శౌనక మహర్షి విజ్ఞాన గని, తపోసంపన్నుడు అయిన శనక మహర్షి కుమారుడు. మనము ఏ పురాణము విన్నా చదివిన మొదటగా వినిపించే పేర్లు శౌనక, సూత మహామునులు, నైమిశారణ్యము. శనకుడు గృత్స్నమదుడు అనే ముని యొక్క కుమారుడు. శౌనకుని కుమారుడు ‘బహ్వ్రచ ప్రవరుడు’. శౌనకుడు సకల యజ్ఞ నిర్వహణా సామర్థ్యము, వేదవేదాంగములు, నియమ నిష్ఠాగరిష్టుడై నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో నిర్జన ప్రదేశము కొరకు బయలు దేరి, చివరకు నైమిశారణ్యము చేరుకొన్నాడు. ఇంక ముందుకు వెళ్ళలేక, ఇక్కడే స్థిర నివాసము ఏర్పరుచుకొని, అనేక మంది ముని పుంగవులని శిష్యులుగా చేసుకొని, మహాతపోధనుడై, బ్రహ్మజ్ఞానియై, కులపతియై, బ్రహ్మజ్ఞానదాన విరాజితుడై, దయామయుడై, శాంఖ్యాయోగాచార్యుడై వెలుగొందాడు.
నైమిశారణ్యానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే ఎంతమందో మునులు అక్కడకు చేరి తపస్సు చేసుకొవాటానికి నైమిశారణ్యాన్ని ఎన్నుకొనేవారు. నైమిశారణ్యంలో సత్రయాగము వేయి సంవత్సరములు వైదికోక్తములగు సర్వ యజ్ఞకర్మ కలాపములు ప్రతిరోజు నెరవేర్చిన పిదప సమస్త పురాణములు, ఇతిహాసములు చెప్పించుకొనుటకు శౌనక మహర్షి సూత మహర్షిని కోరడం జరిగింది. ఇందులో భాగంగా సూతుల వారు కృష్ణ కథాశ్రవణము వారందరికీ వినిపించారు.
ఋగ్వేదం రక్షణ కొరకు శౌనక మహర్షి ఆర్షానుక్రమణి, చందోనుక్రమణి, దేవతానుక్రమణి, పాదానుక్రమణి, సూక్తానుక్రమణి, ఋగ్విధానం, బృహద్దేవతాప్రాతిశాఖ్యం, శౌనకస్మృతి అనే గ్రంథాలు రచించాడు. ఇందులో మొదటి సూచించినవి ఏడు గ్రంథాలు మాత్రము అనుక్రమణికా వాఙ్మయములో చేరతాయి. శౌనక మహర్షి చరణవ్యూహ అను ధర్మశాస్త్రమునకు గ్రంథకర్త. జిజ్ఞాసువు అయిన శౌనకుడు అంగీరస మహర్షి వద్దకు వచ్చి “ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?” అని అడిగిన ప్రశ్నకు అంగీరసుడు “పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు.” అంటూ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తును అంగీరసుడు బోధించాడు.
ఒకరోజు మునీశ్వరులు శౌనక మహర్షి వద్దకు జేరి విష్ణుకథా కలాపములు చేయుచుండ, అక్కడకు సూత మహర్షి రావడము జరిగింది. సూతుడు శౌనకాదులకు పద్మ పురాణము అంతయు వినిపించి వారందరినీ అమిత ఆనంద కందళిత హృదయార విందులను చేసి తను కూడ బ్రహ్మానందము పొందాడు. శౌనక మహర్షి వ్రాశిన అనుక్రమణికములలో అనువాకానుక్రమణి తప్ప మరొకటి లభించుట లేదు. మిగతావి కేవలం వేదరాశులలో (సధ్గురశిష్య రచనలలో) ఉల్లేఖనాలు రూపాలలో మాత్రమే మనుగడలో ఉన్నాయి.
భారతంలో శౌనకుడు కపి గోత్ర రుషి. ఇతడూ, కక్ష సేన వంశం వాడైన ‘అభిప్రతారి’ అనే ముని కలిసి భోజనానికి కూర్చోగా ఒక బ్రహ్మచారి భిక్షకు వచ్చాడు. వచ్చినవాడికి ‘సంసర్గ విద్య’ అంటే సాంఘిక శాస్త్రంలో నిష్ఠ ఉందో లేదో తెలుసుకొందామని వీరిద్దరూ భిక్ష ఇవ్వలేదు. అతడు శౌనకునితో ఆ విద్య పై వాదం చేశాడు. సంతృప్తి చెంది భిక్ష ఇచ్చారు. మహా భారతం లోనే మరో విషయం కూడా ఉన్నది. పాండవులు అరణ్య వాసం చేస్తూ గంగాతీరం చేరి అక్కడ ఒక వటవృక్షం క్రింద ఒక పూట గడిపి వెడుతుంటే, అక్కడి బ్రాహ్మణులు తమ అగ్నిహోత్రాలు తెచ్చుకొని పాండవులతో పాటు వనవాసం చేస్తామని వచ్చారు. అప్పుడు ధర్మరాజు “మహాశయులారా నేను రోజూ బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనంతో సంతృప్తి పరచేవాడిని. ఇప్పుడు నాదగ్గర ఏమీ లేదు. ఏమీ ఇవ్వలేను, పోషించలేను. మాతో రావద్దు” అని బాధ పడ్డాడు. అక్కడికి వచ్చిన శౌనకమహర్షికి ధర్మరాజుకు చక్కటి వాతావరణంలో సంవాదం జరుగుతుంది. శౌనక మహర్షి చెప్పినట్లు ధర్మరాజు సూర్యుడిని ఆరాధించి మునులకు సంతృప్తిగా మృష్టాన్న భోజానాన్ని పెట్టి వారిని సంతృప్తి పరుస్తాడు.
ఆ విధముగా శౌనక మహర్షి నైమిశారణ్యములో సూత మహామునిచే ఎన్నో పురాణాలను భాగవత గాథలను మునులకు వినిపించి వారిని వారి శిష్యుల ద్వారా అనేక మంది భక్తులను తరింపజేసాడు. ఆ విధముగా నైమిశారణ్యము కూడా అనేక రకాల గాథలు విని తరించి పుణ్యభూమిగా వెలుగొందింది. నేటికీ నైమిశారణ్యము ప్రాముఖ్యత అలాగే ఉంది.
You must be logged in to post a comment.
భూతాల బంగ్లా-13
గుండె గోదారిలా
ఎవరికి వారే
మరుగునపడ్డ మాణిక్యాలు – 36: ట్రాఫిక్
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-41
జగన్నాథ పండితరాయలు-22
దేశ విభజన విషవృక్షం-62
చిట్టితల్లి శతకం-2
కవి సర్వాంతర్యామి!
కాంచన శిఖరం-7
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®