శిష్ట్లా రామకృష్ణ శాస్త్రి పాత తరానికి చెందిన ప్రముఖ పండితులు. 1941లో ఆయన మదరాసు విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి. అప్పటికే ఆయన మదరాసు మహిళా కళాశాలలోనూ, బందరు నోబుల్ కళాశాలల్లో తెలుగు అధ్యాపకులు. విమర్శ- వ్యాసములు – అనే గ్రంథాన్ని 1940లోనే ప్రచురించారు. వీరు 1947లో సర్ రఘుపతి వెంకటరత్నం రీసెర్చ్ మెడల్ కోసం జరిగిన పోటీ పరీక్షకు వీరశైవాంధ్ర వాఙ్మయం – అనే గ్రంథం వ్రాసి విజయం సాధించారు. తిరుపతి దేవస్థానం వారు దీనిని 1948లో ప్రచురించారు. వీరశైవ వాఙ్మయంపై క్షుణ్ణంగా చేసిన పరిశోధనా గ్రంథమది.
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతిలో సహాయ సంపాదకుడిగా శాస్త్రి పని చేశారు. ఆయన ఎం.ఏ.తో బాటు బి.ఓ.ఎల్. చదివారు. బందరులో పని చేస్తున్న రోజుల్లో 1949లో ఆంధ్ర నాటక విమర్శనం అనే గ్రంథం ప్రచురించారు. ప్రాచ్య పాశ్చాత్య నాటక విమర్శన పద్ధతుల ద్వారా ప్రధాన సంస్కృత నాటకాలపై విమర్శను ఈ గ్రంథంలో వివరంగా తెలిపారు. ఆ గ్రంథం బి.ఏ. విద్యార్థులకు పాఠ్యాంశమైంది. భవభూతి నాటకాలు, షేక్స్పియర్ నాటకాలు శ్రవ్య నాటకాలే గాని, దృశ్య నాటకాలు కాదని శాస్త్రి అభిప్రాయపడ్డారు. నాటకంలోని నాయక లక్షణాలు, రసపోషణ, కథా సంవిధానం, పాత్ర పోషణలను శాస్త్రి ఈ గ్రంథంలో సోదాహరణంగా వివరించారు.
రామకృష్ణ శాస్త్రి మదరాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 1949 నుండి 1968 వరకు ఉపన్యాసకులు. ఆ కాలంలో నిడుదవోలు వెంకటరావు శాఖాధ్యక్షులు. ఈ ఇద్దరితో తెలుగు శాఖ నడిచింది. 1960లో వెంకటరావు రిటైరయిన తర్వాత శాస్త్రి శాఖాధ్యక్షత బాధ్యత స్వీకరించి 1968లో రిటైరయ్యారు. 1968తో ఒక శకం అంతమైంది. 1927లో కోరాడ వారితో ఆరంభమైన తెలుగు శాఖ 1968 వరకు 40 ఏళ్ళ పాటు ప్రాచీన సంప్రదాయంలో నిష్ణాతులైన విద్వాంసుల ఆధ్వర్యంలో నడిచింది. రెండేళ్ళ పాటు తెలుగు శాఖలో ఎవరూ లేరు. మళ్ళీ 1970లో గంధం అప్పారావు చేరేవరకు జవజీవాలు లేవు.
రెండో తరం 1970 నుంచి 2021 వరకు అంటే అర్ధ శతాబ్దం పాటు ఆధునిక సంప్రదాయాలతో పెరిగిన అధ్యాపకుల ఆధ్వర్యంలో అధ్యయన అధ్యాపనాలు అఖండంగా జరిగాయి. దీక్షా దక్షత గల ఆచార్యులు పని చేశారు. పరిశోధనలకు చేయూత నిచ్చారు. ఇతర విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలతో సమానంగా ముందంజ వేశారు. తెలుగు దీప్తి అనే ప్రత్యేక సంచికతో ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మలితరం అధ్యాపకుల వివరాలందించారు.
ఈ అధ్యాపక/ఆచార్య పరంపరలో తెలుగు శాఖ పురోగభివృద్ధిని గమనిద్దాం. 1970లో గంధం అప్పారావు ఉపన్యాసకులుగా చేరి క్రమంగా 1975లో రీడర్ అయ్యారు. తొలిసారిగా ప్రొఫెసర్ పోస్టు ఏర్పడి 1976లో ఆయన ఆచార్యులయ్యారు. అప్పటి మదరాసు విశ్వవిద్యాలయ వైస్-ఛాన్స్లర్ మాల్కం ఆదిశేషయ్య హయాంలో పోస్టు గ్రాడ్యుయేట్ తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పుడు 1976లో పరిశోధనా నిమిత్తం మరికొంతమంది అధ్యాపకులను నియమించారు. అప్పుడు డా. వి. రామచంద్ర రీడర్ గానూ, డా. యస్. అక్కిరెడ్డి ఉపన్యాసకులుగాను చేరారు. గంధం అప్పారావు అధ్యక్షతన తెలుగు శాఖ పటిష్ఠమై ఎం.ఏ. తరగతుల సిలబస్ రూపొందించబడింది.
క్రమక్రమంగా లెక్చరర్లుగా 1978లో డా. జి.వి.యస్. ఆర్. కృష్ణమూర్తి, 1985లో డా. యస్. శమంతకమణి చేరారు. 1984లో అక్కిరెడ్డి రీడర్‌గా, రామచంద్ర ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 1987లో అప్పారావు రిటైర్ కాగా, రామచంద్ర శాఖాధ్యక్షులయ్యారు. ఆయన పదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. 1997లో అక్కిరెడ్డి ఆ పీఠాన్ని అధిరోహించారు. మూడేళ్ళ తరువాత 2000లో అక్కిరెడ్డి రిటైరయి కృష్ణమూర్తి ఆ పదవిలోకి వచ్చారు. ఆ ఖాళీలో మాడభూషి సంపత్ కుమార్ 2000లో అధ్యాపకులుగా కొత్తగా చేరారు.
2002లో శమంతకమణి శాఖ బాధ్యతలు స్వీకరించినప్పుడు 2004 ఆగస్టులో శంకరరావు ఉపన్యాసకులయ్యారు. ఆమె అకస్మాత్తుగా 2009లో మరణించగా, సంపత్ కుమార్ శాఖాధ్యక్షులయ్యారు. 2019లో ఆయన రిటైరై శంకరరావు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయి ప్రస్తుతం కొనసాగుతున్నారు. తెలుగు శాఖ ఇప్పటికి 260 యం.ఫిల్, 110 పి.హెచ్.డి డిగ్రీ అభ్యర్థులను ప్రోత్సహించింది.
వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేసి – కృషితో నాస్తి దుర్భిక్షం – అనే సామెత ననుసరించి దీక్షా దక్షతలతో బి.ఏ. సాధించారు. కొంతకాలం హైదరాబాదులో చిన్న ఉద్యోగం చేశారు. ఆంధ్రదేశంలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా తిర్లంగిలో ఉపాధ్యాయులైన నరసింగరావుకు జన్మించిన ఆ వ్యక్తియే గంధం అప్పారావు.
వివాహం చేసుకొని ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. మద్రాసు వెళ్ళి పచ్చయప్ప కళాశాల అధ్యాపకులయ్యారు. 1970లో మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఏర్పడిన ఖాళీలో ఉపాన్యాసకులయ్యారు. క్రమశిక్షణకు మారుపేరయిన ఆయన అభ్యుదయ పరంపరాభివృద్ధిలో రీడర్, ప్రొఫెసర్ కావడం సహజ లక్షణం. అంతవరకు తెలుగు శాఖలో పని చేసిన వారు – కోరాడ రామకృష్ణయ్య, నిడుదవోలు వెంకటరావు, శిష్ట్లా రామకృష్ణ శాస్త్రులు లెక్చరర్లు, రీడర్లే.
అప్పారావుకు అదృష్టం కలిసి వచ్చింది. ఎం.ఏ. తరగతులు ప్రవేశపెట్టారు. అన్ని శాఖలలో వలె తెలుగు శాఖలో ప్రొఫెసర్ పోస్టు ఏర్పడింది. అప్పారావు కంఠసీమలో తొలిసారిగా ఆ వరమాల పడింది. తులనాత్మక పి.హెచ్.డి సిద్ధాంత వ్యాసాన్ని – వేమన – సర్వజ్ఞుల రచనలపై తులనాత్మక గ్రంథంగా ఆంగ్లంలో తయారు చేసి ధార్వాడ విశ్వవిద్యాలయానికి సమర్పించి అర్హులయ్యారు.
అది మొదలు పరిశోధనకు పర్యవేక్షకులుగా కేవలం తెలుగు మాత్రమే గాక, ఇంగ్లీషు, హిందీ విభాగ అభ్యర్థులను కూడా తయారు చేశారు. అన్నిటి కంటే గొప్ప విషయం ఫిజికల్ ట్రయినింగ్ అభ్యర్థి ఒకరు – తెలుగు సాహిత్యంలో వ్యాయామ విద్య పై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందారు. అప్పారావు పర్యవేక్షణలో యం.ఫిల్, పి.హెచ్.డి డిగ్రీల పంట పండింది. పరిశోధకులకు కావలసిన కనీస లక్షణాలను తెలిపే గ్రంథం ఒకటి – పరిశోధన పద్ధతులు – తాను, కాళిదాసు సూర్య నారాయణ (పరిశోధక విద్యార్థి) ప్రచురించారు. ఇది అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధకులకు కరదీపిక.
అప్పారావు బహుముఖీన ప్రజ్ఞ గలవారు. చరిత్రలో ఎం.ఏ. చేశారు. తన పరిశోధన గ్రంథాన్ని తెలుగులో కూడా ప్రచురించారు. భాషా పరిశోధన గ్రంథాలను దేశవ్యాప్తంగా అందుబాటులో వుండాలని ఆంగ్లంలోనే వ్రాశారు. బహుభాషా కోవిదుడాయన.
ఆ రోజుల్లో తెలుగు శాఖ ఆచార్యులను కేంద్ర ప్రభుత్వం వివిధ పరీక్షల నిర్ణాయక మండలిలో సభ్యులుగా ఆహ్వానించేవారు. అలా U.P.S.C., ఆంధ్ర ప్రదేశ్‌లోని APPSCల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అప్పారావు అగ్రగణ్యులు. అలానే కేంద్ర సెన్సారు బోర్డు తెలుగు విభాగం మెంబరు అయ్యారు. వివిధ విశ్వవిద్యాలయాల తెలుగు శాఖ ఆచార్యుల ఎంపిక కమిటీలలో ఆయన నిర్ణాయక సభ్యులు.
గేయ సంపుటి కూడా ప్రచురించారు.
రిటైరై ప్రశాంత జీవితం గడిపి సహస్ర చంద్ర దర్శనోత్సాహియై 2014లో దివంగతులయ్యారు. ఎందరో శిష్యులకు మార్గదర్శనం చేశారు. గురుపత్ని పద్మావతి శిష్యులను వాత్సల్యపూరితంగా చూశారు.
అప్పారావు తెలుగు శాఖలో పనిచేసిన కాలంలో అధ్యాపక సహచరుల సంఖ్య పెరిగింది. రామచంద్ర, అక్కిరెడ్డి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు. 1965-67లో నేను ఎం.ఏ. చదువుతున్న రోజులలో వారిద్దరూ పరిశోధన చేస్తున్నారు. వారితో బాటు యల్.బి. శంకరరావు, పి.వి.ఆర్. ప్రసాదరావు (ప్రసాదరాయ కులపతి – తర్వాతి కాలంలో కుర్తాళం పీఠాధిపతి), తంగిరాల సుబ్బారావు పరిశోధన చేస్తున్నారు. అందులో రామచంద్ర, అక్కిరెడ్డి మదరాసు విశ్వవిద్యాలయంలో స్థిరపడ్డారు. శంకరరావు మదరాసు కళాశాలలో చేరారు. ప్రసాదరాయ కులపతి హిందూ కళాశాలలో చేరి ప్రిన్సిపాల్‌గా రిటైరయ్యారు. తంగిరాల సుబ్బారావు బెంగుళూరు విశ్వవిద్యాలయ ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు.
మదరాసు విశ్వవిద్యాలయంలో అప్పారావుతో బాటు జి.వి.యస్. ఆర్. కృష్ణమూర్తి, శమంతకమణి అధ్యాపక వర్గంలో చేరారు. ఆ విధంగా తెలుగు శాఖ పరిశోధనారంగంలో శాఖోపశాఖలుగా విస్తరిల్లింది.
డా. రేవూరు అనంతపద్మనాభరావు అష్టావధాని, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్త. తెలుగు సాహిత్యం లోని అన్ని ప్రక్రియలలోనూ రచనలను చేశారు. 76 ఏళ్ళ వయస్సులో నిరంతర అధ్యయన, అధ్యాపనాలు కొనసాగిస్తూ 120 గ్రంథాలు ప్రచురించారు. 2005 లో దూరదర్శన్, ఢిల్లీ నుండి అదనపు డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణాంతరం గత 18 సంవత్సరాలలో 80 గ్రంథాలు వివిధ ప్రక్రియలలో ప్రచురించారు. అనువాద సాహిత్యంలో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1993); కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2000), అప్పాజోశ్యుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్ వారి విశిష్ట సాహితీ పురస్కారం లభించాయి. వీరి రచనలపై వివిధ కోణాలలో 5 విశ్వవిద్యాలయాల నుండి ఆరుగురు ఎం.ఫిల్/పిహెచ్డి పరిశోధనా గ్రంథాలు సమర్పించి పట్టాలు పొందారు. సంచికలో వీరు గత ఐదు సంవత్సరాలలో – ఆకాశవాణి పరిమళాలు, కావ్యపరిమళం, జ్ఞాపకాలు-వ్యాపకాలు, ఆచార్య దేవోభవ, అవధానం ఆంధ్రుల సొత్తు అనే ఐదు గ్రంథాలు సమర్పించారు.
You must be logged in to post a comment.
అమరులం
అర్థవంతమైన జీవితానికై అన్వేషణ ‘లొరెంజో సెర్చెస్ ఫర్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్’ నవల
అమ్మణ్ని కథలు!-8
రూపాంతరం
కరనాగభూతం కథలు -3 మరబొమ్మ విద్యలు
సంచిక – పద ప్రతిభ – 53
సాగర ద్వీపంలో సాహస వీరులు-9
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-5
జీవనం, సాహిత్యం పెనవేసుకుపోయిన ప్రయాణం
జీవన తాత్వికతను చాటిన ‘దింపుడు కళ్ళం’ కవిత
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®