[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శ్రీమతి శ్రీదేవి బంటుపల్లి గారి ‘విసర్జన విస్తరి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
బడలిక.. బడలిక.. ఒళ్ళంతా బడలిక.. ఇంట్లో, బయట విపరీతమైన ఒత్తిడి.. పెరుగుతున్న అవసరాలు, అవసరాలకు మించిన ఖర్చులు – పక్కవాడితో పోటీ పడుతూ నేను.. సమాజంలో గొప్ప స్థానం నాదే కావాలన్న కల.. ఇలా నన్ను పరుగులు పెట్టిస్తోంది.. ‘కాలం’.
‘అసలు కాలం ఉందా! ఏమో! అది పరిగెడుతోంది’ అనుకుని నేను కూడా పరిగెడుతున్నా.. కాని దానికి అలుపు లేదు, నేను మాత్రం అలసి పోతున్నాను.. ఏదో చెయ్యాలని, ఇంకా ఏదో పొందాలన్న ఆరాటంతో పరుగులు పెడుతున్నా! అధిక లాభల కోసం ఆశగా ముందుకి దూసుకుపోతున్నా.. ఆ ప్రయాణంలో నాకు కనిపించేవి రెండే రెండు. ఒకటి నా కుటుంబం – రెండు దాని అవసరాలు తీర్చే నేను.
సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకుని, స్నానపానాదులు ముగించుకుని, బలవంతంగా అన్న ప్రసాదాలు కానిచ్చి ఎవరో తరుముతున్నట్టు పరిగెడుతున్న నా శరీరంలో ఏదో లోపించింది.. కాని అదేంటో ఆలోచించే తీరిక లేని నా పుర్రె.. “వాట్ ఈజ్ నెక్స్ట్ ప్లాన్” అని ప్రశ్నించింది.
అలా అడగగానే ఉత్సాహంతో నోరు తెరిచి “ఇంకా ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలు వెయ్యాలి. ఎరువులు వేసి దిగుబడి మరికొద్దిగా పెంచితే చిన్నమ్మాయి పెళ్లి ఘనంగా చెయ్యచ్చు” అని సమాధానం చెప్పింది నా మనసు..
అంతే.. ఇక నా మనసు ఆగకుండా “హర్రీ అప్ హర్రీ అప్” అంటూ నన్ను ఉన్నపళంగా పరిగెత్తిస్తూ.. “ఈ ఏడాది నీ గోల్స్..” అని ఫిక్స్ చేసేసింది.
దిగుబడి ఎంత, లాభం ఎంత అని మాత్రమే ఆలోచిస్తున్న నేను, నా కుటుంబం – క్షేమం గురుంచే ఆలోచిస్తూ తపిస్తూ పరిగెడుతున్నాను.. కాని నన్ను మోస్తూ, భరిస్తూ, నేను తన్నినా, కొట్టినా, తుమ్మినా, దగ్గినా కాళ్ళ కింద నలిగిపోతూ, నేను పడిపోయిన ప్రతిసారి బుజ్జగించి లేపి, తన శరీరాన్ని చీల్చి, తన రక్తాన్ని చిందించి మెతుకుగా మార్చి, నా బతుకుకి జీవం పోసి ‘ముందుకు పో’ అని ప్రోత్సహిస్తూ, మనిషిగా నా ఉనికిని నాకే పరిచయం చేసిన ఒక వ్యక్తిని మాత్రం మరిచిపోయాను.
నేను ప్రాణంతో జీవించడానికి, నా కుటుంబంలో అందరి కడుపు నింపడానికి అహర్నిశలు శ్రమించే కన్న తల్లి లాంటి నా నేలతల్లిని మర్చిపోయాను.
నేను చేసే పనుల వల్ల భూమికి నష్టం ఉందా! అన్న ఆలోచనే లేని సుబ్బారావ్ అనే నేను అధిక దిగుబడినిచ్చే రసాయన ఎరువులు వేస్తున్నా.. వేస్తున్నా.. వేస్తున్నా.. దీని వల్ల ఎవరికీ రానంత దిగుబడి నా పొలంలో వస్తుంది. ‘ఈ ఏడాది కూడా మంచి లాభాలే వస్తాయి. మొత్తానికి ఎలా అయితేనేమి నేను అనుకున్న గోల్‌కి రీచ్ అయిపోతున్నా!.. అమ్మాయికి పెద్ద సంభందం చూసి పెళ్లి జరిపించే ఏర్పాటు దిగ్విజయంగా మొదలు పెట్టచ్చు. హమ్మయ్య!’ అంటూ వాలు కుర్చీలో సంతృప్తిగా వాలిపోయాను నేను.
“అలా బయట వాలు కుర్చీలో ఎందుకు.. ఏ.సి.లో వచ్చి పడుకోండి” అంటూ నా భార్యామణి ప్రేమగా పిలిచింది.
అంతే.. గదిలోకి వెళ్లి, అబ్బా డబ్బుంటే ఎంత సుఖం కదా! అంటూ నా భార్య మురిపాలతో పాలు పంచుకుంటున్న వేళ నన్ను ఎందుకో ఒకలాంటి నిస్సత్తువ ఆవహించింది.. అదేంటో అర్థం కాలేదు నాకు. అయినా, దాని గురుంచి ఆలోచించే ‘సో కాల్డ్ కాలం’ నాకు లేదు.. ఎందుకంటే! కూతురు పెళ్ళికి ఎటువంటి నగలు కొనుక్కోవాలి, ఎలాంటి డిసైన్స్ బాగుంటాయో సెల్‌లో చూసి మురిసిపోతూ నాకు కూడా చూపిస్తోంది నా భార్యామణి. తన ఆనందమే నా ఆనందం మరి.. అలా చూస్తూ చూస్తూ ఎప్పుడు నిద్రలోకి జారానో తెలీదు..
ఆ నిద్రలో..
వంటగదిలో పొయ్యి మీద బియ్యం ఎసరు.. ఆ బియ్యం గంజిలో గింజ కోసం నా భార్య కుసుమ వెతుకుతోంది.. “పట్టుకోబోతే ఆ గింజ దొరకడం లేదు.. పట్టిన గింజ ఉడకనూ లేదు.. ఈ గంజి మరగటం లేదు ఎందుకో మరి?” అని తెగ చికాకు పడుతోంది.
నా గొంతు ఎండిపోతోంది, దాహం దాహం అంటోంది నా గొంతు.. కనుచూపు మేరలో నీరే లేదు. అదో ఎడారి.. నడుస్తున్నా నడుస్తున్నా.. దారిలో ఎక్కడా నీరు లేదు.., చెట్లు లేవు.. అవి లేకుంటే వాటి మీద వాలే పిట్టలెక్కడ ఉంటాయ్?.. పక్షులెక్కడ ఉంటాయ్? కనుచూపు మేరలో ఎక్కడా నీటి జాడ లేనే లేదు. ఎండమావిలో నీటికోసం పరుగులు పెడుతున్నా!.. వలువలు లేని వివస్త్రలా భూదేవి పెద్ద పెద్ద ఇసుక తిన్నెలతో దర్శనమిస్తోంది.. ఏంటి ఇది నా నేలతల్లి రూపమేనా! అని ఆగి ఆగి నమ్మకం కలగక ఆ ఇసుకలో చెయ్యి పెట్టి ఓ సారి చూసా!
నిజంగా నిజం, బట్టలు విప్పేసిన స్త్రీ మూర్తిని తాకుతున్న స్పర్శ.. వలువలు లేని నా తల్లిని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను.
ఆమె రూపం ఇలా మారిపోయిందేమిటి? ఇదెప్పుడు నేను గమనించనే లేదు.. కాదు కాదు.. నా చుట్టూ ఏమి జరుగుతుందో ఆగి ఆలోచించే ‘సో కాల్డ్ టైం’ నాకు లేదు.
“పంటపొలాలు, పచ్చని పైర్లతో ఆకుపచ్చ అరిటాకుని వస్త్రంలా చుట్టుకున్నట్టు, ఏర్లు, సెలయేర్లలో నుంచి పంట కాలువ వరకు కనుదోయి నిండా కరుణ రసం పొంగినట్టు, దారి పొడువునా తలలూపే తరువులు సుగంధ పరిమళాలు మత్తుగా గమ్మత్తుగా ముక్కు పుటాలకు తగులుతున్నట్టు, ఎత్తుగా, పొత్తుగా నేనున్నా భయమెందుకు రమ్మంటూ పిలిచే కొండలు పిడికిలి బిగించినట్టు, గండు కోయిల రాగాలు, పక్షుల కిల కిలా రావాలు, తుంటరి తూనీగలు, ‘అంబా’ అని గోమాత పిలుపులతో ఆ జంతు సంతతిని మోస్తున్న నిండు గర్భిణిని నేను అన్నట్టు, ముందు సూర్యుని లేలేత కిరణాలు, శిగ వెనుక చంద్రుని నెలవంక నుంచి జాలువారే వెన్నెల కాంతులు విరజిమ్మినట్టు.. ఇది కదా నువ్వు”..
“మరి ఇలా నిస్సత్తువుగా, నిస్సారంగా ఇలా ఎలా మారిపోయావు ? ఎప్పుడు మారిపోయావు. నిర్జీవమైన నీ రూపాన్ని నే చూడలేకున్నా! ఏమైంది నీకు? తరువులను దూరంగా తరిమేసినావా, గగానాన్ని విహంగంలతో నింపేసినావా, గంగమ్మ దారిని అడ్డుకున్నావా! ఆదిత్య హృదిని గాయపరిచావా! పుడమి తల్లి ఎద పూడ్చేసినావా!, కోటానుకోట్ల జంతు సంతతిని మాయం చేసావా! ఎడారి మద్య నిలపడి ఎగాదిగా చూస్తున్నావా, పొలం గట్టు కనపడలేదని పొర్లి పొర్లి ఏడుస్తున్నావా!”.. ఇలా నా మది నిండా ప్రశ్నలే.. ఈ ప్రశ్నలకి సమాధానం ఎలా దొరుకుతుంది? అనుకుంటూ మెల్లిగా నా కళ్ళు తెరిచి చూసా! నా చుట్టూ ‘శూన్యం’. ఒక్క ఉదుటున లేచి నిలబడి రెండు అడుగులు ముందుకు వేసిన నా కాళ్ళకు అడ్డంగా నేను దాచి ఉంచిన రసాయన ఎరువుల మూట ఎదురొచ్చింది. దానిని తీసి ఆవల పారేయాలని నా కాలు పైకి లేపా! నా కాళ్ళు లేపలేకపోతున్నా.. నిస్సత్తువుగా మంచం పై కూలబడిపోయాను. ఏమైంది నాకు? అంటూ నా భార్యని పిలుస్తున్నా.. నోటిలోనుంచి మాట కూడా రావటం లేదు.. ఏమైంది నాకు? ఏదో జరిగింది అని ఆలోచిస్తున్నా.. లేవలేకపోతున్నా.. లేచి పడిపోతున్నా..
నా పరిస్థితిని చూసిన నా భార్య కంగారుపడుతూ డాక్టర్‌కి కబురు చేసింది..
తిరిగి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా.. కళ్ళు తెరిచి చూసిన నాకు ఎదురుగా చేతినిండా రిపోర్ట్స్‌తో తల్లిని ఓదారుస్తూ ఓ వైపు, మరో వైపు డాక్టర్తో మాట్లాడుతూ కనిపించింది నా కూతురు.
నాకేమైంది అని అడగాలనే ఉంది.. కాని ఎవరూ నా గొంతులో నుంచి వచ్చే మాటని పట్టించుకోవటం లేదు.. నేను లేవలేకపోతున్నా..
ఒకరోజు రెండో రోజు.. మూడో రోజు .. అలా నెలరోజులు హాస్పిటల్ బెడ్ మీద నేను.. నా చుట్టూ నా కూతురు.. నా భార్య..
“అమ్మా! నాన్న కిడ్నీలు దెబ్బ తిన్నాయి, అలాగే లివర్ డామేజ్ అయింది అంటున్నారు.. ఇక్కడ వీలు కాదంట. బతికే చాన్స్ తక్కువ అంటున్నారు డాక్టర్స్” .. అన్న పిడుగులాంటి వార్త నా చెవిని పడింది.
ఇంతలో ‘నాన్నా’ అంటూ బిగ్గరగా ఏడుస్తోంది కూతురు, “ఏమండీ మమ్మల్ని వదిలి వెల్లిపోయారా!” అంటూ నా భార్య ఏడుస్తోంది.
“మన సుబ్బారావ్‌కి కిడ్నీలు పోయాయట.. చనిపోయాడు.. ఇక మన సుబ్బారావ్ మనకి లేడు” అంటూ హితులు స్నేహితులు చేరారు. నా భార్యకి, పిల్లలకి ఓదార్పు మాటలు చెబుతున్నారు. కాసేపటి తరువాత..
“ఎంత బతుకు బతికినా మట్టిలో కలిసిపోవాల్సిందే కదా! కార్యక్రమాలు కానీయండి” అంటూ పాడి ఎత్తి కాటికి తీసుకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. నా మీద పడి నా భార్యా పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు.
‘స్వర్గధామ్’ తలుపులు బార్లా తెరుకుచున్నాయి, నా పాడెని లోపలి తీసుకుపోయి కొద్ది దూరంలో కిందకి దింపారు. ఆరడుగుల గొయ్యి తవ్వడానికి ఆపసోపాలు పడుతున్నారు.. గునపం దిగదే? పార లోపలికి చొచ్చుకు పోదే? ఇక్కడకాదు.. ఇక్కడ తవ్వండి అని ఒకరు.. నీళ్ళు పొయ్యండి భూమి మెత్తపడుతుంది అని ఇంకొకరు సలహా ఇస్తున్నారు.. కాని నేలతల్లి మొండికేసింది..
బలవంతంగా భూమి పెళుసు బయటకు లాగి చూస్తే.. గబ్బు వాసన.. ఎరువుల వాసన.. వట్టి రసాయనాల వాసన.. ఉన్న పళంగా శవాన్ని వదిలి దూరంగా పారిపోయారు మోపర్లు..
నా సంపదని దోచేసి, నా విలువల వలువను విప్పేసి, వివస్త్రగా మార్చేసావు.. పచ్చదనమే అచ్ఛాదనంగా, ఆభరణంగా ధరించే నన్ను అధిక దిగుబడి, అధిక రాబడి అంటూ రక రకాల ఎరువులతో నా ఒళ్ళంతా గాయం చేసి అందమైన నా ఆకృతిని నాశనం చేసిన నిన్ను శపించాలనే ఉంది.. కాని నేను భూమాతని కదా! కాస్తా సహనం ఎక్కువే.. నీలో మార్పు వస్తుంది అని ఎదురుచూసే ఓర్పు ఎక్కువే.. అందుకే నీలో మార్పు కోసం ఎదురుచూసాను.
నను మార్చి, ఏ మార్చి, ఎరువులను ఎరగా వేసి నన్ను నా శరీరాన్ని సారవంతం చేసే నా నేస్తాల (మిత్ర పురుగులను) చిరునామా చెరిపేసి అత్యాశతో అధిక దిగుబడి పొందాలని, ఏడు తరాలకు సరిపడా సంపద కూడబెట్టాలని పేరాసకు పోయి పెను సవాళ్ళ మద్య నిలబడ్డ నీవు నన్ను సృష్టించాగలవా! ఓసారి అలోచించు.. మానం పోయి, ప్రాణం పోయిన నీ మాతృమూర్తిని నువ్వు సజీవంగా తిరిగి పొందగాలవా! రక్షించగలవా! కాదు కాదు కనీసం నన్నుధైర్యంగా తాకగలవా!
నిన్ను చూస్తే జాలేస్తోంది.. ‘ఎక్కడ ఉంటావు? ఎలా ఉంటావు? ఏమి తింటావ్? నా క్షామం నీకు క్షేమం కాదు సుమా! నా భవిషత్తు లోనే నీ భవిత ఉంది, నా ఆరోగ్యం లోనే నీ ఆరోగ్యం ఉందని మరిచిపోతున్నావు’ అని హెచ్చరిస్తూనే ఉన్నాను. కాని నా రోదన నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావ్. ‘ఇప్పుడు నిన్ను నాలో కలుపుకునే శక్తే నాకు లేకుండా పోయింది. నీ పార్థివ దేహానికి ఆశ్రయం కల్పించలేను..’ అంటూ అందవిహీనంగా, కళాహీనంగా నాతో మాట్లాడుతున్న నా నేలతల్లిని చూస్తూ అలా మౌనంగా ఉండిపోయాను.
నిర్జీవంగా ఆకాశం వైపుకి చూసాను.. రాబందుల కోసం అన్నట్టుగా..
ఏంటి నా వైపు చూస్తున్నావు.. అని ఆకాశం అడుగుతోంది నన్ను.. రాబందువుని ఎక్కడ బతకనిచ్చావ్. ఎప్పుడో ఆ జాతిని సమూలంగా నాశనం చేసేసావ్.. అక్కడక్కడ ఉన్న గద్దలు రాసాయానాల వాసనకి నీ దరికే చేరటం లేదు. భూమి నాలో కలుపుకోలేను అంది, ఆకాశం నిన్ను పొమ్మంది.. ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉంటే చూసుకో.
‘ఏమి చేద్దాం’ అంటూ నా పార్దీవ దేహం చుట్టూ కొంతమంది తిరుగుతుంటే, “కిరోసిన్ తీసుకురండి కాల్చి పడేద్దాం” అన్నాడు అందులో ఒకడు.
అన్నదే తడువుగా కిరోసిన్ డబ్బాలతో ప్రత్యక్షమయ్యారు.. పార్థివ దేహాన్ని కిరోసిన్‌తో తడిపేసారు.. కాగడా వెలిగించి అంటించబోతే.. ఎంతకీ అంటుకోదే?
నన్ను మాత్రం ఎక్కడ ప్రశాంతంగా ఉంచావ్.. నువ్వు పచనం చేసింది మొదలు రాయి రాయి రాసి నన్ను బయటకు తీసి నీకు కావలసినవన్నీ ఒండుకుని తిన్నావు. అది మొదలు చెట్లు పుట్టలు కాల్చేస్తున్నావ్, నీకు కోపం వస్తే నీలో దాగి ఉన్న నన్ను కూడా దహించి వేస్తున్నావ్. ప్రక్రుతి వనరులను ద్వంసం చేసేస్తున్నావ్. నిన్ను భరించడం నా వల్ల కాదు నేను నీకు సహకరించి నిన్ను నాలో కలుపుకోలేను అంటూ ‘అగ్ని’ నేను వెలగను అంటూ మారాం చేసింది.
“ఈ ‘శవం’ కాలటం లేదు ఏమి చేద్దాం” అన్నాడు ఒక పెద్దాయన..
“ఇక చేసేదేముంది? పెద్ద చెరువులో పడేసి పోదాం పదండి” అన్నాడు.. ఆ మాట ఆ చెరువు విన్నదేమో! నిన్న మొన్నటివరకు నిండుగా ఉండే ఆ చెరువు అమాంతంగా ఎండిపోయింది. చిత్రంగా లేదూ!
నిండు గోదారిలా నిత్యం పారే ఈ చెరువులో నీళ్ళు ఎండిపోవడమేంటి? అని ఆలోచిస్తుంటే నా మీద ఓ చినుకు పడి పలకరిస్తూ “ఏంటి? అంత ఆశ్చర్యపోతున్నావ్? నిర్మలంగా ఎత్తునుంచి పల్లానికి పారుతూ భూదేవిని తడుముతూ, ఎండిపోతున్న నీలాంటి గొంతులను తడుపుతూ పోతున్న నా మదిలో ఎంత కల్లోలం రేపావో తెలుసా! పవిత్ర గంగ అని చూడకుండా అడ్డమైన చెత్తని, ప్లాస్టిక్ వ్యర్ధాలని, ఫ్యాక్టరీల వ్యర్థాలని నాలో కలిపేసి, నాతో మమేకమై జీవిస్తున్న జలచరాలను పొట్టన పెట్టుకున్నావ్. నిన్నా! నేను నాలో కలుపుకునేది? అసంభవం. నాలో ఉన్న నీటిని నాలోనే దాచేసి ఇసుకదిబ్బలా వెలవెలబోతున్నా! ఇక్కడినుంచి పో నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది” అంటూ ముఖం చాటేసింది.
“ఏంటిరా! ఇంత విడ్డూరంగా ఉంది.. గలగలమని పారే గంగమ్మ ఏమైపోనాది? సూతుంటే సుబ్బారావ్ ‘శవం’ శివంలో కలిసినట్టు అగుపడట్లేదు, ఏమి సేత్తే బాగుంటాది?” అన్నాడు మోపర్లలో ఒకడు.
“ఉన్నపళంగా ఆ చెరువు గట్టుని వదిలేసి పోదాం, ఏ గాలికో, ధూళికో కొట్టుకుపోతాది” అన్నాడు అందులో ఒకడు..
ఇంతవరకు వీచే గాలి ఏమైనట్టు? ఒక్కసారిగా స్తంభించిందేంటి? అనుకున్నాను.
నన్ను మాత్రం వదిలావా! నిన్ను, నీ తెలివిని నిరూపించుకోవడానికి స్వచమైన గాలిలో అడ్డమైన యంత్రాల పొగలు వదిలేసి కాలుష్యం సృష్టించావు. దారాలంగా, పైసా ఖర్చు లేకుండా ఉచితంగా నిన్ను బతికిస్తున్న గాలిని మాత్రం వదిలావా! నీ ఉనికిని, నిన్ను బతికించే ‘ఆక్సిజన్’ అందించే చెట్లను నరికి పారేసావ్. ఇంకెక్కడ గాలి? నిండైన పచ్చదనంతో నిత్యం శోభాయమానంగా కనిపించే ప్రక్రుతి అందాలకు నెలవైన వృక్షజాతి సమస్తాన్ని నాశనం చేసిన నువ్వు చచ్చిపోయి బతికావ్ పో. అణువంత గాలికూడా నీ శరీరాన్ని, నిన్ను తాకదు అంటూ గాలి సుడిగాలిలా మాయమైంది.
‘ఏంటి ఈ వింత భూమిలో కప్పెట్టాలని జూస్తే, భూమిలో గొయ్యి తవ్వకుండా నేల గట్టిపడిపోయింది, ఆకాశంలో ఎగిరే గ్రద్దలు, కాకులు, రాబందులు వచ్చి పీక్కు తిని పోతాయంటే, అవి కనుచూపు మేర కనిపించడమే లేదు. పోనీ ఈ శవాన్ని కాల్చి పడేద్దామంటే ఎన్ని కట్టెలు పెట్టినా, ఎంత కిరోసిన్ పోసినా అగ్ని రాజటమే లేదు. పోనీ ఏ చెరువులోనో పడేద్దామంటే చెరువులో నీరు అదృశ్యమైపోయింది. పోనీ అలా వదిలేస్తే గాలికి ఎండిపోతుంది అని వదిలేస్తే, ఎక్కడా గాలి వచ్చే దారే లేదు.. ఏంటి ఈ గడ్డు పరిస్థితి’ అనుకుంటూ నా పార్థివ శరీరాన్ని వదిలి వెళ్లిపోయారంతా.. దిక్కు మొక్కు లేక పంచభూతాలన్నీ వదిలేసిన ‘విసర్జన విస్తరి’లా ఉండిపోయాను. పైకి ఎగరలేక, భూమిలో కలవలేక, మసిగా మారలేక, కసిగా గాలిని కౌగిలించుకోలేక, ఆకాశం వైపు నిస్సహాయంగా చూస్తూ ‘మిథ్య’ లా మిగిలిపోయా! అనాథ శవమై అంతిమ సంస్కారాలు జరగక ప్రకృతికి వీడ్కోలు చెప్పలేకపోతున్నా!
‘ప్రకృతీ నన్ను నీలో కలుపుకోవూ!’ అని అభ్యర్థిస్తున్నా బేలగా.
శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో జన్మించారు. బంటుపల్లి సన్యాసప్పలనాయుడు, రమణమ్మ గార్లు తల్లిదండ్రులు. పద్మావతి మహిళా యునివర్సిటీ ‘మాస్టర్స్ ఇన్ కమ్యునికేషన్ & జర్నలిజం’ చేశారు. న్యూఢిల్లీ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ నుంచి ‘డిప్లొమా ఇన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా అండ్ పాలసీ’ చేశారు. ప్రస్తుతం విజయనగరం కన్యూమర్ కమిషన్‌లో సబ్ జడ్జ్‌గా (కన్స్యూమర్ కమిషన్ మెంబర్) వ్యవహరిస్తున్నారు. భర్త శ్రీ ఎస్.వి.సన్యాసి రావు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
శ్రీదేవి గారు కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. పలు కథలకు వివిధ పత్రికలలో బహుమతులు పొందారు. లేత గులాబి అనే బాలల పుస్తకం వెలువరించారు. 60 రేడియో టాక్స్ చేశారు. చిన్ని ఆశ, పేపర్ బోట్ అనే డాక్యూమెంటరీలు తీశారు. మనోరంజని అవార్డ్ అందుకున్నారు. ‘వసంత లోగిలి’ వీరి తొలి నవల.