[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
ఉ.॥ అట్టి సువార్త వీనులకు నందిన యంతట రాములాఖ్యుడున్ పట్టగ రాని సంతసముపైకొని మంగను కౌగిలించుచున్ యిట్టని లెక్కలేని గతి మిక్కిలి కోరిక తోడ మంగమన్ గట్టిగ వాటు వేసుకుని ఘాటుగ ముద్దులు బెట్టుచుండగన్. (56)
చం.॥ మగడొనరించు చేష్టలకు మానిని లజ్జయు నావరించగన్ అగణితమైన భావనల నా సమయంబున క్రమ్మివేయగన్ మగనెద రొమ్ముపై శిరము మానిని యుంచుటక మైకమందగన్ సగముగ నేత్రముల్ దెరచి సౌఖ్యము నొందగ సేద దీరెడిన్. (57)
సీ.॥ ఆనాటి నుండియు నా మంగమాంబను కదలనివ్వలేదు కౌతుకమున యింటి పట్టునె యుండి వీధుల గూడను నడచిన యూర్కోడు నాతినిపుడు బరువైన వాటిని పైకెత్తనీయడు అతిగ ముద్దును చేసె నతివనతడు పదిమంది చోటికిన్ పంపడా మగడును ప్రాణంబు కన్నను పదిలపరచె
తే.గీ.॥ ఇటుల తొమ్మిది నెలలును ఎటులో గడచి మంగబాంబకు యావేళ బంగరముగ నిండిపోయెను తొలిచూలు నెలతి గాన బహుగ భయమందె నావేళ బడతి తాను. (58)
సీ.॥ ఒకనాడు మంగాంబ కొరువాత ఝామునన్ గర్భంబు లోపల గదలసాగు విధముగా దోచెను ముదిత కా వేళలన్ మేనంత బాధయు మేర మీరె అమితమౌ వేదనల్ యారంభమాయెను రాములు హృదయంబు రచ్చయాయె ముక్కోటి దేవతల్ ముదముగా ప్రార్థించె ముందు నా సతిగావు దెందమలర
తే.గీ.॥ మీకు వందన మొనరింతు మిక్కుటముగ పురిటి వేదన నొందెడి పుడమి సతికి మోదమలరగ గావుడి మ్రొక్కెదాను కోటి శతకోటి దండముల్ గొనుడివేగ. (59)
మత్తకోకిల॥ ఏమి చేయుదు దైవమా సతి నెట్లు దక్కగ జేతువో నేమి కార్యము జేసినాడనొ నిట్లు చిక్కుల గూలితీ పామరుండను కోరి వేడితి పాపకార్యము చేతనో ఓ మహాశయా తూలనాడితి ఓర్పుతో నను గావుమా. (60)
మత్తకోకిల॥ నాదు మంగమ కీవిధంబున నష్ట కార్యము జేసితే మోదమందున నిన్ను నమ్ముచు మ్రొక్కినాడను గావవే వేదనాభరితంబు నొందుచు వెక్కసంబుగ గోరితీ ఆదరంబున నన్ను గానవె ఆదిదేవుడవంటినీ. (61)
తే.గీ.॥ అనుచు వ్యాకుల మందెడి రాములుకును కెవ్వుమను కేక వీనుల కిటుల దోచె భళిర నా భార్య ప్రసవంబు బాగుగాను జరిగి నట్లుండెనని దోచె జటిలమైన. (62)
సీ.॥ కెవ్వని యప్పుడున్ కేక వేసెడు పాప సపరివార లందరి సాక్ష్యముగను మాంసపు ముద్దగా మాయను గప్పిన మలిన మైనటు రీతి మహిని దోచె రక్తవర్ణపు రీతి రంజిల్లె పసిపాప తుడిచి స్నానపు సల్పతులను దూగె తన బోసి నోటితో తగని రీతిని యేడ్చి ముర్రుపాలను దాగె ముదము తోడ
తే.గీ.॥ వేగమప్పుడు పాపకు వేడి నీళ్ళ స్నాన కార్యము గావించె పరగునంత మంత్రసానియు యన్నిట మరువకుండ దగ్గరుండియు చేసెను దగిన విధము. (63)
చం.॥ కనక శలాక దేహమున కాంతులు చిమ్మెనె బాలికప్పుడున్ అని తన మానసంబునను ఔదల బోసిన స్తోత్ర పాఠముల్ విని గద శైశవాకృతిని ఈ దినమందున నాకు నిచ్చిరా యని మిష వర్గముల్; స్తుతులు అందర కిచ్చెదన్ సంతసంబునన్. (64)
ఉ.॥ బంగరు ఛాయ తోడ బహు బాగుగ బుట్టెను యాడు బిడ్డ; యు ప్పొంగెడి సంతసంబునను యూరిని యుండెడి వారలందరున్ రంగుగ బాట కట్టిరిగ రాజిలు శైశవ బాల చూడగన్ కంగరు నొందకన్ శిశువు కన్నుల జూచుచు నేగుచుండగన్. (65)
సీ.॥ ఆ రీతి మనసున ఆనంద భావంబు బహుగ మోదమునందె బాలికపుడు కనకాంబ మదియందు కారుణ్యములు దోచ తన బిడ్డ వెమ్మోవి దనివి దీర ముద్దాడె నా తల్లి మురిపెంబు తోడుతన్ నా జన్మ పంటగా నని దలంతు ఎన్ని జన్మల పుణ్యమే యిట్టి శిశువంచు బెంచుకుందును తల్లి బ్రేమ మీర
తే.గీ.॥ యంచు కనకాంబ శిశువును దనివి దీర హత్తుకొనియెను హృదయంబు నతివయపుడు శిశువు నెత్తావిపై నుంచి చిత్రముగను దనివి దీరగ తమకంబు దాకెనంత. (66)
చం.॥ బెరిగెను బాలికంతటను బెంపు వహించగ; కొన్ని మాసముల్ విరివిగ దల్లిదండ్రులు వీధుల యందలి వారలందరున్ పరుగున బాలనెత్తుకొని సంతసమందిరి; యట్టి వేళలన్ దొరలుచు దోగుచున్ వరలె ఊయల యందున నూగువేళలన్. (67)
ఉ.॥ చందురు బింబమై చెలగు చక్కదనాలకు చుక్కయై మది న్నందరు సంతసంబునను యాచిరు బుగ్గులపైన ప్రేమతో అందముగాను మీట బహు యాతృత తోడుత సిగ్గు చెందు; నా నందపు మొగ్గ యై మదిని ఆ దొరసానియు సంతసించదే. (68)
పాపకు పేరుబెట్టుట:
చం.॥ పెరిగెను బాలికప్పుడును పెద్దలు జెప్పిన రీతి తోడుతన్ పెరుగుచు నుండె సంద్రమున యీదురు గాలి తుఫాను వేళలన్ పెరుగు తరంగ పోలికను పెద్దగ చుండెను ముద్దు బాల; యే తడగును లేక బెంచిరిగ తల్లియు దండ్రియు బంధుమిత్రులున్. (69)
ఉ.॥ కొందరు బంధువుల్ నచట గూడిరి పాపకు పేరు బెట్టగన్ అందరు జేరి యోచనలు సల్పుచు పాపకు పేరనంగ; యీ కుందన బొమ్మయున్ విరుల కోమల యై చెలువొందుచుమ్డ; ఆ నందము తోడుతన్ గుసుమ అంచును బేరిడె యప్పుడందరున్. (70)
(సశేషం)
కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు. సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు. కం॥ గురువెవ్వరు నా కవితకు గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్ గురువులు లేకనె నేనిట ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.
You must be logged in to post a comment.
సాహిత్యంలో స్వప్న సృజన!
పదసంచిక-2
యాపిల్ కవర్లతో బొమ్మలు
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -26
కాజాల్లాంటి బాజాలు-52: I am too intelligent
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-21
కావ్య పరిమళం-15
ఆవు – పులి
నువ్వు, నేను, మన ప్రేమ కథ!
ఏమండీ ప్లీజ్ మీరు మీరుగానే ఉండండి!!!
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®