“అమ్మా, అమ్మా” అరవింద్ స్కూల్ నుంచి వస్తూనే అరుస్తూ వచ్చాడు. వంటింట్లోంచి హడావిడిగా వచ్చింది కుమారి కొడుకు అరవింద్ అరుపులు విని “ఏమిట్రా?” అనుకుంటూ.
“నువ్వు చెప్పిందేమీ కాలేదు. ఈ సారీ నాకు సుభాష్ కన్నా తక్కువ మార్కులే వచ్చాయి చూడు” యూనిట్ టెస్ట్ బుక్స్ తీసి తల్లికిచ్చాడు. అన్నీ చూసిన కుమారి “మార్కులు బాగా వచ్చాయి కదరా” అన్నది.
“ఏం బాగా వచ్చాయి?? మళ్ళీ ఆ సుభాషే క్లాస్ ఫస్టు. నేను మళ్ళీ సెకండే. హిందీలో అయితే సెకండ్ కూడా కాదు. ధర్డ్” హిందీ యూనిట్ టెస్ట్ బుక్ తీసి చూపిస్తూ అన్నాడు.
కుమారికి అరవింద్ నిరాశ అర్ధమయింది. వాడి క్లాసులో సుభాష్ అనే విద్యార్ధికి ఎప్పుడూ ఫస్టు మార్కులొస్తాయి. వాడినంతా ఓ హీరోలా చూస్తారు. అరవింద్‌కి తను కూడా క్లాస్ ఫస్ట్ అనిపించుకోవాలని కోరిక. బాగా చదువుతాడు. పరీక్షల ముందు ఇంకా ఎక్కువ సేపు చదువుతాడు. పరీక్షలు బాగా రాశానని చెబుతాడు. కుమారి అడిగితే అన్నీ సరిగ్గా చెబుతాడు. మరి ఎప్పుడూ సెకండే వస్తాడు. ఎందుకో కుమారికీ అర్థం కాలేదు. చిన్న పిల్లలమీద ఇప్పటినుంచీ చదువు భారం ఎక్కువ పెట్టకూడదని తను పట్టించుకోదు. కానీ అరవింద్‌కి మాత్రం ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. వాడు నిరుత్సాహ పడ్డప్పుడల్లా ఇప్పుడు బాగా చదివావు కదా. అన్నీ గుర్తు తెచ్చుకుని చక్కగా రాయి.. ఈ మారు నీదే ఫస్టు మార్కు అని ధైర్యం చెబుతుంది. ఈమారూ వాడికి నిరాశే ఎదురయింది. తల్లి చెప్పినట్లు తనకి ఈమారూ ఫస్టు రాలేదని అరవింద్ పసి మనసు గాయపడ్డది.
అదే అడిగాడు తల్లిని. “నేను అంత బాగా చదువుతాను. నువ్వు చెప్పకుండానే చదువుతాను. అయినా ఎందుకు ఫస్ట్ మార్కు రాదు? సుభాష్‌కు ఎప్పుడూ ఫస్టు మార్కు వస్తుంది కదాని వాడు ఎట్టా రాసినా టీచర్లు వాడికే మార్కులెక్కువ వేస్తున్నారేమో!?. ఒకసారి నువ్వొచ్చి అడగరాదూ?” వాడికి ఫస్టు రాకపోవటానికి వాడికి తోచిన కారణాలన్నీ వాడు వెతుక్కుంటున్నాడు.
కుమారి అరవింద్‌ని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చో పెట్టుకుంది. “కన్న తండ్రీ, ఎప్పుడూ నీకు పాఠాలు చెప్పే టీచర్లని అనుమానించకూడదు. నీకు విద్య నేర్పే గురువు దేవుడితో సమానం. నువ్వు ప్రార్ధనలో చదువుతావే పద్యం దానిలో ఏమని చెబుతారు .. గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః అని రోజూ ప్రార్ధన చేస్తావు కదా. అంటే అర్థం ఏమిటి? గురువే బ్రహ్మ, విష్ణు, శివుడు. ఈ ప్రపంచంలో మనకి కనిపించే దేవుడు గురువు అనే కదా. అలాంటి గురువుని అనుమానిస్తే అవమానించినట్లే. నీకు చదువు చెప్పి, బాగా చదువుకుని, పెద్దవాడివవటానికి సహాయపడే గురువుని అస్సలు అనుమానించ కూడదు.. అవమానించ కూడదు.”
“మరి నాకెప్పుడూ ఫస్టు మార్కు రాదా??” నిరాశగా అడిగాడు అరవింద్.
“అరవింద్ నీకు చాలాసార్లు చెప్పాం కదా నాన్నా నేనూ. నువ్వెప్పుడూ క్లాసులో వచ్చే మార్కులు గురించి చూడకు. చదువు మన జ్ఞానం పెరగటానికి. అంటే మనకి తెలియని విషయాలు తెలుసుకోవటానికి. అందుకని నువ్వెప్పుడు చూసుకోవాల్సింది టీచర్ చెప్పే పాఠాలు నీకు అర్ధమవుతున్నాయా లేదా అని. అర్థం అయితే పర్వాలేదు. లేకపోతే క్లాసులోనే మళ్ళీ టీచర్ని అడుగు. వాళ్ళు నీకు అర్థం అయ్యేటట్లు చెప్తారు. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ చదువు. గుర్తు పెట్టుకోవల్సిన విషయాలని మననం చేసుకో. నేనెప్పుడూ నీకింకో విషయం కూడా చెబుతాను కదా. నీకు కష్టం అనుకున్న విషయం బాగా చదివి, ఒక రఫ్ బుక్‌లో చూడకుండా రాసి మళ్ళీ నువ్వే చూసి సరిదిద్దుకో. దానితో బాగా గుర్తుంటాయి. ముందునుంచీ ఇలా చేస్తే పరీక్షల ముందు ఎక్కువ శ్రమ పడక్కరలేదు. అప్పుడు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. దాంతో ఇంకా బాగా గుర్తుంటుంది.”
“నేను చేస్తున్నాను కదా అమ్మా?”
“నీ సంగతి నాకు తెలుసుకదా నాన్నా. నువ్వు చదువుతావుగానీ రాయటానికి కొంచెం బధ్ధకిస్తావు. అంతేకాదు నువ్వు అనవసరమైన టెన్షన్ కూడా ఎక్కువ పెట్టుకుంటున్నావు, నీకు ఫస్టు మార్కు కావాలని. ఇంత చిన్నప్పుడే నీకా టెన్షన్స్ వద్దు. ఆ కాంపిటీషన్స్ నీకు వద్దు. ప్రశాంతంగా చదువుకో. ఆడుతూ పాడుతూ చదువుకో. చదువుతో ఇప్పుడొచ్చే మార్కులు కాదు, తెలివితేటలు పెంచుకుంటే అవి నీ జీవితంలో ఉపయోగ పడతాయి. వాటితో నువ్వు జీవితంలో బాగా సెటిల్ కావచ్చు. సరేనా?”
“కానీ అమ్మా..”
“ఇంక కానీ లేదు ఏమీ లేదు. కావాలంటే మీ నాన్నని కూడా అడుగు. ఆయనా నేను చెప్పినట్లే చెప్తారు. పెద్దవాళ్ళం మేమిద్దరం చెబుతున్నామంటి అది నీ మంచి కోసమే కదా. ఇంకెప్పుడూ ఈ అర్థంలేని పోటీలకి వెళ్ళకు. నువ్వు చదివింది నీకు అర్థం అవుతోందా లేదా అనే చూసుకో. ఈ పోటీల వల్ల అనవసరమైన కుళ్ళు బుధ్ధులు కూడా వస్తాయి. అవి మంచిది కాదు.”
“కుళ్ళు బుధ్ధులేమిటమ్మా?”
“ఇందాక నీకు మీ టీచర్లమీద అనుమానం వచ్చిందికదా. నన్ను వచ్చి అడగమన్నావు. అది సరైన ఆలోచన కాదు. అలాగే రేపు సుభాష్‌ని ఎనిమీలాగా చూడచ్చు. అది అస్సలు మంచిది కాదు. క్లాసులో పిల్లలంతా కలిసి మెలిసి వుండాలి.”
“సరేనమ్మా. నువ్వు చెప్పినట్లే వింటానులే.”
అరవింద్ తను చెప్పింది అర్థం చేసుకున్నాడని తృప్తిగా నిట్టూర్చింది కుమారి. అరవింద్ అర్థం చేసుకోకపోతే పరిస్ధితులు ఎలా వుండేవో ఊహించుకోవటానికే భయపడ్డది. రోజు రోజుకీ మారుతున్న సామాజిక పరిస్ధితులతో చిన్న పిల్లల దగ్గరనుంచీ సర్దుకు పోవాల్సి వస్తోంది. కుళ్ళి పోతున్న ఈ సమాజంలో పెరిగే పసి పిల్లలు పెరిగి ఎలా తయారవుతారు!? ఏమయినాగానీ మా పిల్లలని సాధ్యమయినంత ఈ కుళ్ళు నుంచీ దూరంగా వుంచుతాము. ఈ చదువులు, కాంపిటీషన్స్ మా పిల్లల మీద రుద్దం. హాయిగా చదువుకుంటారు.. నచ్చిన పని చేసుకుంటారు. అందరూ డాక్టర్లూ, ఇంజనీర్లే కానక్కరలేదుకదా..అనుకుంటూ అరవింద్‌కి పాలు కలిపివ్వటానికి వెళ్ళింది.

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
6 Comments
కొల్లూరి సోమ శంకర్
*ఇది మంజులా సుదర్శనం గారి వ్యాఖ్య*
“మీ కథ ‘ఎవరు ఫస్ట్’ చదివాను. పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టేలా వుంది. తల్లి బుజ్జగింపు, పిల్లవాడికి బోధించి ఊరడించే పద్ధతి బాగుంది.
Hats off to you Lakshmi garu.- Manjula Sudarsanam
కొల్లూరి సోమ శంకర్
*ఇది నంద్యాల మురళీకృష్ణ గారి వ్యాఖ్య*
“మీ కథ ‘ఎవరు ఫస్ట్’ చదివాను మేడమ్. తల్లి పిల్లవాడిని అర్థం చేసుకుని సర్దిచెప్పిన తీరు… విద్యలో స్పర్థ ఉన్నా మనస్పర్థలు వద్దని పాజిటివ్ ఆలోచనలో నడిపిన తీరు బాగుంది బోధించి ఊరడించే పద్ధతి బాగుంది.
Nandyala Murali Krishna
పుట్టబాకుల మాధవి
చాలా బాగుందండి లక్ష్మి గారు.నిజంగా పాఠశాలలో తల్లిదండ్రుల కు అవగాహన కలిగించే విధంగా ఇలాంటి కథలు అందించితే బాగుంటుంది అనిపించింది.సమాజంలో అందరికీ ఈ రకమైన ఆలోచనలు వస్తే మానవీయ విలువలు పెరుగుతాయి.ధన్యవాదములు.
కొల్లూరి సోమ శంకర్
*ఇది చెల్లూరు కామేశ్వరి గారి వ్యాఖ్య*
“ఈ కాలం పోటీ చదువుల గురించి చక్కగా రాసారు. మా పిల్లలు, మా మనవలు ఇలాగే పోటీలేకుండా చదివిస్తారు. పెద్దయ్యాక ఏం చదువుతారో వారి ఇష్టం. ముందు నుంచి ఒక అభిప్రాయం వారి మీద రుద్దరు. – చెల్లూరు కామేశ్వరి
కొల్లూరి సోమ శంకర్
*This is a comment by Mr. PSN Murthy, Kazipet *
“Children story is very nice. Advice to parents to create self-confidence in children rather than stressing them for ranks and marks. This story is meant for parents. Thank you for a good concept. – PSN Murthy, Kazipet
G.S.lakshmi
సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టినట్టు రాసారండీ.. చాలా బాగుంది.