Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యువతకు పద్యాల మీద ఆసక్తి

[శ్రీ కిభశ్రీ రచించిన ‘యువతకు పద్యాల మీద ఆసక్తి’ అనే రచనని అందిస్తున్నాము. ఓ సాహితీ సమావేశంలో చేసిన ప్రసంగం పాఠం ఇది.]

మకాలీనాంశాలపై వ్యావహారిక పదాలలో పద్యాలతో యువతకు పద్యాల మీద ఆసక్తి కలిగించవచ్చు.

ఛందస్సు, పద్యాలు తెలుగు భాషకు మకుటాయమాయమైన సంపద. కాలక్రమేణా భాషలో వస్తున్న మార్పుల మూలాన, ఇతర భాషల ప్రభావం మూలాన, ఈ సంపద పట్ల, ముఖ్యంగా యువతలో ఆదరణ తగ్గుతూ వుందని భాషాభిమానుల వేదన కొంతవరకు నిజమే. కానీ దానికి కారణాలు పరిశీలించి పరిష్కారమార్గాలు వెదకవలసిన అవసరం ఎంతైనా వుందన్నదే నా నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, పాత్రల పేర్లు మార్చి చేస్తున్న సోదాహరణ రచన ఇది. కొందరికి నా ఆలోచన నచ్చకపోవచ్చు.

7-8 సంవత్సరాల క్రితం రిటైరయిపోయిన మా ఇంజినీరింగ్ కాలేజీ మిత్రుల రీయూనియన్ తరువాత నేను ఉన్న హోటల్ దగ్గర దింపి వెళతానని మా మిత్రుడొకడు మమ్ములను తన కారులో ఎక్కించుకుని తన సుమారు పాతికేళ్ళ కుర్ర డ్రైవరును నా హోటల్ వైపు వెళ్ళమని చెప్పాడు. దాదాపు అర్ధరాత్రి, పైగా ఆ రోజు మిగిలిన బాబులతోపాటు సుమారుగా మందు పట్టించిన మావాడు మందకొడిగా మాటలలో నన్నుద్దేశించి “నీవు ఎందుకు మాకు నీ పద్యాలు వినిపించలేదు?” అని అడిగితే అప్పటికే వాడిన పరిస్థితిని చూసి సురాపానద్వేషినైన నాకు ఒళ్ళు మండిపోయి,

విద్యలనెన్నో నేర్చియు
ద్యోగమ్ము విడిచితివి సారాప్రియుడై
ఆద్యమ్మున సేవించుట
ద్యమ్మది యేమిటయ్య తిలేకుండా

అని కందపద్యంలో తిట్టినప్పుడు మా వాడు గట్టిగా నవ్వేసి,

“తిట్టడం కూడా నీవు పద్యంలోనే చేస్తావా – ఐనా మందు తాగితే వచ్చే కిక్కు నీకేమి తెలుసోయీ – తాగని వాడివి నీవేమి కవివయ్యా?” అని వాడంటే సమాధానంగా

తాగకపోతే మదిరము
కాగలడే కవియనేది ల్లయె. కానీ
తాగినచో తథ్యమ్ము య
ధోగతి — మేలుగద కల్లు దూరమ్ముంచన్

అని కందపద్యంలో అన్నాను.

ఆ రోజు బఫేలో బాగా మెక్కేసాడేమో, తాగుడుకు అలవాటుపడిన మావాడి పనసపండంత ఉన్న పొట్ట నులుముకుంటూ ఆయాసపడుతున్న వాడిని చూసి

బాన పొట్ట చూడు పనసపండంతయ్యె
మోయలేక బరువు మూల్గుటేల
వళ్ళు తగ్గు కాస్త వర్కౌటు చేయగా
ఉండదీయవస్థ ఉన్న మాట

అని ఆటవెలదిలో ఆట పట్టించినప్పుడు కుర్ర డ్రైవరు గట్టిగా నవ్వబోయి ఆపుకోవడానికి అవస్థపడడం నేను గమనించాను. ఇంతలో హోటల్ వచ్చాక గుర్రుకొడుతున్న మా వాడిని తట్టి బై చెప్పి, నేను దిగినప్పుడు,

“సార్, రండి నేను మిమ్ములను మీ రూము దాకా దింపుతాను” అన్నాడు ఆ కుర్ర డ్రైవరు. నేను, “లేదయ్యా నేను తాగలేదు, పైగా నా సామానల్లా నా ఈ చిన్న బాక్ పాక్ లో ఉన్న నా ఐపాడ్ మాత్రమే” అన్నా కూడా వినిపించుకోకుండా అతను “పరవాలేదు సార్ – నేను వస్తాను” అని నా బాగ్ తన చేతిలోకి తీసుకుని నా వెంట నడుస్తూ, “మీరు చెప్పినవి పద్యాలు బాగున్నాయి సార్?” అన్నాడు.

“నీకు ఇష్టమా పద్యాలంటే?” అని నేనంటే

“టెంత్ క్లాసులో పద్యాల గురించి చదువుకున్నాను. వినేందుకు నడకలో బాగుంటాయి సార్ పద్యాలు – కానీ చాలా పద్యాలు అర్థం కావు. కానీ సార్ మీరు ఇప్పుడు చెప్పిన పద్యాలు మాత్రం పూర్తిగా అర్థమైనాయి సార్” అన్నాడు.

దానికి నేను, “మరి నావీ పద్యాలే, నీవు చదువుకున్నవి కూడా పద్యాలే కదా” అంటే

“నిజమే సార్ – కానీ మీ భాష బాగా అర్థమయింది సార్ – పుస్తకాలలో పద్యాలు ఏమీ అర్థం అయ్యేవి కావు కానీ ఎగ్జామ్స్ కోసం చదివి పాస్ అయాను” అన్నాడు.

నాకనిపించింది – నిజమే కదా అర్థమయ్యే వ్యావహారిక భాషలో ఉంటే, పద్యాలంటే ఆసక్తి కలగవచ్చుగదా అని. అంతలో మా రూము చేరుకున్నా, అతనితో సంభాషణ కొనసాగిస్తూ, రూములోకి రమ్మన్నాను.

నేను “నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచం ఎఫర్ట్ పెడితే అర్థమౌతాయేమో?” అంటే, అతను

“సార్ – పాఠాలలో చెప్పే పద్యాలన్నీ సీరియస్ టాపిక్ మీదనో, ఎప్పుడూ వినని కథల నుంచో వుంటాయి సార్” అన్నాడు. నాకు అర్థమయింది అతని అవస్థ. సమాధానంగా నేను

పద్యమనగనెపుడు బరువైన టాపిక్కు
లుండునన్న తలపు ఒద్దు భాయి
ఫన్నుకొరకుగూడ పద్యాలు వ్రాయచ్చు
అర్థమయెడి తీరు నల్లవచ్చు

అని ఒక ఆటవెలది వదిలాను. అప్పుడు డ్రైవరు

“సార్ మీరు మాట్లాడుతున్నట్లు పద్యాలు చెబుతుంటే బాగుంది సార్. బరువైన టాపిక్కే వుండనక్కరలేదంటే సరదాగా వ్రాయచ్చంటే పిల్లలకు ముందుగా నేర్పే twinkle twinkle లాంటి nursery rhymes ను తెలుగు పద్యంలోకి translate చేసి పిల్లలకు నేర్పిస్తే?” అని అన్నాడు.

దానికి నేను “భేషుగ్గా నేర్పించవచ్చు. ఇదిగో ఈ విధంగా” అంటూ

అవని కన్నివైపు లాకాశమున నిల్చి
పదిలమున్న – – జాతి వజ్ర మల్లె
తళతళమెరయు చిరు తారా కనగ నిన్ను
అబ్బురమ్ముగల్గు నాకదేలొ

అని చదివితే అతను –

“నిజమే పిల్లలకు కూడా సులభంగా నేర్పవచ్చు. మరి శ్రీశ్రీగారు అన్నట్లు ఏదీ ఒక కుక్క మీద పద్యం చెప్పండి” అని అడిగాడు.

నేను వెంటనే ఇదివరకు ఎప్పుడో వ్రాసిన కందం, కొన్ని వ్యాకరణ సూత్రాలను కావాలని ఉల్లంఘించి, అతనిలో ఆసక్తిని పెంచేందుకు అందుకున్నాను

భవుభవ్వనుట – – కమలసం
భవుడే మా నుదుట వ్రాసె – – వదలక ఎపుడూ
భవుభవ్వంటూ చేసెడు
భవునామ స్మరణ భాగ్యమునిడెనే
~
భవుడందరియందగుపడ
భవుభవ్వను పలకరింతు భక్తులనెపుడూ (భక్తునికనుకన్)
భవుడే వచ్చేననుకుని
భవుభవ్వని స్వాగతమ్ము పలుకుదునెపుడూ
~

ఈ పద్యాలు, వాటి భావము వివరిస్తే, ఆ అబ్బాయి “సార్ – అందరూ పద్యాలు మీలాగ అర్థమయేట్లు ఎందుకు వ్రాయరు సార్? ఎందుకు ఎప్పుడూ ఏ పురాణ కథలలాంటి టాపిక్కిల మీదే అర్థమవని పదాలను వాడి వ్రాస్తుంటారు?” అడిగాడు.

“నాకు ఒకసారి డా సి.నా.రె. గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రౌడ భాషలో వ్రాసే కావ్యాలు భాష, సంస్కృతికి అద్దం పడతాయి, భాష ఔన్నత్యానికి దోహదం చేస్తాయి. పౌరాణికాంశాలు, ప్రబంధాలు కలకాలం నిలిచిపోతాయి. కానీ వినోదం, సందేశం ప్రధానోద్దేశమైతే, పద్యాలు వ్యావహారిక పదజాలాలతో, హాస్యాన్ని జోడించి వ్రాస్తే వాటితోనే జనాలను సులభంగా చేరవచ్చు.” అన్నాను. దానికి ఆ అబ్బాయి,

“సార్ నాలాంటి ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళు కూడా వ్రాయచ్చంటారా? మరి ఎన్నో రూల్స్ పాటించాలి కదా పద్యాలు వ్రాయాలంటే?” అంటే,

నేను “ఉంటాయి కానీ సులభమైన ఛందస్సులలో మొదలుపెట్టి మెల్ల మెల్లగా కష్టమైన ఛందస్సులలోకి వెళ్ళవచ్చు” అన్నాను.

దానికి అతను “నా పేరు శంకర్ సార్. పద్యాలు వ్రాయడం అంటే ఎంతో ఈజీ అన్నట్లుగా చెప్పుతున్నారు మీరు. నాకు చిన్న చిన్న పద్యాలు వ్రాసేది నేర్పిస్తారా? మీకు వీలున్నప్పుడే నేర్పండి.” అని, నన్నడుగకుండానే, తన దగ్గర వున్న పార్కింగ్ టికెట్ మీద తన వాట్సాప్ నంబరు వ్రాసి ఇచ్చి అప్పటికి సెలవు తీసుకున్నాడు.

***

యువకులకు కూడా సమంజసమైన తీరులో నేర్పితే పద్యాలంటే ఆసక్తి పెరిగే అవకాశం వుంటుంది అని నాకు అప్పుడు అనిపించింది. ఎంతో ఆసక్తి చూపిస్తున్న ఇతని మీద ప్రయోగం చేసి నా థియరీ నిరూపిద్దామననిపించింది.

మరుసటిరోజు శంకర్ తనకు తెలిసిన శాంభవి, రామచందర్ అనే మరో ఇద్దరిని కూడా పిలుచుకుని వచ్చాడు, వాళ్ళకు సులభమైన ఆటవెలది నియమాలగురించి చెప్పాను. ఆ ముగ్గురిలో ఇద్దరు తెల్లమొగం వేసినప్పుడు నాకు అర్థమయిన విషయం, లఘువులు, గురువులు, గణాలు, ఇంద్ర, సూర్య, గణాలు, ప్రాసయతి గురించి చెప్పినప్పుడు వాళ్ళ అటెన్షన్ కోల్పోయానని. అందుకని, నా రూటు మార్చి నడకలుగా ఆటవెలది ఛందస్సు నియమాలు, శబ్దసామ్యంతో యతి ప్రాసలగురించి చెబితే వాళ్ళకు అర్థమయినట్లనిపించింది.

మాటవరుసలో వాళ్ళకు ఏమి ఇష్టమో తెలుసుకుని, శంకర్‌కు దోమ మీద, రామచందర్‌కు పానీపూరీ మీద, శాంభవికి పెళ్ళి కూతురి వర్ణన మీద వాళ్ళకు తోచిన పదాలు వాడి ఆటవెలదులు వ్రాయమని వాళ్ళకు హోమ్ వర్క్‌గా ఇచ్చాను. రెండురోజుల కష్టపడి వాళ్ళు హోటల్ రూముకు వచ్చి వ్రాసి చూపిన పద్యాలు చూపించారు. వీటిని చిన్న చిన్న సవరణలు చేసిన తరువాత

శంకర్:
స్కిటో అసురుడ ము కుట్ట బోకుమా
తాళలేము నీవు దాడిచేస్తె
డ్రాకులాకు నీవు డైరెక్టు యాంసెస్ట
న్ననిజము మాకు ర్థమయ్యె

అతను ఇంగ్లీషు పదాలు వాడడం నాకు నచ్చింది

~

రామచందర్:
అంశం: (పానీపూరీ)
పెళ్ళిచూపులందు పెట్టగా జలపూరి
పెండ్లికొడుకు మెక్కి పీక వరకు
బేవుమనుచు త్రేన్చ పెండ్లికూతురు చూసి
క్కుమంట నవ్వె యము లేక

అని హాస్యాన్ని జోడించి వ్రాసాడు.. భలే భలే.

~

శాంభవి:
అంశం: పెళ్ళి కూతురు వర్ణన
బుట్టలోన వొదిగి పుత్తడి బొమ్మగా
చేరె పెండ్లికొడుకు చెంత చూడు
ముచ్చటైన జంట ముగ్ధమోహన రూపు
కన్నులార్పకుండ కనిరి జనులు

అని వ్రాసిన పద్యం, ఒక ఆడపిల్ల కలలను ఎత్తి చూపించింది.

గ్రాంథిక భాష కాకున్నా వ్యాకరణరీత్యా కొన్ని దోషాలున్నా, తొలి ప్రయత్నంగా వ్యావహారిక పదజాలంతో పద్యం లక్షణాలన్నిటితోను ఉన్నాయి.

ఆ పద్యాలు నేర్పే ప్రక్రియ నేను అమెరికా తిరిగి వచ్చేసిన తరువాత కూడా కొన్నాళ్ళపాటు కొనసాగింది. మెల్ల మెల్లగా వ్యావహారికంలో, సమకాలీనాంశాలపై వ్రాసేది అలవాటు చేసుకుని, కాస్త మెరుగు పరచుకున్న తరువాత, వాళ్ళు వ్రాసిన పద్యాలు వినిపిస్తాను.

ఆరుబయట ముగ్గు వేసి నిలుచున్న ఒక అమ్మాయిని దారన పోయే అబ్బాయి చూస్తూంటే ఆమె మగడు ఉరుముతూ ఉండే కార్టూనునొకటి శంకర్ ఎంచుకుని, దానిమీద తెలంగాణా మాండలీక పదాలతో కొత్త ప్రయోగం చేసాడు.

పోరి ఇంటికాడ – – ఫోకట్ల ముగ్గేసి
బైట కండ్లబడగ – – బీటు వేయ
కూన మగడు సూస్త కూసుంటడేమిరా- – 
బొక్కలిరగదీయబోడె నీవి

అని నవ్వించిన ఈ ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను.

అదే విధంగా రామచందర్ తనకిష్టమైన పెసరట్టుమీద ఒక కందం వినిపించాడు

అట్టులయందన్నిట పెస
రట్టేయతియుత్తమమ్ము. రాతిరిబగలున్
కట్టుబడక డైటింగని
పొట్టపగులువరకు తినెద పొడిచట్నీతో

కష్టమైన ట కు ట వత్తు ద్విత్వాక్షరం ప్రాసాక్షరంగా వ్రాసిన హాస్యగుళిక ఎంత బాగుంది కదా?

శాంభవి, భర్తృహరి సుభాషితం – ‘కేయూరాని న భూషయంతి పురుషం..’ శ్లోకాన్ని సమకాలీనపరచి వ్రాసిన ఉత్పలమాల:

కంటము చుట్టు కట్టుకుని కంటలగోటియు, కోటు హాటులూ
కంటికి నల్లజోడొకటి కాళ్ళకు నల్లని తోలుబూటులూ
సెంటును కొట్టి, చేతనొక సెల్లును బూనుకు పోజుకొట్టడం
కంటికి సొంపుగుండుగద, కావవి విద్యకు సాటియెన్నడున్

ఈ విధంగా సాగింది యువత పద్యరచనా వ్యాసంగం. నాకు అత్యంత ఆనందం కలిగించినదేమిటంటే, వీళ్ళు ముగ్గురూ, వాళ్ళ స్నేహితులుకు వాళ్ళ రచనలను వినిపిస్తూ వాళ్ళకు కూడా ఆసక్తి కలిగిస్తున్నామని చెప్పడం.

కాలక్రమేణ నా రొటీన్‌లో నేను పడిపోయి, వాళ్ళతో కాలం గడపడం కొంత తగ్గింది. ఆసక్తితో మొదలుపెట్టిన ఆ యువతీ యువకులు కొందరు లోకల్ పద్య కవులను సంప్రదించి వారి రచనలు చూపిస్తే వాళ్ళు వ్యాకరణ సూత్రాలు పాటించడంలేదంటూ, వ్యావహారికంలో పద్యాలు చదవడానికి బాగుండవని, వ్రాయడాన్ని నిరుత్సాహపరదారట. సమకాలీన అంశాలపై వ్రాయాలంటే వచన కవిత్వమో, గజలో, లేదా మాత్రాఛందస్సులోనో వ్రాయవచ్చుగదా, పద్యాలెందుకూ అన్నారట.

నా ఉద్దేశం ప్రకారం వ్యాకరణ సూత్రాలు, వాటిలో ఉన్న విడుపులు అన్నీ, ఏ పండితులో చేసిన కొన్ని ప్రయోగాలను ‘ఆర్యవ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు’ అన్న చిన్నయ్య సూరి గారి సూత్రం ప్రకారం భాషలో చేరినవే అని. మరి యువకులు అటువంటి స్వేచ్ఛ తీసుకోవడంలో తప్పేముంది అని. ఛందస్సులో పద్యాలు వ్రాసే ప్రక్రియపట్ల యువతలో ఆసక్తి పెంపొందించాలంటే, వాళ్ళ మనసులకు దగ్గరైన అంశాలమీద, సమాజంలో ప్రచారంలో ఉన్న పదజాలాలను వాడుతూ వ్రాయనిస్తే తప్పేమిటి? సులభంగా అర్థమయే తీరులో పద్యాల నియమాలు నేర్పి, అవసరమైతే కొన్ని వ్యాకరణ నియమాలను సడలించి, ప్రయత్నం చేసేందుకు ప్రోత్సహిస్తే ఆ విధంగా పద్యాలు వ్రాయడం మొదలుపెడితే రాను రాను వాళ్ళకు ఆసక్తి మరింత పెరిగి అన్ని నియమాలు పాటిస్తూ వ్రాసే స్థాయికి చేరుకుంటారు. ఈ విధంగా, తెలుగు పద్యం అనే ప్రక్రియను యువత కాపాడి చిరకాలం నిలిచేందుకు దోహదపడుతారన్న నమ్మకంతో..

స్వస్తి.

Exit mobile version