[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’.]
ఈ మధ్యనే మా బాబాయీ, పిన్నిల వివాహ స్వర్ణోత్సవ వేడుకలకి వెళ్ళొచ్చేం. వాళ్ళ పిల్లలిద్దరూ అమెరికాలో ఉండడం వల్ల, ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లకి మొత్తం కార్యక్రమం అప్పచెప్పేసేరు.
బాబయ్య మొదట వద్దని కొంత గునిసినా, పిన్నిపడుతున్న సరదా చూసి, పిల్లల లక్షలు ఖర్చు పెట్టడం చూసి ఒప్పుకోక తప్పలేదు, పాపం.
బాబయ్య వాట్సప్‌లో పంపించిన ఇన్వెటేషన్ బహు ముచ్చటగా ఉంది.
చుట్టాలకీ, స్నేహితులకీ వీళ్ళనించి ఆహ్వానాలు వెళ్ళిపోయేయి. ఊళ్ళో ఉన్నవాళ్ళు “బలే బలే” అంటూ సంతోషం ప్రకటిస్తే, వేరే ఊళ్ళలో ఉన్నవాళ్ళు “ముందు చెప్పొచ్చుగా” అంటూ నిష్ఠూరం వేసేరు వాట్సప్ లోనే.
ఆ రోజు మేము ఫంక్షన్ జరిగే రిజార్ట్ చేరుకునేసరికి కార్లు ఆగడం ఆలస్యం ఓ ముగ్గురు ముత్తైదువులు వెండిపళ్ళాలు పట్టుకుని ఎదురొచ్చేరు. కారు దిగగానే పైనుంచి పూలరేకులు వర్షం లాగా మీద పడ్డాయి. తెల్లబోయి పైకి చూసేలోపే ఒక ముత్తైదువ ముందు కొచ్చి బొట్టు పెట్టింది. మరొకావిడ పన్నీరు చల్లింది. ఇంకొకావిడ హారతిచ్చింది. అందరికీ ఎంతో ఆనందంగా అనిపించింది.
లోపలికి రాగానే అందర్నీ వరసగా కూర్చోబెట్టి వెల్కమ్ డ్రింక్ ఇచ్చేరు. తర్వాత అందర్నీ తీసుకుని ఈవెంట్ మేనేజర్ ప్రభు అక్కడే ఉన్న చిన్న మందిరం వైపు తీసుకెళ్ళేడు. ఆ మందిరంలో వినాయకుడి ప్రతిమ ఉంది.
“మీరు దండం పెట్టుకోండి అంకుల్, మా వాళ్ళు వీడియో తీస్తారు..” ఆన్నాడు ప్రభు.
“ఇదేవిటీ! ఇది గుడి కాదా!” ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ అడిగేడు బాబాయి.
“అబ్బ.. ఏదోకటి. ఎదురుగా బొజ్జ గణపయ్య ఉన్నాడుగా. దండం పెట్టుకోండి. పిల్లలు లక్షలు ఖర్చు పెట్టేరు. కాదంటే అంతా వేస్టైపోతుంది” నెమ్మదిగా అయినా ఖచ్చితంగా చెప్పింది పిన్ని.
మారుమాట్లాడకుండా వీళ్ళందరూ దండం పెట్టుకుంటూంటే వెనకాలనించి రికార్డులో ఆశీర్వాదాలు వినిపించేయి. ఒక పూజారి హారతిస్తున్నట్టూ, వీళ్ళందరూ భక్తిగా హారతి అందుకుంటున్నట్టూ వీడియో తీసేరు.
ఇంతలో ఒక్కొక్కరుగా చుట్టాలూ, స్నేహితులూ చేరిపోయేరు.
బ్రేక్‌ఫాస్ట్ అయ్యేక ప్రభు అందర్నీ బైటకి రమ్మని మైక్‌లో అనౌన్స్ చేసేడు. ఇద్దరు మగవాళ్ళు మటుకు బాబాయి దగ్గరకొచ్చి, “అంకుల్, మీరిటు రండి” అంటూ పక్కనున్న రూమ్ లోకి తీసికెళ్ళేరు.
అలా తీసికెళ్ళేముందు పిన్ని బాబాయి దగ్గరకొచ్చి, “వాళ్ళేం చెప్తే అది చెయ్యండి. పిల్లలు లక్షలకి లక్షలు ఖర్చు పెడుతున్నారు” అంటూ మరో రూమ్ లోకి వెళ్ళిపోయింది.
అక్కడ బాబాయిని కూర్చోబెట్టి ఒకతను మొహానికి మేకప్ చెయ్యడం మొదలెట్టేడు.ఇంకోడు నెత్తిమీద గిరజాల జుట్టున్న విగ్గు పెట్టేడు. మరొకడు ముందుకొచ్చి, “ఈ బట్టలు మార్చుకు రండి” అంటూ అతని చేతిలో ఓ సిల్కుపంచె, కండువా లాంటిది పెట్టేడు. చలపతి హడిలిపోయేడు. “ఏవిటిదంతా!” అనడిగేడు.
“మీ పెళ్ళిరోజు కదా అంకుల్. ఆంటీని కల్సుకోవాలి కదా!” అన్నారు వాళ్ళు.
“అసలు మీరేం చేస్తున్నారు!”
‘అంకుల్, మీరు చెప్పేరు కదా! ఈ కాలం వ్యవహారేలేవీ వద్దని. అందుకని అన్నీ మీ కాలం వ్యవహారాలే అరేంజ్ చేసేం” ప్రభు అన్న మాటలకన్న పిల్లలు ఖర్చు పెట్టిన లక్షలు కళ్లముందు కదిలి మారుమాట్లాడకుండా ఆ బట్టలు మార్చుకొచ్చేడు మా బాబాయి.
“అబ్బే, ఈ కండువా ఇలా కప్పుకోకూడదంకుల్” అంటూ దానిని బాబాయి కట్టుకున్న పంచె మీద నడుం చుట్టూ బెల్టులా బిగించేడు కాస్ట్యూమ్ కృష్ణ.
ఆ తర్వాత బాబాయి, పిన్నీవాళ్ళు ఆడమన్నట్లల్లా ఆడవలసొచ్చింది.
పంచె కట్టుకుని, నడుంచుట్టూ కండువా బిగించుకుని, నెత్తికి గిరజాలజుట్టు విగ్గు పెట్టుకుని, నుదుటిమీద ఎర్రని నామం దిద్దుకుని, మెడలో పెద్ద పెద్ద పూసలున్న దండ వేసుకుని మేకప్ రూమ్ లోంచి బైటకొచ్చిన బాబాయి పిన్నిని చూసి ఆశ్చర్యపోయేడు.
పిన్నికోయపిల్లలు కట్టుకున్నట్టు చీర కట్టుకుని, నెత్తిమీద పక్కకి పూసలు వేళ్ళాడుతున్న పెద్ద కొప్పు పెట్టుకుని, మెడలో పూసలదండలతో, నుదుటిమీద పెద్దబొట్టుతో, చేతులకి లావుగా ఉన్న బోల్డు గాజులతో ఉంది.
ఇంతలో ఒకతనెవరో వచ్చి పిన్నిచేతికి విల్లూ, బాణం ఇచ్చి, అవెలా పట్టుకోవాలో చూపించేడు. ఇంకొకతను బాబాయిని “రండంకుల్” అంటూ అక్కడే ఉన్న ఓ పెద్ద చెట్టు దగ్గరికి తీసుకుపోయి, అక్కడే ఉన్న ఓ ఉయ్యాలబల్లలా ఉన్న దానిమీద కూర్చోబెట్టి, “ఊ, లాగరా..” అన్నాడు. అంతే బాబాయి అమాంతం ఒక్కసారి నేలమీంచి పైకి వెళ్లడం మొదలెట్టేడు. గాభరాపడిపోతూ ఆ ఉయ్యాలతాళ్లని గట్టిగా పట్టుకున్నాడు బాబాయి. చెట్టు చిటారుకొమ్మ దాకా వెళ్ళేక అప్పటికే అక్కడున ఇంకోతను బాబాయిని అందుకుని జాగ్రత్తగా అక్కడి కొమ్మ మీద కూర్చోబెట్టి, అతని చేతికి విల్లమ్ములు అందించి, “ఓకె. స్టార్ట్” అని చెప్పి చెట్టు దిగిపోయేడు.
ఏం స్టార్టు చెయ్యాలీ, ఇక్కడినించి దూకాలా అనుకుంటూ, ఆ విల్లమ్ములు పడిపోకుండా బాలన్స్ చేసుకుంటున్న బాబాయికి కిందనించి ప్రభు మాటలు వినిపించేయి.
“అంకుల్, మీరు కొత్తపాటలొద్దూ అన్నారు కదా, అందుకనీ చెంచులక్ష్మి సినిమాలో ‘చెట్టులెక్కగలవా!’ అనే పాతపాట తీసుకొచ్చేం. స్టార్ట్ అనగానే మీరూ, ఆంటీ ఆ పాటకి డేన్సు చెయ్యాలి.” అన్నాడు.
హోరి వీడి మొహం తగలెయ్యా, కొత్తపాటలు వద్దన్నాం కానీ పాతపాటలు కావాలనలేదే అనబోయిన బాబాయికి మళ్ళీ లక్షలు కళ్లముందు కొచ్చేయి.
ఎదురుగా చూసేడు, ఒక ఎత్తైన గుండ్రటి బండ మీద పిన్ని విల్లమ్ములు పట్టుకుని సత్యభామలాగా కనపడింది.
“స్టార్ట్” అని వినిపించగానే మ్యూజిక్ మొదలైంది.
“చెట్టు లెక్కగలవా! ఓ నరహరి, పుట్ట లెక్కగలవా! చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలవా.. ఓ నరహరి చిగురు కోయగలవా!”
పిన్నిమహా చురుగ్గా చేతిలో బాణాన్ని కత్తి తిప్పినట్టు తిప్పేస్తూ ఆ బండమీద అడుగులు ముందుకీ వెనక్కీ వేస్తోంది. ఎక్కడ ఆ బండమీంచి జారిపడిపోతుందోనని హడిలిపోయేడు బాబాయి.
“అంకుల్, మీరే.. స్టార్ట్.” అన్న ప్రభు మాటలకి ఈ లోకంలోకి వచ్చేడు. పాట మొదలైంది.
“చెట్టులెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే.. చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలనే.. ఓ చెంచిత చిగురు కోయగలనే” చిన్నప్పట్నించీ వింటున్న ఆ పాట అతన్ని ఓ ఉత్సాహంగా ఓ అడుగు ముందుకు వేయించింది. అంతే.. ధభీమని కింద పడిపోయేడు. అందరూ ఖంగారుగా పరిగెట్టుకొచ్చేరు.
“ఖంగారు పడకండి. కింద ఎందుకైనా మంచిదని వలలాంటిది వేయించేను. అంకుల్ పెద్దవారని నాకు తెల్సు కదా!” అంటు అందర్నీ సమాధానపరిచేడు ప్రభు.
“అంకుల్, మీరు మరీ అంత పాత్రలో జీవించెయ్యక్కర్లేదు. నటిస్తే చాలు” అంటూ నెమ్మదిగా వచ్చి బాబాయి చెవిలో చెప్పేడు. మరో టేక్‌తో ఆ వీడియో తియ్యడం విజయవంతంగా పూర్తి చేసేరు.
“డ్రెస్ చేంజ్” అన్న ప్రభు మాటలకి, బాబాయినీ, పిన్నినీ మళ్ళీ రూముల్లోకి తీసుకుపోయేరు. ఈసారి మంచి ఉలెన్ పాంటూ, ఫుల్ హాండ్స్ షర్టూ, మెడకి టై వేసేరు బాబాయికి. పిన్నికి ఓ షిఫాన్ చీర కట్టి, పాతకాలం హిందీ సినిమా హీరోయిన్స్ లాగా నెత్తిమీద పైకి ఓ పెద్ద కొప్పులాంటిది పెట్టీ, మెడలో సన్నటి ఛైన్ వేసి తయారు చేసేరు.
ఈసారి ఇల్లరికం సినిమాలో ‘నిలువవే వాలుకనులదానా.. వయారి హంస నడకదానా.. నీ నడకలొ హొయలున్నదె చానా.. నువు కులుకుతు ఘలఘల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు, ఓ లలనా అది నీకే తెలుసూ..’ అనే పాట పెట్టేరు.
పిన్ని నడుం తిప్పుకుంటూ వయ్యారంగా నడుస్తూ వెడుతుంటే ఆ పాట పాడుతూ బాబాయి వెనకాల పడాలన్న మాట.
“ఇదేంటయ్యా, మనవలున్నారు మాకు. ఇప్పుడిలా పాడితే వాళ్ల ముందు ఎంత చిన్నతనం” అడిగింది పిన్ని ప్రభుని.
“ఆంటీ, ఇప్పటి పిల్లల గురించి మీకు తెలీదు. ఈ వీడియో చూసి మీ మనవలు ‘మా గ్రాండ్ పేరెంట్స్ ఎంత బాగా లవ్ చేసుకుంటున్నారో!’ అని మురిసిపోతారు.” అన్నాడు.
వద్దనాలన్నా పిన్నికి కూడా కళ్ళముందు లక్షలు కనపడేటప్పటికి మరింత వయ్యారంగా తిప్పుకుంటూ తిరిగింది. ఆ తిరుగుడికి బాబాయికి నిజంగానే మతిపోయి ఏం చేస్తున్నాడో తెలీకుండా వాళ్ళు ఆడమన్నట్లల్లా ఆడేసేడు.
వీడియో తీస్తున్న వాళ్ళందరూ “ఈ వయసులో ఇంత బాగా ప్రేమించుకుంటున్న మీకు జోహార్లు” అంటూ పూర్తి కాగానే ఒక్కసారి చప్పట్లు కొట్టేసేరు.
బాబాయిని మళ్ళీ రూమ్ లోకి తీసికెళ్ళి కాళ్లకి పట్టేసినట్టున పైజమా, పైన ఎంబ్రాయిడరీ చేసిన కుర్తా, మెడలో ఎర్రరాళ్లతో మెరిసిపోతున్న గొలుసూ, వేళ్ళకి ఉంగరాలూ, మణికట్టుకొ బ్రేస్‌లెట్‌తో అడ్వర్టైజ్మెంటుల్లో పెళ్ళికొడుకుని తయారు చేసినట్లు మేకప్ చేసేరు.
ముందు అటూ ఇటూ పదిమంది ముత్తైదువులు హారతులిస్తూ, పూలు జల్లుతుంటే బాబాయి హాల్లోకి అడుగుపెట్టేడు. ఒక్కసారి అందరూ “హే..” అని అరిచేసేరు. హడిలిపోయి ఒక అడుగు వెనక్కి వెయ్యబోయి బేలన్స్ కుదరక పడిపోబోతుంటే వెనకాలే ఉన్న ప్రభు ఒడుపుగా పట్టుకున్నాడు.
“అంకుల్, అలా భయపడిపోకండి. మొహం నవ్వుతూ ఉండాలి. ఫొటోల్లో బాగుండదు” అంటూ చెవిలో నెమ్మదిగా హెచ్చరించేడు. అప్పుడు గమనించేడు బాబాయి తనపైనే ఫోకస్ చేసిన కెమెరాలని. తనని తను సర్దుకుంటూ మొహమ్మీదకి నవ్వు తెచ్చుకున్నాడు.
బాక్గ్రౌండ్లో “భలే మంచిరోజూ.. పసందైన రోజూ.. వసంతాలు పూచే నేటి రోజూ.. హాయ్.. వసంతాలు పూచే నేటి రోజూ..” అనే పాట వినిపించడం మొదలెట్టింది.
ఆ పాటకి అటూ ఇటూ చుట్టాలూ, స్నేహితులూ నడుంలు తిప్పుకుంటూ, చప్పట్లు కొడుతూ డేన్స్ చేస్తుంటే, వందిమాగధుల్లాగా రెండువైపులా ఇద్దరు మనుషులు తనని అనుసరిస్తుంటే బాబాయి హాల్లోకి అడుగు పెట్టేడు.
అతను నడుస్తున్నంతసేపు అందరూ “హే….” అని అరుస్తూనే ఉన్నారు. అలా ఎందుకు అరుస్తున్నారో బాబాయికి అర్థం కాలేదు. ఆ గోలలో ఎప్పుడు స్టేజి దాకా వెళ్ళేడో కానీ ఎదురుగా ఉన్న స్టేజిని చూసి తెల్లబోయేడు.
అది తాజా తాజా పూలతో, రంగురంగుల చెమ్కీ దారాలతో, బాగా ఊదిన బుడగలతో బ్రహ్మాండంగా అలంకరించి ఉంది. వందిమాగధులిద్దరూ చలపతిని దగ్గరుండి స్టేజి ఎక్కించేరు. అంతలో మళ్ళీ ఇంకో పాట..
‘బంగారుబొమ్మ రావేమే పందిట్లొ పెళ్ళి జరిగేనే..’
అని బేక్గ్రౌండ్లో పాట వినిపిస్తుంటే మంచి పట్టుచీర కట్టి, మెడలోనూ, చేతులకీ ధగధగా మెరిసిపోతున్న గిల్టు నగలతో, తలనిండా ముందుకి కూడా కనపడేన్ని పూలమాలలు గుచ్చిన జడతో, నుదుటిన పెళ్ళిబొట్టుతో, బుగ్గన చుక్కతో పిన్నిహాల్లోకి ప్రవేశించింది.
పాతికేళ్ళ పెళ్ళికూతురిలా మేకప్ చేసిన డెభ్భైయేళ్ళ పిన్నిని చూడగానే కళ్ళు తిరిగిపోయేయి బాబాయికి.
హాల్ మొదట్లోనే ఆపేసేరు ఆమెని వదినలు.
“పెళ్ళికొడుకు స్టేజి దిగాలి.. ప్రపోజ్ చెయ్యాలి..” అంటూ అరవడం మొదలెట్టేరు.
తప్పదుకదా అనుకుంటూ వందిమాగధులు వెంట నడవగా స్టేజి దిగి కిందకొచ్చేడు బాబాయి.
పిన్ని దగ్గరగా నడుస్తున్న బాబాయి చేతికి ఒక అందమైన గులాబీపువ్విచ్చేడు ఒకతను.
ఆ పువ్వుని అందుకుని పిన్నిఎదురుగా నిలబడి దానిని ఆమె చేతి కందించేడు.
అటూ ఇటూ ఉన్న గుంపు ఒక్కసారి గొల్లుమన్నారు. హడిలిపోయేడు బాబాయి. ఎక్కణ్ణించో ప్రభు పరిగెత్తు కొచ్చేడు.
“అలా కాదంకుల్. మీరు మోకాలి మీద కూర్చుని మిమ్మల్ని పెళ్ళి చేసుకోమని ఆంటీని రిక్వెస్ట్ చెయ్యాలి.” అన్నాడు.
“ఏంటయ్యా ఇదీ అర్థం లేకుండా. ఎప్పుడో యాభైయేళ్ళక్రితం వాళ్ల వాళ్ళు మా వాళ్ళూ కుటుంబాలూ, జాతకాలూ చూసి మా ఇద్దరికీ ముడెట్టెసేరు. ఇప్పుడిదంతా ఏం బాగుంటుందీ పిల్లల ముందూ!” చిరాకు పడ్డాడతను.
చుట్టాలూ, స్నేహితులూ ఊరుకోలేదు.
“ఆ రోజుల్లో ఇవన్నీ తెలీక మా సత్య అలా పెళ్ళి చేసుకుంది. ఇప్పుడివన్నీ వచ్చేక మీ పెళ్ళిరోజు సెలిబ్రేషన్ కనక మీరు మోకాలి మీద వంగి ప్రపోజ్ చెయ్య వలసిందే.”
వాళ్ల పట్టుదలకి లొంగిపోక తప్ప లేదు పాపం బాబాయికి.
ఉబికి వస్తున్న నవ్వుని ఆపుకుంటున్న పిన్నిమొహం కేసి చూస్తూ, మోకాలి మీద వంగి, గులాబీ ఆమెకి అందిస్తూ “విల్ యూ మేరీ మీ!” అన్నాడు.
చిన్నగా నవ్వుతూ, ఆ గులాబీని హుందాగా అందుకుంది పిన్ని.
అటూ ఇటూ చుట్టాలూ, స్నేహితులూ నడుంలు తిప్పుకుంటూ, చప్పట్లు కొడుతూ డేన్సులు చేస్తుంటే, చలపతి వేలు పట్టుకుని సుకుమారంగా నడుస్తుంటే, ఒక రాజకుమార్తెని తీసికొచ్చినట్టు ఆమెని స్టేజి మీదకి తీసుకొచ్చేరు చెలికత్తెల్లాంటి ఇద్దరమ్మాయిలు.
అక్కడ సింహాసనంలా ఉన్న సోఫా మీద బాబాయి కూర్చోబోతుంటే ప్రభు పక్కనించి ఆగమన్నట్టు సైగ చేసేడు.
“అంకుల్, మీరు ముందు ఆంటీని కూర్చోబెట్టి కూర్చోవాలి. అంతకన్న ముందు ఇద్దరూ దండలు మార్చుకోవాలి.”
ప్రభు అందంగా అల్లించిన పూలమాలలు తెప్పించి ఒకరికొకరికి వేయించేడు. ఇద్దరూ సింహాసనాల్లాంటి సోఫాలో కూర్చున్నాక ఒక్కొక్కరినీ వరసగా స్టేజి పైకి పిలిచేడు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, మనవలూ అందరూ వచ్చి వీరి గురించి మాట్లాడి బహుమతు లందించేరు. వచ్చిన వాళ్లందరూ కూడా బహుమతులు అందించేరు.
ఆ తర్వాత లెక్కలేనన్ని అయిటమ్స్తో లంచ్. లంచ్ చేసేక వచ్చిన వాళ్లందరినీ రెండు గ్రూపులుగా విడదీసి అంత్యాక్షరి ఆడించేరు. అంటే పాట పాడ్డం మాత్రమే కాకుండా ఆ పాటకి డాన్స్ కూడా చెయ్యాలనే కండీషన్‌తో.
పాత పాటలూ, కొత్త పాటలూ సరదా పాటలూ, మెలొడీలూ, వెక్కిరింతలూ అన్నీ పాడేసి ఆడేసే రందరూ.
పదేళ్ళవాళ్ళూ, ఎనభైయేళ్ళ వాళ్ళు కూడా వయోభేదం మర్చిపోయి ఉత్సాహంగా ఆ ఆటలో పాల్గొన్నారు.
నడుంనెప్పంటూ కుర్చీలోంచి లేవలేని సుభద్రమ్మ “లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం” అంటూ స్టెప్స్ వేసి పాడుతుంటే అందరికీ ఒకటే నవ్వు.
సరిగ్గా అయిదుగంటలకల్లా స్నాక్స్ అరేంజ్ చేసేరు. దాని తర్వాత అందరూ రెట్టించిన ఉత్సాహంతో మ్యూజికల్ చెయిర్స్ ఆడేరు.
ఆరవుతుండగా అలసిపోయి అందరూ శెలవు తీసుకుంటుంటే ఈవెంట్ వాళ్ళు వచ్చినవాళ్లందరికీ పెద్ద పెద్ద రిటర్న్ గిఫ్టులు అందించేరు.
అన్నీ అందుకుని, ఈ మధ్యకాలంలో ఇంత బాగా ఎప్పుడూ ఎంజాయ్ చెయ్యలేదని చెపుతూ చుట్టాలూ, స్నేహితులూ బాబాయికీ, పిన్నికీ, వాళ్ల పిల్లలకి చెప్పి వెడుతుంటే, అందరితో కలిసి ఆనందం పంచుకుంటే ఇంత బాగుంటుందా అనిపించింది అందరికీ.
అదే అన్నాను బాబాయితో..
“అమ్మో, వద్దమ్మా.. ఈ నడుంనెప్పులూ, మోకాళ్ళ నెప్పులూ ఈ వయసులో భరించడం కష్టం. మీ పిల్లలు ఇలా చేస్తానన్నా ఒప్పుకోకు. ఈ వయసులో ఈ డాన్సులేంటమ్మా! ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందీ!”
నిజాయితీగా చెపుతున్న బాబాయిని చూస్తుంటే ఇలాంటి వేడుకలు చేసుకోవాలో మానేయాలో అర్థం కాలేదు నాకు.
మీకేమైనా తెలిస్తే చెప్తారా!
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.