[శ్రీ నాగరాజు రామస్వామి గారు రచించిన ‘వోలటైల్ మనోవీధుల్లో’ అనే కవితని అందిస్తున్నాము.]
నేను ప్రతి ఉదయం
నా ఎనుబదేళ్ళ ఆనంద అనుభవ సారాన్ని,
నాటి నా నవయవ్వన జవనాశ్వవేగ
ఉత్సాహ కషాయాన్ని
కాఫీ కప్పులో కలుపుకుని సేవిస్తుంటాను
తొలి మలి సంజలు ఏకమైన ఏటవాలు
కాలరేఖ మీద సోలార్ విండ్స్‌ను
పుక్కిలిస్తూ దంతధావనం చేసుకుంటున్న
సూర్యుని కిమ్మీర కిరణాల సందు గొందుల్లో
నా గొంతు పారేసుకున్న పాటల
పాదముద్రలను వెతుక్కుంటాను
జియోపొలిటికల్ సాగర కల్లోలాలలో
కకావికలైన కాంపాస్ కంపనాలకు
విసుగొందిన నేను
మెడిటరేనియన్ సంద్ర గహ్వరం బ్లూగ్రట్టో లో
మెరుపులీనుతున్న ఇంద్రనీలాల
జలతరంగిణీ ప్రశాంత రాగాలలో
నా ఆగామి పథాన్ని గాలిస్తుంటాను
అర్థరహిత స్వార్థయుద్ధాల అగ్ని జ్వాలలకు
ఆహుతౌతున్న శైశవఆర్తనాదాల ఆకలి కేకల
నడుమ రగులుతున్న నా ఉద్విగ్న ఆలోచనలు
అర్ధాంతరంగా ఆవిరౌతున్న సబ్లైమ్డ్ కర్పూరాలు.
నేను జ్వాలాముఖి నోట పడి
నేరుగా ఆవిరౌతున్న హిమచంద్రికా వల్లరిని
కాలాతీత సర్రియల్ ఉక్కపోతల ఉప్పరింత!
తీగలు తీగలైన అకాల అగ్నిభాసల పలవరింత!
స్మృతుల స్వర్ణవల్లి వయసుడుగని మెరుపు తీగ!
జెన్ అడవులలో ఎంత తిరిగినా
నా కాలికి ఇంకా తగలనే లేదు
నేను వెదుకాడుతున్న నా *‘ఇకిగాయ్’ పూలతీగ!
*జీవిత లక్ష్యం/Purpose & Reason for being.
