Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వం వసుమయం కావాలి!

[విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ‘విశ్వం వసుమయం కావాలి!’ అనే వ్యాసం అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

తే.గీ.:
సృష్టి ప్రారంభ మెప్పుడో చెప్పలేము
కారు తొలినాడె మనకు యుగాది యగును
కొమ్మ చిగారు లెత్తు విధము క్రొత్త వత్స
రమున కొంగ్రొత్తయాశలు ప్రాభవిల్లు

అన్నాడో కవి.

“మాకు ఉగాదులు తవు మాకు ఉషస్సులు లేవు” అని ఉస్సురని నిట్టూర్చాడో మహాకవి. ప్రతి కొత్త సంవత్సరం మనిషికి కొత్త ఆశలనిస్తుంది. అంత నిరాశ ఎందుకు? కాబట్టి, “మాకూ ఉగాదులున్నయ్. మాకూ ఉషస్సులున్నయ్” అని ఆశావహ దృక్పథాన్ని చూపిద్దాం.

‘క్రోధి’ అంత కోపంగా ఏమీ లేదు లెండి. ‘శ్రీవిశ్వావసు’ వచ్చింది. విశ్వమంతా వసుమయం అవుతుందని దీనర్థం. వసు అంటే సంపద. విశ్వావసుడు అంటే ప్రపంచానికి మేలు చేసేవాడని కూడా అర్థం ఉంది.

ప్రభుత్వాలు జరిపి పంచాంగశ్రవణంలో పండితులు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగానే చెబుతారు. అది ప్రమాణం కాదు. ఏ గ్రహలు ఏ రాశులు, ఎలా ఉండబోతాయో వివరంగా చెబుతారు. అవన్నీ నిజమని నమ్మి, ఆదుర్దా లేదా ఆనందం చెందనక్కరలేదు.

ఒక ఆంగ్ల కవి అన్నట్లు “Every tomorrow must be a suspense”. ప్రతి రేపూ, ఉత్కంఠను రేకెత్తించాలి. అన్నీ ముందే తెలిస్తే ఇక జీవితంలో థ్రిల్ ఏముంటుంది? కాబట్టి, ‘Accept life as it is’ అన్న సూత్రాన్ని పాటిస్తే, టెన్షన్ ఉండదు.

‘ఉగము’ అంటే నక్షత్ర నిర్ణీత గమనం. జన్మ- ప్రపంచం జన్మ. ఆయుష్షులకు ఇది మొదటి రోజు. అందు ఉగాది తర్వాత ‘యుగం’ అంటే రెండు ఉత్తరాయణం, దక్షిణాయసం కలిసి సంవత్సరం. దానికి ప్రారంభం. ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణోక్తం. తెలుగు, కన్నడ, కొంకణి ప్రజలేగాక ‘బాలి’ ద్వీపవాసులు కూడా ఈ పండగను జరుపుకొంటారు. ఆర్.ఎస్.ఎస్. వారు సంస్థాగత స్థాయిలో అధికారికంగా దీనిని జరుపుతారు

మత్స్యావతారం ధరించి, వేద చోరుడైన సోమకాసురుని వధించి విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మకప్పగించిన సుదినం ఇది. శాలివాహన చక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై యుగకర్త ఐనాడు.

‘ఉగాది పచ్చడి’ ఈ రోజు స్పెషల్. మిగతా పండుగల లాగా ఈ రోజు ప్రత్యకంగా వ్రతాలు, నోములు ఉండవు. ఒక రకంగా ప్రకృతి ఆరాధనే ఉగాది. కాబట్టి దీన్ని Romantic festival అనవచ్చు. తెలుగో సాహిత్యంలో Romantic అన్న పదాన్ని శృంగారపరంగా అర్థం చేసుకున్నారు కాని, Romantic అంటే ప్రకృతికి సంబంధించిన ఆరాధన. ఆంగ్ల సాహిత్యంలో Romantic Age అని యుగం ఉంది. వర్డ్స్‌వర్త్, షెల్లీ, కీట్స్ మొదలగువారు Romantic కవులుగా పేరుపొందారు. తెలుగులో అలా ప్రత్యేక యుగమంటూ లేకపోవచ్చుగాని, దువ్వూరి రామిరెడ్డి, విశ్వనాథ, శేషేంద్ర, సినారె వంటి ఉద్దండులు ప్రకృతిని తమ కవిత్వంలో ఆరాధించారు. మన కావ్యాల్లో, ప్రబంధాలలో ఋతువర్ణనలు ఉంటాయి. నదీనదుల వర్ణనలు ఉంటాయి. ఉగాది కవితల్లో కోయిలల పాటలు, మావిచివురుల కాంతులు తప్పక ఉండాల్సిందే.

ఉగాది పచ్చడిలో ఆరు రుచులు కలుస్తాయి. మధురం, ఆమ్లం, లవణం, కటువు, తిక్త, కషాయములు. మన మాటలో చెప్పాలంటే, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఉగాది పచ్చడి మీద మొదటినుండీ ఎన్నో జోకులు, కార్టూన్లు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. చేయాల్సిన విధంగా చేస్తే దాని రుచి అద్భుతం. వేపపూత వల్ల కొద్దిగా చేదు అనిపిస్తుందిగాని, మిగతా ఐదు దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. కొంతమంది చెరుకు ముకలు, అరటిపండ్ల గుజ్జు దానిలో వేసి దానిని నానా కంగాళీ చేస్తారు. జీవితం సకల రుచుల సమాహారం, కాకరకాయ కూడా రుచి గానీ ఉంటుంది, సరిగ్గా వండితే! రుచి సంగతి పక్కన బెడితే, దాని లోని ingredients లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉదా: బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉండి, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వేపపూత కఫహరి. నోటి దుర్వాసనను అరికడుతుంది. వగరు పులుపుతో కలిసి చక్కని రుచినిస్తుంది. కడుపులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఉప్పు ఈ రుచులను సమన్వయం చేస్తుంది. దీనిని సెలవిచ్చిన వారు ‘మనీష్ సర్నా’ గారు. అయిన ‘సెంటర్ పాయింట్’ హాస్పిటాలిటీ హెడ్.

మహారాష్ట్ర దేశంలో ఉగాదిని ‘గుడిపడ్వా’ అంటారు. కన్నడిగులు యుగాది అనే అంటారు. తమిళులు ‘పుతండు’ అంటారు. బీహారు లోని మిథిల ప్రాంతంలో ‘జూడె శీతల్’ అంటారు. బెంగాల్‍లో పొహెల బైశాఖ్ అంటారు. ‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అన్నట్లు, పేర్లు వేరైనా ఉగాది ఒకటే.

ఇక ‘పంచాంగం’ అంటే ఐదు అంగములు గలది. తిథి, నక్షత్రం, యోగం, కరణం, వారం, ఇవీ ఐదు అంగాలు. తిథి అంటే శుక్ల బహుళ పక్షాలు, ప్రతి నెలలో ఉంటాయి. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు; మళ్లీ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక్క పక్షం 15 రోజులు ఉంటుంది. ‘ఆల్మనాక్’ అంటే తెలుగులో కాలనిర్ణయ పట్టిక. ఇంగ్లీషు తేదీలకు అనుసంధానంగా, ఆ రోజు తిధి ఎంత వరకు, ఆ రోజు ఏ నక్షత్రం, వర్జ్యం, రాహు కాలం, ఆ నెలలో వచ్చే పండుగలు అన్నీ వివరంగా ఉంటాయి. Accuracy (ఖచ్చితత్వానికి) ప్రతిరూపం మన తెలుగు క్యాలండర్. అది ఒక శాస్త్రీయ మదింపు. నిమిషాల తేడా కూడా రాదు. శతాబ్దాల నుండి మన పంచాంగకర్తలు దాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మధ్య సామాజిక మాధ్యమాల ‘అతి’ వల్ల శ్రీరామనవమి, కృష్ణాష్టమి లాంటి పండుగలు ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో తేడాలు వస్తున్నాయి గాని, గతంలో ఇలా లేదు. పంచాంగంలో శుభకార్యాలు జరుపుకోవడానికి అనుకూల దినాలు సమయాలు కూడా ఉంటాయి.

‘ఋతూనాం కుసుమాకరః’ – ఋతువులలో ‘వసంతాన్ని నేనే’ అని గీతాచార్యుదే చెప్పాడు. నన్నయ భట్టారకుడు ఆదిపర్వంలో వసంత శోభని వర్ణించాడు

“కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు
పమ్ముల సుగీత నినదమ్ము లెసఁగెం; జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకుళమ్ములను నానుచును
ముదమ్మొనర వాచా
లమ్ము లగు కోకిల కులమ్ముల రవమ్ము మధుర మ్మగుచు
విన్చె; ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును జంపకచయమ్ములును
కింశుకవనమ్ములును నొప్పెన్‌.”

ఇక చేమకూర వేంకటకవి చయుత్కారం చిత్తగించండి.

“తిపయి వట్టి మ్రాకులు జిగిర్ప వసంతుడు దా రసోపగుం
భిత పద వాసనల్ నెఱప, మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
న్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె
ఏ గతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే కదా!”

వసంతుడు చెట్లను చిగురింపచేశాడు, ప్రకృతిని పరిమళింప చేశాడు. పైనున్న చంద్రుడికి కుళ్లు పుట్టింది. తన ఘనత చూపించుకోవడానికి వెన్నెల కురిపించి రాళ్లను కరిగింపచేశాడట. చివరిపాదం ఇప్పటికీ పనికొస్తుంది. దాన్ని సాహిత్యంతో ముడిపెట్టడం చేమకురవారికే చెల్లింది. ఎంత బాగా రాసినా సమకాలీన కవులు రచయితలు మెచ్చరు కదా! అంటున్నాడు. నిజమే కదా!

“అంగము చేతబట్టుకొని ఆడిరుగాదిని పండితోత్తముల్” అని గతంలో ఒక అవధానికి పృచ్ఛకుడు సమస్యనిచ్చారు. ఆయినకది సమస్యే కాలేదు. పైకి అసభ్యంగా కనిపిస్తుంది. కాని, మూడవపాదం చివర ‘పం’ చేర్చి ‘పంచాంగము’ గా మార్చాడా విద్వన్మణి.

నా పద్యంతో ముగిస్తాను.

ఆంగ్ల నూతన వత్సర మందు శ్రద్ధ
జూపు యువతకు మన యుగాదెపుడు విసుగు
పథము మార్చుకు సంవత్సరాది యెదియొ
తెలుసుకొనవోయి, ఓ వెర్రి తెలుగువాడ!

Exit mobile version