Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వయొలిన్ మాంత్రికుడు పద్మభూషణ్ ప్యారేలాల్

[ప్రముఖ హిందీ సంగీతదర్శకులు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ద్వయంలోని ప్యారేలాల్ గారి 85వ జన్మదినం సందర్బంగా హిందీలో శ్రీ అజయ్ పౌండరీక్ వ్రాసిన వ్యాసాన్ని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

హిందీ సినిమాలలో జంట స్వరకర్తలుగా పేరుపొందిన సంగీత దర్శకులలో ప్రముఖులు లక్ష్మీకాంత్ – ప్యారేలాల్. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో అద్భుతమైన సంగీతాన్నిందించారు.

ఈ ద్వయంలోని ప్యారేలాల్ గారు నేడు (3 సెప్టెంబర్ 2025న) తన 85వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు.

ప్యారేలాల్ 1940 సెప్టెంబర్ 3న ముంబైలో జన్మించారు. వారి తండ్రి పండిట్ రాంప్రసాద్ శర్మ ప్రసిద్ధ ట్రంపెట్ ప్లేయర్, సంగీత ఉపాధ్యాయుడు. ప్యారేలాల్ ప్రారంభ సంగీత విద్యను తన తండ్రిగారి వద్ద అభ్యసించారు. పాశ్చాత్య సంగీతం ప్రకారం నోట్స్ వ్రాయడం, వయోలిన్ వాయించడం నేర్చుకున్నారు. తరువాత, ప్యారేలాల్ గోవాకు చెందిన ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు ఆంథోనీ గోన్సాల్వెస్ గారి శిష్యరికంలో వయోలిన్ నేర్చుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే, ప్యారేలాల్ వయోలిన్‌లో చక్కటి ప్రావీణ్యం సంపాదించారు.

సంగీత దర్శకుడు నౌషాద్ ఆర్కెస్ట్రాలో వయోలిన్ వాయిస్తున్న్ 15 ఏళ్ల ప్యారేలాల్

తరువాతి కాలంలో, 1977లో ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాలో, ప్యారేలాల్ “మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వెస్” పాటతో తన వయోలిన్ గురువుగారికి నివాళులర్పించారు.

బాల్యంలో, కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో, ప్యారేలాల్ చర్చిలో వయొలిన్ వాయించి, డబ్బు సంపాదించి, కుటుంబం పట్ల తన వంతు బాధ్యత నిర్వహించారు.

తన తండ్రితో 8 ఏళ్ల ప్యారేలాల్

లతా మంగేష్కర్ తమ్ముడు పండిట్ హృదయనాథ్ మంగేష్కర్, ప్యారేలాల్ సమవయస్కుడు. ఆయన కూడా ప్యారేలాల్ గారి తండ్రి వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ప్యారేలాల్, హృదయనాథ్ మంగేష్కర్ మంచి స్నేహితులయ్యారు.

హృదయనాథ్ మంగేష్కర్ తన ఇంట్లోనే ఒక సంగీత అకాడమీని ప్రారంభించి దానికి ‘సురీలా బాల్ కేంద్ర్’ అని పేరు పెట్టారు. హృదయనాథ్‌‌తో పాటు, అతని సోదరీమణులు మీనా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, ప్యారేలాల్‌, అతని తమ్ముళ్ళు గణేష్, గోరఖ్, ఆనంద్, మహేష్, నరేష్ మొదలైన వారు ఆ అకాడమీలో చేరారు. 10 ఏళ్ల ప్యారేలాల్ (యువ సంగీతకారుడు), ఇతర పిల్లలందరూ లతా మంగేష్కర్ ఇంట్లో నివసించేవారు, అక్కడే భోంచేస్తూ, సంగీతం వాయించేవారు.

మంగేష్కర్ కుటుంబానికి చెందిన ‘సురీలా బాల్ కేంద్ర్’ లో లక్ష్మీకాంత్-ప్యారేలాల్

కొద్ది రోజుల్లోనే భారతరత్న లతా మంగేష్కర్ ఒక కచేరీలో లక్ష్మీకాంత్ మాండలిన్ వాయించడం విన్నారు. సోదరులు లక్ష్మీకాంత్,శశికాంత్ లను శంకర్-జైకిషన్, నౌషాద్, సి. రామచంద్ర గార్లకి లతాజీ సిఫార్సు చేశారు. లతాజీ, లక్ష్మీకాంత్‌ని, అతని అన్నయ్య శశికాంత్‌ని కూడా ‘సురీలా బాల్ కేంద్ర్’‌కి పంపారు.

అక్కడి నుంచి ప్యారేలాల్, లక్ష్మీకాంత్‌ల మధ్య సుదీర్ఘమైన ‘స్నేహం’ ప్రారంభమైంది. అక్కడి నుంచి, అంటే లతా మంగేష్కర్ ఇంటి నుంచి.

అలా లక్ష్మీకాంత్-ప్యారేలాల్ అనే ‘పేరు’ ఉద్భవించింది. తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. 1963 నుండి, హిందీ చలనచిత్ర రంగంలో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ యుగం (1963 – 1998) ప్రారంభమైంది.

503 సినిమాలు, 160 మంది గాయకులు, 72 మంది గేయ రచయితలు, 2845 పాటలు. ఇదీ బాలీవుడ్ సంగీతానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ అందించిన అద్భుతమైన సేవ!

వయోలిన్ కళాకారుడిగా ప్యారేలాల్ – స్వరకర్తలు కె. బులో సి రాణి, నౌషాద్, మదన్ మోహన్, సి. రామచంద్ర, ఖయ్యామ్, చిత్రగుప్త్, ఎస్.డి. బర్మన్‌లతో కలిసి పనిచేశారు.

లక్ష్మీకాంత్-ప్యారేలాల్ పాటల ఆర్కెస్ట్రేషన్‌లో వయోలిన్‌కు ప్రాధాన్యత ఉండేది. సోలో, గ్రూప్ వయోలిన్ రెండిటికీ ప్రాముఖ్యత లభించింది. గ్రూప్ వయోలిన్ కోసం 40 కంటే ఎక్కువ వయోలిన్‌లు అవసరం. చాలా పాటలలో, వయోలిన్‌ని సింఫనీ శైలిలో వాయించారు, దాంతో పాటలకు వెస్ట్రన్ టచ్ లభించింది. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ 80% పాటలలో గ్రూప్ వయోలిన్‌లను ఉపయోగించారు.

ప్యారేలాల్ గారిది వినికిడి శక్తి పదునైనది. 100 మంది సభ్యులు ఉన్న ఆర్కెస్ట్రాలో ఎవరు తప్పు చేసినా, ఆయన వెంటనే దానిని పట్టుకునేవారు.

ప్యారేలాల్ – సోలో వయోలిన్:

(1) మై యహ్ సోచ్‌కర్.. మహమ్మద్ రఫీ.. ‘హకిఖత్’ 1964. సంగీత దర్శకుడు మదన్ మోహన్. గీత రచయిత కైఫీ అజ్మీ.

సంగీత దర్శకుడు మదన్ మోహన్ ఈ పాటను స్వరపరిచినప్పుడు, ఈ పాటకి ప్యారేలాల్ వయోలిన్ వాయించాలని ఆయన కోరుకున్నారు. కానీ అప్పటికే, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ స్వతంత్రంగా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మదన్ మోహన్ దీర్ఘంగా ఆలోచించి, ప్యారేలాల్ కనుక వయోలిన్ వాయించకపోతే, ఆ పాటను సినిమా నుండి తొలగిస్తానని అన్నారు. ఈ విషయం విన్న ప్యారేలాల్ వెంటనే, మదన్ మోహన్ కోరిక మేరకు వయోలిన్ వాయించేందుకు స్టూడియోకి చేరుకున్నారు.

అది పాట కాదు, జుగల్‌బంది. అది కూడా మహమ్మద్ రఫీ గొంతుతో, ప్యారేలాల్‌ వయోలిన్‌తో. రఫీ పాడిన ప్రతి పంక్తి తర్వాత, ప్యారేలాల్‌జీ వయోలిన్ వాయించబడింది.

(యూట్యూబ్‌ లింక్:

https://www.youtube.com/watch?v=bS6Fuf-GCYA )

(2) జబ్ జబ్ బహార్ ఆయీ.. మహమ్మద్ రఫీ. ‘తక్దీర్’ 1967. సంగీతం: లక్ష్మీకాంత్-ప్యారేలాల్, సాహిత్యం: ఆనంద్ బక్షి.

ఈ పాట మొత్తం వయోలిన్ (సోలో) పై కేంద్రీకృతమై ఉంది. ప్యారేలాల్ ఈ పాటకి వయోలిన్ వాయించారు. వయోలిన్‌తో పాటు పియానో ​​కూడా అందంగా వాయించబడింది. ధోలక్ ‘రిథమ్’ శ్రావ్యంగా వినిపిస్తుంది.

(యూట్యూబ్‌ లింక్:

https://youtu.be/mrY6FIQcbYY?list=RDmrY6FIQcbYY )

లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఆర్కెస్ట్రాలోని ఇతర సంగీతకారుల సోలో వయోలిన్ వాదనం:

లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఆర్కెస్ట్రాలోని ఇతర సంగీతకారులు వాయించిన గ్రూప్ వయోలిన్లు:

ఆర్కెస్ట్రాలు 100 కి పైగా వయోలిన్లను ఉపయోగిస్తాయి.

ప్యారేలాల్ – సింఫనీ:

లక్ష్మీకాంత్ శాంతారామ్ కుడాల్కర్ మే 25, 1998న మరణించారు. 50 సంవత్సరాలకు పైగా కొనసాగిన సుదీర్ఘమైన, రికార్డు బద్దలు కొట్టిన స్నేహం/భాగస్వామ్యం ముగిసింది. ప్యారేలాల్ రాంప్రసాద్ శర్మ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తూ చురుగ్గా ఉన్నారు. ఇటీవల ప్యారేలాల్ దివంగత భారతరత్న లతా మంగేష్కర్ కోరిక మేరకు ‘ఓం శివం’ అనే సింఫొనీని రూపొందించారు, దీనికి జర్మనీలో అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

జర్మన్లు ​​ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్‌ను చూడండి (చివరి రెండు నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్). చూడటం మర్చిపోవద్దు.

(యూట్యూబ్ లింక్

https://youtu.be/QIvi74G1aQ0 )

మూలం: అజయ్ పౌండరిక్, వడోదర

Exit mobile version