[శ్రీ ఎరుకలపూడి గోపీనాధరావు రచించిన ‘ఆ ఇంటి గుట్టు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]


ఆ ఇల్లు
లబ్ధి కూర్చే లావాదేవీల గుసగుసలు కూడా
స్పష్టంగా వినగలిగే శ్రవణేంద్రియాల ఇల్లెనా
సాయమర్థించే గట్టి ఆర్తనాదాలూ
ఆ ఇంటి ముందు అరణ్యరోదనలు!
కారు చీకటిలోని నల్లడబ్బునూ
కచ్చితంగా కనిపెట్టగల కన్నులున్న వాసమది!
ఎదుటి వ్యక్తి అవసరాలనూ, బలహీనలతలనూ
తృటిలో గ్రహించి
అతని వల్ల ఒనగూడే లాభనష్టాలను
తక్షణమే తూచగల
సునిశిత దృష్టి పుష్టిని పొంది,
స్వలాభంలేని సందర్భాన
చూచిన వారినీ చూడనట్లు నటించే
తర్ఫీదునందిన చతురమైన చక్షువుల నివాసమది!
స్వీయ ప్రయోజనాల స్థితులలోనో
‘ఆత్మస్తుతి’, ‘పరనింద’ల అవసరాలలోనో తప్ప
మరెప్పుడూ తెరచుకోని
తెలివిమీరిన నోరున్న నివేశమది!
ఆ ఇంటి వక్షస్థలంలో వుండే
‘మనస్సు’ అనే ఒక అవ్యక్త గారడీ పదార్థమే
ఆ నిలయపు విధులను నిర్వహించే మాయలమారి!
ఆ సదనం శిరస్థానంలో
‘బుద్ధి’ అనే
అద్భుత, అగోచర శక్తి అమరివున్నా – అది
లోగదిలోని మాయాలమారికి లొంగి చరించే
పరమ దయనీయ పాత్రధారి!
నాసికారంధ్రాల నాడు లాడుతున్నంత కాలం
ఆ గేహం గతి అంతే!
ఆ దేహం స్థితి అంతే!