పెళ్లంటే ఇలాగా…!?
పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు. పెళ్లి అనేది పూర్వకాలం నుండి సంప్రదాయబద్ధంగా వస్తున్న జీవన సరళికి పునాదిరాయి (పెళ్లి గురించి బాగా లోతుగా తెలియాలంటే సాహితీ ఉద్దండులు శ్రీ తాపీ ధర్మారావుగారి ‘పెళ్లి – పుట్టు పూర్వోత్తరాలు’ చదవ వలసిందే!). ప్రస్తుతం పెళ్లి రెండు రకాలుగా మనకు కనిపిస్తున్నది. మొదటిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. రెండవది ప్రేమ వివాహం (ఇందులో మళ్ళీ పెద్దలకు ఇష్టం లేకుండా చేసుకునే ప్రేమ వివాహం ఒకటి. రెండోది పెద్దల అంగీకారంతో చేసుకునే ప్రేమ వివాహం). ప్రస్తుతం తాజాగా వెలుగులోనికి వచ్చినది/వస్తున్నది మరోటి కలిసి ఉండడం. దీనికి పెళ్లి అవసరం లేదు. మంచిగా ఇద్దరికీ కుదిరినంత కాలం కలిసివుండడమే. వీరిని స్నేహితులూ అనవచ్చు. సహచరులూ అనవచ్చు. సంసారం చేసి పిల్లలను కనవచ్చు. కనకపోనూ వచ్చు. ఈ విపరీత ధోరణి ఇప్పుడు ఆధునిక పెళ్లి కాని పెళ్లి. అదే కాస్త మార్పుకోసం దానికి ‘సహజీవనం’ అని పేరు పెట్టుకున్నారు. భార్యాభర్తల స్థాయిలో స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి, సంసారిక జీవానందం పొందడానికి, అది పెళ్ళైనా, సహజీవనమైనా, ఇరువురి మధ్య సయోధ్య ఉన్నంతవరకే! తేడా ఏమిటంటే, ఇష్టం లేని జంట విడిపోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నవారైతే, విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాలి. సహజీవనం చేసే వారికి మాత్రం అలంటి చిక్కులు వుండవు.
ఇప్పుడు పెళ్లిళ్ల మాటల కంటే విడాకుల మాటలే విరివిగా వినపడుతున్నాయి. ఒకప్పుడు పురుషులతోనే సమస్యలు వచ్చి విషయం విడాకుల వరకూ వచ్చేది. ఇప్పుడు అమ్మాయిల వల్ల కూడా ఆ పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి ఈ ఆధునిక సమాజంలో కారణాలు అనేకం. అందుకే ఫామిలీ కోర్టుల అవసరం ఎక్కువై పోయింది.
సరే. కారణం ఏదైనా పెళ్లిళ్లు పెటాకులైనప్పుడు (కారణం స్త్రీ అయినా, పురుషుడైనా) స్త్రీ పునర్వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు (పురుషుడికి ఎలాంటి సమస్య వుండదనుకుంటాను) మొదటి పెళ్లి వల్ల పిల్లలు పుట్టి వుంటే, అప్పుడు మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం వుంది. పెళ్ళైన తర్వాత పిల్లల్ని అనుమతించే పురుష పుంగవులు బహు అరుదు. అదే విధంగా పిల్లల్ని వదిలి కాపురానికి వెళ్ళే స్త్రీమూర్తులు కూడా బహు అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రథమ వివాహానికి సంబందించిన పిల్లల భవిష్యత్తు అయోమయంలో పడిపోతుంది. ఇది ఊహించిన మనసున్న కొందరు తల్లులు పునర్వివాహానికి సిద్ధపడరు. వారి యవ్వన జీవితం ఇలాంటి త్యాగంతో ముగుస్తుంది. స్వయంగా తమ పిల్లల్ని స్వయంగా పెంచగలిగామనే తృప్తి మాత్రం ఆ తల్లులకు మిగులుతుంది. పిల్లల్ని వదిలి పెళ్లి చేసుకున్న/సహజీవనం చేసిన తల్లులు కూడా లేకపోలేదు. ఇది వాళ్ళ మనఃస్తత్వం మీదా, ఆలోచనా విధానం మీదా ఆధారపడి ఉంటుంది. దీనికి భిన్నంగా విడాకుల తర్వాత పిల్లలు ఎవరికీ చెందాలన్న విషయం మీద సంవత్సరాలు తరబడి కోర్టుల చుట్టూ తిరిగే వారు కూడా వుంటారు. ఆ ఇద్దరి మధ్య పిల్లల మానసిక వేదన వర్ణించడానికి మాటలు చాలవు. తల్లిదండ్రులు చేసే పొరపాటు పనుల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల పిల్లలు బలి అయిపోతారు.
పెళ్లి అంటే ఇప్పుడు ఒక వేళాకోళపు క్రీడగా మారిపోయింది. కారణాలు ఏమైనా పెళ్లి మీద పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపొయింది. సెలబ్రిటీలు కొందరు ఇలా చేయడం గొప్పగా భావిస్తున్నారు. పెళ్లి, దాని విలువలకు తిలోదకాలు పలికేస్తున్నారు. ఎంత వేగంగా పెళ్లి నిర్ణయాలు తీసుకుంటారో, అంతే వేగంగా విడాకుల వైపు పరిగెడుతున్నారు.
భార్యాభర్తల మధ్య సయోధ్య లేనప్పుడు విడాకులు తీసుకోవడంలో ఎంత మాత్రమూ తప్పులేదు. కానీ, పునర్వివాహం చేసుకున్నప్పుడు/చేసుకోవలసి వచ్చినప్పుడూ, ముందు వెనుకలు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరు తీసుకునే నిర్ణయం మరొకరికి ఇబ్బంది కలిగించ కూడదు.
స్త్రీలు/పురుషులు పునర్వివాహం చేసుకోవడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉంటాయి. అందులో ఒకటి వివిధ కారణాలవల్ల విడాకులు తీసుకోవడం. రెండవదిగా, అనారోగ్య కారణాల వల్ల, లేదా వివిధ ప్రమాదాల వల్ల, భర్త గాని, భార్య గానీ మరణించినప్పుడు గాని ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో నాకు తెలిసిన రెండు విభిన్నమైన సంఘటనలను ఇక్కడ వివరిస్తాను.
నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పని చేస్తున్న కాలంలో, నాకు తెలిసిన వైద్య కుటుంబం ఒకటి ఉండేది. ఆంటే భార్యాభర్తలు ఇద్దరూ వైధ్యులన్నమాట! ఇద్దరూ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్ నడుపుకునేవారు. ఇద్దరూ మంచి వైద్యులుగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆ వైద్యురాలు ఆకస్మిక మరణం పొందింది. అప్పటికే వాళ్లకి ఇద్దరు పిల్లలు.
పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఆ డాక్టర్ గారు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు ఎందరు చెప్పినా అయన ‘ససేమిరా పెళ్లి చేసుకోన’ని మొండి పట్టు పట్టాడు. అయితే ఆయన రక్త సంబంధీకులు కొందరు తెలివిగా ఆ డాక్టర్ గారి పిల్లలతో తండ్రిని పెళ్ళికి ఒప్పించే పథకం వేసి కృతకృత్యులయ్యారు. ఆయన కొత్త భార్యకు కూడా పిల్లలున్నారు. వాళ్ళిద్దరి చక్కని అవగాహనతో పిల్లల్ని పెంచి, చదివించి పెద్దచేసి వాళ్ళందరూ చక్కగా స్థిరపడేట్లు చేసారు. ఆ భార్య భర్తలిద్దరూ సుఖమయ, ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. ఇరువైపు పిల్లలు తృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డ నాకు తెలిసిన ఒక అందమైన జంట చక్కగా అక్కడ స్థిరపడి ఆనందమయ జీవితం గడుపుతూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వాళ్ళు కాస్త ఎదిగే సమయానికి భార్యాభర్తలకు విభేదాలు వచ్చాయి. అవి చిలికి చిలికి గాలివాన అయి విడాకుల వరకూ వెళ్ళింది. కోర్టు ద్వారా స్వచ్ఛందంగా విడిపోయారు. తర్వాత ఇద్దరూ వారికి ఇష్టమైనవారికి పెళ్లి చేసుకుని హాయిగా వున్నారు. కానీ కోర్టు ఆదేశాల మేరకు తండ్రి కోర్టు నిర్దేశించిన సూచనల మేరకు పిల్లలను అప్పుడప్పుడు దర్శించే అవకాశం కలిగింది. ఆ తండ్రి పిల్లలను కలిసినప్పుడల్లా ఇరువైపులా మానసిక పరిస్థితి ఎలావుంటుందో ఊహించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు అది మానసిక చిత్రహింసే. తల్లిదండ్రులు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నది పిల్లలు!
మారుటి తల్లులు/తండ్రులూ మంచిగా చూసుకున్నంత కాలమూ సమస్య ఉండదు. అది లోపిస్తేనే సమస్యలు వస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే, నేను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నప్పడు నాకు అసిస్టెంట్‌గా ఒక అమ్మాయి కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చి చేరింది. ఆమె మన సమాజంలో చెప్పుకునే ఉన్నత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఆమె భర్త కూడా వైద్యరంగానికి చెందినవాడే. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒక ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాతే ఈ అమ్మాయి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటున్నది. ఆమె జీవితంలోని సాదకబాధకాలను నాతో అప్పుడప్పుడూ చెప్పుకుంటుండేది. నాకు తోచిన ఓదార్పు మాటలు నేను ఆమెకు చెబుతుండేవాడిని. అలా నాతో చాలా చనువుగా ఉండేది. ఒక ఉదయం డ్యూటీకి వచ్చి ఒక వార్త నా చెవిన పడేసింది. ఆమె ఆ విషయం చెబుతున్నప్పుడు ఆమె ముఖం విప్పారినట్టు, చాలా సంతోషంగా ఉన్నట్టు నేను గమనించాను.
విషయం ఏమిటంటే, ఆమె సామాజిక వర్గానికి చెందని ఒక వైద్య మహాశయుడు, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. విషయం చెప్పి నా అభిప్రాయం కోసం ఎదురు చూసింది. అప్పుడు నేను “చాలా సంతోషం అమ్మా” అని ఆశీర్వదించాను. అప్పటినుండీ ఆమె చాలా చలాకీగా సంతోషంగా ఉండేది. నేను కూడా ఆమెకు అనేక సూచనలు చేస్తుండేవాడిని.
ఒకరోజు ఆ అమ్మాయి దిగాలు ముఖంతో వచ్చి నా ఎదురుగా నిలబడింది. ఇంట్లో ఏదైనా విషాద సంఘటన జరిగిందేమో అనుకుని, ఆమె చెప్పేవరకూ నేను మౌనం వహించాను. కొద్ది నిముషాల తర్వాత ఆమె నోరు విప్పింది.
“సార్.. మీరు నాకు ఒక సలహా ఇవ్వాలి” అంది మామూలు పరిస్థితికి వచ్చి.
“చెప్పమ్మా” అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ.
“అతను.. మా పెళ్లి విషయంలో ఒక మెలిక పెట్టాడు సార్” అంది
“మెలిక ఏమిటమ్మా?’’ అన్నాను, అదేమిటో అర్థంకాక.
“అవును సర్. పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలి రావాలని కండిషన్ పెట్టాడు” అంది.
“మరి నువ్వు ఏమని అన్నావు?’’ అన్నాను.
“ఆలోచించుకుని చెబుతానన్నాను సర్” అంది
“మరి ఏమని నిర్ణయించుకున్నావ్?’’ అన్నాను.
“నా.. నిర్ణయం మీ సలహా మీద ఆధార పడివుంటుంది సర్” అంది మెల్లగా.
“నా సలహా నీకు నచ్చినా నచ్చకపోయినా, ఒక విషయం స్పష్టం చేస్తానమ్మా. పిల్లల్ని నువ్వు అలా వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు. పిల్లల కోసం నువ్వు ‘పెళ్లి’ త్యాగం చేయక తప్పదు. వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే సరైన అండ” అన్నాను.
“నేనూ అదే అనుకుంటున్నాను సర్. అతనికి విషయం చెప్పేస్తాను” అంది దైర్యంగా, ఒక నిర్ణయానికి వచ్చినదానిలా.
ఆమె పెళ్లి చేసుకోలేదు. పిల్లల్ని ఎంతో శ్రద్ధగా జాగ్రత్తగా పెంచుకుంటున్నది. పిల్లలిద్దరూ ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నారు. ఆమె సంసారిక జీవితాన్ని త్యాగం చేసినా మంచి నిర్ణయమే తీసుకున్న తృప్తి ఆమెకు మిగిలింది. ఎందరు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, చిన్న పిల్లలు వున్నప్పుడు తీసుకునే నిర్ణయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లంటే మరీ స్వార్థపూరితమైనదిగా వుండకూడదు. కారణంతో సంబంధం లేకుండా, రెండవ పెళ్లి అవసరమైనప్పుడు చేసుకోవలసిందే! కానీ అమాయకమైన పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేయకూడదు. అందరూ కలిసి బ్రతికే ప్రయత్నం చేయడం మంచిది. పాశ్చాత్య పోకడలకు మన సమాజం అప్పుడే పోవలసిన అవసరం లేదు (పిల్లలే లేనప్పుడు సమస్య ఉత్పన్నం కాదు).
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక-అంతర్జాల పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
-డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.
sagar
అసలు మీరు చెప్పిన సహజీవనాలు అనేవి కోరికమత్తులో కూరుకున్నవారికి తప్ప బాధ్యతలను పంచుకునేవారికి కాదని నా అభిప్రాయంసర్. నిజమే విడాకుల ప్రహసనంతో ఎంతమంది బిడ్డలు ఎన్నిరకాలుగ బాధలు అనుభవిస్తారో మనం నిత్యం చూస్తున్నదే. అలాంటి ఘటనలతోనే కదా జాన్సీ మేడమ్ విరోధాబాస లో వివరించారు. అక్రమ సంబంధం ముసుగులో బార్యకు విడాకులిచ్చి కూతురిని చూసుకునేప్పుడు తండ్రిబాధ ఎంత బాగ వివరించారో చూడండి మేడమ్. ఇక మీరన్నట్లు పాశ్చాత్యానికి అప్పుడే వెళ్ళనవసరంలేదు అనేది భ్రమ. ఇప్పటికే ఆ ముసుగు చాలామందిని కప్పేసింది. మీ దగ్గర పనిచేసే మేడమ్ కు మీరు మొహమాటంలేకుండా ఇచ్చిన సలహా అద్భుతమైనది సర్. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
ధన్యవాదాలు.
Rajendra Prasad
Sir, you have quoted good examples how successful the re married lives are! May be true where a spouse dies. But a person who takes or accept a divorce on unreasonable grounds if remarried, would lead to failure. Emotional, selfish decisions leading to divorces and re-marriages are social evils in my opinion.
– Rajendra Prasad
డా కె.ఎల్.వి.ప్రసాద్
Not all prasad garu.
Thank you.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి విషయ చర్చ… !





పెళ్లి, దాంపత్యం, కుటుంబం అనే విషయాలలో… మన మనదేశం, మహోన్నతమైనదందుకే !విడాకులు, పునర్వివాహం…
దురదృష్టకర సంఘటనలు !
అందుకే, కుటుంబము, సంసారము విషయాలలో…
స్త్రీపాత్ర కీలకమైనది… !కాబట్టే మన భారతీయులు తల్లిని తొలిదైవంగా గౌరవిస్తున్నారు
ఈ రోజుల్లో భార్యపోయి,పిల్లలకోసం జీవితాన్ని త్యాగం చెయ్యగల మగవారు అరుదు !
అలాంటివారిని చేతులెత్తి నమస్కరించాల్సిందే !
… మీ ఈ వ్యాసానుభవం చాలాబావుంది, తొందరపడి విడిపోవాలనుకునే యువ జంటలకు చక్కని బోధన !
—కోరాడ నరసింహారావు
విశాఖపట్నం
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 123 పెళ్లంటే ఇలాగా.?
సంచికలో అనాలోచితంగా తొందరపడి విడాకులు ఎలా తీసుకుంటున్నారు,అందువల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయంలో సమాజానికి అవసరమయ్యే మంచి విషయాలు అందించిన మీకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Pendli vishayam meeru teleya chesina opinion vastavani ki chala baga saripoyendi.
Jogam, hyd
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఇద్దరు భార్యాభర్తలు విడిపోవడం సులభం కానీ తల్లిదండ్రులుగా విడిపోవడం చాలా కష్టం అనే అంశాన్ని చాలా సుస్పష్టంగా తెలియచేశారు సర్ ఇది అక్షర సత్యం.పిల్లలు భవిత ఆకుపచ్చగా సాగాల్సిందే గానీ సంఘర్షణల మధ్య గడవకూడదు అది వారికే కాక రేపటి సమాజానికి కూడా చేటు.విధి లేని పరిస్థితుల్లో జరిగిన వాటిని వదిలేస్తే సాధ్యం అయినంత వరకూ దంపతులు ఎవరైనా విడిపోవాలనుకున్నపుడు పిల్లలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు చెప్పినట్టు.నేటి సమాజానికి ముఖ్యంగా కుటుంబాలకు మంచి సందేశాన్ని ఇచ్చారు సర్.మీరు ఉదహరించిన వ్యక్తులు కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు.వారి నుండి మంచిని గ్రహించాలి.మంచి అవసరమైన అంశాన్ని అందించారు సర్.ధన్యవాదాలు

—-నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు
హృదయపూర్వక
కృతజ్ఞతలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
123 వ సంచిక లో మీరు చర్చించిన అంశం ఇవాళ సినిమారంగంలో విరివిగా కనపడుతున్నది.డబ్బుతోవచ్చే హోదా అన్ని అవకరాలను లేదా అవలక్షణాలనూకప్పివేస్తుందనటానికి నిదర్శనంగా సినిమావాళ్ళ పునర్ పునర్ వివాహాలునిలుస్తున్నాయి.సాధారణ ప్రజానీకానికి అనుచితంగా కనిపించే ఇవి సెలెబ్రిటీలకు ( బాగా డబ్బున్నవారికి) సర్వ సాధారణంగా చెలామణీ ఔతున్నది.ఏదో ముతక సామెత చెప్పినట్టు ” నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో తగవు పడుతున్నా” రనేది పాశ్చాత్య నాగరకతలో ఎక్కువగా కనిపిస్తుందంటారు .భారతీయ సంస్కృతిలో కొద్దిగా ఎబ్బెట్టుగానే అనిపిస్తది.
కొందరూఅభ్యుదయ లేదా విప్లవ వాదులనబడే వారిలోనూ పెళ్ళిచేసుకొని పిల్లలను కని ఆభార్యను విడిచిపెట్టోవ,పెట్టకనో ఇంకొకమహిళతో సహజీనం చేస్తూ దానికి అభ్యుదయ రంగులద్ది మాట్లాడటమూ చూస్తున్నం. వీటన్నిటిలో నైతికత,ఎంత? అని ప్రశ్నిస్తే నైతికతకు మనం ఇచ్చేనిర్వచనమూ మరికొందరిచ్చే నిర్వచనమూ భిన్నంగా ఉన్నవి. తప్పొప్పులు నీతికినిర్వచనాలూ వ్యక్తుల హోదా లను బట్టి మారుతున్నవి.
సాధారణప్రజానీకం లో ఈవిషయం పెద్ద కన్ఫ్యూజన్గా వున్నదనవచ్చునేమో. పూర్తి కిందితరగతుల జనంలో మార్మానాలు( మారుమనువులు) చాలాసహజంగా జరిగిపోవటంనేనెరుగుదును ముగ్గురు పిల్లలున్న మహిళ ఇద్దరు ముగ్గురుపిల్లలున్న పురుషుడిని మనువాడటం చూసిన.కాని వాళ్ళు దానికిఅభ్యుదయమో మరో పేరో పెట్టలేదు ప్రచారమూ చేసుకోలేదు.ఎందుకంటే వాళ్ళు డబ్బుతోవహోదా వచ్చిన వారుకాదు.వాళ్ళు పూర్తిగా ఆచరణవాదులు.సిద్ధాంతాలు వల్లె వేయనివారు.సిద్ధాంతాలు తెలియని వాళ్ళు.అసలు ముసుగులే లేనివాళ్ళు.
వాఅక్ష్ళే నిజమైన మనుషులనిపిస్తది.
మీరు లేవనెత్తిన అంశాలు చర్చించ దగ్గవే
—వాగిల్ల రామశాస్త్రి
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ విశ్లేషణ బాగుంది
ధన్యవాదాలు మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అనివార్య కారణాల వలన పునర్వివాహము చేసుకున్న జంటలు, భార్యాభర్తల మధ్య సంభవించిన అభిప్రాయ భేదాల వలన విడిపోయిన జంటలు చాలా అరుదుగా కనిపించేవి ఆ రోజుల్లో. అటువంటి వారికి సమాజంలో కూడా సరైన గౌరవ మర్యాదలు దక్కేవి కావు .పవిత్రమైన వివాహ బంధంతో ముడిపడి సక్రమ సంతానము ద్వారా అభివృద్ధి చెందుతున్న భారత దేశము లాంటి సనాతన సంప్రదాయం కలిగిన వ్యవస్థలో ,కొత్తగా నవనాగరికత అనే ముసుగులో వినిపిస్తున్న అపవిత్రమైన పదము .. ఈ సహజీవనము . నేటి యువతరానికి ఇది సహజమే అనిపించినప్పటికినీ, పాత తరానికి చెందినవారు దీనిని ఒక జుగుత్సాకరమైన పరిణామంగా భావిస్తారు . ఈ సమాజం చేసుకున్న ప్రారబ్దం ఏమిటో కానీ …నేటి ప్రభుత్వాలు ,న్యాయవ్యవస్థలు పరస్పర అంగీకారంతో వివాహేతరులు ,చివరకు వివాహతుల మధ్య జరిగే అక్రమ సంబంధాలు కూడా తప్పు కాదు …అని తేల్చాయి . ఇటువంటి సంబంధాలతో కొనసాగే వ్యక్తులు నా దృష్టిలో పశువులతో సమానం . కాదు!కాదు !..వీరిని పశువులతో పోల్చడం సరైన పోలిక కాదేమో! కారణం పశువులు కేవలం సృష్టి ప్రక్రియ అయిన సంతానోత్పత్తికి మాత్రమే వావి వరసలు మరచి వ్యవహరిస్తాయి. వాటికి కుళ్ళు, కుతంత్రాలు ,స్వార్థ ప్రయోజనాలు, అహంభావము ,అసమానతలు తెలియవు.
…
అరిషట్వర్గాలలో ప్రథమమైన కామ వాంఛతో మానవుడు అధోగతి పాలవుతున్నాడు.
సరైన అవగాహన లేకుండా చిన్న చిన్న మనస్పర్ధలతో వివాహ బంధాన్ని దూరం చేసుకునే జంటలకు తదనంతర పరిణామాలను సరైన సమయంలో ,సరైన వ్యక్తుల ద్వారా ఏదో ఒక రూపంలో విషద పరచడం వలన ఈ దుర్వ్యవస్థ నుండి కొంతవరకైనా విముక్తి కలిగించగలము…అనే విషయాన్ని రచయిత ఈ శీర్షికలో ఒక చిరు సలహాతో ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని నిలబెట్టి ఆదరణీయులైనారు
–బి.రామకృష్ణా రెడ్డి
అమెరికా.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ రెడ్డి గారు
మీమనసులో ని మాటకు
స్వాగతం.
పుట్టి. నాగలక్ష్మి
పెళ్ళిళ్లు,సహజీవనం,పునర్వివాహాలకు కారణాలను గురించి విపులంగా వివరించారు..పిల్లల కోసం పునర్వివాహం గురించి ఆలోచించని ఒంటరి తల్లి, ఒంటరి తండ్రులను గురించి సోదాహరణంగా వివరించడం బావుంది.. ధన్యవాదాలు అభినందనలు మీకు..