[భారతదేశపు విశిష్ట సంస్కృతిని వివరిస్తూ శరచ్చంద్రిక గారు అందిస్తున్న వ్యాసం.]
ఈ వ్యాసం వ్రాయడానికి రెండు కారణాలు:
ఒకటి:
‘India is like European Union. Just Like United States of America, what’s your thought on making India as a true United States of India’ → మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా వచ్చినపుడు NRI ఒకరు, తమిళం వారు ఒకరు భాజపా వారు తమపై హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా అర్థం వచ్చేట్లు ప్రస్తావించి పైన చెప్పిన ప్రశ్న అడిగారు.
రెండు:
ఇటీవలే భారతదేశంలో నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం జరిగింది. అందులో భాగంగా సింగోల్ రాజదండాన్ని భారత ప్రధాని మోదీ గారు ప్రతిష్ఠాపన చేసారు. దాని మీద చర్చలు, కథనాలు సోషల్ మీడియాలో ఎన్నో చూసాము. ‘ఇదంతా అబద్ధం, అసలు సన్యాసులకి పార్లమెంట్లో పనేమిటి’ అంటూ ‘తమిళనాడులో గెలవడానికి భాజపా ఇదొక రాజకీయం చేస్తున్నద’నీ అన్నవారు ఉన్నారు.
నా అభిప్రాయం:
ఆర్యులు, ద్రవిడులు అంటూ, ఉత్తర భారతం దక్షిణ భారతం అంటూ భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ మాట్లాడేవారికి, భారతదేశం సంస్కృతి అనేది ఏ మాత్రం అర్థం కాలేదు అని స్పష్టమవుతుంది అంటాను నేను.
ప్రపంచంలో భారతదేశం అనేది ఒక Unique సంస్కృతి. యూరోపియాన్ నమూనాలో భారతీయ సంస్కృతిని ఇరికించలేము. భారత సుప్రీమ్ కోర్టు న్యాయవాది సాయిదీపక్ గారు చెప్పినట్టు, అసలు భారతదేశాన్ని భాష, ప్రాంతం అనే దృష్టి కోణం నుంచీ చూడటం చాలా తప్పు.
అసలు భారతీయత అంటే ఏంటి?
భారతదేశం గురించి చెప్పేటప్పుడు ‘భిన్నత్వం లో ఏకత్వం’ అనే మాట చాలా తరచుగా వాడేమాట. భారతేదేశం అడుగుగడుగునా కనిపించేదంతా భిన్నత్వమే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా కనిపిస్తుంది. భాషలు వేరు. అంతే కాదు. కట్టు, బొట్టు వేరుగా ఉంటాయి. కానీ తరచి చూస్తే ఏకత్వం కనిపిస్తుంది. అదే భారతీయత అంటాను నేను.
నేను ఇదివరకే నా గురించి చెప్పాను కదా. చాలా సామాన్యమైన గృహిణిని. ఇటువంటి విషయాలు నేను నా రోజూ వారి జీవితంలో విషయాలని గమనించి ఒక దానితో ఒకటి లంకె వేసుకుంటూ, చుక్కలు కలుపుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. నాకు అర్థమయిన ఏకత్వం గురించిన విషయాలు కొన్ని ప్రస్తావిస్తాను. ఏవైనా తప్పులు ఉన్నాయి అంటే తప్పక సరిదిద్దుకుంటాను.
ముక్తి/మోక్షం
సద్గురు ఒక ప్రసంగంలో చెప్పారు. కన్యాకుమారి నుండీ కాశ్మీరం వరకూ ప్రజలు ఒకే మాట అంటూ ఉంటారుట. ఆ మాట ఏమిటి అంటే ‘ముక్తి’. అదే మోక్షం అని కూడా అనవచ్చు. చాగంటి గారి మాటల్లో చెప్పాలి అంటే ‘ఎవరైతే పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం నమ్ముతారో వారు భారతీయులు’.
రామాయణం
భారతదేశం ఉత్తర భాగంలో ఎవరినయినా పలకరించేటపుడు ‘రామ్ రామ్ భయ్యా’ అంటారు. ఏదైనా దుఃఖానికి లోనైతే ‘హే రామ్’ అంటారు. చాలా సినిమాలలో చూస్తాము కూడా. అదే దక్షిణభారతం తీసుకుంటే ‘అరే రామ’ అనేది తెలుగులో ఒక ఊతపదం. ఉత్తరంలో ‘రాంసింగ్’ ఉంటే, దక్షిణంలో ‘రామన్’ ఉంటాడు. రాముడు అయోధ్యలో పుట్టినా రాముడు నడయాడిన భారత భూమంతా మనకి ఓ పుణ్యక్షేత్రం. ఉత్తరంలో ఉన్న అయోధ్యలో రాముడు ఎంత ముఖ్యుడో, దక్షిణాదిన శ్రీలంకలో కూడా రాముడు అంతే ముఖ్యుడు. ‘Ramayana Tours’ అంటూ శ్రీలంకలో అశోక వనం, సీతాదేవి గుడి, రావణాసురుడి కోట అంటూ రామాయణంతో మనం connect అయ్యేలా మనకి ఎన్నో ప్రదేశాలు చూపిస్తారు. సీతాదేవి పుట్టిల్లయిన మిథిలానగరంలో (అంటే ఈనాటి నేపాల్ దేశంలో) ఈ రోజుకి కూడా ఆవిడ పుట్టినరోజుని వేడుకగా చేసుకుంటారు. ఉత్తరంలో తులసీదాసు ఉంటే దక్షిణంలో రామదాసు ఉన్నాడు.
మహాభారతం
మహాభారతంలో చెప్పిన ప్రదేశాలన్నీ భారతదేశం నలుమూలల ఉన్నాయి. హస్తిన అంటే ఈ రోజు ఢిల్లీ. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకి ఇచ్చిన సమాధానంగా వచ్చిన ‘భగవద్గీత’ ఆవిర్భవించిన ప్రదేశం కురుక్షేత్రం ఢిల్లీ పక్కనే ఉన్నది. కర్ణుడికి దుర్యోధనుడు ఇచ్చిన అంగరాజ్యం అంటే ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అంటారు. అర్జునుడి కొడుకైన బభృవాహనుడు ఈశాన్య రాష్ట్రమైన మణిపూరుకి చెందిన వాడట. నేటి ఆఫ్గనిస్తాన్లో కాంధహార్ పేరు మూలం గాంధార దేశం. కేరళలో పంచపాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క గుడి కట్టారు అంటారు. దక్షిణంలో ఇంకో ప్రదేశం ‘మహాబలిపురం’. ఎక్కడో ఉత్తర భారతంలో ఉన్న రాజులయిన పంచపాండవులకి దక్షిణాన ఈ రథాలు చూస్తాము.
అష్టాదశ శక్తి పీఠాలు.
‘The Kerala Story’ లో ఒకమ్మాయి చెప్పినట్లు, అమ్మవారిని తీసుకుని శివుడు యావద్భారతం ప్రయాణిస్తాడు. లంకాయాం శాంకరీదేవీ నుంచీ కాశ్మీరేతు సరస్వతీ వరకూ అమ్మవారి రూపాలు కొలుస్తాము. అమ్మవారి రూపాలు ఎన్నో అయి ఉండవచ్చు. పూజించేది మాత్రం అమ్మవారినే. ఆంగ్లం చెప్పాలి అంటే Feminine worship.
“ముఖం బిందుం కృత్వా కుచయుగ మధస్థస్యతథదో అనే సౌందర్యలహరి శ్లోకం లో ఆది శంకరులు అమ్మ శరీరం లోని ప్రతీ అణువు ప్రకృతియే అనీ.. అదే బీజాక్షర స్వరూపమనీ, ఆ బీజ సంపదంతటికీ ప్రథమం మూలం ఓం కారమనీ చాలా నిగూఢార్ధాన్ని చాలా కొద్ది మంది తత్త్వవేత్తలకు మాత్రమే అర్థమయ్యే రీతిలో రహస్యంగా ఉంచారు. ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే అమ్మ ముఖ మండలం అ కారాంతర్గత స్వరూపం, అదే దృశాద్రాఘీయస్యా అయిన కాశీ విశాలాక్షి స్థానం అనీ, అలాగే మధ్య కూటమి కాంచీ పురవాసిని అయిన కామాక్షిదనీ, కామరాజ కూటమి సుందరేశ్వర గతమైన (పరమైన) మధుర మీనాక్షీ స్థానమనీ జాగ్రత్తగా ఆయా దేవాలయాలు, వాటి నిర్మాణ శైలి, అక్కడ జరిగే కైంకర్య విధానాలనూ పరిశీలిస్తే అవగతమవుతుంది.” – కిరణ్ ప్రకాష్ నిట్టల.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
‘సౌరాష్ట్రే సోమనాధంచ’ అంటూ ఒక్క శ్లోకంలో పన్నెండు క్షేత్రాల గురించి చెప్తారు. ఏవి ఎక్కడ ఉన్నాయో నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదేమో!
సూర్యుడి గుళ్ళు
సూర్య భగవానుడికి గుళ్ళు భారతదేశం నలుమూలలా కనిపిస్తాయి.
నదులు
రోజూ చేసే నిత్యపూజలో చెప్పుకునే మంత్రం
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ..
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు”.
ఆర్యులు ద్రవిడులు వేరు అయితే ఉత్తర భారతం వారికి కావేరి ఎందుకు? దక్షిణ భారతం వారికి ఎక్కడో ఉన్న గంగ ఎందుకు?
ఉత్తరంలో కుంభమేళా అనే ఉత్సవం జరిగితే దక్షిణంలో కుంభకోణంలో జరిగే ఉత్సవం మహామహం.
సంపూర్ణ తీర్థ యాత్ర
సంపూర్ణ తీర్థ యాత్ర అంటే మొదట రామేశ్వరం దర్శించి అక్కడ ఇసుక తీసుకెళ్ళి కాశీ దర్శించి అక్కడ గంగలో కలిపి, తిరిగి కాశీలో గంగను తెచ్చి రామేశ్వరంలోని లింగానికి అభిషేకం చేయాలిట.
కాశీ ఎక్కడ? రామేశ్వరం ఎక్కడ?
ఈశాన్య రాష్ట్రాలు
ఈ రాష్ట్రాలు భారతీయ సంస్కృతిలోకి రావు అని అనుకుంటాము. రాకా సుధాకర్ రావు గారు ఈశాన్య రాష్ట్రాల మీద చేసిన కొన్ని వీడియోలలో వివిధ తెగల వారికి ఉండే ఆచార వ్యవహారాలు అన్నీ ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉంటాయి అని చెప్పారు. ఉదాహరణకి అమావాస్య, పౌర్ణమి తిథులు. అధికమాసం concept, వివిధ గ్రామ దేవతలని పూజించడం, పునర్జన్మ అనే నమ్మకం.
కళలు
ఉత్తరంలో ‘మధుబని’ ఉంటే దక్షిణంలో ‘కలంకారీ’ ఉన్నది. ఉత్తరంలో బెనారస్లో తయారయిన చెక్కబొమ్మలు, కొండపల్లిలో తయారయిన చెక్కబొమ్మలు ఏవైనా సరే రామకథో కృష్ణకథో చెప్తాయి. భారతదేశం ఇలా ఎన్నో కళలకు పుట్టినిల్లు. చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, చేనేత వస్త్రాలు, శిల్పకళ చెప్పుకుంటూ పోతే అనేకం.. ఏ కళయినా రామాయణభారతభాగవతాలే చెప్తాయి.
ఆది శంకరుల వారు
ఆదిశంకరుల వారు పుట్టింది కేరళలో. నర్మదా నదీ తీరంలో గౌడపాదాదుల వారి దగ్గర అధ్యయనం చేసారు. 32 ఏళ్ళ వయసులోనే భారతదేశం నలుమూలల తిరిగి వేదాలని తరువాతి తరాలకు అందించాలని, వాటిని రక్షించేందుకు నాలుగు దిక్కులా నాలుగు పీఠాలు నెలకొల్పారు. ఆ రోజుల్లో ఇప్పుడు తెలిసిన map లాంటివి ఏమీ లేవు. అయినా వారి ముందుచూపు ఎటువంటిదో ఊహకు అందని విషయం. సౌందర్యలహరిలో 75వ శ్లోకంలో ‘నేను ద్రవిడ శిశువుని’ అని చెప్పుకున్నారు. ద్రవిడ అంటే మూడు సముద్రాలూ కల్సిన ప్రదేశం అంటారు.
చతుర్వేదాలు
వేంకట నరసింహ భట్టు అనే మా వంశజ్ఞులు తెలంగాణలోని మంథని అనే గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో మహమ్మదీయుల దండయాత్రల కారణంగా వారి కుటుంబం మంథని నుండి నరసింహస్వామి క్షేత్రమయిన ధర్మపురికి వలస వెళ్లారు. ఆ క్షేత్రంలో గోదావరీ నదీ తీరంలో నరసింహ భట్టుగారు తాతగారి గారి దగ్గరే ఋగ్వేదం, యజుర్వేదం నేర్చుకున్నారుట. నాలుగు వేదాలు నేర్చుకోవాలి అన్న పట్టుదలతో ముందుగా దక్షిణంలో చిదంబరంలో సామవేదం అభ్యసించారట. ఒక్క కాశీ లోనే అధర్వణవేదం నేర్పుతారని తెల్సి, అది మొగలుల పరిపాలించే కాలం అయినా ప్రాణాలకు లెక్క చేయకుండా అధర్వణవేదం కూడా అభ్యసించి చతుర్వేదిగా తిరిగి వచ్చారట. మా వంశజ్ఞుల వారి చరిత్రలో అర్థం చేసుకోవలసింది విషయం ఏమిటంటే వేదాధ్యయనం అనేది భారతదేశం అంతటా చేసేవారు అని.
వేరు వేరు పద్ధతులలో వివిధ రూపాలలో భగవదారాధన చేయడమే భిన్నత్వం. ఏ రూపంలో కొలిచినా, ధర్మాన్ని పాటిస్తూ (చతుర్విధ పురుషార్థాలు) పునర్జన్మ లేకుండా మోక్షం పొందటమే ఈ ఏకత్వం. అదే భారతీయ సంస్కృతి. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన’ అనే అన్నమాచార్యుల వారి కీర్తనలో ఇంత పెద్ద వ్యాసం వ్రాయకుండానే రెండు చరణాల్లో చాలా స్పష్టంగా చెప్పారు.
ఇలా ఎన్నో ఆచారాలతో సంప్రదాయాలతో ఉన్న భారతభూమిలో గురుశిష్య పరంపరలో ఉన్న సాధు సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరిదీ చాలా ముఖ్యమైన పాత్ర. ‘సన్యాసులకు పార్లమెంట్లో ఏమి పని’ అని అడిగేవారిని ఏమంటారో పాఠకులకే వదిలేస్తున్నా.
నేను ముందే చెప్పాను సామాన్యురాలిని అని. నేనేమి మ్యూజియంలు చూడలేదు. రీసెర్చ్ పేపర్లు చదవలేదు. పైన చెప్పినవన్నీ రోజువారీ జీవితం నుండీ తీసుకున్న ఉదాహరణలు మాత్రమే. అంటే ఈ భారతీయ సంస్కృతి జీవంగా ఉన్న సంస్కృతి అని చెప్పడానికి ఇంకో ఋజువు అక్కర్లేదు. మరి తమ మూలాలు ఏమిటో కూడా తెలియని యూరోపియన్ దేశాల నమూనాతో దీనిని పోల్చడం సమ్మతమేనా?
3 Comments
రమా శాండిల్య
అద్భుతంగా వ్రాశావు చంద్రిక!! నేను గత 30 సంవత్సరాలుగా యాత్రలు చేస్తూ అనుకునే విషయాలు ఇవే! భారతదేశం మొత్తం ఐదు ప్రదక్షిణలు చేసి తెలుసుకున్న విషయాలు నీవు ఒకచోట ఉండి గమనించావు.
శుభాశీస్సులు ఇతమంచి వ్యాసం అందించినందుకు!
Cheruvu Rambabu
Well scripted. The flow is good.
Geographical representation in Ramayana & Mahabharatha is the sole proof of akhanda Bharath.
Today’s political desperation & the power mongering at any cost by the so called opposition is really Harming the country & the Sanathana Dharma as well.
Keeping doing your good work.
Visali Peri
సామాన్య గృహిణి అంటూనే సమస్త భారతావనిని వర్ణించేశారు శరచ్చంద్రిక గారు!