ప్రకృతి మాతా నేను వృక్షాన్ని
నాకెన్ని బాధలో విను తల్లీ
నేను మొగ్గగా వున్నప్పుడే
నన్ను చిన్న పిల్లలు
త్రుంచి వేయు చున్నారు
తమ ఆటలకొరకు
పశువులు నన్ను చూడక
త్రొక్కివేయుచున్నవి
మనుజులు తమ ఇతర అవసరాలకొరకు
పెకిలించివేయుచున్నారు
ఇవన్నీ దాటి నేను
యవ్వనంలోకి అడుగుపెట్టా.
యవ్వనంలో హాయిగా జీవిస్తూ
పిల్లల్ని కందామనే ఆశ
నెరవేరుతుందో లేదో తెలియదు.
నేను పుష్పించి పిల్లల్ని
కంటున్నా. ఆ ఆనందం
ఎంతోసేపు నిల్వలా.
పిల్లలు పెరుగుతుండగానే
వాటిని జంతువులు తమ
ఆహరం కోసం నములుచున్నవి
ఇక మనుజులు తమ ఆహారంకోసం
తన పిల్లల్ని వృద్ధి చెంది
పెద్దవారు కాకుండానే (అపక్వాలుగా)
కోసివేయుచున్నారు.
కొందరు నన్ను అన్యాయంగా నరికి
తమ వంటచెరుకుగా వాడుకొనుచున్నారు.
ఇక నడి వయస్సు వొచ్చేసరికి
నన్ను ముక్కలు ముక్కలుగా
చేసి ఇంటి అవసరాలకు వాడుచున్నారు.
ఇంకా చెప్పాలంటే ముక్కలు ముక్కలుగా
కోయటమేగాక నన్ను నా చర్మాన్ని
వెడల్పాటి, పొడవాటి రేకులు (షీట్స్)గా
మార్చి వాటి మధ్యలో నా పనికిరాని
చిన్న చిన్న ముక్కలను ఇరికించి
ప్లై వుడ్ గా మార్చి అనేక రకాలుగా
మానవులు ఉపయోగించుకొను చున్నారు.
ఇన్ని కష్టాలు దాటి పెరుగుదామంటే
అప్పుడప్పుడు వొచ్చే తుఫాను గాలులకు
నా రెక్కలు (కొమ్మలు) విరగటమో లేక
మొత్తం వేళ్ళతో సహా పెకిలించబడటమో
జరుగుచున్నది.
నన్ను, నా జీవితాన్ని పూర్తిగా అనుభవించనివ్వక
ఇన్ని రకాల బాధలు తల్లీ.
నాతో జీవులకు ఎన్ని ప్రయోజనాలో
యేమని వివరింతు
నేను జీవులకు గాలిలోని
కార్బన్ డై ఆక్సైడ్ను మ్రింగి
ప్రాణవాయువుని ఇచ్చుచున్నానుగదా
కానీ నన్ను బ్రతకనివ్వటం లేదు తల్లీ.
నేను నా ఆకుల ద్వారా గాలిని
వృద్ధి చేస్తూ మేఘాలకు చల్లని గాలిని
తగిలేలా చేసి మంచి వర్షాలు పడేటట్లు
తోడ్పడుతున్నాను.
వేసంగిలో నేను ఎండతాపాన్ని
తగ్గించగలను
నన్ను పూర్తిగా బ్రతకనిస్తే
మంచి పండ్లను మనుజులకు,
పక్షులకు ఇతర జంతువులకు
ఇవ్వగలను.
కాగా జీవులు జీవించుటకు ప్రాణవాయువును
ఇవ్వగలనుగదా.
మంచి వర్షాల్ని పడటానికి
తోడ్పడగలను
నన్ను నావల్ల కలిగే ఇన్నిరకాల ఉపయోగాలు
చూచికూడా నన్ను ఆదరించి
నా జీవితాన్ని పూర్తిగా అనుభవించనివ్వటం లేదు
ప్రకృతిలోని జీవులు.
మరి నా పరిస్థితి ఏమిటి తల్లీ
ఇంతేనా నా జీవితం?
శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్‌గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.