[శ్రీ కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి రచించిన ‘విశ్వాస ప్రతీక – విశ్వావసు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
ప్రభవాదిగా ప్రభవించు, కాల భ్రమణాన
వెలసె షష్టిహి వత్సరాలు, కాల చక్రమున
విష్ణు మాయ వలన, నారదుని పుత్రసంతాన
నామములుగా ప్రణతి కెక్కి, నిల్చె జగమున
జగతి నడతకు, జనుల భావి పురోగతులకు
బాట వేయ, వత్సరమున కొక వైశిష్ట్యమున
సృష్టి కర్తవలన, సృజనమొందె నామములుగ
వేల సంవత్సరము లొక యుగము, దివికి గాగ
సృష్టి కాల మారంభామాయె, నదియె ‘యుగాది’
కాలవిభజ నానుసార మొచ్చు, ఏడాది కొక ‘ఉగాది’
షష్టిహి యే షష్ట్యబ్దిగా, మానవ జీవన గుణితమందు
షష్ట్యబ్ది మహోత్సవమై, మానవుల నలరించు నిలను
వత్సరారంభ వేళ, ప్రకృతి ఉత్సుకతయేగా ఉగాది
ఉగ యన నక్షత్ర గమనమని, అస్యయన ఆది యంచు
వేదభూమిన వెలుగులు విరజిమ్ము, చైత్రమాసము నందు
వసంతాగమనాన చెట్లు, చిగురులు తొడిగి పులకరించ
పరవశించు ప్రకృతిన, కోకిలలు మంగళనాదాలందించ
వత్సర ఫలితములు పండితులందించు, పంచాంగ శ్రవణాల
షడ్రుచి సమ్మేళనా లేహ్య భక్షణ, జీవనసార మెరిగించ
ధన సమృద్ధికి ఆలంబనగా, విశ్వాసమునకు ప్రతీకై ఏతెంచె
ముప్పది తొమ్మిదవ సంవత్సరము, విశ్వావసు నామధారియై
సరాగ సమ్మిళతమై సిరులు గూర్చి, మానవ సంబంధాలును
పెంపుచేయ, వేడుకొందమా విశ్వేశ్వరుని విభవములు గూర్చ.