[విశ్వనాథవారి రచనల గురించి వచ్చిన మూడు పుస్తకాలను పరిచయం చేస్తున్నాము.]
విశ్వనాథ సత్యనారాయణ రచనలొక్కక్కటీ ఒక్కొక్క మహా సముద్రం. మానవుడు అంతరిక్షపుటనంత లోతులను పరిశోధిస్తున్నాడు. రహస్యాలను ఛేదిస్తున్నాడు. కానీ, భూమిపై ఉన్న అనంతపాథోరాశి రహస్యాల ఉపరితలాన్నయినా స్పృశించలేకపోతున్నాడు. అనేకులు పై పై అలలు చూసి సముద్రం గురించి అంతా తెలుసుకున్నామని సంతోషిస్తారు. కొందరు ఇసుకలో కూచుని చూసేదంతా చూసేశామనుకుంటారు. కొందరు సముద్రపు లోతుల్లోకి వెళ్ళి పరిశోధిస్తారు. అద్భుతాలను ఆవిష్కరిస్తారు. కానీ తరచి చూస్తే సముద్ర గర్భంలో నిక్షిప్తమైవున్న అనంతమైన అద్భుతాల ఉపరితలాన్నయినా వారు స్పృశించలేదని అర్థమవుతుంది. అనంతాకాలం ఈ అన్వేషణ సాగినా అద్భుతాల ఆవరణలో కూడా అడుగుపెట్టలేదని బోధపడుతుంది. సముద్రతుల్యమైన విశ్వనాథవారి సాహిత్యం కూడా అంతే!
ఏదో కొద్దిపాటి విదేశీ సాహిత్యం చదివేసి తెలుగులో నవలలు లేవనీ, విదేశీ రచనలతో పోల్చదగ్గ స్థాయి రచనలు లేవని మిడిమిడి జ్ఞానాహంకారంతో మిడిమిడి మేధావులు వేదికలెక్కి ప్రకటించేస్తూంటారు. అలాంటివారు సముద్రపు ఒడ్డుకు మైళ్ళ దూరంలో వుండేవారు. సముద్రపు హోరు కూడా వినలేని బధిరాంధకారాజ్ఞానంలో అహంకారాన్ని సంతృప్తిపరచుకునే చదువురాని చదువరులు. విశ్వనాథ రచనలను వారు చదువుతారు. కానీ చదివినవారు కారు. వారికి అక్షరాలు కూర్చుకుని పదాలు చదవటం వచ్చుకానీ, పదాల అర్థాలు, అర్థాలలో వొదిగిన పరమార్థాలు, ఆ పరమార్థాలలో పొదిగివున్న ప్రతీకలలో ఒదిగిన మార్మికభావాల గ్రహింపు వుండదు. వారు పదాల శబ్దాలు వింటారు. శబ్దాలలో ప్రాణాన్ని పసిగట్టలేరు. ఈ నిజం విశ్వనాథ రచన ‘భ్రమరవాసిని’లో ఇమిడివున్న మార్మికాంశాల గురించి కాశీనాథుని సువర్చలాదేవి ఎంఫిల్ థీసిస్, ‘ఏకవీర-రహస్య కథనము’ గురించి బాలాత్రిపుర సుందరి రాసిన నవలానుశీలనము చదివితే మరింతగా స్పష్టమవుతుంది.
విశ్వనాథ నవలలు-ఉపాసనారీతులు:
విశ్వనాథవారి భ్రమరవాసిని -ఒక పరిశీలనము:
కాశీనాథుని సువర్చలాదేవి ‘విశ్వనాథవారి భ్రమరవాసిని-ఒక పరిశీలనము’ అన్న గ్రంథంలో భ్రమరవాసిని నవలను లోతుగా పరిశీలించి అందులో పొందుపరచివున్న ఉపనిశత్సదృశ విజ్ఞానాన్ని ఆవిష్కరించారు. “ఆయన సృజియించిన ఆ సుధాహ్రదమునకెత్తిన ఏతాము ఈ పరిశీలన” అని ఆమె ముందుమాటలో చెప్పారు.
భ్రమరవాసిని నవల కశ్మీర రాజవంశావళి నవల పరంపరకు చెందిన నవల. ఈ నవలకు ఆధారము కల్హణ రాజతరంగిణి. కల్హణ రాజతరంగిణిలో వున్న కథను తీసుకుని దానిని తనదైన సృజనాత్మక స్రవంతిలో ముంచి, లౌకిక, ఆధ్యాత్మిక, మానసిక ప్రపంచాలను బహుకోణాల్లో విశ్లేషిస్తూ, భారతీయ తాత్విక, తాంత్రిక, మాంత్రిక, ఉపాసన విషయాలనేకం నవలలో పొందుపరచి ఒక అస్థిపంజరంలాంటి కథకు రూపమిచ్చి రక్త మాంసాలిచ్చి ప్రాణంపోసి పాఠకులకు సజీవమైన చిత్రాన్ని అందించారు. అమోఘమైన ఈ సృజన సముద్రంలాగా ఎంత లోతులకు వెళ్తే అన్ని అద్భుతాలను ప్రదర్శిస్తుంది.
రాజతరంగిణిలో భ్రమరవాసిని కథ ఆశ్చర్యజనకమైనది. చోళరాజు రతిసేనుడికి సముద్రగర్భంలో స్వర్ణపద్మంపై ఒక శిశువు లభిస్తుంది. ఆమె పేరు రణరంభ. ఆమె కశ్మీరు రాజు రణాదిత్యుడిని వివాహమాడుతుంది. కానీ, అతడి స్పర్శకు ఇష్టపడదు. పెళ్ళి సందర్భంలో ఒక భ్రమరం అక్కడ ప్రవేశిస్తుంది. ఆమె ప్రవర్తటుంది. ఆమెను రాజు ఎన్నో ప్రశ్నలడుగుతాడు. ఆమె సమాధానం ఇవ్వదు. ఒక భ్రమరం గదిలో ప్రవేశిస్తుంది. అతడికి నిద్రవస్తుంది. నిద్రలో కలలొస్తాయి. కలలో అతనికి గత జన్మ తెలుస్తుంది. గతజన్మలో భ్రమరవాసినీ వ్రత దీక్ష చేసి దేవి ప్రత్యక్షంకాగా, అతనిలో ఉన్న కామనలవల్ల ఆమెను భార్యగా కోరతాడు. దేవి అనుగ్రహిస్తుంది. ఫలితంగా ఈ జన్మలో అతని భార్య అవుతుంది. తరువాత అంఋతప్రభతో అతని వివాహమవుతుంది. దేవి దయవల్ల అతడు గొప్పగా రాజ్యం చేస్తాడు. టూకీగా ఇదీ కథ.
ఈ కథను విశ్వనాథ ఎంత అద్భుతంగా మలచారంటే, ఎన్నిసార్లు చదివితే అన్నిమార్లు ఎన్నెన్నో విషయాలు కొత్తగా తెలుస్తాయి. మనం ఎంత జ్ఞానం సంపాదిస్తే అంతగా కొత్త విషయాలీ నవల విశదపరుస్తుంది. అంటే, నవల మనతో పాటూ ఎదుగుతున్నట్టు తోచినా మనం జీవితంలో ఎన్ని విషయాల పరిజ్ఞానం సాధిస్తామో అంతగా ఈ నవల స్థాయికి ఎదుగుతూంటామన్నమాట. ప్రపంచ సాహిత్యంలో కంచుకాగడాలు కొన్ని వేలుపెట్టి వెతికినా, ఇలాంటి రచనా సంవిధానం కానీ, ఇలాంటి రచనలు కానీ కనబడవు. తెలుగు నవలలు ప్రపంచ స్థాయిలో లేకపోవటం కాదు, ప్రపంచంలో రచనలు తెలుగు నవలల స్థాయిలో లేవన్నది అసలు నిజం. కళ్ళకు కమ్మిన విదేశీ రంగుల పొరలు, మెదడులో నిండిన బానిస మనస్తత్వపు బురదలు, మనసునిండా నిండిన అహంకారం, హృదయంలోని న్యూనతా భావాలు తొలగించి చూస్తేకానీ, ఈ నిజాన్ని గ్రహించలేరు.
ఈ నవలలో విశ్వనాథ ప్రదర్శించిన ప్రతి విషయానికి, చూపిన ప్రతి చమత్కారానికీ సాంప్రదాయిక శాస్త్ర సమ్మతి వుంటుంది. మంత్ర తంత్ర శాస్త్ర విజ్ఞాన ప్రకారం కల్పనలుంటాయి. కల్హణుడి రచనలో దేవి భక్తుడి భార్య అయినట్టుంది. దీనిలోని రహస్యాన్ని విశ్వనాథ, శ్రీవిద్యామహాసంప్రదాయము, అందులోని రహస్యాలు, అనుభూతివైలక్షణ్యాల ఆధారంగా కల్పనా ప్రపంచాన్ని అల్లిన విధానాన్ని సువర్చలాదేవి సప్రామాణికంగా, తార్కికంగా వివరించారు. భ్రమరవాసిని భ్రాంతికారిణి. ఈ భ్రాంతి విషయనిరూపణను విశ్వనాథ ఏయే ప్రమాణాల ఆధారంగా చేశారో తిరుగులేనిరీతిలో విశదపరచారు.
విశ్వనాథ రచనలు నవలాప్రక్రియ పరిధి సరిహద్దులను సవాలు చేస్తూ అత్యంత విశృంఖలంగా విహరిస్తాయి. నవలలో కథ కన్నా, విశ్వనాథవారు పాత్రల ద్వారా చేసే చర్చలు పాఠకుల మనోభూమికలను విస్తృతపరచగల విజ్ఞాన కోశాలు. ఈ అంశాన్ని రచయిత్రి చక్కగా ఎత్తి చూపించారు. విశ్వనాథ రచనల పఠనం భారతీయ సంస్కృతీ సముద్రంలో విహారం లాంటిది. ఎవరెంత లోతులలో విహరిస్తారో వారి వారి సంస్కారం, విజ్ఞానం విషయ పరిజ్ఞానం, ఆసక్తులపై ఆధారపడి వుంటుంది.
ఈ ఎంఫిల్ గ్రంథం విశ్వనాథ నవలల వర్గీకరణంతో ఆరంభమయి, నవలా వాగ్మయంలో విశ్వనాథ స్థానం, విశ్వనాథ నవలలో చిత్రితమైన కశ్మీరు చరిత్రలను వివరిస్తుంది. భ్రమరవాసిని కథను సంగ్రహంగా చెప్పిన తరువాత కథానుశీలనము, భక్తితత్వము, పునర్జన్మ సిద్ధాంతము వంటి వాటిని కూలంకశంగా చర్చిస్తుంది. విశ్వనాథ వ్యక్తిత్వం భ్రమరవాసిని నవలలో ఎలా ద్యోతకమయిందో వివరిస్తుంది. చివరి అధ్యాయంలో కొన్ని ముఖ్యపాత్రలు వాటి ప్రతీకలను వివరించటంతో ఈ గ్రంథం పూర్తవుతుంది. మొదలుపెడితే పూర్తయ్యేవరకూ క్రింద పెట్టలేని విధంగా వుంది రచనా సంవిధానం. ఒకవేళ మధ్యలో ఏదైనా పనివల్ల పుస్తకం పక్కనపెట్టాల్సివస్తే మళ్ళీ పుస్తకం తెరచేవరకూ అనిశ్చింతగా అనిపిస్తుంది. అంతగా వెంటాడుతుందీ పరిశోధన. విశ్వనాథ అభిమానులు, మంత్రంత్ర, తాత్విక శాస్త్రాలపై ఆసక్తివున్న వారే కాదు, సామాన్య పాఠకులు కూడా చదివి, తెలుగు రచయితల రచనలు ఆషామాషీ రచనలు కావని గ్రహించవచ్చు. విశ్వనాథ రచనల సముద్రపు లోతులో ఒక అంశాన్ని చూపిస్తుందీ పరిశోధన.
***
కాశీనాథుని సువర్చలాదేవి
పేజీలు: 158
వెల: ₹ 200/-
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్, 33-22-2
చంద్రం బిల్డింగ్స్,
సీ ఆర్ రోడ్
చుట్టుగుంట,
విజయవాడ-520004
Ph: 0866-2436643
ఏకవీర – రహస్య కథనము:
ప్రేమకథలెన్ని రకాలుగా రాసినా అన్నీ ‘ఏకవీర’ నవలలో కనిపిస్తాయి. దీన్ని మించి ప్రేమ నవల ఎవ్వరూ రాయలేరని అంటారు. పైకి ఏకవీర ఒక వచన కావ్యంగా, గద్య కావ్యంగా ప్రఖ్యాతమయినా, ఈ ప్రేమకావ్య వైశిష్ట్యాన్ని ఎందరో ప్రస్తావించినా, దీనిలోని అంతర్యోగ ప్రతీకల విశేషాలను బాలాత్రిపుర సుందరి ఈ పరిశీలన విశ్లేషిస్తుంది.
ఈ రకమైన యౌగిక తత్వాన్ని ప్రకటిస్తూ పాత్రలు, సంఘటనలు, మానసిక ఉద్విజ్ఞ్నతలలోఒదిగివున్న ప్రతీకలను విశదపరుస్తూ మర్మ గంభీరంగా సాగుతుంది రచన. ఈ నవలా చిత్రణము యోగపరిణామక్రమాన్ని అనుసరిస్తుందని నిరూపిస్తారు రచయిత్రి. ఇలా, అనేక గంభీరము, గుహ్యమయిన విషయాలను, పాత్రలద్వారా ఆ విషయాలను విశ్వనాథ ప్రదర్శించిన కల్పనా చాతుర్యాన్ని రచయిత్రి ఎత్తి చూపిస్తారు. ఈ రచనలో అనేక తాంత్రిక, యౌగిక అంశాలను సహేతుకంగా, స ప్రామాణికంగా వివరిస్తారు. ఈ రచన చదివిన తరువాత ఏకవీర నవల మరోసారి చదవాలనిపిస్తుంది, అయితే. ఈ సారి ఒక నవలను చదివినట్టు చదవటం కష్టం. ఒక తాత్విక, తాంత్రిక, యోగాంశాలు కల ముక్తినిచ్చే ఉపనిషత్తు చదివినట్టు చదువుతాము. ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి భావనను విశ్లేషిస్తూ, అనుభవిస్తూ, ఒకరకమైన తెలివిడితో చదువుతాం.
ఈ రెండు రచనలు చదివిన తరువాత విశ్వనాథ రచనల పట్ల మన దృష్టి మారిపోతుంది. ఇంతకాలం సముద్రపు ఒడ్డునకూర్చుని సముద్రంలోకి రాళ్ళు విసురుతూన్నామన్న భావన కలుగుతుంది. ఇకపైనన్నా, కనీసం వచ్చీపోయే అలల్లో కాళ్ళు పెట్టాలనిపిస్తుంది.
(విశ్వనాథ గురుపదముద్రలు)
బాలాత్రిపురసుందరి.
పేజీలు: 64
వెల: ₹ 100/-
ప్రతులకు:
శ్రీ కళాబాల ప్రచురణలు
ఫ్లాట్ నంబర్ 104
గోల్డెన్ పాం అపార్ట్మెంట్స్, బీ-48
డి.డి. కాలనీ, బాగ్ అంబర్ పేట్, హైదరాబాదు
ఫోను: 8247079335