Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వకవి రవీంద్రుని విశ్వమానవతావాదం

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘విశ్వకవి రవీంద్రుని విశ్వమానవతావాదం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“Where the mind is without fear and the head is held high” మానవ మేధస్సు మరియు హృదయాలు స్వేచ్ఛ, మానవత, పరిపూర్ణతను ప్రతిబింబించాలనే సందేశం గీతాంజలి కావ్యం ఇస్తోంది అది విశ్వ మానవీయతకు పిలుపు కూడా!

ప్రేమతో మానవాళిని ఒక్కటిగా చూసే తత్త్వాన్ని ప్రపంచానికి వినిపించిన ఒక దివ్యగీతం గీతాంజలి. 1913లో, సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ మహాకావ్యం అది!

“Where the world has not been broken up into fragments by narrow domestic walls” అంటూ, ప్రాంతీయ, కుల, మత, భాష, విదేశీ వ్యామోహపు సంకుచిత గోడలను చెరిపేసిన ఒక ప్రపంచాన్ని తలపెట్టారు రవీంద్రుడు.

రవీంద్రనాథ్ ఠాగూర్ (1861 మే 7-1941 ఆగస్టు 7) భారతీయుడుగానే కాక, విశ్వమానవునిగా ఎదిగినవాడు. కవి, సంగీతవేత్త, చిత్రకారుడు, విద్యావేత్త అనేక మేధోమూర్తులు కలిసి మూర్తీభవించిన ఒక సజీవ శిల్పం. ఆధునిక భారతీయ ఆత్మను ప్రపంచ వేదికపై ప్రతిబింబించిన ప్రతిభాశాలి!

రవీంద్రుని విశ్వమానవతా సందేశం

రవీంద్రుని ఆలోచనలు ప్రాంతీయ గరిష్ఠాలను, జాతీయ పరిమితులను దాటి విశ్వమానవత వైపు పయనించాయి. జాతీయతను ఆయన ప్రజల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా గౌరవించాడు.

‘జనగణమన’

మన జాతీయ గీతం ‘జనగణమన’ భారతదేశ ఐక్యతను ప్రతిఫలిస్తూ, భాషలు, మతాలు, ప్రాంతీయతలను ఆదరిస్తూ సమగ్ర మానవ సమైక్యతను ఆకాంక్షిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతుంది. పండిట్ నెహ్రూ పార్లమెంటు వేదికపై ‘జనగణమన’ను విశ్వమానవతా గీతంగా ప్రకటించారు.

‘గోరా’ నవల

రవీంద్రుని ‘గోరా’ (1880) నవల – జాతీయత, మతం, మానవతా భావనలపై గాఢమైన పరిశీలన. హిందుత్వానికి, దేశభక్తికి పరాకాష్ఠగా జీవించిన గౌర్మోహన్ (గోరా) చివరికి తాను విదేశీయుని సంతానం అన్న నిజాన్ని తెలుసుకుంటాడు. మతాలకన్నా, జాతులకన్నా మానవత్వమే అసలైన ఆత్మస్వరూపమని గ్రహిస్తాడు.

“నేను హిందువుని కాదు, భారతీయుణ్ణీ కాదు, కేవలం మానవుణ్ణి!” అంటూ గొప్ప మానవతా సందేశాన్ని ప్రకటిస్తాడు.

ఈ నవలలో రవీంద్రుడు మత సహనం, స్త్రీ చైతన్యం, సామాజిక సమానత్వం, ప్రేమ, సహనం, సత్యం వంటి విలువలను లోతుగా తర్కించాడు. సుచరిత, లలిత వంటి పాత్రలు స్వేచ్ఛా భావనను, మానవీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి.

‘ఘరే బైరే’

ఈ నవలలో రవీంద్రుడు దేశభక్తి ఒక మత్తు అనీ, మానవతను మింగి విషంగా మారుతుందనీ హెచ్చరించాడు.

‘చార్ అధ్యాయ్’

1934లో వెలువడిన ఈ చివరి నవలలో రహస్యవాదం, సాయుధ ఉద్యమాల లోపాల్ని ఖండించారు.

The Religion of Man

మానవ సంబంధాలలో ప్రేమ, గౌరవం, అనుభూతిని మానవ ఉనికికి మూలసారం అన్న తీర్మానం చేశారిందులో.

పాశ్చాత్య జాతీయవాదంపై విమర్శ

‘Nationalism’ (1917) గ్రంథంలో ఆయన యూరోపియన్ జాతీయతను శక్తి కేంద్రీకృత నియంతృత్వంగా భావించారు. మానవ విలువలను తోసిరాజేసి, యంత్రాల్లా నడిచే సమాజ నిర్మాణాన్ని ఈ జాతీయ భావన పెంపొందిస్తుందని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాలలో జాతీయత ఆర్థిక, రాజకీయ స్వార్థాలకు వేదికగా మారిందని, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారన్నారు.

బెనెడిక్ట్ ఆండర్సన్, ఎర్నెస్ట్ గెల్నర్, ఎరిక్ హాబ్స్బామ్ వంటి పాశ్చాత్య పండితుల నిర్వచనాలు యూరోకేంద్రీకృత దృష్టిని ప్రతిబింబిస్తాయి. అయితే, రవీంద్రుడు జాతీయతను పవిత్ర భావనగా భావించారు. మానవతను తృణీకరించి ఆధిపత్య ధోరణి పెరిగితే, అది ప్రపంచ శాంతికి ముప్పు అని స్పష్టంగా హెచ్చరించారు.ఈ విమర్శలు పాశ్చాత్య మూలాల అంధానుకరణపైనే ఆయన ఎక్కుపెట్టినవి.

యూరోపియన్ జాతీయతలు మానవ సమూహాల్లో విభేదాలు, శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. జపాన్ ఉదాహరణగా చూపిస్తూ, పాశ్చాత్య దేశాలతో పోటీపడి విజయం సాధించిన ‘జపాన్ జాతీయత’, కేవలం వాణిజ్య ప్రయోజనాలకు పరిమితమైపోయిందని, అది పరిపూర్ణ జాతీయత కాదని వివరించారు.

రవీంద్రుని సమకాలీనులు ఆయన విమర్శలను ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియదు. అయితే, జాతీయత అనే నినాదంతోనే హిట్లర్ వంటి నియంత ఉద్భవించి, ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారినప్పుడు, 30 యేళ్ల ముందే ఈ ప్రమాదాన్ని పసిగట్టిన రవీంద్రుని దార్శనికత అందరికీ అర్థం అయ్యింది!

భారత జాతీయోద్యమం, టాగూర్ స్పందన

భారత జాతీయోద్యమ ప్రారంభానికన్నా ముందే జాతీయత పట్ల ఆయన తన దృఢమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. దేశభక్తికి ఆయన విరోధి కాదు. అయితే ఆయన అభిలషించిన జాతీయతా భావన శాంతి, సమగ్రత, మానవతా విలువలపై ఆధారపడినది.

రాజకీయాలు నైతికతతో విడదీయరాని సంబంధం కలిగి ఉండాలని, దేశభక్తి గర్వోత్తుంగ శోభకు ప్రతీకగా కాక, మానవ సమగ్ర వికాసానికి దోహదపడే పరిశుద్ధ మార్గంగా నిలవాలని, మానవతా విలువలను కాపాడే, విశ్వబంధుత్వపు బాటను అనుసరించాలనీ అన్నారు. పాశ్చాత్య ధోరణులతో కూడిన బూటకపు జాతీయవాదాన్ని ఆయన ధీరంగా తిరస్కరించారు.

1905లో బెంగాల్ విభజనపై జరిగిన స్వదేశీ ఉద్యమానికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గీతాలు రచించారు, ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ ఉద్యమం హింసాత్మకంగా మారుతుండటం ఆయనను తీవ్రంగా నిరుత్సాహ పరిచింది. నిర్దోషులపై దాడులు, ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం, బాంబుదాడుల వంటి ఘటనలు ఆయనను బాధించాయి.

1908లో ఒక యువ జాతీయవాది విసిరిన బాంబు కారణంగా ఇద్దరు నిర్దోషుల మృతి ఆయనను తీవ్రంగా కలచివేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీలో వీధినపడ్డ మితవాద అతివాద విభేదాలు కూడా ఆయన నిరాశకు కారణమయ్యాయి.

భారత జాతీయోద్యమంలో జరిగిన విదేశీ వస్తువుల దహనాన్ని కూడా పాశ్చాత్య చౌవినిజం (అతివాద దేశభక్తి)కి అనుకరణగానే ఆయన భావించారు. స్వదేశీ వస్తువులు ఖరీదైనవిగా మారి పేదలపై భారం పడుతుందన్నారు. విశ్వమానవతా విలువలకు ఇలాంటివి విరుద్ధమన్నారు.

భారత జాతీయోద్యమానికి శాంతి, సహనం, పరస్పర గౌరవం వంటి విలువలే పునాది కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆసియా, ఆఫ్రికా దేశాలతో ఉన్న ప్రాచీన మైత్రీబంధాల్ని పునరుద్ధరించి, వసుధైక కుటుంబాన్ని బలపరచాలన్నారు.

విద్యాప్రదాత, మానవతావాది

వ్యక్తిగత స్వేచ్ఛను మౌలిక విలువగా పరిగణించిన తత్త్వవేత్త రవీంద్రుడు. ఆత్మవిశ్వాసం, భావప్రకటన స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛల్ని ప్రజాస్వామ్యపు ప్రాణసూత్రాలుగా విశ్వసించారు.

“Where the mind is without fear and the head is held high, Where knowledge is free”ఈ వాక్యాలు ఆయన జీవితమే జీవించిన సత్యప్రకటనలు; కేవలం పదాల కూర్పు కాదు!

మానవ మేధస్సు వికాసానికి స్వేచ్ఛ అవసరాన్ని గుర్తించి రవీంద్రుడు శాంతినికేతన్ స్థాపించారు. భారతీయ విద్యా వ్యవస్థ పునర్నిర్మాణానికి అక్కణ్ణుంచే తొలి అడుగులు పడ్డాయి. భారత జ్ఞానపరంపరను ప్రపంచానికి పరిచయం చేయాలనేది ఆయన తపన.

రవీంద్రుని దృష్టిలో విద్య, సమాజ వికాసానికి మూలస్తంభం. స్వేచ్ఛ, సృజనాత్మకత, మానవతా విలువల ఆధారంగా నిర్మించాల్సిన శక్తిగా విద్యను చూశారు. మనిషిని విశ్వమానవుడిగా తీర్చిదిద్దే విద్యావ్యవస్థ కావాలన్నది ఆయన గాఢమైన ఆకాంక్ష.

శాంతినికేతన్ విద్యనభ్యసించిన తెలుగు ప్రముఖుల్లో బెజవాడ గోపాలరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు, కొండపల్లి శేషగిరిరావు, శివలెంక శంభుప్రసాద్, వేదుల సత్యనారాయణ శాస్త్రి, మల్లవరపు విశ్వేశ్వరరావు, టీ.ఎన్. అనసూయాదేవి, బి.వి. సింగరాచార్య వంటి మహానుభావులు ఉన్నారు. ఆంధ్ర షెల్లీగా ప్రసిద్ధిచెందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, రవీంద్రుని కలిసిన అనంతరం తన పద్యాలలో సంభవించిన గాఢమైన మార్పును స్వయంగా గుర్తించారు.

మహాత్మా! గురుదేవ!!

1917లో గాంధీజీ భారతీయ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు, మౌన తత్త్వచింతనలో మునిగిన రవీంద్రుని హృదయంలో, జాతికి నిజమైన వారసుడు లభించాడన్న ఆ ఆనందావేశం కొన్ని అమృతపు భావబిందువుల్లా ప్రవహించింది!

గాంధీజీని “మహాత్మా” అని తొలి సారిగా సంబోధించింది రవీంద్రుడే! గాంధీ కూడా రవీంద్రుని “గురుదేవ్” అని మధుర గౌరవబిరుదుతో సత్కరించారు. ఈ ఇద్దరిదీ భిన్నమైన భావనాఝరులైనప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛ, మానవతా విలువల పట్ల ఏకీకృత మమకారంతో మిళితమైన మిత్రత్వం వారిది.

గాంధీ ‘యంగ్ ఇండియా’ పత్రికలో, రవీంద్రుడు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ఆత్మీయతతో, వినయంతో స్పందించారు.

ఈ సంభాషణ జ్ఞానం, సంస్కృతి, వినయం కలిసిన ఒక ఆదర్శ మానవిక పరస్పర సంభాషణగా నిలిచింది.

1915లో బ్రిటిష్ ప్రభుత్వం రవీంద్రునికి ‘నైట్’ బిరుదును ఇచ్చింది. అయితే, 1919 జలియన్ వాలాబాగ్ మారణహోమం అనంతరం, రవీంద్రుడు ఆ బిరుదును గౌరవంగా త్యజించి,తన దేశభక్తిని, మానవతా బద్ధతను ఘనంగా ప్రకటించారు.

ఇది కేవలం బిరుదు పరిత్యాగం కాదు; అది ఒక గంభీరమైన నైతిక తిరస్కరణ.

ఇతర జాతీయ నాయకులతో పోలిస్తే, రవీంద్రుని అంతర్లీనమైన విలువలకు సంబంధించిన అవగాహన ఇక్కడ స్పష్టమవుతుంది.

టాగూర్-గాంధీ:

గాంధీ గ్రామస్వరాజ్యాన్ని, స్వయం సమృద్ధిని ఆశయంగా నిలుపుకున్నారు. రవీంద్రుడు గ్రామాలను విద్య, శాస్త్ర విజ్ఞానం, కళల ద్వారా మానవ వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని శాంతినికేతన్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కానీ, గాంధీ ప్రతిపాదించిన ‘నయీతాలీమ్’ విద్యా విధానం వ్యక్తి స్వావలంబనకు దోహదపడేదిగా రూపొందింది!

టాగూర్ – తిలక్:

“స్వరాజ్యం నా జన్మహక్కు” అంటూ ఉగ్ర భావోద్వేగాలతో ఉద్యమాన్ని నడిపించారు తిలక్. అయితే, టాగూర్ జాతీయతను మానవతా విలువల పరిరక్షణతో మిళితమై ఉండాలని తత్త్వదృష్టితో హెచ్చరించారు. మత భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం ప్రమాదకరం అని హెచ్చరిక చేశారు.

టాగూర్ – అంబేద్కర్:

అంబేద్కర్ భారత కులవ్యవస్థను గట్టిగా ఖండించి బౌద్ధమతంలోకి మారే దిశగా సాగారు. రవీంద్రుడు కూడా కులవివక్షను తీవ్రంగా నిరసించారు. అయితే, మార్పును శాంతియుత విద్యావికాసం ద్వారా సాధించాలన్న విశ్వాసంతో నడిచారు. అంబేద్కర్ ప్రత్యక్ష రాజకీయ మార్పును ఆశించగా, రవీంద్రుడు మానవిక సాంస్కృతిక మార్పును ఆశించారు.

రవీంద్రుని దృష్టిలో రాజకీయ విజయాలకు మించినది మానవ వికాసం, అంతర్భావ పరిమళం, విశ్వమానవతా ప్రేమ.

జీవితాన్ని పరిపూర్ణతతో పరిమళించే మౌలిక విలువల పరిరక్షణే ఆయన జీవన ధ్యేయం!

స్వేచ్ఛా స్వర్గానికి పిలుపు

“Where the mind is without fear..” రవీంద్రుని ఈ కవిత జాతీయత, విశ్వమానవతా విలువల దార్శనికతను ప్రతిఫలిస్తుంది:

మనసునిండా నిర్భయత, శిరశెత్తి నిలిచే చోట,
అపరిమిత జ్ఞానం అందరికీ అందుబాటైన చోట,
సంకుచిత ప్రాంతీయతల అడ్డుగోడలతో
ప్రపంచం ముక్కలుగా విడిపోని చోట,
మాటలు పెదాల మీదుగా కాక,
సత్యపు లోతుల్లోంచి ఉబికివచ్చే చోట,
పరిపూర్ణత కోసం నిర్విరామ సాధన జరిగే చోట,
కాలం చెల్లిన ఆచారాల అఙ్ఞానపు టెడారుల్లో
వివేకప్రవాహం అంతమై పోకుండా నిర్మలంగా ప్రవహించే చోట
వికసిత భావాలతో విస్తారమైన క్రియాశీలతతో
ఓ ప్రభూ! నీ దారినే సాగుతోంది నా మనసు..
నా దేశం ఆ స్వేచ్ఛా స్వర్గంలో మేల్కొనుగాక!”

ఈ సందేశం నేటి భారతానికి ఎందుకు ముఖ్యమైందో ఇప్పటి తరం ఆలోచించాలి!

ఈ నాటి భారతదేశంలో narrow domestic walls – కులతత్వపు గోడలు, ప్రాంతీయత, మతతత్వపు విభజనలు వెర్రితలలు వేస్తున్నాయి. జాతీయత వక్రభాష్యానికి లోనవుతోంది.

రవీంద్రుడు 150 సంవత్సరాల క్రితమే ఈ ప్రమాదాన్ని ఊహించారు. నేటి పరిస్థితులకీ ఆయన హెచ్చరికలకీ మధ్య నలిగిపోతున్న సత్యాన్ని మనం గమనించాలి. రవీంద్రుని విశ్వమానవతా తత్వం భారత జాతీయతకు ఒక గాఢమైన ఆధ్యాత్మిక పరిమళాన్నిచ్చింది. దేశాభిమానం అనేది మానవతా విలువలతో మిళితమైనప్పుడే నిజమైన సార్ధకత పొందుతుందనే సందేశాన్ని ప్రపంచానికిచ్చింది!

ఆయన చూపిన విశ్వబంధుత్వ మార్గంలో అన్నీ మానవతా పుష్పలావికలే పరిమళిస్తాయి. ఐకమత్య రాగాలు ప్రతిధ్వనిస్తాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రతిబింబిస్తాయి. రవీంద్రుని దారి ప్రపంచశాంతికి రహదారి!

Exit mobile version