Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యుద్ధ ఋతువు..!

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘యుద్ధ ఋతువు..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

లోకానికి వెలుగులు
జీవన యానానికి ఆహ్వానం
గాయాల వలపోతలు
ఆత్మీయమైన స్పర్శతో మటుమాయం
చేయూతనిచ్చే పలకరింపులు
శాంతి వసంతానికి స్వాగతం..!

కొండల నుండి తరలివస్తున్న
కాంతి కిరణాలే ఆత్మ బంధువులు
ఆకర్షణీయమైన నీటి రంగులు
మానవీయమైన కరచాలనాలు
సమయోచితమైన క్షణాలే
అవస్థలకు చివరంకాలు..!

దయనీయమైన కథనాలు
మట్టిబంధాలు మసకబారుతున్నాయి
నదుల మధ్యన సంచారాలు
ఆర్తనాదాలు వినబడుతున్నాయి
అడవులు, లోయలు, శిఖరాలు
స్వార్థపు జ్వాలలు ఎగసిపడుతున్నాయి !

విస్తరించిన అశాంతి పవనాలు
ఆగమైపోతున్న కపోతాలు
యుద్ధపు విలయతాండవాలు
హృదయ విదారకరమైన దృశ్యాలు
విస్తృతమైన సామ్రాజ్యవాద వ్యూహాలు
అతలాకుతలమవుతున్న సామాన్యులు

ఆక్రమణలకు సరిహద్దులు
అధికార దాహాలకు హద్దులు లేవు
ఆవరించిన అంధకారంలో
క్షిపణులతో మానవలోకం దహనం
యుద్ధ ఋతువు దగ్ధంకై
పిడికిల్లెత్తి నగారా మొగిద్దాం..!

Exit mobile version