వర్ణనలు
ఒక విషయాన్ని, స్థితిని, సంఘటనను, సన్నివేశాన్ని, దృశ్యాన్ని, వ్యక్తిని, ఇంద్రియ గోచరమయ్యే విధంగా చిత్రించడం వర్ణన. దీనికి సహాయపడేవి అలంకారాలు. వర్ణనలు సంక్షిప్తంగా, ప్రతీకాత్మకంగా ఉండాలి. వర్ణించబడిన వస్తువు పాఠకుడిని అలరిస్తుంది. కథపై మక్కువను పెంచుతుంది. కథనంలో భాగమే వర్ణన. కనుక దీనికి కథలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. వర్ణనలు వస్తురూప గుణవిశేషాల్ని పెంచాలి. కాని అతివ్యాప్తిని అందించరాదు. అనవసర వర్ణన చేసినా, అవసరమైనది వదిలినా కథకు నష్టం కలుగుతుంది. ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో, దానిపై మంచి అవగాహన ఉండాలి. లేకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తయి. చెప్పదలచుకున్న విషయాన్ని దృశ్యమానం చేయడానికి వర్ణనలు తోడ్పడుతాయి. వర్ణనలు క్లుప్తంగా ఉండాలి.
“వర్ణనా నైపుణ్యం గలవాడే మనలను సంచలనం గలిగిన దృశ్యాల సమక్షంలో చైతన్యవంతంగా ఉంచుతాడు” – ప్రొఫెసర్ షిఫర్డ్
వస్తుతత్వాన్ని పాఠకుడికి అందించడానికి, కథ వేగంగా ముందుకు నడవడానికి వర్ణనలు తోడ్పడుతాయి. వస్తుస్వభావానికి లోబడి వర్ణనలుండాలి. ఇవి కథలో అంతర్భాగం కావాలి. కాని కథను మింగరాదు. వ్యక్తులను, వాతావరణ స్థితిగతులను, విషయపు మంచి చెడులను, సంఘటన పూర్వాపరాలను, సన్నివేశాల్ని, సౌందర్య-బీభత్సాల్ని, స్థితికి చెందిన లోతుపాతుల్ని, మాతృత్వపు మాధుర్యాన్ని, సంతోష-విషాదఫలితాల్ని, ప్రకృతి అందాల్ని, మానవగుణ విశేషాల్ని, సామాజిక అభివృద్ధిని-అంతరాల్ని, శీతోష్ణాది ప్రభావాల్ని, భూచలనాల్ని, రుతువుల్ని, స్త్రీపురుష ప్రకృతిని ఇట్లా అనేక విషయాలను వర్ణించవచ్చు. ఏ వర్ణనలైనా కథకు బలాన్నిచ్చేవిగా ఉండాలి.
ఉదాహరణ:
రష్యన్ రచయిత గొగోల్ కథ “ఓవర్ కోట్” ప్రసిద్ధమైనది. కథ ప్రారంభమే ప్రధానపాత్ర అయిన దిగువ మధ్యతరగతి గుమస్తా స్థితి, వర్ణనతో మొదలవుతుంది.
“ఒకానొక గవర్నమెంట్ ఆఫీస్లో గుమాస్తా అకాకి, అకాకియేవిచ్ బాష్మాచ్కిన్ సన్నగా, పీలగా, పొట్టిగా ఉంటాడు. మొహం మీద స్పోటకపు మచ్చలు. కళ్ళు నీళ్ళు కారుతుంటాయి. బట్టతల రావడం ప్రారంభమైంది. ఆయన, ఆఫీసులో ఎంతకాలంగా వున్నాడో ఎవరికీ తెలియదు. అనేక మంది డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికార్లు వచ్చి వెళ్ళారు. కాని ఇతడు మాత్రం అక్కడే, అదే సీట్లో, దశాబ్దాలుగా కుర్చీకి అంటుకుపోయినట్టుగా కూర్చున్నాడు. ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగులందరూ ఆకుపచ్చ కోటు తోడుక్కోవడం ఆనవాయితీ. ఇతగాడి కోటు మాత్రం రంగువెలసి, తుప్పుపట్టిన ఇనుపరేకులుగా కనిపిస్తున్నది. చాలా చోట్ల చిరిగింది. దారప్పోగులు వేలాడుతున్నాయి. దుమ్మూ, ధూళిలో అట్టలు గట్టింది. అక్కడక్కడా ఎండిన పక్షుల రెట్టలుకూడా లేకపోలేదు.”
ఇలాంటి వ్యక్తి కొత్తగ కోటు కుట్టించుకోవడం, అది ఎవరో కొట్టేయడం జరుగుతుంది. ఒక గుమస్తా బతుకు యాతన ఈ వర్ణనలో కనిపిస్తుంది.
(మరోసారి మరో అంశంతో)

డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
7 Comments
Garipelli ashok
మంచి ఉప యుక్త అంశాలు అభినందనలు
bvn swamy
tq sir
విలాసాగరం రవీందర్
వర్ణన ల పరిమితిని కథాన్వయం చేసే ఉదాహరణ తో చక్కగా వివరించారు సార్
bvn swamy
tq sir
bvn swamy
tq sir
గుండెబోయిన శ్రీనివాస్
వర్ణన సంక్షిప్తంగా ఉండాలి!
అది వస్తు రూప గుణ విశేషాల్ని పెంచాలి!అనవసరమైన వర్ణ చేసినా, అవసరమైన దానిని వదిలినా కథకు నష్టమే !
చెప్పదలుచుకున్న విషయాన్ని దృశ్యమానం చేయడానికి వర్ణనలు తోడ్పడతాయి, లాంటి వాక్యాలు బాగున్నాయి!
మీకు అభినందనలు సార్!
bvnswamy
tq sir