[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘వ్యాధ మౌని గాథ’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 3వ, చివరి భాగము.]
~
31.
వీటి కేగి ప్రశ్నించె నా వెఱ్రి వాడు
సతి యతని కట వివరించె సత్య మెల్ల
ఆలు బిడ్డల పోషణ అతనికి విధి
అందు భర్త యఘము గొను మనుట తప్పు
ధనమె కావలె, నఘమేల తనకు ననియె
32.
అఘము గైకొన నొప్పరే, అయ్యొ రామ!
వీరి కొరకేల పాపంబు బారి పడగ
నేనటంచు తర్కించెను మానసమున
వ్యాధు మదిలోన నిండెను వంత ఎంతొ
33.
తిరిగి ముని దరి కేగి యా తీరు దెలిపె
వారి కొరకు తానేల నీ పాప కృత్య
ముల నొనర్ప వలయు నొక్కొ? మూర్ఖుని గతి
పుణ్య పథమున నడచుటే బుద్ధి యుక్త
మనుచు సత్యమున్ గ్రహియించె మనము నందు
34.
ముని యతని మది మార్చి, తా ముద మొసంగు
మంత్ర మొకటి బోధించె ప్రమాణ మనగ
“రామ”నామ జప మొనర్ప ,రమ్య మనుచు
పాప భంజక మంత్రమీ భవ్య నామ
మనుచు, మది నిల్పి ధ్యానింప ముని వచించె
35.
మౌని బోధ నా వ్యాధుండు మానె హింస
వీడె సంసార భారంబు,వీడు వీడె
కాననంబున తపమును కఠిన చిత్తు
డై యొనర్ప సాగెను ధృతి ననుసరించి
జన్మ ధన్య మొనర్ప నా జనుడు తలచె
36.
మౌని సద్బోధల నెరింగి జ్ఞాని యయ్యె
భవము తొలగు సన్మార్గంబు ప్రాప్త మగుట
రక్తి విడిచి,విరక్తుడై భక్తు డయ్యె
పెరిగె గడ్డంబు ,పుట్టముల్ చిరిగి పోయె
పుడమిపై గట్టె పైపైన పుట్ట లెన్నొ
తి0డి త్రిప్పలు లేకుండె ,దీక్ష దైవ
దర్శన మొకటే ధ్యేయమై తనరె తాను
కడచె పెక్కేండ్లు, పరిణతి గాంచె నతడు
37.
పాప కృత్యంబులను, హింస పార విడిచె
భవ్య జీవన పథమును బట్టు కొనియె
దైవ చింతనా పరుడౌచు తత్త్వ మఱసె
భక్తి మార్గ మనుసరించి, ముక్తి బడసె
38.
అంత రంగంబు శుద్ధమై,సంతరించె
శాంతి, సహనంబు, ధర్మంబు,సత్య పథము
భూతసేవయు,కరుణయు, పూత చరిత
హృదయ కుహరాన నింపె నమృతము సతము
ఆర్ష సంప్రదాయ మఱసె నహరహంబు
సజ్జనుండు, సద్గుణుడును, సన్మతియును
గాగ, జన్మ ధన్య మగుట ఖ్యాతి నందె
39.
తానె వాల్మీకియై యొప్పె ధరణి యందు
మానవత్వంబు వృద్ధియై, మాన్యు డయ్యె
మనసు స్వచ్ఛమై, శీలంబు నెనయ జేసె
తత్త్వ చింతనా ధ్యాసతో తనరె బ్రతుకు
సచ్చిదానందమును బొంద నిచ్చ వొడమె
40.
నవ విధంపు భక్తి పథము లవధరించె
వేద వేదాంగ విద్యల విషయ మెఱిగె
సంఘ సేవారతిని బొందె సాధు చరిత
జీవ కారుణ్య మేపార, శీల మబ్బె
ధర్మ బోధ కాచార్యుడై ధరణి వెలిగె
41.
ఏక పత్నీవ్రత మహిమ నెఱుక బరచె
భ్రాతృ ప్రేమ నరయుడనె భరత భూమి
భవ్య జీవన విధమున భద్ర మొసగె
శాంతి దాంతులు ,సద్గుణాసక్తి గలిగె
హితము గల్గె నీ జగతికి సతము తృప్తి
42.
వ్యాధు డొక మౌని మంత్రమున్ వరముగ గొని
పరమ భక్తుండు, సత్కీర్తి చరితు డయ్యె
రమ్య రామాయణ కథను రచన జేసె
రామ మంత్ర మహిమ ననురక్తి గఱపె
ముక్తి మార్గంబు బోధించి ముదము గూర్చె
43.
వ్యాధ ముని గాథ చదివిన పాప ముడుగు
పున్నె మబ్బును జనులకు, బుద్ధి పెరిగి
ధర్మ మార్గంబు తెలియ నధర్మ ముడుగు
భక్తియును శ్రద్ధ మన భవ భయము డుల్లు
రామ చరిత చదువ స్వర్గ ధామ మబ్బు
జగతి క్షేమంబు నలరుచు స్వస్తి కలుగు
(సమాప్తం)
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.