[శ్రీలక్ష్మి నందమూరి గారు రచించిన ‘విన్నపం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
బిడ్డలు కారు, బాధ్యతలు కారు,
విశ్వం పంపిన విలువైన యోధులు,
పుత్తడి కంకణ సంకెళ్ళలో కాదు,
కలం రాతా, ఆలోచనా స్వేచ్ఛా అందిద్దాం,
కాగితపు మూట కాదు, వివేకపు బాట పరుద్దాం,
మేని మెరుగులో కాదు,
వ్యక్తిత్వపు విలక్షణకు గర్విద్దాం,
గీతల హద్దులలో ప్రేమగా కాదు,
రాతలు మార్చగల మమకారపు ముద్దగా మలచుదాం,
మన ఛాతి విరుపునకై, వారి వెన్ను విరువకుండగా,
వెన్నంటి కలలకు చేయూతనిద్దాం,
అందుబాటులోనిది అందిపుచ్చుకొనుట కాదు,
అందరానిదైనా అందితెచ్చుకొను ఆత్మవిశ్వాసమిద్దాం,
సమకాలీన స్వేచ్ఛా సంద్రములో
ఈదుతూనే ప్రాకృతిక పరవళ్ళు పరిచయం చేద్దాం,
దైవ మంత్రాలకు బానిసై కాదు,
దైవ మార్గానికి బంటుగా జ్ఞానం కలిగిద్దాం,
చలనం లేని భూమికి ఆసామిలా కాదు,
చలించి చైతన్యపరిచే మనస్సుకు మొలకలు వేద్దాం,
కాలంలో కరిగిపోవు వనరులు కాదు,
కాలం చెల్లని ఆత్మిక జ్ఞాపికలు, గుణగణాలు పెంపొందిద్దాం,
మన చేతి సైగతో ఎగిరే గాలిపటం కాదు,
ఎటువంటి పరికరం లేకున్నా, గమ్యం చేరగల స్వేచ్ఛాపక్షిగా ఎగురవేద్దాం,
విత్తనం అరచేత ఎండ ఎరుగకుండిన
ఎంత సుఖమైనా, మట్టిలోనే మొలకించును కదా,
భావి తరాలకు పేదరాశి పెద్దమ్మగా,
నా వేదాంతం కాదు, నా విన్నపాల వినతి ఇది..