Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుగాదే ఉగాది

[విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ‘యుగాదే ఉగాది’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

కాలం ఒక ప్రవాహం వంటిది. ఆ ప్రవాహంలో అలల వలె సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, రోజులు ఉంటాయి. వీనిలో కొన్ని అలలు పెద్దవైతే మరికొన్ని అలలు తరగల వలే తేలిపోతుంటాయి. అలాంటి కాలాన్ని పురుషుడితో పోల్చి కాలపురుషుడిగా అభివర్ణిస్తారు కవులు. కాలంలో వచ్చే మంచిచెడులన్నీ కాల పురుషుని గమనంతో ముడివడి ఉంటాయి. ఆరు ఋతువులు ఆరు విభిన్న రీతులలో సాగుతుంటాయి. అందులో తొలి ఋతువు వసంతం అయితే చివరి ఋతువు శిశిర ఋతువు.

శిశిర ఋతువు ఆకులు రాల్చి తరలి వెళుతూ ఉండగా చెట్లన్నీ చివురులు తొడిగి ప్రకృతి పూర్వ శోభను సంతరించుకునేదే వసంత ఋతువు.

ఈ చర్య ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువంజన్మ మృతస్యచ’ అనే జీవిత సత్యాన్ని తెలియచెబుతుంది. వసంత ఋతువు ప్రారంభమైన రోజును ఉగాది లేదా యుగాది అంటారు.

ఆకులు రాల్చి శిశిరం తరలి వెళ్ళగా చిగిరించిన చెట్లతో అందాలు నింపుతూ ఆమని వచ్చింది. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది.

దక్షిణాయనం వెళ్ళిన తర్వాత ఉత్తరాయణంలో వచ్చే మొదటి పండుగ ఉగాది లేదా యుగాది. ఇది తెలుగువారు జరుపుకొనే మొదటి పండుగ ముఖ్యమైన పండుగ. ‘ఉగస్య’ ‘ఆది’ ఉగాది అంటారు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనము. ‘యుగము’ అంటే జంట లేక రెండు అని అర్థము. ప్రతి సంవత్సరంలో దక్షిణాయనం ఉత్తరాయణం రెండు భాగాలుగా చెబుతారు.

ఆ ద్వయానికి ఆది యుగాది లేదా సంవత్సరాది అయినది. ఇది తెలుగు నెలలలో మొదటి నెల అయిన చైత్ర మాసంలో మొదటి తిథి అయిన పాడ్యమి రోజున మొదటిదయిన అశ్వనీ నక్షత్రంలో వస్తుంది. ఆ రోజున చింతపండు, లవణం, మామిడికాయ, వేపపూత, మిరియాలు చెరకు, కలగలిపి చేసే ప్రసాదమే ఈ పండుగ ప్రత్యేకత. ఈ ఆరింటిని అరిషడ్వర్గాలకు ప్రతీకగా చెబుతారు. ఈ అరిషడ్వర్గాలను జయించి మనిషి మనీషిగా ఎదగాలన్నది ఈ పండుగ చేసే ప్రబోధము. ఈ పండుగను గురించిన అనేక గాథలు మనకు కనిపిస్తాయి. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణమే ఈ ఉగాది.

చైత్ర శుక్లపాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజు అని, శాలివాహన శక యుగకర్త అయిన శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనది ఈ రోజే. మహావిష్ణువు నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించబోతూ మహావిష్ణువును తన వద్ద ఉండమని కోరగా విష్ణువు తాను శయనించి ఉన్న విగ్రహాన్నిచ్చి దానిని అర్చించమంటాడు. ఆ తరువాత అది సూర్యుని వద్దకు అంచలంచలుగా చివరకు సూర్యవంశం వాడైనా శ్రీరామచంద్రుని వద్దకు చేరుతుంది. పట్టాభిషేకం అయిన తరువాత విభీషణుడు కోరగా శ్రీరామచంద్రుడు దానిని అతనికి ఇస్తాడు. ఆ విగ్రహాన్ని లంకకు తీసుకుపోతూ దారిలో కావేరీ నది ఒడ్డున నేలపై పెట్టగానే అది అక్కడే ప్రతిష్ఠితమవుతుంది. అదే శ్రీరంగనాధుడు వెలసిన దివ్యక్షేత్రం శ్రీరంగక్షేత్రము. శ్రీ రంగనాథుడు వెలసిన ఆరోజు చైత్ర శుక్ల పాడ్యమే ఉగాది.

ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ పండుగ అత్యంత ముఖ్యమైనది. ఇది కేవలము తెలుగువారి పండుగ మాత్రమే కాదు, తమిళనాడు, మలయాళీలు, సిక్కులు, బెంగాలీలు అందరు ఒక్కసారి ఆనందంగా జరుపుకునే పండుగ. ఆ రోజున ఇళ్ళల్లోనే కాదు ఆలయాలలో కూడా ఈ ఉగాది పండుగ జరుపబడుతుంది. ఆలయాలలో పంచాంగ పఠనం ప్రధానంగా జరుపబడుతుంది.

పంచాంగంలో ఐదు అంగాలు ఉంటాయి. అవి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం అని చెబుతారు. ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును నక్షత్రం పాప ప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను, కరణం పవిత్ర గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని నమ్ముతారు. పంచాంగ శ్రవణం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని పండిత వాక్కు. ఈ పంచాంగము కాలపురుషుడయిన మహావిష్ణువుకు ప్రతిరూపం. పంచాగ శ్రవణం వలన నవగ్రహాలు సకల సౌఖ్యాలు కలగచేస్తాయని, దైవానుగ్రహం కలుగుతుందని, గంగా స్నానం ఫలితం కలుగుతుందని పండిత వాక్కు. ఈ ఐదింటిని లెక్క వేసి దేశ భవిష్యత్తును, మానవుడి యొక్క మంచి చెడులను గురించి పండితులు వివరించి చెబుతారు. దీనినే పంచాంగ శ్రవణము అంటారు.

ఉగాది పండుగ రోజున తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ప్రతి దేవాలయం నందు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ పంచాంగపఠనము జరుపబడుతుంది. ఉగాది యొక్క ప్రత్యేకతను గురించి నిర్వహించే కవి సమ్మేళనాలలో కవులు ఉగాది ప్రత్యేకతను గురించి కవితాలాపన చేస్తారు. ఉగాది పురుషునికి నీరాజనాలు అర్పిస్తారు.

గుమ్మాలకు మామిడి తోరణాలను కట్టి

పరమాత్మ స్వరూపమైన విశ్వావసుకు

స్వాగతం పలుకుతూ ఉగాది సంబరాలు జరుపుకుందాం.

Exit mobile version