Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యువభారతి – తెలుగు వెలుగు సమాఖ్య సమావేశాలు – ఒక సమీక్ష

తరం యువతీ యువకులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం వలన తెలుగు చదవడానికి, వ్రాయడానికి కష్టపడుతున్నారు. అందువలన తెలుగులో ఉన్న అమూల్య సాహితీ సంపదను వారు చదివి అర్ధం చేసుకుని, ఆనందించలేని స్థితిలోకి జారుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే – రాను రాను తెలుగు మాట్లాడేవారు, చదివే వారు, ముఖ్యంగా వ్రాసేవారు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని నిస్సహాయంగా చూస్తూ ఉండే కన్న మనమంతా పూనుకొని దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

“చుట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకొంటూ కూర్చోవటం కంటె, ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది” అంటూ ‘యువభారతి’ సంస్థ తొలినాటి నుండి అనుసరిస్తున్న సూక్తి స్ఫూర్తిగా ఇప్పుడు మరొక్కమారు ఈ మార్గంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత సమాజంలో‌ తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తికై జంటనగరాలలో పేరెన్నిక గన్న సాహితీ సంస్థలతో కలసి ఒక సమాఖ్యగా ఏర్పడి, నెలనెలా ఒక సంస్థతో కూడి ‘తెలుగు వెలుగు’ సమాఖ్య సమావేశాలను ఏర్పాటు చేయాలని ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థ సంకల్పించింది. ప్రతి నెల మొదటి ఆదివారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని ఐ.ఐ.ఎం.సి. కళాశాల సభావేదికపై నిర్వహించే ఈ సమావేశాలలో తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణ, వ్యాప్తికి దోహదపడే అనేక కార్యక్రమాలను రూపొందించి నిర్వహించాలని యువభారతి నిర్ణయించింది.

ఈ నిర్ణయం మేరకు, నవంబర్ 4 వ తేదీ (ఆదివారం) సాయంత్రం ఆరు గంటలకు ఐ.ఐ.ఎం.సి. కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి సమావేశంలో, విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి, తెలంగాణా రాష్ట్ర పూర్వ సలహాదారు డా. కె వి రమణాచారి గారు మాట్లాడుతూ యువభారతి చొరవతో రెండు రాష్ట్రాలలోని సంస్థలు అన్నీ కలిసి రావడం చూస్తే, వృక్షాలన్నీ ఒక చోట చేరి ఫలప్రదానం చేస్తున్నట్లు అనిపిస్తోందని, తెలుగు వెలుగు సమాఖ్య ప్రారంభం తెలుగు భాషను పరిరక్షించు కోవడానికి శుభారంభమని అన్నారు.

యువభారతి అధ్యక్షులు డా. ఆచార్య ఫణీంద్ర గారు ‘తెలుగు వెలుగు’ సమాఖ్య ఏర్పడడానికి గల కారణాలను వివరించారు. తరువాత  ‘తెలుగు వెలుగు సొగసులు’  అన్న అంశంపై ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు శ్రీ సుధామ గారు, ‘తెలుగు సాహిత్యం లో ఆణిముత్యాలాంటి పద్యాలు’ అన్న అంశంపై ప్రముఖ రంగస్థల, సినీ నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ గారు ప్రసంగించారు.  అలాగే వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షులు డా. వంశీ రామరాజు గారు, ఐ.ఐ.ఎం.సి. ప్రిన్సిపాల్ శ్రీ కూర రఘువీర్ గార్లు తెలుగు వెలుగు సమాఖ్య ఏర్పాటు చేసే నెలవారీ కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువభారతి సంస్థ నుండి డా. వంగపల్లి విశ్వనాధం, శ్రీ ఆమాతి రవీంద్ర, శ్రీ జీడిగుంట వెంకట్రావు, డా. జి ఎల్ కె దుర్గ, శ్రీ నారాయణ రెడ్డి, శ్రీ నవీన్, కిన్నెర సంస్థ అధ్యక్షులు శ్రీ మద్దాళి రఘురాం తదితరులు పాల్గొన్నారు.

తరువాత ఈ నెల 1 వ తేదీన, యువభారతి, రసమయి, ఐ.ఐ.ఎం.సి. సంస్థల సంయుక్త ఆధ్వర్యవంలో జరిగిన రెండవ సమావేశంలో  వీరనారి చాకలి ఐలమ్మ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య సూర్య ధనుంజయ్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని, ‘తెలుగు వెలుగు’  సమాఖ్య కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సాహిత్య విద్యార్ధినిగా తాను యువభారతిని చాలా దగ్గరగా చూశానని, ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన  ‘మహతి’, ‘కావ్య లహరి’, ‘చైతన్య లహరి’, ‘వికాస లహరి’, ‘దశ రూపక సందర్శనం’ వంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలను ప్రచురించిందని అన్నారు.

ఆచార్య వంగపల్లి విశ్వనాధం గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘అవధాన ప్రక్రియ’ గురించి శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మగారు ప్రసంగించారు. అనంతరం ‘తెలుగు భాషా సాహిత్యాల వైభవం’ అన్న అంశంపై యువభారతి అధ్యక్షులు డా.ఆచార్య ఫణీంద్ర గారు నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొని తమ కవితా గానం చేశారు.

ఈ కార్యక్రమంలో యువభారతి సంస్థ నుండి శ్రీ ఆమాతి రవీంద్ర, శ్రీ జీడిగుంట వెంకట్రావు, డా. జి ఎల్ కె దుర్గ, శ్రీ నారాయణ రెడ్డి, శ్రీ నవీన్, డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, సత్కళా భారతి సంస్థ నుండి అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version