[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
తే.గీ.॥ మిన్నగా వధూవరులంత మిక్కుటముగ పోసుకొనె తలంబ్రాలను ప్రోది మీర వేగముగ రతీ మన్మథుల్ వెలయు రీతి వారి యానంద బంధుర వార్ధి కపుడు. (159)
ఉ.॥ పిమ్మట బెండ్లివారలును పేర్మిని మీరగ బిండివంటలున్ కమ్మగ నారగించిరిగ కైపును బొందుచు మద్యమాంసముల్ ఒమ్ముగ చేరిపోయిరపు డోపిక తోడుత కాపులిండ్లకున్ యిమ్ముగ యాకు వక్కలిడి యిట్టి శుభంబిక రాదనెంచుచున్. (160)
చం.॥ ఘనముగ బెండ్లి చేసుకుని గైకొని దీవెన బెద్దవారలన్ మునుకొని పెండ్లి కూతు తన యూరికి నందరు పైనమవ్వగన్ వినయము తోడుతన్ బిదప విజ్ఞత తోడుత నమ్ముహూర్తమున్ కనుగొని కార్యమున్ గరప కన్యక తల్లియు దండ్రి దల్చిరే. (161)
బాలరాజు శోభనం
తే.గీ.॥ అపుడు గుసుమాంబ చేతికి పాల గ్లాసు నిచ్చి బంపిరి పెద్దలు నిట్లు దెల్పి మగడె నీకిక దైవంబు మనసు నందు నిల్పి కాపురమందుము నీరజాక్షి. (162)
వచనం॥ ధవళ వస్త్రంబులు ధరించి యా ఏకాంత వేళలో తన జీవిత భాగస్వామికై ఎదురుచూచు సమయంబున వన కన్యకలా సుమ వస్త్రంబులు ధరించి తెల్లని పాల గ్లాసు హస్తంబు నిడుకొని వయ్యారంపు గమనంబున యా శోభన గృహంబును చేరె కుసుమాంబ.. అంత విరహాగ్ని వేగెడి బాలరాజు యా మత్స్య గ్రహణ జాత పాద మంజీరవంబులు ఘల్లు ఘల్లు మన తృళ్ళిపడి నిటుల చూసెనంత (163)
కం.॥ వచ్చెను సుమాలల బంతిగ తెచ్చెను క్షీరాబ్ది కన్య తీరుగ నపుడున్ మెచ్చెను దివి దేవ వరులు హెచ్చెను యా తరుణరాజు యీప్సిత మెల్లన్. (164)
కం.॥ కదిలెను కుసుమతి వేగమె పదములు తడబడు విధాన సదమల వృత్తిన్ మెదలెను మనసున భావన పదిలముగను పరుచుకొనుచు ప్రక్కను జేరెన్. (165)
చం.॥ నయన మనోహరంబగుడు నాతిని గాంచిన బాలరాజు; బల్ రయమున పాదముల్ గదిపి రాగను భామిని తొట్రుపాటుగన్ భయమున భీతిగొల్ప మరి బంధము సేయగ బ్రహ్మరాత తోన్ శయన గృహంబు చేరె గద చంచల నేత్రము చంచలించగన్. (166)
చం.॥ సరగున చేరవే చెలియ చంచల నేత్ర సమస్త బ్రకృతి న్నరమర లేక సాగుచును నైక్యము బొందుద; మాలతీ లతల్ విరహపు తాప మోర్వనిక వేగిరమందున నన్ను జేరవే మరి మరి వేడితిన్ మదన మైకము గ్రమ్మిన వాడనౌటచే. (167)
చం.॥ సరగున చేరవే చెలియ చంచల నేత్రరొ; చారుశీల, నా దరికిని వచ్చి నన్ను మరుదారిని గూర్చవె చంచలాక్షి; యీ సరికిని నిన్ను జేరితిని సౌఖ్యము గూర్చవె నాదు నెచ్చెలీ పరిపరి రీతులన్ మురిసి పావనమై చెలగంగ వేడితిన్. (168)
చం.॥ నులి నులి సిగ్గులన్ సుదతి ఊహల లూగుచు నోర కన్నులన్ చెలి సఖు జూచుచున్ మగని చెంతకు జేరను సంశయించుచున్ తొలి వలపంతయున్ విభునితో వచియించగ జేరనత్తరిన్ వెలువడు సిగ్గు దొంతరుల వేలున జేర్చుచు దమ్మలంబునన్. (169)
చం.॥ విరహపు మత్తులో మునిగి వేగిరమందున బాలరాజు; యా విరహిణి గాంచి యాత్రమున వీపును చేతుల తోడ ద్రిప్పి; యా సరసపు మోముతో నగుచు సాయము చేయవె చారుశీల; యీ విరహపు వేళలన్ మనసు వేయి విధంబుల బోయెనొక్కొకో. (170)
చం.॥ మగని సుతార వ్రేలు ప్రియ మానిని దేహము నాట్యమాడగా అగణితమైన భావనలు యక్కుసుమాంజలి దేహమంతయున్ సెగలుగ బ్రాకె నక్కుసుమ శీతల కాయము నుష్ణమొందగన్ నిగనిగలాడుదౌ కుసుమ నిల్చెను పూరుష చేష్టలన్నిటన్. (171)
ఉ.॥ ఈ మదనాంకురమ్మికను ఏ విధమైనను సైపజాలనే ఓ మదనాంగి కోరికల నూయలలూగుచు నుష్టమొందగన్ నా మనసంతయున్ మరుల నాదము వేదనలై చరించె; నే కామము చేత నా మనసు కన్యక నీ దరి జేర వచ్చితిన్. (172)
సీ॥ వికసించినట్టి యా విమల దేహముపైన భ్రమరంబు వలె బాలరాజు సుకుమార సుందర సురుచిర సుందరి కుసుమంబు వలె వాడె కువలయమున జుంటు తేనియ కోరు జుంటీగ మాదిరి స్వర్గలోకంబుల శోధ జేసె నును లేత సిగ్గుతో నులికె నా జవరాలు పాలబుగ్గల చాటు పరవశించె
తే.గీ.॥ అంత నా బాలరాజు యాత్రపడుచు ముందు ముందుకు సాగెనా యిందువదన సుఖము గూర్చుచు తానును సుఖము నొందె కప్పురంబయ్యి నారేయి కరిగిపోయె. (173)
శా.॥ ఆ రేయంతయు బాలరాజు కుసుమాంబల్ గూడి రంగంబునన్ యూరేరంగను నూహ లోకముల నుత్సాహంబుగా నుండగన్ పారా వారి సమంటి మైథునము పెంపారంగ నొప్పారుచున్ వారావేళల సంతసం బొడుచు వైవాహాబ్దిలో మున్గగన్. (174)
తే.గీ.॥ బాగుగను రోజు గుసుమాంబ బాలరాజు నవ వధూవరులంతట నయముగాను రతియు మన్మథు జంటగా రమియుచుండె వసుధ దాంపత్య జీవన వాంఛ గల్గి. (175)
తే.గీ.॥ అంత నా యాలుమగలును చింత లేక అన్ని రాత్రుల యందును అమితముగను ఒకరి నొకరును విడువక ఓర్మి తోడ కలిసి బొందిరి సుఖమును కలత లేక. (176)
ఆ.వె.॥ మూడు రాత్రులందు ముచ్చట గొల్పుచున్ గాఢమైన మోహ ఘడియ లంత ఒకరినొకరు వీడి యుండగ లేకను శయన మందిరమున రయము నుండె. (177)
తే.గీ.॥ అపుడు కుసుమాంబ తలితండ్రి యాత్రముగను బాపనింటికి నరుదెంచి భక్తి తోడ తనదు పుత్రిని మగనింట తడయకుండ బంపు ఘడియల దెల్పుము బాయకుండ. (178)
తే.గీ.॥ అనుచు బల్కిన వారికి ఆదరమున శుభ ముహూర్తపు ఘడియల శోధ చేసి తెలిపె విప్రుండు శీఘ్రమె; తేటతెల్ల మటుల; యింటికి చేరిరి మరువకుండ. (179)
తే.గీ.॥ రేపె సుముహూర్త మంచునీ రీతినిపుడు తనయ నత్తింటి కంపను తనపజెందు చుండె వారలు యా వేళ యమితముగను యన్ని పనులను జక్కగ నమరు నటుల. (180)
ఉ.॥ ఆ మరునాడనే యుదయ కాలమునన్ కుసుమాంజలిన్; తనన్ ప్రేమను బంచునట్టి తమ పెన్నిధియై జనియించు నంతట న్నేమరుబాటు లేక బహు నెయ్యము గూర్చెడి తల్లిదండ్రులన్ ఏమిటి వీడిపోను తనకీ గతి ఏమిటి దైవమ దారి జూపవే. (181)
తే.గీ.॥ కరుణ గురిపించు వారల గాలి కొదిలి ఎటుల జీవింతు నచ్చట ఏమి కర్మ నన్ను కరుణించు మా స్వామి; నాతి రక్ష చేసి వాసిని గాంచి నచెన్న దేవ! (182)
సీ॥ తలిదండ్రులా వేళ తమ కుమార్తె కొరకు ఎనలేని సారెలన్ ఏరి కూర్చి అల్లుండు యైనట్టి యా బాలరాజు కున్ బహు గొప్పగా నుండు బట్టలిచ్చె తన కుమార్తెకు కూడ తనరుగా నున్నట్టి గొప్పైన చీరలున్ గొనియునిచ్చె యావేళ మలి సంజ యాగమించకముందె యత్తవారింటిన్ యంపసాగె
తే.గీ.॥ మొదలుబెట్టిరి వారలున్ ముదిత గుసుమ కేమి వలయునొ ఎరిగియు ఏరి కూర్చె యల్లుడౌ బాలరాజుకు నలుగుబెట్టి స్నానపానంబులను గూర్చె సదమలముగ. (183)
(సశేషం)
కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు. సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు. కం॥ గురువెవ్వరు నా కవితకు గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్ గురువులు లేకనె నేనిట ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.
You must be logged in to post a comment.
సంగీత సురధార-48
సినిమా క్విజ్-120
కైంకర్యము-31
జాతీయ జెండా
ధర్మనిరతియే మన కర్తవ్యం
ఆచార్యదేవోభవ-44
సినిమా క్విజ్-118
వరాలు-2
రేపటి పౌరులు
సంగీత సురధార-9
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®