[విశ్వనాథ సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని, విశ్వనాథవారిపై కానీ, ఆయన రచనల గురించి కానీ, వచ్చిన అయిదు పుస్తకాలను పరిచయం చేస్తున్నాము.]
కవిసమ్రాట్ విశ్వనాథ – సుప్రసన్న వివేచన
విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు కాల దోషం పట్టని రచనలు. ఆయన సమకాలికుల రచనలు కొన్ని ఈనాటికీ నిలచివున్నా, విశ్వనాథ రచనలపట్ల యువతలో రోజు రోజుకీ పెరుగుతున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుంటే, ఆనాడు చేసిన రచనలయినా ఈనాటికీ అధికమవుతున్న ఆసక్తిని పరిగణలోకి తీసుకుంటే, విశ్వనాథ రచనలపై తరతరానికీ పెరుగుతున్న ఆసక్తి – పరుగిడుతున్న కాలంతో అడుగులో అడుగుకలిపి పరుగిడుతూన్నట్టు అనిపిస్తుంది. ఎవరెంతగా ఆయనను వ్యతిరేకించినా, ఆయన రచనలను విమర్శించినా, విశ్వనాథ రచనల పట్ల పెరుగుతున్నట్టు ఆసక్తి ఆయన సమకాలికులెవరి రచనలకూ పెరగటం లేదన్నది నిర్వివాదాంశం.
విశ్వనాథ సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇటీవలె విశ్వనాథవారిపై కానీ, ఆయన రచనల గురించికానీ, వచ్చిన అయిదు పుస్తకాల పరిచయ వ్యాసం ఇది. ఈ పుస్తకాలు ఈనాటికీ, పెరుగుతున్న విశ్వనాథ రచనల పట్ల ఆదరణ, పరిశోధన, ఆసక్తులకు చక్కటి ఉదాహరణలు.
విశ్వనాథ సాహిత్య పీఠం ‘కవిసమ్రాట్ విశ్వనాథ సుప్రసన్న వివేచన’ అన్న పుస్తకాన్ని ప్రచురించింది. కోవెల సుప్రసన్నాచార్యులవారు గత అరవై ఏళ్ళుగా విశ్వనాథ సాహిత్యంపై చేసిన వివేచన ఈ గ్రంథం. శ్రీ సుప్రసన్న గారు విశ్వనాథపై వివిధ సండర్భాలలో వ్రాసిన వ్యాసాలను, ఉపన్యాసాలను ఒకే చోట చేర్చి అందిస్తుందీ గ్రంథం.
ఇందులో మహాకవి విశ్వనాథ, శ్రీ మంజూషిక, వేదమే సీతాదేవి తపసాజ్వలంతీం, హంస దౌత్యం, పెంజీకటి కవ్వల, కల్పవృక్షం-బాలకాండ, కల్పవృక్షము-వరంగల్లులో కీలకోపన్యాసము, ఆధునిక సాహిత్యం ఎదిగిన సంస్కృతి శిఖరం విశ్వనాథ సత్యనారాయణ, గిరికుమారుని ప్రేమగీతాలు కులపాలికా ప్రణయం, విరాట్పురుషుడు, సమగ్ర మానవ చైతన్య నిర్మాణ శిల్పి విశ్వనాథ సత్యనారాయణ, ఒక్కపిలుపులేదయోధ్యనుండి, వేయిపడగలు ఎందుకు చదవాలి, మరొకసారి వేయిపడగలు చదివిన అనుభవం, శ్రీకృష్ణదేవుని నిర్వేదము, తొలిచివేసే విరహం, ఏకవీర రహస్య కథనం వంటి రచనలున్నాయి. వీటితో పాటుగా, వేయిపడగలు రచన అంతరార్థాన్ని వివరిస్తూ విశ్వనాథవారు చేసిన రేడియో ప్రసంగం, సుప్రసన్నాచార్యుల రచననపై పలువురు పండితుల విమర్శనాత్మక వ్యాసాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి.
కవిసమ్రాట్ విశ్వనాథ – సుప్రసన్న వివేచన
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య
పేజీలు: 194
వెల: ₹ 200/-
ప్రతులకు
విశ్వనాథ సాహిత్య పీఠం
ధరం కరం రోడ్, అమీర్ పేట్ , హైదెరాబాద్-16
Phone: 9848195959.
కవిత్వ కల్పతరువు – విశ్వనాథ
“ఒక నిరాడంబరుడు, నిశ్చలుడు, నిరంజనుడు కవిసమ్రాట్ డా. విశ్వనాథ సత్యనారాయణ గారు. భువికి అవతరించిన కవిత్వ కల్పతరువు. విశ్వనాథ శారద సకలార్ధ దాయిని!” అంటూ ఆరంభమవుతుంది ఈ పుస్తకం. ఈ పుస్తకంలో అధిక భాగం శ్రీమద్రామాయణకల్పవృక్షం కావ్య విమర్శ, వివరణలుంటాయి. ఆరంభంలోనే విశ్వనాథ ‘నా రాముడు’ రచన ప్రకారం విశ్వనాథ రాముడి లక్షణాలను వివరిస్తారు రచయిత. అలా పది లక్షణాలు కల రాముడు, పది తలల రావణుడిని సంహరించటం సమంజసమేనంటారు.
రెండవ అధ్యాయంలో మొదటి పద్యం వివరణ వుంటుంది ప్రతిపదార్ధ తాత్పర్య సహితంగా! ఈ రకంగా ప్రతి అధ్యాయంలో కొన్ని పద్యాలు, వాటి వివరణతో రామాయణ కల్పవృక్షాన్ని సవివరంగా, సమ్మోహనకరంగా, సమగ్రంగా, సుందరంగా పరిచయం చేస్తుందీ చిన్ని పుస్తకం. చివరలో విశ్వనాథ – జీవినివేదన అన్న అధ్యాయంలో విశ్వనాథ జీవుని జీవుని వేదన పరిచయం వుంది. “జీవుని వేదన బహిర్ముఖంగా సమాజవేదన అనీ, అంతర్ముఖంగా ఆధ్యాత్మికవేదన అనీ సాహిత్యవేత్తలు నిర్ధారించారు. రామకథలో ఈ రెండు ముఖాలూ ఉన్నాయి మరి! నిద్రలో కూడా శ్రీరామ స్తుతి వేయి మానస జిహ్వలతో చేసే విశ్వనాథ జీవన వేదన అటు
కవిత్వ కల్పతరువు – విశ్వనాథ
ఆచార్య రావికంటి వసునందన్
పేజీలు: 120
వెల: ₹ 50/-
ప్రతులకు
నవచేతన పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలు
విశ్వనాథ దర్శన – సాహిత్య సమాలోచనం, జీవిత వాఙ్మయ దర్శిని
ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతలలో కైలాస శిఖర స్థానం అయిన మహాకవి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంచనాలకు మించిన ప్రతిభామూర్తి. సమకాలీనత సార్వకాలీనత పొదుగుకున్న ఆయన సాహిత్య ప్రతిభ విశ్లేషించని అంశం లేదు. వ్యాఖ్యానించని అంశం లేదు. అందుకే ఈనాటికీ అనేకానేక కోణాలనుంచి, దృక్పథాలనుంచి విమర్శకులూ, పరిశోధకులూ ఎన్నెన్నో పరిశోధనలు చేస్తున్నారు. నూతనావిష్కరణలను చేస్తున్నారు. అయినా, ఇంకా ఎన్నెన్నో పరిశోధనాంశాలు మిగిలిపోతున్నాయి. అనేకానేక అద్భుతమయిన సత్యాలు ఆవిష్కృతం కావాల్సివున్నాయి. అలాంటి పరిశోధన అంశాలను ఆధారం చేసుకుని ఆయన జీవితాన్నీ సాహిత్యాన్నీ సమన్వయం చేసేందుకు చేసిన ప్రయత్నపు రేఖాచిత్రం ఈ పుస్తకం.
ఈ పుస్తకం మూడు ప్రత్యేక అధ్యాయాలుగా విభాజితమయింది. సాహిత్య సమాలోచనం, జీవిత వాఙ్మయ దర్శని, అభినందన చందనం అన్న మూడు అధ్యాయాలలో విశ్వనాథ సాహిత్య సృజనకూ జీవితానికీ నడుమ సమన్వయం చేసే ప్రయత్నం చేశారు ఆచార్య ఎస్వీ రామారావుగారు.
సాహిత్య సమాలోచనం అధ్యాయంలో సకలలోక వైభవ సనాథుడు, విశ్వనాథ కావ్యాలు-సమకాలీనుల ప్రసక్తి, కల్పవృక్ష-అవతారిక, ఆంధ్ర ప్రశస్తి, కిన్నెరసాని పాటలు, విశ్వనాథ నవలా శిల్పం, కథా మాణిక్యాలు, నాటక రత్నాలు, విమర్శక శేఖరము, సాహిత్య చరిత్ర రూపకాలు- అపూర్వ ప్రయోగం, వ్యాస సమీక్ష అనే అంశాల వివరణ వుంది.
జీవిత వాఙ్మయ దర్శిని అన్న అధ్యాయంలో జీవన రేఖలు, విశ్వనాథ సాహిత్యం, విశ్వనాథపై విమర్శనా సాహిత్యం, విశ్వనాథతో ఇష్టాగోష్టి అన్న అంశాల వివరణ వుంది. అభినందన చందనం అన్న అధ్యాయంలో కవితలు, విశ్వోన్నతుడు, భాషా విశ్వనాథుడు అన్న వ్యాసాలు ఆసక్తికరంగా వుంటాయి. ముఖ్యంగా ‘భాషా విశ్వనాథుడు’ అన్న వ్యాసంలో విశ్వనాథ భాషను వాడుకున్న తీరు వివరణ, వాడిన పదాల జాబితా ఆనందాన్ని కలిగిస్తాయి. విశ్వనాథ అభిమానులకే కాదు, తెలుగు భాషాభిమానులకు, సాహిత్యాభిమానులకు అత్యంత ఉపయోగకరమూ, ఆనందకరమూ ఈ పుస్తకం.
ఆచార్య ఎస్వీ రామారావు.
పేజీలు: 152
వెల: ₹ 250/-
ప్రతులకు
నీల్ కమల్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
సుల్తాన్ బజార్, కోఠి
హైదరాబాద్-1
Phone-9000168953
రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం
రామాయణ కల్పవృక్షంలోని వేలాది పద్యాలలో ఈ కాలానికి పనికివచ్చే కొన్ని పద్యాలను, ఆంటే, లోక సహజములైన మాటలు, వ్యవహా రశైలి, సంభాషణా చాతురి, మానవ సంబంధాలు, సుఖదుఃఖాలు, మొదలైనవాటిని ఎంపికచేసి ఆయా పద్యాలగురించి వివరించిన పుస్తకం డా. గండ్ర లక్ష్మణారావు గారు రచించిన ‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’.
విశ్వనాథ నందమూరిలో శివుని సంబోధించి రచించిన ‘మా స్వామి’ శతంలో మొదటి పద్యం, రామాయణ కల్పవృక్షంలో మొదటి పద్యం ఒకటేనని చెప్తూ, ఒకటి విష్ణు సంబంధితమని, మరొకటి శైవ సంబంధితమనీ విశ్వనాథ వారి దృష్టిలో శివకేశవుల నడుమ అభేదప్రతిపత్తి అనీ చక్కగా వివరిస్తూ ఈ పుస్తకం ఆరంభమవుతుంది.
ఈ పుస్తకంలో పద్యాల ఎంపికలో కథాక్రమం పాటించలేదు. పద్యాలకు వ్యాఖ్యానం రాయలేదు. పద్యాల సందర్భాలు వివరిస్తూ, సమకాలీన సామాజిక పరిస్థితులతో అన్వయిస్తూ, ఆయా పద్యాల సారాన్ని ఆధునిక సమాజంలో ఎలా ఆచరణలో పెట్టవచ్చో సూచించారు వ్యాఖ్యాత.
అయోధ్యకాండలోని పద్యాన్ని వివరిస్తూ ఆ పద్యంలో విశ్వనాథ రాముడితో విప్లవం అనిపించటం వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించటం బాగనిపిస్తుంది. గుహుడు రాముల నడుమ జరిగిన సంఘటనలను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ప్రపంచంలో తానే శక్తిమంతుడన్న అహంతో ఇతర స్వతంత్ర దేశాధీశులను సామంత రాజులలా పరిగణిస్తూ వ్య్వహరిస్తున్న అమెరికా అధ్యక్షుడికి చెప్పాల్సిన పాఠంలా అనిపిస్తుంది. ఈ సందర్భంతో ఆత్మగౌరవంతో వ్యవహరించిన భారతప్రభుత్వ వ్యవహారరీతి కూడా అర్ధమవుతుంది.
రాముడు, శబరిలు కలిసే ఘట్టాన్ని వివరించిన తీరు అద్భుతం అనిపిస్తుంది. ముఖ్యంగా శబరి నదిని శబరి పాత్రలో లీనం చేశాడని ప్రకటిస్తూ, శబరి, రాముల అనుబంధాన్ని చాలా గొప్పగా వివరించారు. ఇటీవలి కాలంలో శబరిని ఒక ట్రైబల్ విప్లవ మహిళగా, రాముడిని అణచివేత కమ్యూనిస్ట్ సర్కార్‌గా చూపిస్తూ రచించిన సిద్ధాంత గ్రంథం లాంటి అభూత కాల్పనిక నవల అనబడే సంవాద రచనను చదివిన తరువాత ఇలాంటి వ్యాఖ్యానాల ఆవశ్యకత మరింతగా బోధపడుతుంది. దృష్టి ప్రాధాన్యం అర్ధమవుతుంది.
విశ్వనాథ అభిమానులు, ముఖ్యంగా రామాయణ కల్పవృక్షాన్ని అర్థం చేసుకోవాలని తపన కలవారే కాదు,
విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం లోకానుశీలనం
డా. గండ్ర లక్ష్మణరావు
పేజీలు: 92
వెల: ₹ 200/-
ప్రతులకు
విశ్వనాథ సాహిత్య పీఠం
ధరమ్ కరమ్ రోడ్, అమీర్ పేట్
హైదరాబాదు-16
Phone-9848195959
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – ఉదాత్త కల్పనలు
విశ్వనాథ విరచిత ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ కావ్యాన్ని సంగ్రహసుందరంగా పరిచయం చేసి, అపోహలు తొలగించి అందరూ చదివి ఆనందించేట్టు చేసే లక్ష్యంతో పలువురు దిగ్గజ పండితులతో రచింపచేసి ప్రచురించిన వ్యాస సంకలనం ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము – ఉదాత్త కల్పనలు’.
ఈ పుస్తకానికి శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు సంపాదకత్వం వహించారు. బాలకాండలోని ఉదాత్త కల్పనల గురించి వివరించే వ్యాసం కూడా వారు వ్రాశారు. డా. అద్దంకి శ్రీనివాస్ అయోధ్యకాండలోని ఉదాత్త కల్పనల గురించి, డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్ అరణ్యకాండలోని ఉదాత్త కల్పనల గురించి, శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు కిష్కింధకాండ ఉదాత్త కల్పనల గురించి, డా. కడిమెళ్ళ వరప్రసాద్ సుందరకాండ ఉదాత్త కల్పనల గురించి, డా. పేరి రవికుమార్, యుధ్ధకాండలోని ఉదాత్త కల్పనల గురించి అందించిన సుందరమైన వివరణాత్మకమైన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం.
విశ్వనాథవారు రామాయణ కల్పవృక్ష కావ్య అవతారికలోనే ‘మదికి నుదాత్తకల్పనల మక్కువ గల్గిన విశ్వనాథ శారద’ ప్రస్తావించటంతో ఈ వ్యాసాలకు విశ్వనాథవారు వివిధ కాండల్లో చేసిన ఉదాత్త కల్పనలను వివరించటం లక్ష్యంగా ఎంచుకున్నారు.
మొదటి వ్యాసంలో ఉదాత్త కల్పనలంటే ఏంటో వివరిస్తూ బాలకాండలోని ఉదాత్త కల్పనల వివరణ వుంది. హృదయాన్ని ఆనందపరవశం చేసే కవిత్వాన్నీ, బుద్ధికి పదును పెట్టే శాస్త్ర రహస్యాలనూ , వివిధ పాత్రల వ్యక్తిత్వాలనూ విశదపరుస్తాయీ వ్యాసాలు. అయోధ్యకాండ ఉదాత్త కల్పనలు వివరిస్తూ కాకాసురుడన్న పేరే తప్పనీ, అందుకే విశ్వనాథవారు ఆ పేరును కావ్యంలో వాడలేదనీ చెప్తారు. సుందరకాండలో వచ్చే ఈ కథను విశ్వనాథ అయోధ్యకాండలో పొందుపరచటం ఒక ఉత్కృష్టమైన కల్పన అంటారు.
సీతారావణుల సంవాదాన్ని భారతీయ సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికీ నడుమ సంవాదంలా చిత్రించటం విశ్వనాథ కల్పనా చాతుర్యానికి మచ్చుతునక. ఆ విషయాన్ని ఈ వ్యాసం ఎత్తి చూపిస్తుంది. విశ్వనాథ రచనలన్నిటిలో ఈ సంఘర్షణ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తూనే వుంటుంది. ప్రధానకథకు భంగం కలగకుండా విశ్వనాథ వారు చేసిన కల్పనలను వ్యాసకర్తలు చక్కగా వివరించటమే కాదు, ఆ కథలను పొందుపరచటంలో కవి ఉద్దేశము, సాధించాలనుకున్న ప్రయోజనంతో సహా, ఆయా కల్పనల సృజనలోని చాతుర్యము, సృజనాత్మక ప్రతిభలను చక్కగా వివరించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలు చదివిన తరువాత రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని పఠించాలనే కోరిక కలుగుతుంది. కావ్యాన్ని అధ్యయనం చేస్తూ అందులోని సౌందర్యాలను గ్రహిస్తూ అలౌకికానందన్ని అనుభవించాలన్న తీవ్రమైన ఇచ్ఛ కలుగుతుంది.
శ్రీమద్రామాయణ కల్పవృక్షము – ఉదాత్త కల్పనలు (వ్యాస సంపుటి)
సంపాదకులు- బేతవోలు రామబ్రహ్మం
పేజీలు: 264
వెల: ₹ 400/-
ప్రతులకు
టీవీఎస్ ఎస్ కృష్ణకుమార్
Phone: 9908572598.