Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యాచకులు లేని ఊరు

[బాలబాలికల కోసం ‘యాచకులు లేని ఊరు’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ.]

భువనగిరి రాజ్య పాలకుడు గుణశేఖరుడు అతను తన మంత్రి సుబుధ్ధితో కలసి రాజధాని పొలిమేరలలో జరిగే సంతకు మారువేషాలతో చేరుకున్నాడు.

సంతలో విక్రయ, కొనుగోలుదారులతో పాటు పలువురు వృధ్ధ యాచకులు కనిపించారు గుణశేఖరునకు.

“మంత్రివర్యా, ఇందరు వృధ్ధులైన యాచకులు ఇక్కడ కనిపించడానికి కారణం ఏమైఉంటుంది?” అన్నాడు రాజు గుణశేఖరుడు.

“ప్రభూ వయసులో పెద్దవారైన తమతల్లి తండ్రి పట్ల జాలి, దయలేకుండా ఇంటినుండి వెలివేయడంతో, ఆ వృధ్ధులు శ్రమించే వయసు కాదు కనుక ఇలా యాచన చేస్తూ ఆలయాలలో లభించే ప్రసాదం తినీ అర్ధాకలితో అలమటిస్తున్నారు” అన్నాడు మంత్రి.

“మంత్రివర్యా, మూడురోజులలోగా తమ తల్లి, తండ్రి, తాత వంటి వృధ్ధులను వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి. అలా చేయని చేయనివారికి బహిరంగంగా వారి వీధిలో నే ప్రజల ముందు ఇరవై కొరడా దెబ్బలతో పాటు మూడు సంవత్సరాలు చెరసాల శిక్ష విధిస్తామని రాజ్యం అంతటా దండోరా వేయించండి” అన్నాడు రాజుగారు .

“ప్రభు గుర్రాన్ని నీటి వద్దకు తీసుకు వెళ్ళగలం కాని నీటిని తాపించలేము, ఇది అంతే. వారిని ఇంటికి పంపించగలం కానీ వారు ఆ ఇంటిలో ఎలా ఉన్నారు అన్నది మనం తెలుసుకోలేం” అన్నాడు మంత్రి.

“ప్రతి వృధ్ధునికి నెలకు ఐదు రూకలు ప్రభుత్వం వారి ఇంటికి వెళ్ళి చెల్లిస్తుంది, అప్పుడు వారిని ఆ ఇంట్లో ఎలా చూస్తున్నారో విచారణ చేయిద్దాం! ఎవరైనా ఆ వృధ్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి మూడు ఏళ్ళ చెరసాల శిక్ష విధిస్తామని ప్రకటించండి” అన్నాడు రాజు.

“ప్రభూ సంతానం లేని వారు పలువురు ఈ యాచకుల్లో ఉన్నారు వారందరికి సముచిత న్యాయం చేయాలి తమరు” అన్నాడు మంత్రి.

“అలాగే అటువంటివారికి సదుపాయాలు కలుగజేస్తూ వృధ్ధాశ్రమాలు వెంటనే నిర్మించండి” అన్నాడు రాజుగారు.

మంత్రి తక్షణం రాజుగారి ఆజ్ఞ అమలు జరిపాడు. కొద్దిరోజుల్లో భువనగిరి రాజ్యంలో ఏ ఊరిలోనూ భిక్షాటన చెసేవారు కనిపించలేదు.

Exit mobile version