[ది 26 నవంబర్ 2024న మృతి చెందిన ప్రముఖ సినీ గీత రచయిత శ్రీ కులశేఖర్ గారికి నివాళి అర్పిస్తున్నారు కోవెల సంతోష్‍కుమార్.]
ఆకాశం నుంచి తోకచుక్క తెగిపోయింది. మేఘం నుంచి నీటి చుక్క రాలిపోయింది. ఎప్పుడూ ఈజీ చైర్లో కూర్చొని కళ్లు మూసుకుంటే.. అతని సినిమా రీళ్లు గిర్రున తిరుగుతాయి. అతని సినిమా పాటలు ప్రతిధ్వనిస్తాయి. గాజువాక పిల్లా అని ర్యాగింగ్ చేసినా, రాను రానంటూనే చిన్నదీ అని ప్రియురాలిని ఏడిపించినా, ఏ చిలిపి కళ్లలోన కలవో.. అన్న రొమాంటిక్ పాటైనా.. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అన్న అందమైన గీతమైనా, రామాయణమంతా పూస గుచ్చినట్టు నాలుగు చరణాల్లో వినిపించిన పాట.. మధుర రసానుభవాన్ని కలిగిస్తుంటాయి. కానీ ఇవాళ అన్నీ కలిసి ఒక దాని వెంట ఒకటి వెంటబడి నన్ను వేటాడుతున్నాయి. ఆ స్వరాలన్నీ కండ్లముందు నిలిచి కన్నీళ్లు కారుస్తున్నయి. తమను విడిచి వెళ్లిపోయిన సృజనకారుడి గురించి వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి. వాటికి ఓదార్పు లేదు. నాకు ఆ స్మృతుల నుంచి మరపు లేదు. రాదు.
ఆ అద్భుత సృజనంతా జాలువారిన కలం మా శేఖరుడిది. కుల శేఖరుడిది. మల్లె పువ్వు లాంటి వర్చస్సు.. ఎప్పుడూ ఎంతో అందంగా తయారయ్యేవాడు. ముఖంలో నవ్వు తప్ప మరే భావమూ వ్యక్తం కాగా నేను ఈనాడు జర్నలిజం స్కూల్లోనైతే చూడలేదు. ఈనాడు జర్నలిజం స్కూల్ 1996-97 బ్యాచ్‌లో చదివిన నాటినుంచి నాకు అత్యంత సన్నిహితుడు. జర్నలిజం స్కూల్ అనంతరం ఈనాడు సెంట్రల్ డెస్క్‌లో.. ఆ తర్వాత.. ఢిల్లీ ఈటీవీలో కలిసి పనిచేశాం. అందరితోనూ సరదాగా మాట్లాడే వక్తవ్యం. తెలుగు, సంస్కృతంలో అసాధారణ పాండిత్యం వారసత్వంగా పొందిన వాడు. ఇంగ్లిష్ పాండిత్యంతో చిలిపి పద ప్రయోగాలు సైతం చేయగలిగినవాడు. ఈనాడు సంస్థలో విలేఖరిగా జీవితం మొదలు పెట్టినవాడు. అదే సంస్థకు చెందిన జర్నలిజం పాఠశాలలో మాతో కలిసి చదువుకున్న సహాధ్యాయి. ఆ తరువాత నాతో కలిసి కొద్ది కాలం ఒకే గదిలో ఉన్న సహచరుడు. అనంతరం అదే ఈనాడు సంస్థలకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ సినిమా చిత్రంతో సినీ జగత్తులో అడుగుపెట్టినవాడు. ఏడు సంవత్సరాల పాటు దాదాపు వంద సినిమాలకు పాటలు రాశాడు. 2007 లో ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది అన్న సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. దురదృష్టవశాత్తూ అది థియేటర్లలో విడుదల కాకపోయినా, సామాజిక మాధ్యమమైన యూట్యూబ్ లో మాత్రం విడుదలైంది. ఇవాళ అతను మా నుంచి భౌతికంగా దూరమైపోయాడు. ఒక ప్రమాదంలో గాయపడి.. దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూయడం మా జర్నలిజం బ్యాచ్ మిత్రులందరికీ పూడ్చలేని పెద్ద వెలితి. మాకు అత్యంత దురదృష్టమేమిటంటే గత మూడేళ్లలో మేము నలుగురు మిత్రులను భౌతికంగా దూరం చేసుకున్నాం. అన్నింటిలోకీ విషాదకరమైన ముగింపు మా శేఖర్ ది.
సింహాచలం దేవస్థాన ఆచార్య కుటుంబ వారసుడు కులశేఖర్. మహామహోపాధ్యాయ, కవి పండితులు, యావత్ భారత దేశం గర్వించదగ్గ సంస్కృత విద్వాంసులు శ్రీమాన్ ఎస్టీపీ రామచంద్రాచార్యుల చిన్న కుమారుడు కులశేఖర్. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజియ్యర్ స్వామి వారికి అత్యంత ఆప్తుడు, సలహాదారు, గురుస్థానంలో ఉన్నవారు అయిన రామచంద్రాచార్యుల సాహిత్య, పాండిత్య వారసత్వాన్న పుణికిపుచ్చుకున్నవాడు కులశేఖర్. జీయర్ స్వామి వారి ‘భక్తి నివేదన’ పత్రికకు అనేక దశాబ్దాల పాటు సంపాదకులుగా వ్యవహరించారు రామచంద్రాచార్యుల వారు. వారి వారసుడుగా కులశేఖర్ సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ముందే అలతి అలతి పదాలతో రామాయణాన్ని సరళంగా కవిత్వీకరించాడు. చూడటానికి ఎంత మోడర్న్ అవుట్ లుక్ తో కనిపించినా.. అంతర్లీనంగా అతనిలో ఉన్న పాండిత్యం అసాధారణమైంది. మేము ఢిల్లీలో ఒకే అపార్ట్ మెంట్ లో ఉన్నప్పుడు ఏరోజూ స్నానం చేయకుండా, సంధ్య వార్చకుండా పచ్చి మంచి నీళ్లయినా తాగేవాడు కాదు. ఆ అపార్ట్ మెంట్ లో నేను, శేఖర్ మాత్రమే శాకా హారులం. మిగతావారు ఏం వండుకున్నా.. మా ఇద్దరికీ కొద్ది రోజుల పాటు తానే వంట చేశాడు. శేఖర్ అసలు రూపం అది. అప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడంలో భాగంగానే మద్రాసు డెస్కుకు బదిలీ చేయించుకొని వెళ్లిపోయాడు. తరువాతి కొద్ది రోజులకే అంటే 2000 సంవత్సరం తొలి నాళ్లలోనే ఉద్యోగం వదిలేశాడు. రామోజీరావు చిత్రం సినిమా తీస్తున్న సందర్భంలో ఆ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ రావటం రావటం ఇక వెనక్కి చూసుకోలేదు. అత్యంత వేగంగా.. ఒక దశలో తన గురువుగారు సీతారామశాస్త్రినే మించిపోతాడనే స్థాయిలో అద్భుతమైన పాటలను సృష్టించుకుంటూ పోయాడు.. పాటలు రాసుకుంటూ అదే ఫ్రేమ్ కు పరిమితమై పోతే బాగుండేదేమోనని నాకిప్పుడు అనిపిస్తుంది. కానీ.. తనలోని ప్రతిభను మరింతగా విస్తరించాలనుకున్నాడేమో తెలియదు కానీ ఘర్షణ వంటి సినిమాలకు చక్కని మాటలను అందించాడు శేఖర్.. తరువాత కొద్ది రోజులకు ప్రేమలేఖ రాశా అన్న సినిమాకు ఏకంగా దర్శకత్వం వహించాడు.
బహుశా మల్టిపుల్ టాస్క్ లు ఎక్కువ కావడం వల్లనేమో.. కులశేఖర్ మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు.
సినిమారంగంలో ఉన్న కాలంలోనే ఆ రంగంలోని జాడ్యాలు.. సహజంగానే కులశేఖర్‌కు అంటుకున్నాయి. అవి క్రమంగా ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయి. మానసికంగా తీవ్రంగా కుంగదీశాయి. ఒక దశలో ఆయన్ని రక్షించుకోవడమే కష్టమైన పరిస్థితి. హైదరాబాద్ నుంచి కొన్నాళ్లపాటు విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్స తీసుకోవడం వల్ల ఆయన ఆరోగ్యం చాలావరకు కుదుటపడింది. కానీ కులశేఖర్ విషయంలో చాలా చాలా తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడం అత్యంత దురదృష్టం. ఆయనపై ఇలాంటి వార్తలు చూసినప్పుడు ఎనలేని దు:ఖం పొంగుకొస్తున్నది. బ్రాహ్మణులు వెలివేశారని, పూజారులపై ద్వేషం ఉన్నదని.. రాయడం దారుణంగా అనిపిస్తుంది. కానీ అవేవీ కూడా అసత్యాలు. అన్యాయపు ఆరోపణలు. మానసిక అసమతుల్యత వల్ల ఆయన ప్రవృత్తి పూర్తిగా విచలితమైంది. అలా విచలితమైన పరిస్థితిలో భార్య, కుటుంబసభ్యులు ఆయన్ను వదిలి వెళ్లటం దురదృష్టకరం. ఈ దశలోనే ఆయన ఏదో రకంగా పూట గడిచేందుకు గత్యంతరం లేక ఈ రకమైన దారులను వెతుక్కొని ఉండవచ్చు. జీవితాంతం సినీ మేనియా ఆయన్ను విడిచిపోలేదు. కానీ సినిమా ఆయన్ను తిరిగి ప్రవేశింపనివ్వలేదు. కాకినాడ ఘటన జరిగినప్పుడు కూడా ఆయన్ను కాపాడటానికి మా సహచరుడు రమణమూర్తి శతథా, సహస్రథా ప్రయత్నించాడు. కానీ.. ఆయన మన లోకంలోనే లేడు. అప్పుడే బాగా ఉన్నట్టు కనపడతాడు.. కానీ, అంతలోనే స్వభావంలో మార్పు వస్తుంది. స్వతహాగా కులశేఖర్ మంచివాడు. మానసికంగా.. ఆయన మేధకు కలిగిన రుగ్మత కారణంగానే ఆయన కొంతకాలం అలా ప్రవర్తించాడు. తరువాత చిత్రపురి కాలనీలోనే ఉంటూ.. తిరిగి తాను పాత కులశేఖర్ కావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కానీ ఇంతలోనే పంజాగుట్ట సెంట్రల్ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా చనిపోవడం నిజంగా గుండెను పిండేస్తున్నది. అతడు లేని లోటు.. నాకే కాదు.. మా మిత్ర కుటుంబానికంతటికీ ఎప్పటికీ తీరని లోటే.
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. వీరి టీవీ సీరియల్ పుస్తకం దేవ రహస్యం అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది.