Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వైరస్

[శ్రీమతి పి.వి. శేషారత్నం గారు రచించిన ‘వైరస్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ‘అభినందన’ సంస్థ (విజయనగరం) ఫిబ్రవరి-మార్చ్ 2025లో నిర్వహించిన హాస్య కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ.]

మధ్య మా ఫటాఫట్ కాలనీలోని సుబ్బారావుగారింటికి గుజరాత్ నుంచి ఏదో పని మీద ఓ తెలిసున్నావిడ వచ్చిందిట. ఆవిడ సరదాకి ఇంట్లో వేసుకున్న పంచవన్నెల రామచిలకలాంటి ఫిట్టింగ్ లాంగ్ గౌను బాల్కనీలలో టీ తాగుతూ బాతాఖానీ వేస్తున్న భామామణులకి తెగ నచ్చేసింది.

ఇంకేముంది? హనుమంతులవారు లంకాదహనం చేసేసినట్టు విషయాన్ని గంట గడవక ముందే అరచేతి వైకుంఠాల ద్వారా అదేలెండి సొల్లు ఫోన్ల ద్వారా మిగతా ఆడస్త్రీలందరికీ అంటించేసారు.

అంతా కలసి సుబ్బారావుగారింటిని ముట్టడించేసి గుజరాతావిడని చుట్టుముట్టేసి లాంగ్ గౌను పుట్టు పూర్వోత్తరాల గురించి పత్రికా విలేకరుల్లా తెగ ప్రశ్నల వర్షం కురిపించేసారు.

నాకు తెలిసినంతవరకు సాధారణంగా ఆడాళ్లకి ఓ సహజ లక్షణముంటుంది. మా ఆవిడతో పడుతూ ఉంటాను కదా! తన దగ్గరున్నది ఎంత మంచి వస్తువు అయినా ఎంత అందమైన చీర అయినా మొగుడు కొన్నది నాసిరకంగాను పొరుగావిడ కట్టుకున్నది బంగారంలాను కనిపిస్తుంది.

కుసింత ధైర్యం చేసి నేనా మాటన్నానో లేదో మా కాముడు చురుక్కున చూసి “మీరు మాత్రం! నేను చేసిన కూర కంటే పక్కింటి పిన్నిగారు రుచి చూడమని ఇచ్చిన ఆవపెట్టిన దూట కూర లొట్టలేసుకుని తింటూ ఎంతో బావుందనరూ! అందుకేగా పొరుగింటి పుల్లకూర రుచి అనే నానుడి వచ్చింది” అని మండ్రగబ్బలా అంటపొడిచేసింది.

మగమహారాజులకిది కొత్తేముందిలెండి ఇంటింటి రామాయణం!

ఇంక అసలు విషయానికొస్తే.. అలాంటి లాంగ్ గౌను తామూ స్వంతం చేసుకుంటే బాగుంటుందనే తీవ్ర వాంఛ సాటి ఆడవాళ్ల కళ్లల్లో పేట్రేగిపోవడం తారాస్థాయికి చేరుకోవడం గమనించినట్టుంది గుజరాతావిడ. ఛండాలంగా ముసిముసి నవ్వులు నవ్వుతూనే తన కోసం ఇలాంటివే మరికొన్ని కూడా తెచ్చుకున్నానని పెద్ద బిల్డప్పే ఇచ్చి వచ్చిన వాళ్లందరి చెవుల్లోను కాలీఫ్లవర్లు పెట్టి పాతిక లాంగ్ గౌన్లను ఎగ్జిబిషన్ పెట్టేసింది.

అంతటితో ఆగిందా?మొహమాటపడుతున్నట్టు నటిస్తూనే వెయ్యిరూపాయలు కూడా చెయ్యని గౌనుని ఒక్కోటి ఐదువేలకి ఓ పాతిక మందికి అంటగట్టి చక్కగా డబ్బు మూటగట్టుకుని వారం తిరక్కుండానే, వచ్చేటప్పుడు రైల్లో చెమటలు కక్కుతూ వచ్చిన మనిషి కాస్తా, ఖరీదయిన సెంటు కొట్టుకుని మరీ టక్కున కులాసాగా ఫ్లయిటెక్కేసి చెక్కేసింది.

ఇంకేముంది? కాలనీలోని తక్కిన నూట పాతిక ఇళ్లల్లోని ఆడవాళ్లందరూ కిర్రెక్కిపోయి వయసులు కూడా మరిచిపోయి ఇళ్లల్లో వంటావార్పూ వదిలేసి ఐదు రంగుల వెరయిటీ బట్టల కోసం షాపింగులు మొదలెట్టి అలసిపోయేదాకా తిరిగి నెల తిరక్కుండా ఎవరి తాహతుకు తగినట్టు వాళ్లు లాంగ్ గౌను కుట్టించుకునే గుడ్డలు కొనేసుకున్నారు. అక్కడితో సరిపోతేనా? ఊహూ! టైలర్ల వేట మొదలుపెట్టారు. ఇంకేం? ఎప్పుడూ గోళ్లు గిల్లుకునే కాలనీ టైలర్లకి బంగారు పంట పండింది.

ఆడాళ్ల క్రేజ్‌ని సొమ్ము చేసుకోవడానికి ‘ఇలాంటివి కుట్టడం కష్టం’ అంటూనే నకరాలు మొదలు పెట్టి కుట్టు కూలిని నాలుగురెట్లు పెంచేసి నెల తిరక్కుండా వాళ్లు కూడా లక్షాధికారులయిపోయారు.

కారణం ఈ వైరస్ వేగంగా పక్క కాలనీలకి కూడా వ్యాపించేసి లాంగ్ గౌను నోములు కూడా మొదలయ్యాయి. వెరసి ఆ ఏడాది దసరా నవరాత్రి పూజల్లో లలితా సహస్రనామ పారాయణలకి అరవైలు దాటిన ఆడాళ్లతో సహా అంతా పట్టుచీరలకి బదులు పంచవన్నెల రామచిలకల్లాంటి ఆ లాంగ్ గౌన్లు వేసుకుని బ్యాండు మేళంలా తయారయ్యారు.

అందులో నా కాముడు కూడా ఉంది. అరవయ్యయిదేళ్ల మా కామేశ్వరి ఆ లాంగ్ గౌనులోకి తోసేసిన భారీ కాయాన్ని ఈడ్చుకుంటూ వీథుల్లో గునగునా నడుస్తుంటే చెప్పొద్దూ నా సామిరంగా కడుపుబ్బా కరువుతీరా నవ్వాలనిపించింది.

కానీ అంత స్వాతంత్ర్యం రిటైరయినవాళ్లం మాకెక్కడిది? పైగా అలా పైకి నవ్వానంటే ఇంకేమైనా ఉందా? అసలు నిజానికి అరవైలలో ప్రవేశించేదాకా.. అంటే ఈ కాలనీలో ఇల్లు కొనుక్కునేదాకా మా కాముడు సగం నెరసిన జుట్టుతో సన్నగా నేవళంగా ఎంత డిగ్నిఫైడ్‌గా ఉండేదని?

అయితే ఆదివారాలు ఫటాఫట్ కాలనీ ఆడవాళ్ల సమావేశాలకు వెళ్లడం మొదలైంది. తన వయసును కూడా మరిచి ఎంతో మారిపోయింది.

జుట్టుకి రంగొచ్చింది. బుగ్గలకి గులాబీ షేడ్ లొచ్చాయి. కనుబొమ్మలకి కత్తిరింపులొచ్చాయి. చెప్పులస్టాండులోకి పదిరకాల చెప్పులొచ్చాయి. ఇంట్లోకి ఒక జత.. బాత్ రూంకి ఒకటి. చీరల మ్యాచింగును బట్టి మరో అరడజనూ. కళ్లకి గాగుల్సు, చేతికి సెల్‌ఫోన్ వగయిరాలు మామూలే.

మా కాముడేం ఖర్మ?.. ఎదురింటి సింహాద్రిగారి ఎనభయ్యేళ్ల తల్లి కూడా ఇక్కడికొచ్చాక వీర లెవెల్లో మారిపోయిందని ఆయన గోల పెడుతుంటాడు.

ఎందుకంటే.. ఆ మధ్యనోసారి భర్త తాలూకు పెన్షన్ తీసుకునే ఆవిడ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వెళ్లినపుడు బోసినోటికి పళ్ల సెట్టు పెట్టుకుని జుట్టుకు చిక్కని నల్ల హెయిర్ డై వేసుకున్న ఆవిడను గుర్తించలేక స్కానింగ్ మిషన్ మొరాయిస్తుంటే బ్యాంకు వాళ్లు నవ్వుతూనే హెచ్చరించారుట.

“బామ్మగారూ! మీరు ఇంతకుముందు ఇచ్చిన పెన్షన్ ఫొటోతో ఇప్పటి మొహం మ్యాచ్ కావడంలేదు” అని..

అయినా వైరస్ సోకిన ఆవిడ మొదట్లో ముసిముసినవ్వులు నవ్విందే తప్ప గెటప్ అరంగుళం కూడా మార్చలేదుట. పెన్షన్ నాలుగు నెలలు ఆపేసేసరికి అప్పుడు దారికొచ్చిందిట.

పోనీ ఈ వైరస్ ఆడవాళ్లవరకే పరిమితమయితే బావుండేది. ఎవరికి పుట్టిందోగాని ఆ పాడు ఆలోచన.. తమ పతిపరమేశ్వరుల శిరోజాల ఆరోగ్యం మీద ఆడస్త్రీల దృష్టి పడింది.

ఎందుకంటే అప్పటికే కొందరికి బట్టతలలు.. కొందరికి ఊడ్చేసిన పెరుగన్నం కంచంలా బోడి గుళ్లు..

నేను రిటైరయేనాటికి నాకు ఒకటో రెండో వెంట్రుకలు తెల్లబడ్డాయి తప్ప నా గిరజాలజుట్టు వంకీలతో ఎంత బావుండేదని? అసలు మా వంశంలోనే ఎవరికీ బట్టతల లేదు. అందుకని నా రిటైర్మెంట్ రోజున ఆ విషయంలో నన్ను ప్రశంసించనివారు లేరు. ఎందరి దిష్టి తగిలిందో ఏమిటో మరి!

నేను ఎంత మొత్తుకున్నా వినకుండా నిక్షేపంలాంటి నా జుట్టుకి ట్రిమ్మింగు పేరుతో దిక్కుమాలిన క్రీములు పట్టించి రకరకాల తలసబ్బులరగదీసి మూడు నాలుగు రకాల షాంపూలతోను తలనూనెలతోను ప్రయోగాల పేరుతో నానా బీభత్సం చేసేసరికి ఎలర్జీ మొదలయి ఓరోజు తలంతా కోతిపుండు వచ్చినట్లు విపరీతంగా దురదలు..

అంతేనా? నా మొహంమీద ఒక్కటొక్కటిగా ప్రారంభమైన ఎర్ర పొక్కులు క్రమేపీ నీలంగా మారి తర్వాత ఆకుపచ్చని రసిలాంటి విషాన్ని చిమ్ముతుంటే పాతకాలపు ‘నాగిని’ సినిమాలో విలన్ బాసులా తయారయ్యేసరికి అదిరిపడి మా కాముడు క్రీములు అయితే ఆపేసింది. అయితే దురదృష్టం కొద్దీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

మొహంమీద గుంటలతోబాటు నా జుట్టు మొత్తం హుష్ కాకి అయిపోయేసరికి కాముడు ముందు కంగుతిన్నా తర్వాత “గుండు ఇప్పటి ఫాషన్ లెద్దురూ!” అంటూ ఓ ఏబ్రాసి నవ్వు విసిరేసింది.

జుట్టు గతి ఇంతే.. పెళ్లాలున్నవాడి జుట్టు గతి ఇంతే.. ఆ.. ఆ. ఆ. ఆ.

జుట్టున్న మనిషికీ సుఖము లేదంతే.. ఏ ఏ ఏ ఏ

అంటూ ప్రేమనగర్ హీరోలా నేను లబోదిబోమన్నాను. తనకీ వయసు మీరిందని మా కాముడికి గుర్తుంటేనా?

“అయినా తాత అయ్యాక కూడా అంత ఒత్తుగా గిరజాల జుట్టుంటే ఏం బావుంటుంది లెండి. మీ వయసుకి ఇది సహజం..” అనే ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడంతోబాటు “ఎంత ముద్దోస్తున్నారో చలివిడి ముద్దలాంటి ఈ గుండుతో?” అంటూ కొంగు చాటు చేసుకుని గుండుమీద ఓ ముద్దు కూడా పెట్టి నా బలహీనతతో ఆడుకుని నా నోరు మూయించేసింది.

నాకయితే మా కాలనీలోని బట్టతల.. అరగుండు.. రెండు పరకలు.. నాలుగు పరకల పురుష పుంగవులంతా నన్ను, నా గుండుని చూసి చాటుగా సంతోషంతో పొంగిపోతున్నారని నా అనుమానం. ఏది ఏమయినా కలికాలం.. అంతా వైరస్ మహాత్మ్యం.

కొన్నాళ్లు హెయిర్ స్టయిల్ వైరస్ పట్టుకుంది.. దాంతో సంప్రదాయపు జడలూ ముడులూ హెయిర్ సెలూన్లకు బలి అయిపోయాయి. శ్రీమతులందరూ రకరకాల హెయిర్ స్టయిల్ విగ్గుల కోసం కాళ్లకు మరో పది జతల చెప్పులు కొనుక్కుని మరీ షాపులకు పరిగెత్తారు.

ఎందుకో నిన్నరాత్రంతా నాకు నిద్రపట్టనే లేదు. కరోనా కంటే భయంకరమైన ‘సస్పెన్స్ థ్రిల్లర్ వంటల పోటీ’ అనే వైరస్ మా కాలనీ క్యాంపస్ లోకి ప్రవేశించిందని చెబుతూ పోటీ పేరుతో ఎంత నికృష్టపు తిండి తినాలో తలుచుకుంటేనే ఉరేసుకోవాలనిపిస్తోందని మనమంతా సన్యాసం తీసుకుంటే మేలని బానపొట్ట కనిపించేలా చొక్కా ఎత్తి మరీ కళ్లు తుడుచుకున్నారు సంప్రదాయ వంటల ప్రియుడు రాంబాబు మేష్టారు.

తెల్లారగట్ల ఓ కునుకు తీసానుగానీ మా కాముడు సస్పెన్స్ థ్రిల్లర్ పోటీలో గెలిచేందుకు జుట్టు విరబోసుకుని వికటంగా నవ్వుతూ వానపాముల వేపుడును పెద్ద మూకుట్లో అట్లకాడతో తిప్పేస్తున్నట్టు వచ్చిన భయంకరమైన కలకి ఉలిక్కిపడిలేచి వణకడం మొదలెట్టాను. రామాయణంలో త్రిజట స్వప్నంలాగ నాకసలే తెల్లారగట్ల వచ్చిన కలలు నిజమౌతాయనే స్వప్నశాస్త్రం మీద విపరీతమైన విశ్వాసం!

Exit mobile version