[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘యోగవిద్యలో సమతుల్యత ప్రాధాన్యత’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 6వ అధ్యాయం, 16వ శ్లోకం
నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున॥
ఓ అర్జునా, ఎవరైతే అతిగా భుజిస్తారో, లేదా మరీ తక్కువగా తింటారో, అతిగా నిద్రించేవారికి, ఏ మాత్రం నిద్రించనివారికి యోగంలో విజయం సిద్ధించదు అని పై శ్లోకం భావం.
శారీరిక నిర్వహణ నియమాలను అతిక్రమించినవారు యోగములో సాఫల్యం సాధించలేరన్నది ఈ శ్లోకం సారాంశం. మనం నిజానికి మన శరీరంలో హృదయ స్థానంలో నివసించే ఆత్మ అని, మనము ఈ శరీరము కాదు అన్న విషయం వేదం స్పష్టం చేస్తున్నా, ఆత్మ ఈ శరీర్రాన్ని ఒక ఉపాధిగా పొంది తనకు విధించిన కర్మలను నెరవేరుస్తోంది. కాబట్టి ఆత్మ నివాసమైన ఈ శరీరమే మన జీవించి ఉన్నతకాలం మన వాహనం అని భావిస్తూ, దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అందుకోసం యోగ శాస్త్రం కొన్ని నియమాలను మానవాళికి విధించింది. ఆ నియమాలను అనుసరించి జీవితం గడిపేవారు యోగులై ఆధ్యాత్మిక మార్గంలో చక్కగా పయనించి చివరకు భగవంతుని చరణాలను చేరుతారు. వాటిని లక్ష్యపెట్టనివారు సోమరిపోతులై, అనుక్షణం శరీర సౌఖ్యాలకు అలవాటు పడి, శరీర నిర్వహణ నిమిత్తమే తమ జీవితం గడుపుతుంటారు. అటువంటి వారికి ఆధ్యాత్మ విద్య ఎన్ని జన్మలకైనా వంటబట్టదు.
మన వేద శాస్త్రాలు ఆధ్యాత్మికతతో పాటు శారీరిక స్వస్థత పట్ల కూడా చాల శ్రద్ధ చూపిస్తున్నాయనటానికి ఈ శ్లోకం ఒక చక్కని నిదర్శనం. అందుకే, మరీ ఎక్కువ తినటం లేదా అసలు తినక పోవటం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం వంటివి యోగమునకు అవరోధాలు. ఆధ్యాత్మిక సాధకులు – తాజా పోషకాలతో కూడిన ఆహారం భుజిస్తూ, ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ, రాత్రి పూట తగినంత నిద్రపోతూ – తమ శరీరాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. ఆ పరమాత్ముడిని పొందే భక్తి ప్రత్యేక ఆసనం లేదా భంగిమలో ఏకాంత ప్రదేశంలో కూర్చోవడం ద్వారా విజయవంతం కాదు, లేదా ఎక్కువగా తినే వ్యక్తి, లేదా అస్సలు తినని వ్యక్తి అంటే ఉపవాసాలు పాటించడం ద్వారా, లేదా ఎక్కువగా నిద్రపోయే వ్యక్తి లేదా బలవంతంగా మేల్కొని ఉండే వ్యక్తి విజయవంతం కాదు. అన్నింటిలో మితం వుండాలన్న విషయాన్ని ప్రతీ సాధకుడు తమ మనసులో పదిలపరచుకోవాలి.
పతంజలి యోగసూత్రాలలో శారీరక నిర్వహణపై ఒక ప్రత్యేక వివరణ వుంది. ఆహారం మరియు నిద్రలో మితంగా ఉండటం అన్ని సాధకులకూ ఒక షరతు. ముఖ్యంగా ధ్యాన యోగాలలో, ఇది చాలా ముఖ్యమైనది. శరీరం తేలికగా మరియు బలంగా లేకపోతే, ధ్యానం సాధన చేయడం కష్టం. కాబట్టి, ఆహారం మరియు నిద్రను నియంత్రించడం యోగా యొక్క మొదటి షరతుగా సూచించబడింది. సాధారణంగా, ఆధ్యాత్మికత అనేది శరీరంతో సంబంధం లేనిది కాబట్టి సాధకులు ఏమి తింటారన్న దానిపై పట్టింపు లేదని ప్రజలు భావిస్తారు. అది అలా కాదు. శరీరం నియంత్రించబడకపోతే అది ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి ప్రధాన అడ్డం అవుతుందని పతంజలి మహర్షి స్పష్టంగా పేర్కొన్నాడు.