వారే అఘోరాలని వింటాడు. మనిషి జీవితానికి…. వారి కర్మననుసరించి.. వారు పుట్టేముందే ఎన్ని ఊపిరులు తీసుకోవాలి.. ఆఖరి ఊపిరి ఎప్పుడో ముందే నిర్దేశించబడుతుంది కాబట్టి ఈ అఘోరాలు కొన్ని ఊపిరులు ఆపుకుని… అసలు ఊపిరే తీసుకోకుండా (హఠ యోగం ద్వారా) వందల సంవత్సరాలు జీవిస్తారని వింటాడు.
ప్రతి మనిషి పుట్టుకకి ఒక పరమార్థం ఉంటుంది. ఎవరి జీవిత గమ్యాన్ని వారే కనిపెట్టగలరు కాబట్టి తన గమ్యం మరణానంతర జీవితం గురించి తెలుసుకోవటమేనని….
“కెటామిన్” అనే ఒక ఉత్ప్రేరకం.. “కొకెయిన్” లాంటిదన్నమాట… లోపలికి మందులాగా సేవించి కోమాలోకి వెళతాడు.
ఆ కోమా స్థితిని “లూసిడ్ డ్రీం” అంటారని… లూసిడ్ డ్రీం అంటే కలో.. నిజమో తెలియని స్థితి! ….ఆ స్థితిలో తను నరకానికి వెళ్ళానని భావించటం… ఆ దారిలో అనేక భయంకరమైన వ్యక్తులని కలిసినట్లు భావించటం… తనకి తనే ఒక లోకాన్ని సృష్టించుకోవటం అనేవి అతను సేవించిన “కెటామిన్” అనే ఉత్ప్రేరకం, మరొక గలాటమైన్ అనే పువ్వు పొడి కలిగించిందని ఒక సైకాలజీ ప్రొఫెసర్, ఒక సైకియాట్రి డాక్టర్ ద్వారా తెలుసుకుంటాడు.
“జీవితం ఎప్పుడూ ముగింపులేని ప్రశ్నగానే మిగిలిపోతుంది.
మనసేమో నిజానికి, అబద్ధానికి…నమ్మకానికి, మూఢ నమ్మకానికి మధ్య నలిగిపోతూ ఉంటుంది!
ఏది నిజం..ఏది అబద్ధం??”
అనే ఒక తాత్విక ప్రశ్నతో రచన ముగుస్తుంది.
చావుతో మన మధ్య తిరిగే మనుషులు భౌతికంగా నిష్క్రమించటం అనేది ఎలా?? ఎందుకు?? అని మనందరికీ అప్పుడప్పుడు… కొందరికి ఎప్పుడూ కలిగే సందేహానికి ఒక రచనా రూపం ఇచ్చిన రచయిత అన్వేషణ ఆసక్తికరంగా సాగింది.
ఈ పుస్తకానికి సినీ రచయితలు సత్యానంద్ గారు, దేవీ ప్రసాద్ గారు, తనికెళ్ళ భరణి గారు తమ అభిప్రాయాలని ఆసక్తికరంగా ‘చచ్చినట్టు చదివించే’ నవలగా వ్యక్తపరిచారు.
***
మరణంతో నా అనుభవాలు
రచన: విజయ్ శేఖర్ ఉపాధ్యాయుల
పుటలు: 192
వెల: ₹ 100/-
ప్రచురణ: ఎమెస్కో బుక్స్, హైదరాబాదు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్లైన్లో
https://www.amazon.in/Maranamtho-Anubhavaalu-Vijay-Sekhar-Upadhyayula/dp/9386327902
You must be logged in to post a comment.
భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 17: పెదపులివర్రు
చిరుజల్లు 21
ప్రైవసీ
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-11
జీవితంలో స్పర్శ కరువైతే : Call Him Eddy
అలనాటి అపురూపాలు-48
2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
మెట్రో జీవన చలనచిత్రాలు ‘అపగామిత మరి కొందరు’ కథలు
ఎంత చేరువో అంత దూరము-26
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®