వీర హనుమాన్ దేవాలయం, రామ సముద్రం
కుల శేఖర్ గారిది పూర్వీకుల పురాతన గృహం. దానిని కుల శేఖర్ గారు ఆధునీకరించారు. దానిలో వారు చూపించిన నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా వుండలేక పోయాము. పెద్దలు, వారి తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకున్నాము.
వారి మాతృమూర్తి వడ్డించిన కమ్మని భోజనం కడుపారా ఆరగించాము. భోజనం పెట్టటమే కాదండీ. మంచి జాకెట్ బట్ట, పసుపు కుంకాలతో తాంబూలమిచ్చారు. వారి ఆదరణకు హృదయం ఉప్పొంగగా అక్కడనుండి బయల్దేరాము.
ఇక్కడ ఇంకో విశేషం చూశాము. వాళ్ళింటిని ఆనుకునే వున్నది వీర హనుమాన్ దేవాలయం. అక్కడికి తీసుకెళ్ళారు. ముందు చాలా పెద్ద హాలు కనబడ్డది. ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటారేమో అక్కడ అనుకున్నాము. అక్కడ ఆలయం వున్నట్లు తెలియలేదు. లోపలకి వెళ్ళాక ఎడమ చేతి పక్క ఆలయం వీర హనుమాన్‌ది 7 అడుగుల పైన విగ్రహం. నాకు ఆ విగ్రహం చూడగానే వరంగల్ భద్రకాళి అమ్మవారు గుర్చొచ్చారు. అంత పెద్దగా వున్నది.
స్వామి మకర తోరణంలో శంఖు, చక్రాలున్నాయి. ఈయన ఇది వరకు పెరుగుతూ వుండేవారట. అప్పుడు ఎడమ చేయి పైన రెండు రంధ్రాలు చేస్తే పెరగటం ఆగిందట. ఆ రంద్రాలను చూపించి ఆ విషయం చెప్పారు.
ప్రతి మంగళ వారం ప్రత్యేక పూజలు, ఇంకా హనుమజ్జయంతి, శ్రీ రామ నవమి వంటివి వైభవంగా జరిపిస్తారుట.
150 సంవత్సరాల క్రితం వారి తాతల కాలంలో వారు సంతానం కనగక పోతే రావి మొక్క నాటి, నాగ ప్రతిష్ఠ చేశారుట. ఇప్పుడా చెట్టు మొదలు విగ్రహాన్ని కప్పేస్తూ పెరిగింది. చాలా పెద్ద వృక్షం. ఇంకా కొందరు భక్తులు, కుల శేఖర్ గారు చేసిన నాగ ప్రతిష్ఠలు కూడా చూపించారు.
రామ సముద్రం లోనే ఇంకా చాలా పురాతన ఆలయాలు వున్నాయని, వాటిలో ముఖ్యమైన వాటిని చూపిస్తామన్నారు కుల శేఖర్ గారు. మాకు మృష్టాన్న భోజనంకన్నా ఎక్కువ అన్నమాట. సంతోషంగా బయల్దేరాము.
వచ్చే వారం ఊరు కన్నా ముందే వెలిసిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం గురించి.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.