Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాతృత్వాన్ని భిన్నంగా వ్యక్తీకరించిన కథల సంకలనం ‘యోధ’

[విజయ భండారు గారి సంపాదకత్వంలో వెలువడిన ‘యోధ’ అనే కథాసంకలనాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్]

స్మిత ప్రచురణల తరఫున ప్రచురించిన 53 మంది రచయిత్రుల కథల సంకలనం ‘యోధ’. మాతృత్వాన్ని భిన్నంగా వ్యక్తీకరించిన కథలివి.

“మాతృత్వం అనేది ఒక వాస్తవిక సామాన్య భావన. అన్ని అనుభూతులతో పాటు అది కూడా ఒక అనుభూతి. ప్రకృతి రీత్యా స్త్రీలకు పిల్లల్ని నవమాసాలు మోసి కనే అవకాశం వున్నందు వల్ల వారు ఆ పనిని చేయగలుగుతున్నారు. అదే అవకాశంగా తీసుకుని పిల్లల పూర్తి భారం, బాధ్యతలను తల్లులపై కుటుంబ వ్యవస్థ నెట్టివేయడాన్ని తిరస్కరిస్తూ.. పిల్లల పెంపకం, బాధ్యత, సంరక్షణ అంశాలలో పురుష భాగస్వామ్యం ఉండాలని నేటి తల్లులు కోరుకుంటున్నారు.

అలాంటి తల్లుల చరిత్రలు కొనసాగింపుగా.. ‘మాతృత్వ’ భావన చాటున స్త్రీలకు ఎదురైన మానసిక, శారీరిక సంఘర్షణలను, హింసలను, సామూహిక సవాళ్ళను ఆత్మస్థైర్యంతో ఎదుర్కుని, ధైర్యంగా నిలబడిన ‘యోధ’ల జీవిత చిత్రీకరణలే ఈ కథలు” అని తమ ముందుమాటలో వ్యాఖ్యానించారు విజయ భండారు.

~

కె. వరలక్ష్మి గారి ‘శత్రువు’ కథలో తాను ఇద్దరు ఆడపిల్లల తల్లిని అనుకునే కోడలు అత్తగారి పట్ల ప్రవర్తించిన తీరుని ఎలా అర్థం చేసుకోవాలో, పాపం, చివరిదాకా, అలా అర్థం చేసుకోదా అత్తగారు. ఆ ఇల్లు వాళ్ళ నలుగిరికే పరిమితమని తెలిస్తే తాను వచ్చేదాన్నే కాదంటుందా అత్తగారు. కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోతూ, ఆవిడ నవ్వీ నవ్వక నవ్విన నవ్వుని ఎలా అర్థం చేసుకోవాలో కోడలికి తెలియలేదు.

ఎండపల్లి భారతి గారి ‘తలపండిన గొడ్రాలు’ కథ – పిల్లలున్నవారికన్నా, నిస్సంతు అయిన కనకం సుఖంగా ఉందని చెప్తుంది. అందుకు కారణాలనూ చెప్తుంది. పిల్లలు అదుపుతప్పి, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తూ, వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పుడల్లా, జనాలు, ఇంతకు ముందు – గొడ్డుది, గొడ్డోడు అని తాము హేళన చేసిన కనకాన్ని, ఆమె భర్తని తలచుకుని, వాళ్ళే నయం అనుకుంటారు. ఎముక లేని నాలుక ఎటైనా మాట్లాడుతుందని అనుకుంటారు. కనకంలోని మంచితనాన్ని ప్రస్తావించుకుంటారు.

వి. శాంతిప్రబోధ గారి ‘గణేశ్ అలియాస్ గౌరి’ కథ సమాజంలో బహిష్కృతులుగా పరిగణింపబడే ట్రాన్స్ మహిళ అంతరంగ వేదనని ఆర్ద్రంగా చాటింది. అన్ని మాతృత్వాలు సమానం కావని, ఒకేలా ఉండవని ఆమె గ్రహిస్తుంది. మాతృత్వానికి జెండర్ అంటించవద్దని ఆమె సూచిస్తుంది.

తోటికోడలు నీలిమ మాతృత్వాన్ని కొల్లగొట్టాలని అనుకున్న సంధ్యలో మార్పు ఎలా వచ్చింది? ఇంట్లో పెద్దవాళ్ళ భయానికి లొంగిపోయిన నీలిమ భర్త ఆమెనెలా మోసం చేశాడు? కావ్య నీలిమకి ఏ విధంగా సాయపడిందో తెలియాలంటే, నండూరి సుందరీనాగమణి గారి ‘అమ్మే కావాలి’ కథ చదవాలి.

‘అమ్మలంటే పిల్లల బతుకును నిలబెట్టేటోళ్ళు. మా అమ్మ అల్లుని బతుకు గురించి రంధి బడతాంది’ అనుకుంటుంది అనూష సమ్మెట ఉమాదేవి గారి ‘మోదుగ పూలు’ కథలో. పెళ్ళి వయసు రాకుండానే పెద్దకూతురు ప్రత్యూషకి వయసు ఎక్కువ రాయించి పెళ్ళి చేసేసి, ఆమె మరణించాకా, అల్లుడికి రెండో కూతురుని కట్టబెట్టాలనుకున్న ఆ తల్లి ఆలోచనలో న్యాయముందో లేదో ఈ కథ చెబుతుంది. కథలోని ఆఖరి వాక్యంతో కథ శీర్షికని జస్టిఫై చేశారు రచయిత్రి.

స్పెషల్ చైల్డ్ రచన ఎదుర్కున్న ‘వివక్ష’ని డా. చెంగల్వ రామలక్ష్మి గారు ప్రభావవంతంగా వివరించారు తన కథలో. రచన తల్లి పడే వేదనని అర్థం చేసుకునేదెవరు? తనలాంటి తల్లులకు ఊరట ఎప్పుడు కలుగుతుందో ఆమె చెప్తుంటే హృదయం భారమవుతుంది.

‘అమ్మీ.. అవసరం నిఖా వరకే కాదు, అసలు అవసరం ఆ తర్వాతే’ అని తల్లిని తలచుకుంటుంది కూతురు, షేక్ నసీమా బేగం గారి కథ ‘వజూద్’లో. అమ్మ తరువాత అమ్మలా, అక్క ఇచ్చిన మద్దతుతో, భర్త చేసిన మోసాన్ని ఎదిరించి, కూతురితో, తన బతుకు తాను ఆత్మవిస్వాసంతో బ్రతుకుతుంది ఇషాన్.

రుక్మిణి దేవరకొండ గారి ‘లచ్చితల్లి’ కథ – మాతృత్వానికి సంబంధించి సమాజంలో స్త్రీలకు ఎదురువుతున్న ఒక పెద్ద ప్రశ్నని ముందుకు తెస్తుంది.

సింగరాజు రమాదేవి గారి ‘ఇంకొంచెం ప్రేమించనీవా’ కథలో – తన తల్లికి దొరికే ఆటవిడుపు ఏమిటో, దాని వల్ల ఆమె ఎన్ని ఒత్తిళ్ళను తట్టుకుందో అనఘ తలచుకుంటుంది. తనది ఆటవిడుపు కాదని, కెరీర్ అనీ భర్తా, అత్తమామలు ఎందుకు అర్థం చేసుకోరో అని బాధపడతుంది. అనఘ సమస్యని ఆమె బాస్ సువర్ణ పరిష్కరించిన తీరు – సమంజసం, ఆచరణీయం!

మతాంతర ప్రేమ వివాహం, తన అస్తిత్వాన్నే మార్చేసిన వైనాన్ని ఓ స్త్రీ చెప్పుకుంటుంది, డా. లక్ష్మీసుహాసిని గారి ‘జాస్మిన్’ కథలో. ప్రేమించి పెళ్ళాడిన భర్త పెట్టే మానసిక హింస నుంచి జాస్మిన్ తప్పించుకోగలిగిందా? భార్యని వేధించడానికి అతను చెప్తున్న సాకు, ఘటనకి అసలు కారణం అతడే అయినా, నిస్సిగ్గుగా తప్పించుకుని తిరిగే అతన్నుంచి విముక్తి కలిగినా, మానసిక క్షోభనుంచి బయటపడడానికి చాలా కాలమే పడుతుంది జాస్మిన్‍కి.

నల్లూరి రుక్మిణి గారి ‘అజమాయిషి’ కథ – నూతన జీవితం కావాలనుకున్న సువర్చల ఏ యుద్ధం చేయాల్సి వస్తుందో చెప్తుంది. ఆమె తల్లిది ఆమెపై ప్రేమా, అజమాయిషినీ అనేది పక్కింటి తులసికి అర్థం కాదు.

చేతి రాత వంకరగా ఉండే ఓ కుర్రాడు, అతని తల్లి ఎదుర్కున్న సవాళ్ళను, హేళనలను వంజారి రోహిణి గారి ‘కన్నా.. నీ చేతిగీత..’ కథ ఆర్ద్రంగా వ్యక్తీకరిస్తుంది. డ్రాయింగ్ స్కూల్లో చేరాలనుకున్న కొడుకు కోరికను తీర్చేందుకు ప్రయత్నించిన తల్లి కృషిని అర్థం చేసుకోలేని కొడుకు జీవితాన్ని బలవంతంగా ముగిస్తాడు. మానసిక వేదననను అనుభవిస్తున్న వారిను అనుక్షణం గమనిస్తూండాల్సిన అవసరాన్ని ఈ కథ మరోసారి గుర్తు చేస్తుంది.

వి. ప్రతిమ గారి ‘నిగూఢ’ కథలో డా. జయప్రద, తన ఆప్తమిత్రురాలు శారద వద్ద ఓ రహస్యాన్ని దాచి, చాలా ఏళ్ళ తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఆమెకు వెల్లడిస్తుంది. జయప్రద చేసిన పని సరైనదా, అనైతికమా అన్న ప్రశ్న తలెత్తినా, ఆమె ఆశించిన ప్రయోజనం నెరవేరడంతో, శారద కూడా ఆ రహస్యాన్ని తనలోనే దాచుకుంటుంది.

తన కూతురు, అల్లుడు ఎందుకు పిల్లల్ని కనాలని అనుకోవడంలేదో విజయకి అర్థం కాదు. “Motherhood is not my cup of tea” అనే కూతురిని, తమ నిర్ణయానికి అనువుగా వాసెక్టమీ చేయించుకున్న అల్లుడిని ఏమనాలో ఆమెకి, ఆమె భర్తకి అర్థం కాదు కల్పన రెంటాల గారి ‘నో రిగ్రెట్స్’ కథలో. Childless by choice అనే శ్రీజ, అనీష్‍ల నిర్ణయం వారి పెద్దలకి రుచించదు. కానీ వాళ్ళిద్దరూ ఎందుకా నిర్ణయం తీసుకున్నారో కథ చెప్పదు.

ఎం. ఆర్. అరుణకుమారి గారి ‘అమ్మ కానుక’ కథలో వెళ్ళిన ప్రతి పెళ్ళిచూపులలో, సుధీర్ తన కోరిక చెప్పడం, సంబంధం కలవకపోవడం జరుగుతుంది. అతని కోరిక ఏమిటి? వారసత్వ, స్వార్థ అనుబంధాలను మర్చిపోయే అవకాశాన్ని ఓ తల్లికి అతనెలా కల్పించాడో ఈ కథ చెబుతుంది.

కన్న కూతురు – తమ పట్ల అత్యంత స్వార్థంగా, సంకుచితంగా వ్యవహరించడంతో, ‘తల్లిప్రేమ’ని అధిగమించి, ఓ గట్టి నిర్ణయం తీసుకుంటుంది లలిత అయినంపూడి శ్రీలక్ష్మి గారి ‘తుది నిర్ణయం’ కథలో. సాయిపద్మ గారి ‘ఆకాశమంతా ఆలాపనలే’ గొప్ప స్ఫూర్తిదాయక కథ.

మణి వడ్లమాని గారి ‘అనాచ్ఛాదిత’ కథలో కూతురు “నువ్వు అమ్మవని ఎలా చెప్పుకోను?” అంటుంది తల్లితో. బదులుగా ఆ తల్లి ఏం చెప్పిందో వింటే, సోషల్ ప్రిస్టేజ్ అంటూ కూతురు తల్లిని ఎంత దూరం చేసుకుందో అర్థం అవుతుంది.

“జీవితం మరీ ఇంత ఇరుకైపోతుందని సులోచన అనుకోలేదు” అనే వాక్యంతో మొదలయ్యే పద్మకుమారి గారి ‘పొద్దుచాలని మనుషులు’ కథ. హక్కుల ఉద్యమంలో పోరాడిన ప్రమీల అనారోగ్యం వల్ల; ఆమె నేస్తం సులోచన సంసార బాధ్యతల వల్ల ఇంటికే పరిమితమవుతారు. గట్టిగా నిశ్చయించుకుని ప్రమీల చూడ్డానికి వెళ్ళిన సులోచన. తన మీద తాను అసంతృప్తితో ఉంటూ, ప్రమీలపై జాలిపడిన సులోచనకి – తన అభిప్రాయాన్ని స్థిరంగా, స్పష్టంగా చెబుతుంది ప్రమీల ఈ కథలో.

కాంతి నల్లూరి గారి ‘హృదయ జనని’ కథలో రెండు పాత్రలకి పెట్టిన పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి. విజ్ఞయ, హలంత. ఉద్యమంలో భాగంగా పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ చేయించుకుంటాడు విజ్ఞయ భర్త. తరువాతి కాలంలో వాళ్ళ కూతురు హలంత పుట్టిందని విన్న జనాలు – ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరి కూతురు వంటి చౌకబారు ప్రశ్నలు వేసి ఆ దంపతులను విసిగిస్తారు. బిడ్డని కంటేనే అమ్మతనమా? కనని వాళ్ళు అమ్మలు కాదా? అని ప్రశ్నిస్తుందీ కథ.

గిరిజ పైడిమర్రి గారి ‘ఫాదర్‌హుడ్’లో ఆడపిల్లే కావాలనుకున్న శైలజకి మగపిల్లాడు పుడతాడు. మదర్‌హుడ్ అనేది స్త్రీలకి తరతరాలు కండీషన్డ్ చేయబడ్డ స్థితి అనీ, కనడం, పాలివ్వడం మాత్రం ఆడవాళ్ళే చేయగలరనీ, మిగతా అన్ని పనులు మగవాళ్ళు కూడా చేయచ్చనీ, అదే ఫాదర్‍హుడ్ అని భర్త రవితో చెబుతుంది. ఇద్దరం కలిసి వీడిని మగాడిలా కాకుండా, మనిషిలా పెంచుదాం అంటుంది.

“జీవితం అనే ప్రశ్నాపత్రంలో కాలం కొన్ని సమాధానాలను అందిస్తుంది. కొన్ని సమాధానాలు మనమే వెతుక్కోవాలి” అంటుంది రత్న సుమతి గారి ‘తిరిగిరాని వసంతం’ కథ. వి. యశోద గారి ‘ముత్యాల గర్భం’ గర్భధారణలోని అపోహలని దూరం చేస్తుంది. కన్న ప్రేమని అణచుకుని, నేరం చేసిన కొడుకుని పోలీసులకి పట్టిస్తుంది ఉమ, ‘నేరానికి శిక్ష’ కథలో. జ్యోతి వలబోజు గారి ఈ కథలో తల్లి ప్రేమని, సామాజిక బాధ్యత జయిస్తుంది.

“ఇక్కడ మనుషులు వేగానికి అనుగుణంగా బ్రతకాలి, బ్రతుకు చక్రంలో పుల్లలాగా ఉండాలి. ఏ ఒక్క పుల్ల విరిగినా చక్రం పనితనం తగ్గినట్టే” అని గొప్ప సత్యాన్ని చెబుతుంది డా. నందిగామ నిర్మలకుమారి గారి ‘క్షతగాత్రి’ కథ. సరోగసీ వ్యాపారమయమైన వైనాన్ని ప్రశ్నిస్తుంది.

వాసరచెట్ల జయంతి గారి ‘నింగికి మొలిచిన రెక్కలు’ కథ ఆశావాదాన్ని నింపుతుంది. గట్టి నిర్ణయం తీసుకున్న యువతి, ఆమెకు అండగా నిలిచిన మంచి మనుషులు! కొందరి జీవితాలను మలుపు తిప్పడానికి దోహదమవుతుంది.

పద్మావతి రాంభట్ల గారి ‘రెండు ఆకాశాల మధ్య’ కథలో వింధ్య వాళ్ళ బాస్ భర్త; జి. అనసూయ గారి ‘అమ్మ’ కథలో జావేద్ ఈ పుస్తకంలో తారసపడే నిజమైన మంచి మగవాళ్ళని అనిపిస్తుంది. శాంతిశ్రీ బెనర్జీ గారి ‘నీటిమీద రాతలు’ కథలో వృద్ధాప్యంలో పెద్ద కూతురు తప్ప, మిగతా పిల్లలు ఎవరూ సరిగా చూసుకోకపోవడంతో బలవంతంగా జీవితాన్ని ముగిస్తుంది భాగ్యమ్మ. హర్షించలేని నిర్ణయం తీసుకునేలా ఆమెని ప్రేరేపించిన పరిస్థితులు సృష్టించిన ఆ పిల్లలపై పాఠకులకి కోపం రావడంలో ఆశ్చర్యం లేదు.

భండారు విజయ గారి ‘మార్పు అనివార్యం’ కథ ట్రాన్స్‌జెండర్స్ జీవితాలని మానవీయ కోణంలో చూపుతుంది. అనివార్యమైన మార్పును ఆమోదిస్తే, ఇరువైపులా సంతోషమే ఉంటుందన్న సూచన చేస్తుంది.

గీతాంజలి గారి ‘ఫ్లైయింగ్ మదర్స్’ నేటి తరంలో కొందరు తల్లులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యని చక్కగా ప్రస్తావించింది. “ఆ ముసలివాళ్ళ ఫ్లైట్. రిటైర్ అయిన అమ్మానాన్నల ఫ్లైట్. పిల్లల కోసం, మనవళ్ళను పెంచడం కోసం, విరిగిన రెక్కలతో ఆదరాబాదరాగా ఫ్లైట్ ఎక్కుతూ దిగుతూ.. నడుములు విరిగిపోతున్నా, రోజుల తరబడి ప్రయాణాలు చేస్తూ.. సముద్రాలు, ఆకాశాలు దాటుతూ, ప్రమాదాలు లెక్కచేయకుండా బిడ్డల కోసం చేసే ప్రయాణాలు. వృద్ధుల ప్రయాణాలు. వృద్ధ ప్రయాణాలు.. ప్రేమ దొరకని వృథా ప్రయాణాలు” అనుకుంటుందో పాత్ర. వర్తమాన సమాజంలోని ఓ ధోరణిని, చేదునిజాన్ని ఈ కథ చాటుతుంది.

‘తల్లితనం’ సమస్యలని, కోర్టు నేపథ్యానికి ముడిపెట్టి హేమలలిత గారు రాసిన ‘భార్య – భరణం’ కథ భిన్నంగా సాగుతుంది. న్యాయవాది వృత్తిలో మహిళలు ఎదుర్కునే సమస్యలను ప్రస్తావిస్తుంది, స్త్రీల సమస్యలను కోర్టు దృశ్యాలతో ముడిపెట్టి వ్రాసిన కథ ఈ సంకలనంలోని వైవిధ్యం!

ఓ ట్రాన్స్‌జెండర్ తల్లి తన కూతురి వైవాహిక బంధాన్ని నిలపడానికి చేసిన ప్రయత్నం, అందుకు సాయం చేసి ఆమె అల్లుడిలో మార్పు వచ్చేలా చేసిన కౌన్సిలర్లు ఉన్నతంగా కనిపిస్తారు మోహన గారి ‘పురస్కృత’ కథలో.

మానస ఎండ్లూరి గారి ‘ముందుచూపు’, డా. తాళ్ళపల్లి యాకమ్మ గారి ‘ఇంకా ఎన్నాళ్ళు’, జ్వలిత గారి ‘మాతృక’, ఝాన్సీ కొప్పిశెట్టి గారి ‘మేలిముసుగు’, డా. సమ్మెట విజయ గారి ‘చీకటి మనుషులు’.. తదితర కథలలోని పాత్రలు ఎన్నో ప్రశ్నలు వేస్తాయి. సమాధానాలను అన్వేషిస్తాయి. పాఠకులనూ జవాబులు వెతకమంటాయి.

***

యోధ (కథలు)
సంపాదకురాలు: విజయ భండారు
ప్రచురణ: హస్మిత ప్రచురణలు
పేజీలు: 495
వెల: ₹ 500.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఇతర పుస్తక విక్రయ కేంద్రాలు.
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/yodha-matrutvam-bhinna-vyakthikaranalu

 

Exit mobile version