Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వింత చేపలు

[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]

పిల్లలూ!

విష్ణుమూర్తి తొలి అవతారం మత్సావతారం. మహాభారతంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని చేధించాడు. పురాణాలలో మత్య్యకన్యలు కనిపిస్తారు. అంటే చేపలకు మన ఇతిహాసాల్లో ప్రముఖ స్థానం ఉందన్నమాట.

చేపలలో చాలా రకాలున్నాయి. ఇవి చెరువులు, నదులు, సరస్సులు, చిన్ననీటి గుంటలు, సముద్రాలు మొదలయిన వాటిలో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రకాల సముద్రపు చేపల గురించి తెలుసుకుందాం.

కత్తి చేపలు:

ఇవి పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్లోను, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలలో ఉత్తర అమెరికా తీరప్రాంతాలలోను పెరుగుతాయి. ఈ చేపల దవడ చివర పెద్ద కత్తి వంటి అవయవం ఒకటి వుంటుంది. ఇవి చాలా పెద్ద చేపలు. సుమారు 7 అడుగులు పొడవుంటాయి. కొన్ని చేపలు పది నుండి పదిహేను అడుగులు పొడవు కూడా వుంటాయి. తమ మీద దాడి చేసే పెద్దపెద్ద చేపలను తిమింగలాలను ఎదుర్కుంటాయి,. సముద్రంలో తమకు అడ్డం వచ్చే పడవలను తమకు గల కత్తి లాంటి అవయవంతో పొడిచి ఎదుర్కొంటాయి. కాబట్టి మహాసముద్రంలో ప్రయాణంలో తస్మాత్ జాగ్రత్త.

ఎగిరే చేపలు:

ఈ ఎగిరే చేపలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాలలో పెరుగుతాయి. ఇవి తమ తోకలను బలంగా, గట్టిగా నీళ్ళలో చరిచి ఒక్కఉదుటన పైకి లేచి ఎగిరి గంతులేస్తాయి. కొంతదూరం అలా ఎగిరిన తరువాత తమ రెక్కలతో గాలిలో జారుతూ ప్రయాణం చేసి తిరిగి నీటిలో చేరుతాయి. కొన్ని చేపలు వంద నుండి రెండు వందల గజాల దూరం వరకు గాలిలో ఎగురుతాయి. ఇవి విపత్కర పరిస్థితులలో తమను తాము శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి ఇలా ఎగురుతూ, మళ్ళీ నీటిలో చేరుతూ శత్రువుల చేతికి అందినట్లే జారిపోతాయి. తమను తాము రక్షించుకుంటాయి.

మబ్బు చేపలు:

మహాసముద్రాలలోని లోతు ప్రాంతాలలో స్క్విడ్లు, కటిల్ ఫిష్లలు పెరుగుతూ వుంటాయి. ఇవి తమ మీదకు శత్రువులు వచ్చినప్పుడు మెరుస్తున్న ద్రావకపు మబ్బుని వదులుతాయి. ఈ మబ్బు పరిమాణంలోను, ఆకారంలోను స్క్విడ్లు, కటిల్ ఫిష్లనే పోలి ఉంటుంది. శత్రువులు ఈ మబ్బులను చూసి చేపలనుకుని వెంటబడతాయి. ఇదే అదనుగా చూసుకుని మబ్బుచేపలు తప్పించుకుని సముద్రపు నీటి లోపలకి వెళ్ళిపోతాయి.

వింత చేపలు కదా!

Exit mobile version