[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘ఓటు కూడా ఒక ఆయుధమే సుమా..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నిజమే..
ఎన్నికల రోజున
ఉద్యోగులందరికీ
సెలవురోజే..!
కానీ..
సెలవు ప్రకటించింది
సరదాగా —
ఇంట్లో గడపడానికి కాదు ,
కలిసొచ్చిందికదా.. అని
మరో రోజు కలుపుకుని
సుఖయాత్రల —
చేయడానికి కాదు..!
సెలవొచ్చిందికదా.. అని,
శుభకార్యాలు–
ఏర్పరచుకోవడానికి కాదు!
బాధ్యతాయుతమైన
భారతీయ పౌరులుగా
మీ ఓటుహక్కు —
వినియోగించుకోవడానికి!
ఐదేళ్లపాటు మనల్ని
సమర్థవంతంగా పాలించగల
ఉత్తమ నాయకులను
ఎన్నుకోవడానికి..!
ఎండలని భయపడకండి
మీ అమూల్యమయిన
ఓటుహక్కును —
వినియోగించుకుని రండి!
పలు రకాల పార్టీ అభ్యర్థులు
ఎన్నికల బరిలో ఉంటారు
ఎవరికి ఓటెయ్యాలన్ననది
మీ ఇష్టం సుమా..!
ప్రలోభాలకు లొంగకండి,
మీ బాధ్యతను మరవకండి
ఆదర్శ పౌరులుగా
ఎన్నికల యజ్ఞానికి –
మీ వంతు సహకారం అందించండి!
ఆదర్శమూర్తులను ఎన్నుకోండి ,
మీరు ఓటు వేయలేదంటే.. మీరు,
దేశద్రోహుల జాబితాలో చేరినట్టే!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.