[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]


మాటే మంత్రమూ
చాలా ఏళ్లకిందట యువభారతి వాళ్లు ఏర్పాటు చేసిన సభలో దివాకర్ల వెంకటావధాని గారు మాట్లాడుతూ ఏమన్నారంటే “..ఎంతో కాలం నుంచి వరూధునిని మోహించిన గంధర్వుడు ఒకడు, ప్రవరుని రూపంలో వచ్చి ఆమెను ప్రసన్నురాలిని చేసుకుని ఆమెతో సంగమిస్తాడు. అయితే ఎవరు మారు వేషంలో వచ్చినా సంభోగ సమయంలో అసలు రూపం కనిపిస్తుందిట. అందుకని ఆ గంధర్వుడు ఆమెను ఆ సమయంలో కళ్లు మూసుకోమనే అవసరం లేకుండా, ఆ సమయంలో ఆ పారవశ్యంలో ఆమె కళ్ళు మూసుకున్నదట..” ఇలా సాగిపోతుంది ఆయన ప్రసంగం. సభాధ్యక్షుల వారు అడ్డు తగిలి “ఈ విషయంలో అవధాని గారికి విశేషమైన అనుభవం ఉన్నట్లుంది” అనగానే, “నాకీ విషయాలు అంతగా తెలియవండీ. ఎందుకంటే నేను గంధర్వుడిని కాను. మీ వంటి గ్రంథసాంగులు రాసినవే చదివి చెబుతున్నాను..” అనగానే సభ అంతా నవ్వులతో నిండిపోయింది.
సభలో ప్రసంగించటం ఒక కళ. ఇది అందరికీ అంత తేలికగా అబ్బే విషయం కాదు. సందర్భానుసారంగా కొంచెం చమత్కారం జోడిస్తే ఆ ప్రసంగం రక్తి కడుతుంది.
కొందరు మా రాంభట్ల కృష్ణమూర్తి గారిలాంటివారు ఏ విషయం మీదనైనా ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడగలరు. అందులోనూ ఇతరుల నొప్పింపకుండా, అవసరమైతే తన మీద తనే జోక్ వేసుకుని సభను రంజింప చేయగల నేర్పు ఆయన వలె అందరికీ ఉండదు. అదే మరి బూదరాజు రాధాకృష్ణగారు అయిదు నిముషాలు మాట్లాడితే, పదిమంది మీద సూటి బాణాలు వేయగల నేర్పరి. ఒకసారి బూదరాజుగారికీ, జి.వి. సుబ్రహ్మణ్యం గారికీ పత్రికా ముఖంగా వాదోపవాదాలు జరిగాయి. ఈయన ఆయన్ని బూసు అంటే, ఆయన ఈయన్ని బూరా అని అనుకునే దాకా వెళ్లారు. అలాగే ఒకసారి శ్రీశ్రీ గారికీ, దాశరథిగారికి ఇలాంటి బహిరంగ వివాదం ఏర్పడింది. “ఇద్దరు భార్యలతో నువ్వెట్లారా స్వామ్యవాదివి?” అని ఈయన అంటే “పి.ఎ.పి.లో నా పాట సగం గతికావు, ఇంకా ఎందుకురా బతికావు” అని ఆయన విసుర్లు విసిరాడు.
దూషణ భూషణ తిరస్కారముల జోలికి పోకుండా అందర్ని ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక ఆర్ట్. ఉపన్యాసకులుగా పేరు పొందినవారు కొందరుంటారు. ఎక్కడ ఏ సభ జరిగినా వారే ఆ సభను నిండుగా కనువిందుగా అలంకరిస్తుంటారు. ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్ భాస్కరరావుగారని ఉండేవారు, ఎందుకో తెలియదుగానీ, ఆ రోజుల్లో అందరూ ఆయన్ని వక్తగా పిలిచేవారు. గడగడగడగడ వడగళ్ల వాన కురిసినట్లు మాట్లాడే వాడు. నిముషానికోసారి ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు, చెప్పులోని రాయి, అంట వేమన పద్యాలు అప్పజెప్పేవాడు.
ఉపన్యాసకుల్లో మలబద్ధకం గలవారు కొందరుంటారు. ఎంతోసేపు మాట్లాడినా, విషయం ఏమీ ఉండదు. “నిర్వాహకులు నన్ను కలవటం జరిగింది, సభకు రమ్మని పిలవటం జరిగింది, నేను రావటం జరిగింది..” ఈ సోదిని ‘కాన్స్టిపేషన్ ఆఫ్ స్పీచ్’ అంటారు. మరి కొందరిది ‘డయేరియా ఆఫ్ స్పీచ్’. అంటే ఒక వాక్యం పూర్తి గాక ముందే ఇంకా వాక్యంలోకి, ఒక విషయం పూర్తి గాక ముందే మరొక విషయంలోకి అన్నమాటలు. ఉదాహరణకి ‘సంఘసంస్కర్తల విషయాని కొస్తే కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఆ రోజుల్లోనే విధవా వివాహలు జరిపించి, అసలు అంతకంటే రాజారామ్ మోహన్ రావుగారు సతీసహ గమనాలను ఆపి, అంతకు ముందే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మరి దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గారు..” ఇలాగా ఆ వాక్యం ఎప్పటికీ పూర్తి కాదు.
ఇంకాయన ఉంటాడు. ఆయన స్పీడ్ బ్రేకర్. మీరు ఒక విషయం చెబుతుంటే అడ్డుపడి ఏదో చెబుతాడు. “సుబ్బారావు అల్లుడు..” అని చెప్పబోతుండగానే “విపరీతంగా పగలు కూడా తాగుతాడు. ఒట్టి బూజర్..” అంటాడు. “సరే, నువ్వు చెప్పు” అంటే, “లేదులే నువ్వే చెప్పు ’అంటాడు. “ఉద్యోగం మానేశాడు” అని మీరు అంటే, “అతనెక్కడా గట్టిగా రెండు నెలలు కూడా పని చేయడు” అని అడ్డు తగులుతాడు స్పీడ్ బ్రేకర్.
ఇంకొక ఆమె ఉంది. ఆమె ఏది మాట్లాడినా సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే ఉంటుంది. భర్త ఆఫీసు నుంచి రాగానే ఆయనతో చెబుతుంది “ఏమండీ, అతను వచ్చాడు. వాళ్లకు ఇస్తామని చెప్పారట గదా, పట్టుకెళ్లాడు. మీతో చెప్పమన్నాడు, మళ్లీ ఎప్పుడు ఇస్తారని ఆడిగాను. వాళ్ల అన్నయ్యగారింట్లో ఫంక్షన్ ఉందట. అది అయిపోగానే తెచ్చి ఇస్తానన్నాడు..” ఇలా సాగిపోతుంది. వచ్చిన వాడు ఎవరు? పట్టుకెళ్లినది ఏమిటి? ఏం ఫంక్షన్ వంటి సప్లిమెంటరీ క్వశ్చన్స్ వేస్తే గానీ విషయం అర్థం కాదు.
ఇంకొక ఇల్లాలు ఉంటుంది. ఆమె ఎక్కడో మొదలుపెట్టి, ఎక్కడెక్కడికి వెళ్లి, ఎన్నో విషయాలను పరామర్శిస్తుంది. “ఇంట్లో కరెంట్ లేదా?” అని అడిగితే- “పొద్దున మీటర్ రీడింగ్ చూసేవాడు వచ్చాడు. మీటర్ స్పీడ్‌గా తిరుగుతోంది, స్లో చెయ్యమని అడిగాను. అతని భార్యకు జబ్బు చేసి౦దట. హాస్పటల్ బిల్ లక్ష రూపాయలు అయిందిట. రీయంబర్స్మెంటుకు పెట్టుకున్నాట్ట. ఆ బిల్లు డబ్బులు వచ్చే లోపలే మళ్లీ హాస్పటల్లో చేరిందిట..” ఇలా ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్లి రావటాన్ని ‘ఎరౌండ్ ది వరల్డ్ స్పీచ్’ అంటారు.
కొంత మంది ఏం మాట్లాడుతుంటారో, దాని అర్థం ఏమిటో వాళ్లకే తెలియదు. “వాడు, నా కన్నా సన్నాసి వెధవలా ఉన్నాడు. ఇంట్లో ఇచ్చెయ్యరా అంటే, వాళ్ల ఇంట్లో ఇచ్చేశాడు!” అంటాడు. ఇంకొకడు “ఆవిడకేంటి, రెండు సంపాదనలు. ఇటు మొగుడు గవర్నమెంటు ఉద్యోగం, అటు మొగుడు రచయిత..” అంటాడు. “అంటే ఆమెకు ఇద్దరు మొగుళ్ళా?” అని అడిగితే “లేదు. మొగుడు ఒకడేలే. ‘ అంటాడు.
కొందరికి కొన్ని ఊతపదాలు ఉంటాయి. “మామూలుగా సికింద్రాబాద్ స్టేషన్‌కి వెళ్తామని మామూలుగా బస్సు ఎక్కాను. మామూలుగా చిక్కడపల్లి కాకుండా, మామూలుగా చార్మినార్ వెళ్తోంది. మామూలుగా రాంగ్ నెంబర్ బస్సు ఎక్కాను” అంటుంటారు.
ఒక మేధావి ఉంటాడు ప్రపంచంలో ప్రతివాళ్లనూ తీవ్రంగా విమర్శిస్తుంటాడు. “అసలు దేశం ఇలా తయారవటానికి నెహ్రు కారణం. మనకి డెమొక్రసీ అనవసరం సరే, హిట్లర్ లాంటి వాడు కావాలి. నాకు పెళ్లాం పిల్లలు ఉన్నారని గానీ, లేకపోతే వెళ్లి పొడిచేసి వెళ్లి జైల్లో కూర్చునేవాడ్ని” అంటాడు బస్ స్టాప్‌లో ఆవేశంగా. “నీ పెళ్లాం పిల్లల్ని నేను చూసుకుంటా కానీ, నువ్వెళ్లి పొడిచెయ్” అని ఇంకొకడు అందుకుంటాడు.
ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం – అన్నది తెల్సుకోవాలి. కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు గొప్ప పండితుడు, ఆయన ఏది మాట్లాడినా కవిత్వంలాగానే ఉంటుంది. ఒక రోజు ఇంటి ముందుకొచ్చిన బిచ్చగత్తెతో అన్నారు.
“ఓ బిచ్చంబున కొచ్చిన నెచ్చెలీ, నీ కిచ్చట బిచ్చంబిడు వారెవరూ గానంగ రారు గాన, వచ్చిందారి బొమ్ము” అని.
ఆ బిచ్చగత్తె “అయ్యో, బిచ్చమడిగితే తిడతారేందయ్యా?” అంది.
ఆయన భార్య తోను అదే విధంగా మాట్లాడేవారు – “గృహిణీ, మార్జాలంబొకటి క్షీరంబులం గ్రోలుచున్నది. వేవేగం వచ్చి వైదొలంగవేయుము..” అని.
కొందరు వచ్చీరాని ఇంగ్లీషులోని తమ ప్రతాపం చూపిస్తారు. “సుబ్బారావుగారు వేదిక మీదకు రావాలి” అనగానే, “అండర్ కమింగ్ సర్” అంటాడు ఇంకెవడో. మేడ మీద కూర్చున్న ఆఫీసర్, “కింద ఎవరో పిలుస్తున్నారు, చూడు” అని పనిమనిషిలో చెబితే ఆమె ఇంగ్లీషులో “వన్ మిస్ అండర్ స్టాండింగ్ సర్” అంటుంది. “ఏంటే?” అంటే “ఒక అమ్మాయి కింద నిలబడి ఉంది సర్” అని తెలుగు అర్థం చెబుతుంది.
“మొన్న మేం కాశీ వెళ్లి మా ఆస్తికలు గంగతో కలిపేసి వచ్చామండీ” అంటాడు ఒకాయన. “తిరుపతి వెంకటేశ్వరసామి దర్శనం ఇచ్చేసి వచ్చామండీ” అంటాడు మరొక మహానుభావుడు. ఒకావిడ “మీకు నా పాదాభివందనాలు” అంటుంది. ఆ వందనాలు ఎవరికి పాదాలకో తెలియదు.
ఒక రచయితని ఒక అభిమాని అడిగాడు. “ఇప్పుడు ఏమన్నా రాస్తున్నారాండీ?” అని. “ఆఁ, ఆఁ, తలకు నూనె రాస్తున్నా” అంటాడు ఆ రచయిత. “అది కాకుండా ఇంకేమన్నా రాస్తున్నారాండీ?” అని మళ్లీ అడుగుతాడు అభిమాని. “తమలపాకులకు సున్నం రాస్తున్నా” అంటాడు రచయిత. “అది కాకుండా, ఇంకేమన్నా రాస్తున్నారాండీ?”
అని అడుగుతాడు అభిమాని.
“దేశభాషలందు తెలుగు లెస్సు” అన్నాడు ఒకాయన
“లెస్సు కాదండీ, ‘లెస్స, లెస్స’ అనాలి’ అన్నాడు ఇంకాయన.
“ఆఁ, కొమ్ములో ఏముంది లెండి?” అన్నాడు మొదటి ఆయన.
“అమ్మమ్మ, అలా అనకండి. కొమ్ములు రావటం లోనే ఉన్నదంతా!” అన్నాడు రెండో ఆయన.
ఒక రచయిత్ర కొంచెం సన్నబడింది. ఇంకో రచయిత “చక్కనమ్మ చిక్కినా అందమే” అన్నాడు. “నేను ఎవరికీ చిక్కను. ఎంతకీ అంతు చిక్కను” అన్నది మాటకారి అయిన రచయిత్రి.
“ఐన్‌స్టీన్‌ని చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు” అని ఒకాయన అంటే, “అయితే నేను ఆయన కన్నా గొప్పవాడిని. నన్ను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు” అన్నాడో కాబోయే శాస్త్రవేత్త.
ఆమె భర్తకు అన్ని చెడు అలవాట్లే ఉన్నాయి. “నా భర్తను మార్చాలని ఆరునెలల నుంచి ప్రయత్నిస్తున్నాను” అని ఆమె అంటే, “మేము కూడా కొత్త భర్తల కోసమే వెతుకుతున్నాం’ అన్నారు కొంతమంది సభ్యురాండ్రు.
అన్నది భార్య
“నీ తోలు ముహం నాకు చూపించకు” అన్నాడు భర్త.
“నీదీ తోలు ముహమే.. వెళ్ళి అద్దంలో చూసుకో” అన్నది భార్య.
ఒక మాస్టారు పిల్లలకు యోగా పాఠాలు నేర్పుతున్నారు. ఇంతలో హెడ్ మాస్టారు వచ్చి “ఏం చేస్తున్నారు?” అని అడిగారు. “శ్వాస పీలుస్తున్నారు సర్” అన్నాడు మాస్టర్. “అయితే ఓకే” అంటూ ఆయన వెళ్లిపోయాడు.
“నా మీద కవిత్వం చెప్పవా?” అన్నది ప్రియురాలు.
“ఈగ వాలిన కందునీ ఇగురుబోడి” అన్నాడు కవి. “బోడీ, గీడీ ఉన్నావంటే మర్యాదగా ఉండదు. నువ్వే బోడి వెధవ్వి” అంటూ లేచి వెళ్లిపోయిందా ప్రేయసి.
“నేను అందరికన్నా ఎక్కువ బరువు ఉన్నా, ప్రతివాళ్లూ నన్ను తేలికగా తీసిపారేస్తారు” అన్నాడు సుబ్బారావు.
ఇలా ఎన్ని అయినా చెప్పవచ్చు.
మాట్లాడటం అనేది ఒక కళ. మాటే మంత్రం. మాటే మన చుట్టూ ఉన్న వాళ్లని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కొండొకచో బద్ధ శతృవులను చేస్తుంది.
తస్మాత్ జాగ్రత్త.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.