[‘అమెరికా జనహృదయ సంగీతం- కంట్రీమ్యూజిక్’ అనే ఫీచర్లో భాగంగా మెర్లె హగ్గార్డ్ పాడిన ‘మమా ట్రైడ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
~
బిడ్డ భవిష్యత్తు బావుండాలని ఎంతో కష్టపడుతుంది తల్లి. భర్త లేని ఒంటరి స్త్రీ అయితే ఇద్దరి బాధ్యతా తానే తీసుకుని, ఆశలన్నీ సంతానం మీదే పెట్టుకుని, జీవితంలో ఎన్నో ఆటు పోట్లకు ఓర్చుకుని బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. కాని ఆమె కష్టం బిడ్డలకు అర్థం కాదు. తమ జీవితాలపై తల్లి నియంతలా వ్యవహరిస్తుందని ఆమెను ద్వేషిస్తారు. స్వేచ్చగా ఎటో ఎగిరిపోవాలనుకుంటారు. అయినా తల్లి ఊరుకోదు. తన శక్తి మేరా బిడ్డను మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నిస్తుంది. తన చేతులు అడ్డుపెట్టి పూర్తిగా రెక్కలు రాని ఆ బిడ్డ గాయపడకూడదని, క్రూరమైన ప్రపంచం బారిన పడకూడదని తపిస్తుంది. ఆమె ఒంటరి పోరాటంలో ప్రపంచం నుండి, బిడ్డల నుండి కూడా ఎన్నో అవమానాలు పొందుతుంది. ప్రాణాలు ఉన్నంతవరకు బిడ్డ భవిష్యత్తు కోసం పడరాని పాట్లు పడుతుంది. కాని ఆ తల్లి తపన బిడ్డలకు అర్థం కాదు. అర్థం అయినప్పటికి జీవితం అయిపోతుంది.
మెర్లె హగ్గార్డ్ అలా ఓ తల్లి మనసు విరిచేసిన కొడుకు. తండ్రి చనిపోయాక ఒంటరిగా తల్లి తమ కుటుంబం కోసం రాత్రి పగలు చాకిరి చేస్తూ బిడ్డల భవిష్యత్తుకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తుంటే రకరకాల అలవాట్లతో బలహీనతలను బలం అనుకుని, బంధనాలను స్వేచ్ఛ అనుకుని చెడు దారిలో జీవితాన్ని గడిపాడు హగ్గార్డ్. దొంగతనాలకు అలవాటుపడి ఎన్నో సార్లు జునివైల్ హోమ్‌లో చేరాడు. తరువాత జైలుకి వెళ్ళి వచ్చే అతిథిగా మారాడు. అయితే హగ్గార్డ్కు సంగీతంపై ఎంతో ప్రేమ ఉండేది. స్వయంగా గిటార్ నేర్చుకుని వాయించేవాడు. మధ్య మధ్యలో దొంగతనాలు, చెడు స్నేహాలు, జైలు జీవితం. 1960లో సాన్ క్వాంటన్ జైలు నుండి రిలీజ్ అయ్యాక సంగీతంపై దృష్టి పెట్టడం మొదలెట్టాడు హగ్గార్డ్. జైలులో మరణ శిక్ష పొందిన సాటి ఖైదీలతో గడిపిన అనుభవం అతని ఆలోచనలలో మార్పు తీసుకువచ్చింది. తరువాత క్రమంగా కంట్రీ మ్యూజిక్‌లో గొప్ప గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1972 లో ప్రజలు మెచ్చుకునే గాయకుడిగా అందరి మన్ననలు పొందిన తరువాత అప్పటి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ హగ్గార్డ్కు క్షమాబిక్ష ప్రసాదించి అతనిపై ఉన్న కేసులను కొట్టేయించారు.
1968లో గాయకుడిగా పేరు పొందిన తరువాత తన తల్లిని తానెంత మానసిక క్షోభకు గురి చేసాడో తలచుకుంటూ మెర్లే హగ్గార్డ్ ఓ పాట రాసి, సంగీతాన్ని సమకూర్చి పాడి రిలీజ్ చేసారు. ఇది ఆయన సొంత కథ కాదని, ఈ పాటలో చెప్పినట్లు జీవిత ఖైదు అతనికి ఎప్పుడూ విధించలేదని కొందరు అంటారు. కాని పాటంతా హగ్గార్డ్ జీవితాన్నే పోలి ఉంటుంది. తాను ఎంత కళ్లు మూసుకుపోయి ప్రవర్తించింది, తల్లి తనను ఎంత మార్చాలని ప్రయత్నించింది ఈ పాటలో చెప్పుకొస్తాడు హగ్గార్డ్. ఈ పాట వింటుంటే మనకూ కన్నీళ్ళు ఆగవు. తల్లి మనసుకు అయిన గాయం రక్తమోడుతున్న హృదయంతో ఓ తల్లి దీనవదనం మనకూ కనిపించి హృదయం బరువెక్కుతుంది. ఈ పాటను ఆ తరువాత కూడా ఎందరో గాయకులు తమ గాత్రంతో పాడారు. కొందరు ఈ పాటను తమ పాటల్లో ప్రస్తావించారు. అమెరికా లోని నేషనల్ రికార్డింగ్ రిజిస్ట్రీ దీన్ని ఉత్తమ పాటగా ఎంచి భద్రపరిచింది. అంతగా ప్రజలు మెచ్చిన ఈ పాట దారి తప్పిన కొడుకుల పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. అలాగే బిడ్డల కోసం అల్లాడిన ప్రతి తల్లిని గుర్తుకు తీసుకు వస్తుంది.
The first thing I remember knowin’ Was a lonesome whistle blowin’ And a young un’s dream of growin’ up to ride On a freight train leavin’ town Not knowin’ where I’m bound And no one could change my mind but Mama tried
(నాకు ఊహ తెలిసాక గుర్తున్న మొదటి విషయం, నిర్జన ప్రాంతంలో ఓ విజిల్ మోగుతుంటే, నగరానికి వెళుతున్న ఆ గూడ్సు రైలు ఎక్కి ఏదో సాధించాలనే ఓ పెద్ద కలతో ఎక్కడికో తెలియని చోటుకు యువకుడిగా నేను చేసిన ప్రయాణం. ఎవరూ నా నిర్ణయాన్ని మార్చగల స్థితిలో నేను అప్పుడు లేను అయినా అమ్మ మాత్రం ప్రయత్నించింది.)
జీవితంలో ఏదో సాధించాలని, తానేదన్నా చేయగలనని అనుకుంటూ ఇంటిని వదిలిపెట్టి నగరం వెళ్ళే రైలు ఎక్కేసాడు ఆ యువకుడు. అతనికి ఇప్పుడు ఆ రోజు గుర్తుకొస్తుంది. ఎవరినీ లక్ష్య పెట్టక అతను చేసిన ఆ ప్రయాణాన్ని తల్లి ఆపాలని ఎంతో ప్రయత్నించింది. కాని అతను ఆమెను పట్టించుకోలేదు.
One and only rebel child From a family, meek and mild My Mama seemed to know what lay in store
(సౌమ్యమైన నెమ్మదైన కుటుంబానికి చెందిన ఏకైక బిడ్డను నేను కాని అందరిపై తిరగబడ్డ సంతానాన్ని. అమ్మకు అప్పటికే నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసులా ఉంది)
గౌరవంగా, నెమ్మదితనంటో ఎవరు జోలికి వెళ్ళకుండా జీవించే కుటుంబంలో అతను జన్మించాడు. కాని ఆ యువకుడు మాత్రం చిన్నతనంలోనే అందరిపై, అన్నిటిపై తిరగబడడం నేర్చుకున్నాడు. బిడ్డను గమనిస్తున్న ఆ తల్లికి అతని భవిష్యత్తుపై అనుమానాలే ఉన్నాయి. అందుకే బిడ్డ నగరానికి వెళ్లిపోతుంటే వద్దని ఆమె అతన్ని ఆపాలని ప్రయత్నించింది.
Despite all my Sunday learnin’ Towards the bad, I kept on turnin’ ‘Til Mama couldn’t hold me anymore
(నా ఆదివారపు పాఠాలు క్రమంగా జరుగుతున్నప్పటికీ, అమ్మ నన్ను అందుకోలేనంత వేగంగా నేను చెడు వైపే ప్రయాణం చేసాను)
పాపం ఆ పిచ్చి తల్లి మతం, దాని ద్వారా వచ్చే క్రమశిక్షణ కోసం బిడ్డని సండే స్కూల్ అంటే బైబిల్ క్లాసులకు కూడా పంపింది. బిడ్డ నీతి నియమాలను అలవర్చుకోవాలని తాపత్రాయపడింది. అంటే తనకున్న పరిధిలో బిడ్డ బాగు కోసం చేయవలసినదంతా చేసింది. అయినా వాటన్నిటి నడుమ కూడా ఆ కొడుకు చెడు మార్గాన్నే ఎన్నుకుని అటే ప్రయాణిస్తూ వెళ్లాడు.
And I turned twenty-one in prison doin’ life without parole No one could steer me right but Mama tried, Mama tried Mama tried to raise me better, but her pleading, I denied That leaves only me to blame ‘cause Mama tried
(ఇక ఇరవై ఒక సంవత్సరాలకు వచ్చేసరికే నేను పెరోల్ లేని జైలు జీవితం గడుపుతున్నాను. నాకు సరైన మార్గం చూపించడం ఎవరి వల్లా కాలేదు మరి. కాని అమ్మ ప్రయత్నించింది. ఎంతో ప్రయత్నించింది. నన్ను మంచిగా పెంచాలని అమ్మ ప్రయత్నించింది. కాని ఆమె ఎంత బ్రతిమాలినా నేను ఆమె చెప్పిన మంచిని ఒప్పుకోలేదు. అందుకే నా ఈ స్థితికి నాకు నేనే కారణం, ఎందుకంటే అమ్మ.. ప్రయత్నించింది)
ఈ చరణం ఎంతో బాధను మోసుకొస్తుంది. తల్లి చెప్పినట్లు నడుచుకోక చెడు స్నేహాల బాట పట్టిన ఆ యువకుడు ఇరవై ఒక్క సంవత్సరాలకే జైలుకు చేరాడు. ఎలాంటి నేరం చేసాడంటే అతనికి పెరోల్ కూడా వచ్చే సూచనలు లేవు. అతన్ని మార్చగల శక్తి ఎవరికీ లేకపోయింది. ఎవరి మాట కూడా అతను వినిపించుకునే స్థితిలో లేడు. కాని అతని తల్లి ప్రయత్నిస్తూనే ఉంది. ఆమెది ఏ తప్పూ లేదు. ఆమె తన శక్తి మేరా బిడ్డను మంచి మార్గంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించింది. కాని ఆ బిడ్డ ఆమె మాటలను కొట్టిపడేశాడు. ఆమె ఎంత మొత్తుకున్న, ఏడ్చినా, బతిమాలినా ఆమె మాటలు వినిపించుకోలేదు. అందుకే అతని ప్రస్తుత స్థితికి అతనే కారణం, తల్లి ప్రయత్నించింది. ఎంతో ప్రయత్నించింది. ఆ బిడ్డ అలా మారడంలో ఆమె తప్పు ఏం లేదు. ఆమె చేయగలిగినంతా చేసింది.
Dear old Daddy, rest his soul Left my Mom a heavy load She tried so very hard to fill his shoes Workin’ hours without rest Wanted me to have the best She tried to raise me right but I refused
(ప్రియమైన మా నాన్న, ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక, మా అమ్మకు ఎంతో బరువును మిగిల్చిపోయాడు. అమ్మ అతని బాటలో నడవాలని, అతనిలా కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చాలని చాలా కష్టపడింది. విశ్రాంతి లేకుండా ఎన్నో గంటలు పని చేసింది. నాకు అన్నీ ఉత్తమమైన సౌకర్యాలు సమకూర్చాలని కోరుకుంది. నన్ను సరైన పద్ధతిలో పెంచాలని అనుకుంది కాని నేను ఆమె చూపిన మంచిని నిరాకరించాను)
కుటుంబాన్ని ఎంతో ప్రేమించే తండ్రి చనిపోయాడు. తల్లి ఒంటరిదయింది. అయినా తన దుఃఖం మరచి తండ్రి బాధ్యతలనూ తన నెత్తిన వేసుకుంది. ఇద్దరి బాధ్యతలను నిర్వర్తించడానికి గొడ్డులా చాకిరి చేసింది. విశ్రాంతి మరచిపోయింది. బిడ్డకు అన్నీ సరిగ్గా సమకూర్చాలని తాపత్రయపడింది. బిడ్డను మంచి మార్గంలో పెంచాలని చేయవలసినవన్నీ చేసింది, కాని ఆ బిడ్డ ఆమె కష్టాన్ని చూడలేదు. ఆమె మాటలను వినలేదు, ఆమె ప్రేమను అర్థం చేసుకోలేదు. ఆమె తాపత్రయాన్ని లెక్కచేయలేదు. ఆమె చెప్పినవేవీ చెవి కెక్కించుకోలేదు. అత్యంత కఠినంగా ఆమెతో ప్రవర్తించాడు. ఆమెను వదిలించుకుని ప్రపంచంలోకి ఎగిరిపోయాడు.
(ఇరవై ఒక సంవత్సరాలకు వచ్చేసరికే నేను పెరోల్ లేని జైలు జీవితం గడుపుతున్నాను.. నాకు సరైన మార్గం చూపించడం ఎవరికీ సాధ్యపడలేదు. కాని మా అమ్మ ప్రయత్నించి ఎంతగానో ప్రయత్నించింది. అమ్మ నన్ను చక్కగా పెంచాలని తపించింది. కాని ఆమె ఎంత ప్రాధేయపడినా నేను ఆమె చెప్పినవేవీ ఒప్పుకోలేదు. అందుకే అంటున్నాను నా ఈ స్థితికి నేను మాత్రమే కారణం, ఎందుకంటే అమ్మ ఎంతో ప్రయత్నించింది)
ఇష్టం వచ్చినట్లు జీవించి నేరస్తుడిలా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ కొడుకు తన పతానానికి తానే కారణం అని, తల్లి ప్రయత్నాలేవీ అర్థం చేసుకోక తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నానని ఒప్పుకుంటున్నాడు. అతని గొంతులో పశ్చాత్తాపం ద్వనిస్తుంది. దానితో పాటు అమ్మ తన బాగు కోసం చేసిన ప్రయత్నాలన్నీ గుర్తుకొస్తున్నాయి. తన తల్లి తన కోసం పడిన వేదన అతనికిప్పుడు అర్థం అవుతుంది. అందుకే తన తల్లిది ఏ తప్పు లేదని, తన కోసం ఆమె ఎంతో కష్టపడిందని. తన స్థితికి తానే కారణం అని అమ్మ ప్రయత్నించిందని తన బాగు కోసం ఎంతో పోరాడిందని చెప్తున్నాడు.
ఈ పాటలో గాయకుడు విషాదాన్ని పలికించిన తీరు బావుంటుంది. అమ్మ ప్రయత్నించింది (మామా ట్రైడ్) అని గానం చేసిన ప్రతి ఒక్క సారి అతని గొంతులో పశ్చాత్తాపం, తల్లిని అర్థం చేసుకున్న బాధ ద్వనిస్తాయి.
కంట్రీ పాటల్లో తల్లిని ప్రస్తావించే గీతాలు ఇంకొన్ని ఉన్నాయి. కాని ఈ పాట వాటన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. భాషా, ప్రాంతం, అన్నీ మరచి తల్లి ప్రేమలోని ఆ అసహాయతను, బిడ్డలపై తల్లుల కున్న అవాజ్యమైన ప్రేమను గుర్తు చేస్తుంది. ఈ పాటకు వోకల్స్ అందించింది ‘ది స్ట్రేంజర్స్’ అనే బాండ్. మెర్లె హగ్గార్డ్ పాటలన్నిటికి బాక్ గ్రౌండ్ గా ఈ బాండ్ పని చేసింది.
ఈ పాటని యూట్యూబ్‌లో ఈ లింక్‌లో వినవచ్చు.
(మళ్ళీ కలుద్దాం)
You must be logged in to post a comment.
అదృష్టరేఖ
నీలమత పురాణం – 41
జంతువును మనిషిగా మార్చే నిరుపయోగ ప్రయత్నం – జీనీ కథ
తప్పిదం
మానస సంచరరే -14: తోకలేని పిట్ట తోడుగా…
33. సంభాషణం – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ
ముద్రారాక్షసమ్ – షష్ఠాఙ్కః – 2
బ్యాంకింగ్ రంగం – నియమావళి
స్నేహస్పర్శ
ఎగిరే గాలిపటం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®