Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వివక్ష

ప్పుడో మొలిచిన
మొండి ఖడ్గం
ఇప్పుడు కొచ్చగా పదునెక్కేలా
సానబెట్టుకొని దాడి చేస్తుంది
ఊపిరి తీస్తుంది
ఆకాశంలో సగాన్ని

తరాలు మారుతున్నా
లింగ వివక్ష శూన్యస్థితికి రాకుండా
ఇంకా రగులుతూనే ఉంది
రావణకాష్టంలా
నేటికీ వెర్రితలలు వేస్తుంది
ఈ వింత వ్యాధి
సమాజంలో మానవతకూ,
స్త్రీ జాతికీ సవాలు విసురుతూ

గర్భస్థ శిశువును బలిగొనే
రాక్షసత్వం ఊడలు దిగింది
ఆడజాతిపై కక్ష పెంచుకొని
ఎగుస్తుంది రాచపుండులా
స్నేహం, ప్రేమ మాయ వలలో
అహం, ద్వేషం జడలు విప్పుకొని

మనకు జన్మనిచ్చింది అమ్మ
జాతికి తల్లివేరు తెలుసుగా
మరి ఏ మత్తులో మరిచిందో గాని
పురుషాహంకారం మృగమై
విశృంఖల నృత్యంలో
మానని గాయాలు చేస్తుంది

పుత్రుని కనాలనే కోరికలో
తల్లి తీరని దాహం
ప్రతి కాన్పులోనూ దేవతే జన్మించే
ఆకాశంలో వెలిగే దివ్వెలుగా..
ఇక, మగాహంకారమేమో నేలపై
వెంటాడి వేటాడబట్టే ఉన్మాదమై

ఈ వివక్షకు ఆఖరి పాటగా
అక్షర శరాలు సంధించాలి
సమానత్వం సాధన దిశలో
మానవత్వపు కనులు తెరుచుకోనేలా
పురుష మొదళ్లను మొదలంటా
దున్నాలిక
హలాలతో పొలాలుగా..

Exit mobile version