నువ్వేదో పనిమీదే వచ్చి వుంటావు
కాస్త చూసుకో
నదులూ మనుషులూ
నీ పక్కనుంచే ఒరుసుకుంటూ పోతుంటారు-
నెత్తి మీద ఆ మూటను కాస్త
ఏ చెట్టు కిందో దింపుకో
పాండవుల అస్త్రాలు కాకపోయినా
రెండు రొట్టె ముక్కలో రెండు కలల ముక్కలో
రెండు బతుకు రెక్కలో..రెండు ఎర్ర సంధ్యలో
ఏవేవో నీ మూటలోంచి నీలోకి దూకి అటూ ఇటూ
తూరలో దూరిన పిల్లల్లా ఆడుకోవచ్చు
నీక్కూడా ఇక్కడేదో పనే వుంటుంది
భుజాల మీద పెళ్ళాం పిల్లలూ
కళ్ళలోంచి రాలుతున్న నీలిరంగు ఆకాశాలు
వీపుమీదెక్కి కూర్చున్న భూగోళం
కళ్ళ నుంచి కాళ్ళ దాకా కనపడని గొలుసులు
దేని పని దానిదే-
కానీ నువ్వు మాత్రం మరి దేనికోసమో వచ్చావు
రుతువుల చక్రాలు తొడుక్కుని పరుగులు తీస్తున్న
ఈ బండి మీద హాయిగా పడుకోని పోవడానికి మాత్రం రాలేదు
అలా కొమ్మ మీద రోజూ కాసేపు కూర్చుండి పోయే పక్షి కూడా
ఏదో పనిపెట్టుకునే వుంటుంది
గాలి పటం ఊరకనే చెట్లకు చిక్కుకోదు
నేల మీద రాలకుండా కొంచెం ఆలోచనలో పడ్డ
వాన చినుకును చూడు
మట్టి మీద చివరి సంతకానికి ముస్తాబవుతున్న పువ్వును చూడు
పిల్లల భుజాలకు వేలాడే ఇంద్రధనుసులను చూడు
అర్థం లేకుండా అద్దం కూడా పగలదు
నువ్వు పీల్చుకునే గాలిని
కాగితం మీద పరచి దృశ్యం చేసి చూడు
నీలో రంగుల లోకాలు నిన్ను రాట్నంలా వడుకుతాయి
నీకు తెలీదు
కారణం లేకుండా ఇక్కడేదీ కాలు మోపదు
నువ్వెందుకొచ్చావో నీకెవరూ చెప్పరు
తల్లిదండ్రులే కాదు
నీ పుట్టుక కోసం నరాలు తెంచుకున్న
తరాల మానవ చరిత్ర ఒకటి వుంది
అమ్మ కడుపులో ఉమ్మ నీటిపొరలో
నువ్వు రచించిన నీ స్వప్నలోకాలు నీవే-
నీ తొలి అడుగు నుంచి చివరి అడుగు దాకా
మట్టి కౌగిలిలో నీ అనుభూతులు నీవే-
తోట రాముడివో.. తూటావో కాకున్నా
తూటాని తుమ్మెద చేసి ఎగరేస్తావేమో!
ఛోఖమేళావి కాలేకపోవచ్చు
పద్యాలతో పంఢరిపురాలు నిర్మించలేకపోవచ్చు
కొత్త లోకాల కోసం అక్షరాలు పోగేస్తున్న చీమల రెక్కల మీద
ఇసుక రేణువంత ఇటుక ముక్కైనా అవుతావేమో!
విగ్రహాల్లోనో..పుస్తకాల్లోనో నీ పేరు ఉండకపోతే ఏముందిలే
వీరుల విజయ ప్రస్థానం కోసం ఒరిగిన దేహాల
చివరి దరహాసానివైనా అవుతావేమో!
లోపలా బయటా ఈ హవా ఆడినంత వరకే నీ హవా-
చెరిగిపోయిన ముగ్గను కాలితో తుడిచేసినట్టు
అస్తిత్వాలకేముందిలేవోయ్!
సూర్యుడితో చేతులు కలపలేకపోయినా
ఈ రంగుల వాకిళ్ళ ముందు
నీతోటి వాళ్ళతో కలిసి రంగవల్లులైనా దిద్దు-
మహా పురుషులనే కాదు
నీలాంటి నాలాంటి మామూలు మనుషుల్ని కూడా
నింగీ నేలా రెండు కళ్ళయి చూస్తుంటాయి
కాలమిచ్చిన హోం వర్క్ పూర్తి చేస్తున్నామా లేదా అని–
నువ్వూ ఒక జీవితాన్ని కూడా తెచ్చుకున్నావ్
తెరిచి చూడు
నీ పని నీదే..!!
–ప్రసాదమూర్తి
బండారు ప్రసాద మూర్తి ప్రస్తుతం తెలుగు సాహిత్యం పద్య రచన చేయగల సామర్ధ్యం వున్న అరుదయిన కవి. పద్య రచన చేయగలిగీ స్వచ్చందంగా వచన కవిత్వాన్ని ఎంచుకున్నారు. కానీ, వచన కవిత్వంలో పద్యకవిత్వంలోని లాలిత్యాన్ని, లయను, భావ గాంభీర్యాన్ని, భాషా సౌందర్యాన్ని పొందుపరుస్తారు. అనేక ప్రౌఢ ప్రతీకలను ఎంతో సులువుగా అర్ధమయ్యే రీతిలో వాడే ప్రసాదమూర్తి పలు కవితా సంపుటులను ప్రచురించారు. పూలండోయ్ పూలు, చేనుగట్టు పియానో వీరి ప్రసిద్ధ కవితా సంపుటులు.
కవిత్వమంటే ఇలాగే రాయాలని అందరంటుంటే ఇక కవులు కాలేమనే భయం వెంటాడేది. కాని ప్రసాదమూర్తి గారి చేనుగట్టు పియానో చదివినతరువాత అక్షరసముదాయం పదాలకూర్పుతో పాటు భావుకత వెల్లువిరిస్తుందనే నగ్నసత్యాన్ని ఆయన ప్రతి కవితలోను చదువుతుండంగానే ఆ ఆందాన్ని ఆనందాన్ని అప్పటికప్పుడే అనుభవించవచ్చు. ఒకచోట.. వేటగాడి వలలో చిక్కుకొన్న పక్షిరెక్కల చప్పుడు సాయంత్రం ఖాళీ గూళ్ళల్లో వినిపిస్తుంది. గుండే తరుక్కుపోయే భావమది. మరోక కవితలో … రాత్రికలంతా ఎండిన చేపముల్లులా గుచ్చుతూనే ఉంది. ఇలా చాలా ఆలోసింపచేసే కవిత్వం వారిది. ….బత్తిన కృష్ణ 9705060469
You must be logged in to post a comment.
భళారే – సినారె
సంచిక – పద ప్రతిభ – 98
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-9
పద శారద-7
నంద్యాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి సమావేశం – నివేదిక
చూడక్కరలేని 12 ఓ క్లాక్
దీపావళీ అమావస్య
అమ్మ ప్రేమ
తాజా పరిమళాల కవిత్వం
రజనీగారూ… కొన్ని జ్ఞాపకాలూ
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®