[శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘విరిదండన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“నిన్నే చూస్తున్నాడే. నిన్నా, మొన్నా ఇలాగే. మనకంటే ముందే బస్ స్టాప్ చేరుకుంటున్నాడు. నీవైపే చూస్తూ మూగసైగలు చేస్తుంటాడు” అంది రాధ.
“ఎవరే అంది?” వసుధ. చూస్తున్న సెల్ఫోన్ నుంచి చూపు తిప్పకుండానే.
“నువ్వు తలెత్తి చూస్తే కదా తెలిసేది!” విసుక్కుంది రాధ.
“పోన్లేవే. చూసినంత మాత్రాన మనకు పోయేదేముంది” అన్నది కాని వసుధ తలెత్తి చూడలేదు.
శబ్దం చేసుకుంటూ సిటీ బస్సు వచ్చింది. మహిళలకే ప్రత్యేకం.
ఈసారి సెల్ఫోన్ ఆఫ్ చేయక తప్పలేదు. ఇద్దరూ బస్సెక్కారు.
మర్నాడు. స్నేహితులిద్దరూ బస్టాప్ కి వస్తున్నారు. “ఆ పిల్లి గడ్డం వాడేనే. నిన్ను కళ్ళతోటే జుర్రేస్తున్నాడే. నిన్నే వాడి గురించి తెలిసిందే. పేరు రఘుట. ఇన్నాళ్లూ పద్మావతీ కాలేజ్ దగ్గర పడిగాపులు పడి, చివరికి ఒకమ్మాయి వెంటపడితే, లెంప వాయించిందట. సరోజచెప్పింది.”
ఐనా, నవ్వే వచ్చింది వసుధకి. నవ్వుతూనే వెనక్కి తిరిగి వాడిని చూసింది. రాధన్నది నిజమే. ఆనందంతో పిల్లి గడ్డం ముఖం మతాబాలా వెలిగింది. ఇద్దరమ్మాయిలూ మరి వెనక్కి చూడకుండా ముందుకు వెళ్లిపోయారు.
మూడో నాడు ధైర్యం వచ్చిన రఘు వసుధ కనబడగానే సూటిగానే ఓ చిరునవ్వు విసిరాడు. వసుధ అలాగే బదులిచ్చింది. కులుకుతూ వాళ్ళవెంటే నడిచాడు. కానీ ఎందుకైనా మంచిదని రెండడుగుల దూరం పాటిస్తూ.
ముగ్గురూ బస్టాండ్ చేరుకున్నారు. కొంచెం దగ్గరగా జరగాలని చూసాడు. రాధ కొంచెం పక్కకి జరిగినా, వసుధ ఏమాత్రం కదల్లేదు.
రాధకి మండిపోయింది. గొంతు తగ్గించి, కటువుగా అంది “నీకు నిక్కెక్కెవే. పెద్ద అందగత్తెవని” అప్పటికీ వసుధకి నవ్వే వచ్చింది!
ఆ నవ్వు చూసి మరింత మండుకొచ్చింది రాధకి. ఏమైనా అనేంతలో బస్సొచ్చింది.
నాలుగో రోజు. అదే బస్టాప్ .రఘు ముందు పొడిదగ్గాడు. గొంతు సవరించుకున్నాడు. “చెప్పండి” అన్నట్టు అతని వైపు తిరిగి చూసింది వసుధ. ఆ వేళకే బస్టాప్ కి వచ్చే ప్రయాణికులు కొందరు ఆసక్తిగా చూస్తున్నారు.
“మీతో మాట్లాడాలని. మీకు కుదిరితే ఒక కప్పు కాఫీ..” నసిగాడు రఘు.
“దానిదేముందండీ. మీరెప్పుడంటే అప్పుడే”
స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నాడు రఘు. అతను ఏదో అనేలోగానే కొనసాగించింది వసుధ.
“మిమ్మల్ని చూసిందగ్గర్నుంచీ నాక్కూడా మీతో మాట్లాడాలని ఉందండీ”.
రఘు కళ్ళ ముందు స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. నోరు మాత్రం తెరచుకోనని మొరాయించింది.
“దీనికేదో మతి చెడింది. బస్సు వచ్చినా బాగుణ్ణు”. అనుకుంది రాధ.
‘భలే మంచి రోజు. వసంతాలు విరుస్తుండగా చూస్తున్నామ’నుకున్న కొందరు లొట్టలు వెయ్యాలనుకున్నారు.
మళ్లీ మొదలెట్టింది రాధ. “మిమ్మల్ని పలకరిస్తే ఏమనుకుంటారోనని సందేహించానండి”.
పిల్లి గడ్డం పులి గడ్డం కాబోతుండగా, వసుధ కొనసాగించింది. “నాకు వాసు దూరం తమ్ముడు వరస. మతి సరిగ్గా లేక ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇల్లొదిలి వెళ్లిపోయాడు. మూడేళ్లయింది. మీరంతా వాడి పోలికే అన్నయ్యా” నిట్టూరిస్తూ ముగించింది.
తల ఎక్కడ పెట్టుకోవాలో తట్టని పిల్లి గడ్డం తృటిలో అదృశ్యమయింది.
లొట్టలు బదులు బస్టాప్ లో మూడో, నాలుగో నవ్వులు విరిసాయి.
“నీకు నిక్కే కాదు. బుర్రా ఎక్కువే” అని రాధ అంటుండగానే స్టాప్ లో ఆగిన బస్సు ఎక్కారిద్దరూ.